05 February 2011

చాలాసార్లు

చాలాసార్లు, చాలా చాలాసార్లు

కలుసుకునీ కలుసుకోం మనం:
మాట్లాడుకునీ
మాట్లాడుకోం మనం:
దగ్గరయ్యీ, ఒక దూరంలోకి
విడిపోయి
రెండు అంచులనుంచి
నాలుగు కళ్ళ అంచులనుంచి
రెండు కన్నీళ్ళ చుక్కలై
రాలిపడిపోయేది మనం=
పరచితమవుతూ
అపరిచితులుగా మిగిలి
పోయేదీ మనమే.

చూడలేదా నువ్వు
తాకలేదా నువ్వు
గీతకు చెరో వైపున
జ్వలిస్తున్న
ఎదురుచూపులలో
కరిగిపోయేదీ
మిగిలిపోయేదీ
మనమిద్దరమేననీ?

కనుగొనలేదా నువ్వు
నయనాలు నీవనీ
కన్నీళ్లు నావనీ?
తెలుసుకోలేదా నువ్వు
అక్షారాలు నావనీ
రాసేది నీవనీ?
నీ నిరీక్షణ నాదనీ
నా అన్వేషణ నీదనీ?
నేను నువ్వనీ
నువ్వు నేననీ?

రా. ఈ రెండు చేతులూ
నీవి: నను
కౌగలించుకోటానికైనా
నా మెడ
నులిమి చంపడానికైనా=

No comments:

Post a Comment