02 February 2011

ప్రశ్న**

ఊడిన గుండీని- దగ్గరగా చేరి ఊపిరితో తాకుతూ-
తిరిగి పెట్టినట్టు

ఆమె నే లేనప్పుడు గది గొళ్ళెం మధ్యగా ఓ చిన్న కాగితం
ఉంచి వెళ్ళేది. ఈదురు గాలికి
రహదారిపై, దారినీ గాలినీ ఖాలీనీ తాకుతూ కొట్టుకువెళ్ళే

ఎవరో చింపి పడవేసిన దుమ్ము నిండిన కాగితపు ఉండలా
నేను ఆ గదికి చేరుకున్నప్పుడు
గొళ్ళెం మధ్యగా దాగిన ఆమె దేహం సువాసన కొమ్మల్లో
ఇరుక్కునే వాడిని.

జాబిలీ నుంచి కొన్ని తునకలను తుంపుకుని వచ్చినట్టు
కాగితంపై తెల్లటి గండు చీమల్లాంటి అక్షరాలు:
"నీ కోసం వచ్చాను. గదికి తాళం వేసి ఉంది. ఎక్కడికి
వెళ్లావు? చెప్పకుండా?"

ఇన్ని, మరిన్ని సంవత్సరాల తరువాత నేనా నా గదికి వచ్చి
అలసట అరుస్తున్న మట్టి కమ్ముకున్న
వీధిదిమ్మరి కళ్ళతో అ కాగితమూ లేని గొళ్ళెం వైపు చూస్తాను.

బహుశా రుతువు మారింది. పగటి భూకంపపు రోజు, రాత్రి
లోయగా చీలినట్టు, బహుశా
కోల్పోయినతనం తలుచుకునే అక్షరాలగానూ మారింది.

ఈ గొళ్ళెం గూటిలో ఒకప్పుడు పొదిగిన అక్షరాలు, ఇప్పుడు
ఎక్కడ ఉన్నాయి?

1 comment: