01 February 2011

ఇటువంటి మరో మధ్యాహ్నం*

నువ్వొక్కడివే ఈ మధ్యాహ్నంపూట నీతో=

ఎండ ముళ్ళ పొదల్లా, మరచిపోలేని
ఆమె చేతివేళ్ళలా, ఆమె
కళ్ళ అంచుల తడి, వేడి ఇసుక రేణువుల్లా
తాకుతున్నప్పుడు

నువ్వొక్కడివే ఈ మధ్యాహ్నంపూట నీతో=

ఇట్లాంటి మరో మధ్యాహ్నంపూట
నువ్వు మరణిస్తావు. శరీరంలోకి కాసింత
ఎండనీ, ఎండు గడ్డినీ
వొంగి తొంగి చూస్తున్న మర్రిచెట్టు ఊడలనీ
కొద్దిగా రాత్రిపూట మిగిలిన అన్నాన్నీ
గుక్కెడు నీటినీ నింపుకుని
నిన్ను చూస్తున్న పావురాలకూ
ఉడతలకూ ముందు
నువ్వు నిశ్శబ్దంగా మరణిస్తావు.
ఎవరూ లేకుండా, పదిమందీ నడిచిన
పాదముద్రలతో
సమయాన్ని నింపుకున్న శరీరంతో
సమయంలోకి జారిపోతావు=

అప్పటిదాకా నీ చుట్టూ, నీపై
పాదాల చేతుల పెదవుల వొత్తిడి. ఈ భూమిపై
నువ్వు చుట్టుకున్న కొంత ప్రేమ
కొన్ని బంధాలు, కొన్ని కన్నీళ్లు. మరికొన్ని
గాయాలు, కొంత హింసా కొంత శాంతీ
కొంత అశాంతీ=

ఎవరూ ఎక్కడకూ వెళ్ళటం లేదు=

వెడుతున్నట్టుగా ఉంది ఎవరూ
ఎక్కడకూ వెళ్ళని సందర్భం= చివరకు ఏదైనా
మిగిలితే అది నీ చుట్టూ
కనిపించని కత్తులతో, నవ్వుతో కూర్చున్న
మిత్రులు. చివరకు ఏదైనా గుర్తుకు ఉంటె అది
నువ్వు ఆమెతో లిప్తకాలం గడిపిన కాలం=

"-నా స్నేహితుల్లారా, స్నేహితుడెవ్వడూ లేదు-"

ఈ మధ్యాహ్నంపూట నా ఎడమవైపుగా
మరణాన్ని అనుభూతి చెందుతాను=
రంగువలె, వాసనవలె
ఈ మధ్యాహ్నంపూట మృత్యు ఎండను
పీల్చుకుంటాను= సంవత్సరాల క్రితం
నీట మునుగుతున్నప్పుడు గుక్కెడు గాలిని
అత్యంత తపనతోటి తీసుకున్నట్టు
ఈ మధ్యాహ్నంపూట మృత్యుతెమ్మరను
హృదయంలోకి లాక్కుంటాను=

ఎవరైనా ఎలా మరణిస్తారు? ఎవరైనా
ఎలా మరణించేందుకు తపిస్తారు? శాంతితో
నలుగురు ఎనిమిది చేతులై
తమ బ్రతుకులను
వెచ్చబరుచుకుంటున్నప్పుడు
కళ్ళ చుట్టూ వ్యాపిస్తున్న
నల్లటి గీతలలో
చెమ్మ మెత్తగా ఊరుతున్నప్పుడు

ఇటువంటి మరో శీతాకాలపు మధ్యాహ్నం
నేను సమయరహిత వెలుతురులో కలసిపోతాను
ఆకులపై వాలిన ఆకుల నీడల కింద కదులాడే
చీకటిలాంటి కాంతిపుంజాలలోకి, సమయంలోకి
వెళ్ళిపోతాను= సరిగా

ఇటువంటి మరొక మధ్యాహ్నంపూట=

1 comment: