02 February 2011

పిల్లలు**

చూస్తుండగానే పిల్లలు ఎదుగుతారు

ఇల్లు దులుపుతుండగా, పెళ్లినాటి ఫోటోలు బయటపడి
గడిచిన కాలమంతా తటాలున స్పురణకురాగా
చీపురు పక్కన పడవేసి కొంగుతో ఫోటోలు శుబ్రం చేస్తూ
చిందరవందరగా పడి ఉన్న వస్తువుల మధ్య కూర్చుని

దాటి వచ్చిన సముద్రాల్ని గుర్తు చేసుకున్నట్టు

చూస్తుండగానే పిల్లలు ఎదిగి ఆశ్చర్య పరుస్తారు=

ఇల్లు. ఇంటి చుట్టూతా కొన్ని మొక్కలు.
మొక్కలకు పైగా ప్రసరించే శీతాకాలపు ఇంద్రజాలపు
ఎండా. శీతాకాలపు ఎండపై
గాలి జోలపాటతో ఊగుతూ నిదురిస్తున్న, నువ్వు
ప్రేమగా పెంచుకున్న వేపాకుల నీడలు.
నీడలపై పూలగుత్తుల్లా గెంతుతున్న పిల్లి పిల్లలు.

అయితే చూస్తుండగానే పిల్లలు ముసలి వాళ్ళవుతారు=

పుస్తకాలు సర్దుకుంటుండగా
బాల్యంనాటి ఫోటోలు బయటపడి, తల్లితండ్రులతో గడిపిన
సమయమంతా తటాలున స్పురణకు రాగా
మెత్తటి చీకటిపై తుంపరలా రాలుతున్న బల్బు కాంతిలో
మంచంపై ఒక్కడివే కూర్చుని

వాళ్ళు దాటిన సముద్రాలనీ, నువ్వు దాటవలసిన
హిమ తుఫానులనీ గుర్తుచేసుకుంటున్నట్టు

చూస్తుండగానే పిల్లలు ముసలివాళ్ళవుతారు
చూస్తుండగానే పిల్లలు ముసలివాళ్ళయి
తళ తళలాడుతున్న వెలుతురులో, భాషారహిత స్థితిలో
బోసి నవ్వులతో, రోదనలతో
తోటి పిల్లలతో ఆడుకుంటారు=

No comments:

Post a Comment