ఎన్నటికీ అంతం కాని సమయాలు
తెల్లవారకుండా గదినిండా
తెరలు తెరలుగా దగ్గు=
సన్నటి లోహపు కడ్డీలో
కలియ తిరుగుతున్న
గాలి లాంటి శ్వాస: ఉబ్బసం.
ఊపిరాడదు:
అంతంలేని బావిలోంచి
నీళ్ళు తోడుకున్నట్టు
నోరు తెరిచి
గాలిని ఒక మహా ప్రయాసతో
లాక్కోవాలి =
బహుశా, కనిపించీ
మెరుపులా మాయమవుతున్న
ప్రాణపదమైన రూపమేదో
గాలి కావొచ్చు-
చప్పున ఒడిసి పట్టుకోవాలి
గుండెల్లో నింపుకునేందుకు=
రాత్రి మధ్యగా
ఆమె దేహం ఉలిక్కిపడుతుంది
కలల పక్షులు చెదిరి
అరుపులు గదికి నలుదిశలా
విసిరి వేయబడతాయి=
దేహపు కాగడా
నిర్విరామంగా రాత్రిలో
జ్వలిస్తుంది
ఒక అంచును పుచ్చుకుని
ఆ వెలుతురులో
ఆమె కలలని పరిశీలిస్తాను=
ఆమె దేహం
చిక్కటి చీకటిగల
నక్షత్రాల ఆకాశం=
ఆమె అరచేతుల మధ్యనుంచి
ఎపుడూ జారిపోయే నీరు
ప్రేమ=
మిగిలేది తడి ఒక్కటే
మిగిలేది ఆరని
ఆమె కళ్ళ నిరీక్షణ ఒక్కటే=
నెమ్మదిగా, ఈ రెండు అరచేతుల
మట్టి మధ్యకు
ఆమె దేహం కుంగిపోతుంది
బలహీనమైన శ్వాస
మొలకెత్తుతుంది. ఆహ్
తెరలు తెరలుగా వీచే
దగ్గు పూవు
కదులాడని రాత్రి, ఇంకా
ఎన్నటికీ అంతం కాని సమయాలు=
No comments:
Post a Comment