06 February 2013

ఉపోద్ఘాతం

1.
"ఎలా ఉన్నావు?"

అతడు తల ఎత్తి, ఒక మారు ఆమె  చూసి తల దించుకున్నాడు. సాయంకాలపు ఎండ ఆమె ముఖాన్ని కప్పి ఉంది. ఆ పసుపు పచ్చటి కాంతిలో ఆమె పసుపు పచ్చ ముఖం మరింతగా మెరుస్తోంది. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ప్రపంచంలో ఉన్న భాషలన్నిటిలోనూ, సంభాషణలన్నిటిలోనూ ఉన్న అసందర్భ ప్రశ్నలలో ఇది ఒకటి కావొచ్చు. బహుశా, సమాధానంకై కాకుండా ఉట్టినే అడుగుతారు కాబోలు. కానీ, జవాబు? అతనికి అసహనంగా ఉంది. అసౌకర్యంగానూ ఉంది. ఉదయంపూట కాలేజ్లో కుర్రవాడి ముఖం గుర్తుకు వచ్చింది. ముప్పై కిలోమీటర్ల నుంచి వస్తాడు - చదువుకోడానికి. ఏం ఉంటుంది? ఏమీ ఉండదు. నల్లటి ముఖం. భుజాన ఒక బ్యాగూ, దానిలో టిఫిన్ బాక్సూ ఇంకా కొన్ని పుస్తకాలూ. సరిగ్గా తొమ్మిది గంటల కల్లా కాలేజ్లో ఉంటాడు. సరిగ్గా తొమ్మిది గంటల కల్లా కాలేజ్లో ఉండటానికి, సరిగా ఏడింటికి ఇంటి వద్ద బయలుదేరుతాడట. ఇంతా చేసి వస్తే, మొదటి క్లాసు జరగదు. జరిగినా చెప్పేది అర్థం కాదు. అది ఆ కుర్రవాడి తప్పు కాదు. ఆ లెక్కల మాస్టారు ఏం చెప్పినా అర్థం కాదని, పట్టణాల్లో చదువుకున్న 'చదువొచ్చిన' కుర్రవాళ్ళూ చెప్పారు. తడచిన బొగ్గులాంటి ముఖంతో ఆ కుర్రవాడు చెబుతాడు: 

-లెక్కలు కష్టంగా ఉన్నాయి సార్. అర్థం కావడం లేదు. టూషన్ చెప్పడానికి ఇంటి వద్ద ఎవరూ లేరు సార్. ఇక్కడ ఈ సిటీలో టూషన్ చదవాలంటే మేము అంత ఉన్న వాళ్ళమి కాదు సార్-

-మీ నాన్నేం చేస్తాడు-

-చిన్న షాపు ఉంది సార్- అని కొద్దిగా ఆగి - చెప్పులు షాపు సార్. చెప్పులు కుట్టి అమ్ముతూ ఉంటాడు...-

-కాలేజ్ అయ్యి ఇంటికి వెళ్లేసరికి నాలుగు ధాటి పోతుంది కదా, మరి భోజనం?-

-అమ్మ టిఫిన్ కట్టి ఇస్తుంది సార్-

అతను ఆ కుర్రవాడి తల్లిని ఊహించుకోగలిగాడు. తన తల్లికి చాలా దగ్గరగా ఉంది ఉండవచ్చు. నలభై ఐదేళ్ళు పైబడి, ముఖంలో గీతాలు దీర్ఘమయ్యీ, బహుశా తను ఏమిటో తెలియని వ్యధతో, ప్రతి ఉదయం విషాదాన్నంతా దాచి పెట్టుకుని తల వంచుకుని టిఫిన్ బాక్సులో పెరుగన్నం పెడుతూ ఉండే రూపం. అమ్మలందరూ ఇలాగే ఉంటారా? అది కూడా అసందర్భ ప్రశ్నలలో ఒకటిలాగా అనిపించి తల విదిల్చాడు.

-ఏంటీ ఆలోచిస్తున్నావు?- మరొక ప్రశ్న.

-ఏం లేదు-

-ఏం ఆలోచిస్తున్నావో చెప్పొచ్చు కదా?-

అతడు అసౌకర్యంగా కదిలాడు. ఒక ఏక ఆలోచన లేనపుడు ఎలా చెప్పడం? అతను తల ఎత్తి ఆమె వైపు చూసాడు ఆమె అతని వైపే తదేకంగా చూస్తోంది. అతడికి, ఆకస్మికంగా నిస్సత్తువుగానూ దిగులుగానూ అనిపించింది. అసలు తను ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? ఆమె ఎవరు?

-నేను వెడతాను- అతను అన్నాడు.

ఆమె ఏమీ మాట్లాడలేదు. అతడికి ఆమె తరచూ అనే వాక్యం గుర్తుకు వచ్చింది. అతడు ఆ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె నిట్టూర్పు విడుస్తో అనాలి: సరే. మళ్ళీ ఎప్పుడు?

-తెలియదు-. అతనికి అక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత బావుండు అని అనిపించింది. వొంటరిగా ఉండాలి. వొం - ట - రి - గా -. ఎవరితోనూ సంభాషణ లేకుండా, అసంబద్ధ ప్రశ్నలు లేకుండా, అసౌకర్యంగా కాకుండా-ఎక్కడికన్నా వెళ్ళాలి. ఎక్కడికి? అతనికి తెలియదు. కానీ వెళ్ళాలి. కానీ ఏమిటిది? బాధా? కాదు. భయమూ కాదు. దిగులా? 

అతను ఆ పదంపై కాసేపు ఆగాడు. తను అనుభవిస్తున్నది దిగులా? ఈ ఎమ్టీనెస్...గుండెనీ, శరీరాన్నీ చుట్ట చుట్టినట్టు...కాదు. ఇది దిగులు కాదు. మరేమిటి? విషాదం...? ఊహు...ఎమ్టీనెస్...శూన్యత. కానీ దేనికి?  తను ఎందుకు కారణం కోసం వెదుకుతున్నాడు? ప్రతీదానికి ఒక కారణం ఉంటుందా? ఇక, అసహనంతో అతను చివాలున లేచి, నెమ్మదిగా క్యాంటీన్ మెట్లు దిగి కిందకి వచ్చాడు.

సాయంత్రం. ఆకాశం. అతను ఆకాశాన్ని, పాలరాయి శిల్పంపై కప్పిన ఒక జలతారు పరదా ని లాగివేసిన రెండు చేతులు లాగా ఊహించాడు. చుట్తోతా చెట్లు. చెట్ల మధ్య నుంచి రాలే పసుపు ఆకులో, మసక కాంతి బిందువులూ. అవి ఏమైనా తనకి కమ్యునికేట్ చేస్తున్నాయా? ఒక వేళ అయితే, ఏమిటది? అతనికి ఒకప్పుడు తను రాసుకున్న వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి 

...the sky is nothing, sometimes
only a space, a space into which
you fly your life like a kite, with 
the thread in somebody else's hand

and that is memory, memory 
of being lead by 
another memory...

ఒక అపరిచిత ఎమ్టీనెస్. పేరు లేని దశలోకి దేహం జారిపోతున్న అనుభూతి. అతనికి పరచితమైన అనుభూతి. సంవత్సరాలుగా దేహంలో నెత్తురులా జ్వలిస్తోన్న అనుభూతి. బహుశా, ఇటువంటి విషాదపు దశలో తప్ప తను మరో దానిలో బ్రతకలేడు. తను ఇటువంటి అనుభూతిలో తప్ప మరొక దానిలో జీవించ లేడు. ఏమిటిది? సంతోషం కాదు. దుక్కం కాదు. బాధ కాదు. దిగులూ కాదు. ఇవన్నీ అయిన, అదే సమయంలో ఇవన్నీ కాని ఫీలింగ్ ఘాడమైన జీవన చలన సూత్రం. అతనికి మాత్రమే, అతను మాత్రమే స్పర్శించ గలిగే జీవితం. దేహంతో పాటు తల కూడా ఒక మత్తులోకీ, ఒక అంతులేని వలయాల లోకీ కూరుకుపోయినట్టుగా-

అతను తల వంచుకుని తన గదిలోకి వచ్చాడు. గదికి తాళం వేసి లేదు. తాళం వేసే అలవాటూ లేదు. తలుపులు తెరిచి లోపలి--- చీకటిగా ఉంది. తలుపుని పూర్తిగా తెరిచి, లైటు వేసి ఫాన్ స్విచ్ వేసాడు. గదిలో ఒక పక్కగా మంచం, మరో పక్కగా రాసుకునే బల్లా. రెండింటికి మధ్యా కొద్దిగా ఎత్తులో ఉన్న కిటికీ కిందుగా పుస్తకాల రాక్ - వాటిలో కొన్ని పుస్తకాలూ మరి కొన్ని జిరాక్స్ తీయించుకుని బైండు చేయించుకున్నవీ. టేబుల్ పై చెదురు మదురుగా కాగితాలు. 

నెమ్మదిగా చీకటి చుట్టుకుంటుంది. తెరచి ఉంచిన కిటికీలోంచి విసురుగా గాలి వీస్తోంది.అతను గాలి వంక చూసేందుకు ప్రయత్నించాడు. తన ముఖాన్నీ, తన దేహాన్నీ మెలికలుగా చుట్టుకుంటున్న హస్తాల కోసం. అరచేతులు కావొచ్చు. చెంపలపైనుంచి చెవులకు పైగా చల్లగా - బహుశా, ఆ కుర్రవాడి కళ్ళూ అలా ఉండి ఉండ వచ్చు. పగళ్ళూ రాత్రుళ్ళూ ఉన్న కళ్ళు. తడచిన ఉదయాల మధ్యగా మెరిసే నల్లటి రాత్రుళ్ళ కళ్ళు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి అతడికి? పదహారూ? పదిహేడూ? ఆ కుర్రవాడు అద్దంలో తన ముఖం చూసుకున్నప్పుడల్లా తన ముఖం కాకుండా తన తల్లి ముఖం గుర్తుకు వస్తుండవచ్చు. ముప్పై ఏళ్లకు పైగా కష్టంతో, సంతోష రాహిత్యంతో, మసక బారి ముడతలు పడి, అయినప్పటికీ దయగా ప్రేమగా కదులాడే ముఖం. లేదా తన తండ్రి ముఖమూ చూసుకుంటుండ వచ్చు. వృద్ధాప్యం ఆకస్మికంగా జొరబడి, ముఖాన్నీ దేహాన్నీ చిందర వందర చేసినట్టు, చెమటలు పట్టిన ముఖంతో ఉప్పటి దేహంతో నల్లటి చెట్టు బెరడు లాంటి పెదాల మధ్య చిటపట లాడుతూ తగలబడే బీడీతో, ఒక సుపరచితమైన వాసనతో కదులాడే తండ్రి ముఖం. 

-స్కాలర్షిప్పులు సమయానికి రావు సార్ ... మా అమ్మా నాన్నా నన్ను ఇంత దూరం పంపించి చదివించడమే చాలా కష్టం సార్-

పెరుగన్నం. కాలేజ్ లోని ఆవరణలోని ఒక చెట్టు కింద కూర్చుని, టిఫిన్ బాక్స్ తెరుస్తాడు. చలికాలమైతే పరవాలేదు. కానీ ఎండాకాలం అన్నం త్వరగా పాడవుతుంది. ఒకాకొక పిగిలే ఎండాకాలపు తొలి దినాల్లో, చెట్టు కిందుగా నడుస్తూ ఆ కుర్రవాడిని గమనించి అడిగాడు:

-నేను కూడా వచ్చేదా? నాక్కూడా ఒక ముద్దన్నం పెడతావా?- అని.

అప్పుడు ఆ కుర్రవాడి నారింజ పెదాలపైన ఆకస్మికంగా రాత్రి ప్రత్యక్షమయ్యింది. అమావాస్య. కళ్ళల్లో పొడుస్తున నక్షత్రాలు.

-మీరు తినలేరు సార్...-

-మరేం పర్వాలేదు...-

ఆ కుర్రవాడి ముఖం ఇంకిపోయి, గడ్గాధమైన స్వరంతో అన్నాడు:

-ఎండాకాలం కదా సార్ ... అన్నం త్వరగా పాడవుతుంది... వాసన...మీరు తినలేరు...-అని 

ఆ కుర్రవాడు తల దించుకున్నాడు. అతను స్థాణువయ్యాడు. జేబులో రెండున్నర రూపాయలు ఉన్నాయి. దానితో పది కిలోమీటర్లు వెళ్ళాలి. బస్సు టికెట్టుకూ సరిపోవు. తమాయించుకుని అన్నాడు అతను:

-టీ తాగుదాం రా -

ఆ కుర్రవాడు టిఫిన్ బాక్సు మూసి భారంగా లేచాడు. బాదు. ఎందుకు? అయినప్పటికీ నొప్పి. దేహంలో. మనస్సులో. ఇద్దరికీ. కెఫే లో టీ  తాగుతుండగా ఆ కుర్రవాడు అడిగాడు:- మీరు అన్నం తిన్నారా సార్-?

-లేదు. హాస్టల్లో రూం లో నాకు భోజనం ఉంటుంది. వెళ్ళాక తింటాను-

అబద్ద. పర్వాలేదు. జీవితంలో చాలాసార్లు తప్పదు. చాలాసార్లు అబద్ధం నిజంగానూ, నిజం అబద్ధంగానూ మారుతూ ఉంటుంది. బహుశా, రెండింటికీ మధ్యా ఉండే సరిహద్దు గీత సన్నది ఉండవచ్చు. చాలాసార్లు రెండింటికీ తేడా లేకపోతుండవచ్చు. చాలాసార్లు రెండూ ఓవర్ లాప్ అవుతుండవచ్చు.

ఆ కుర్రవాడి ముఖం-సన్నగా, కోలగా. అన్నింటికంటే ముఖ్యంగా కళ్ళు. పగలూ రాత్రీ రెండూ కలగలసిపోయి.

అతడు మంచంపై కూర్చుని పక్కనే ఉన్న అద్దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. రెండు కళ్ళు. అపరచితమైన నయనాలు. ఎక్కడో భూమి పొరలలోంచి కేక వేస్తున్నట్టుగా. కాళ్ళ కింద నల్లబడుతున్న చారలు. ఎలా అంటే ఒక స్వప్నం ఆకస్మికంగా తునకలయ్యినట్టుగా. ముఖం - అది కూడా అపరాచితంగా అతను తన ముఖాన్ని మరింత సునిశితంగా అద్దంలో గమనించుకున్నాడు, నిక్షిప్తమైనదాన్నేదో కనుగోవాలనుకున్నట్టుగా. అది తన ముఖం కాదు. ఎట్లీస్ట్ తనకు తెలిసిన ముఖం కాదు. మరెవరిది? తనకు తెలిసిన ముఖం డిస్ లోకేట్ అయినట్టుగా, తనే గుర్తు పట్టనంతగా మారిపోయినట్టుగా...ముఖాన్ని చిత్రిస్తుండగా కాన్వాస్ పై నీళ్ళూ పెయింట్ వొలికిపొయి, చిందర వందరగా సాగిపోయినట్టుగా. అతడు మరి కొద్దిసేపు అద్దంలో ముఖం చూసుకుంటూ ఉండిపోయాడు. ఎటువంటి భావాలూ లేకుండా. గమనించడం గమనించడం కోసమే అన్నట్టుగా-

కిటికీలోంచి చీకటి మరింతగా చిక్కబడింది. లతల్లా, లోపలి నెమ్మదిగా అల్లుకుంటోంది. రాత్రి. మొదలవుతున్న రాత్రి. మరొక, సుదీర్ఘమైన చీకటి సమయం. ఎటువంటి వెలుతురూ లేకుండా, దిగులూ విషాదభరితమైన ఎటువంటి నిశ్చల అర్ధమూ లేని తన ముఖం లాంటి తన ముఖాన్ని తను గమనిస్తున్నట్టు ఉండే రాత్రి.

అతను లైటు ఆర్పివేసి మూలగా ఉన్న కుర్చీని దగ్గరగా లాక్కుని దానిలో కూర్చుండిపోయాడు, ఎదురుగా కిటికీలో చిక్కనవుతున్న చీకటిని గమనిస్తో. కళ్ళు మూసుకో తగలబడుతున్న పూలపై మంటలను ఆర్పివేసేందుకు కప్పుతున్న అరచేతులు - కనురెప్పలు. కొద్దిగా గాలి. కొద్దిగా దేహం. కొద్దిగా గతం. కొద్దిగా వర్తమానం - అద్రుశ్య అజగరమేదో శరీరాన్ని చుట్టుకుంటున్నట్టుగా. లోపల ఏదో జ్వలిస్తోంది. దేహం లోపల.ఏదో అరణ్యం తగలబడు తున్నట్టుగా. కొన్ని జ్ఞాపకాలు. కొన్ని ఇమేజెస్. కలగాపులగంగా కలగలసి మెలికలు చుట్టుకుని, అంతలోనే వీడిపోయి తిరిగి చుట్టుకుంటో-

అతను తన చల్లటి అరచేతులతో ముఖాన్ని అసహనంగా రుద్దుకున్నాడు. కొన్నిసార్లు స్పష్టం కాదు ఏవి ప్రతీకలో ఏవి వాస్తవాలో, ఏది గతమో ఏది వర్తమానమో. గతం వర్తామానంలోకి, వర్తమానం గతంలోకీ జారుకుటునట్టూ: అసహనం. విసుగు. అనిశ్చితి. ఇవి సరే: మరి ఆమె? ఒక్కటే. ఆమె దేహం ఒక్కటే. ఆమె నవ్వూ ఒక్కటే. ఆమె స్పర్శా ఒక్కటే. మరొక రోజు మరొక సమయం మరొక సందర్భంలో, నవ్వూ చిరునవ్వూ ఉద్రేకమూ శాంతీ అశాంతీ కూడానూ- ఆమె అంది అప్పుడు:

-నీకు మనుషుల్ని ఎలా ప్రేమించాలో తెలియదు-

అతను మాట్లాడలేదు.

-నీకు మనుషుల్ని ఏం చేసుకోవాలో కూడా తెలియదు శ్రీ- ఆమె మళ్ళా మృదువుగా చెప్పింది. అతను తల ఎత్తి ఆమె  వైపు చూసాడు. మధ్యాహ్నపు సుపరిచితమైన ఎండా మళ్ళా తన ముఖంపై నీడలతో వాలి ఉంది. ఆ నీడలలో తన కళ్ళు పక్షుల్లా కదులుతున్నాయి. అతడు వాటి వంక చూసాడు. 'భాష కాదు, లిపి లేటి వాటిని చదువు-' ఆ పక్షులు చెప్పాయి. అతనికి వాటిని స్పర్శించాలనే బలీయమైన కోరిక కలిగింది. అతన చేతిని చాచగానే ఒక కదలిక: అతని ముందు రెండు ప్రశాంతమైన సరస్సులు ప్రత్యక్షమయినాయి: నిటారుగా నిలబడి వికసించిన నీటి పూవుల్లా. అతనికి ఆకస్మికంగా వాటిలో తన ప్రతిబింబం కనిపించింది. తన శరీరం సమస్థమూ ఆ జల ధారలలో ప్రత్యక్ష మయ్యింది.  అతని కళ్ళు: మరణించిన శరీరాల్లా, లేక ఆకస్మికంగా పోయిన ప్రాణంలా. అవి తన నయనాలు కావు. అంది తన శరీరమూ కాదు. తన మరో తనలా కనుమరుగవుతున్న చిత్రంలా. చూసుకుంటే, అరచేతులకు నల్లని కాటుక -          

 తన రెండు అరచేతులనూ కళ్ళకి ఎదురుగా తెచ్చుకుని పరీక్షగా గమనించాడు అతను. కాటుక. అది రక్తపు కాటుక. కమిలిన కాటుక. ఆకస్మికంగా, కాతుకలోంచి రెండు కళ్ళు మొక్కల్లా పొడుచుకు వచ్చాయి. కనురెప్పలకు బదులుగా పాలిపోయిన ఆకులు. రోగగ్రస్థమైన ఆకులు. అవి కళ్ళూ, కనురెప్పలోనూ. తన తల్లి కళ్ళు. తన స్త్రీ కళ్ళు. ఏదో మాట్లాడుతూ ఆ కళ్ళు. ఆ మొక్కలు. అర్థం కాక, మూగవోయి అతను. ఆ కనురెప్పల కింద నీటిలో లిఖించబడుతున్న పదాలు ఏవీ అతనికి అర్థం కావడం లేదు. బాధ. నొప్పి. నొప్పీ. బాధా. అతని కళ్ళు కుంచించుకు పోయి, ఒక చీకటిలోకి సాగిపోయి, రెండు వేళ్ళ మధ్య ఎవరో చిదిమినట్టు, అతని శరీరమంతా చమట, నొప్పీ బాధా. అతను ఉలిక్కిపడి అ వాలు కుర్చీలో ఆ చీకట్లో ఆ గదిలో సర్దుకున్నాడు. గుండె శరీరమంతై గదంతా సవ్వడితో కొట్టుకులాడుతున్నట్టు- ఇక ఆ రాత్రి అక్కడ, అతనిలో ఒక గతమైన ఒక వర్తమానంలో అతని ప్రియురాలి అద్రుశ్య స్వరం ప్రాణభయంతో వెలువరించిన, కనుమరుగవుతున్న కేకలా మార్మోగింది:


-నువ్వు నన్ను వొదిలి వెళ్ళకు. ఈ దేహాన్ని వొదిలి వెళ్ళకు. నువ్వెందుకు నన్ను ప్రేమించవు? నువ్వు ఈ దేహాన్ని ఇష్టపడ్డప్పుడు ఈ పెదాలనూ పదాలనూ పాదాలనూ ఇష్టపడినప్పుడు, గోరింటాకులా నిన్ను నాపై పరచుకున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవు? ఒకసారి, ఒక్కసారి, నీ చుట్టూ ఉన్న మనుషులనీ, వాళ్ళలోని ఆశలనీ ఎందుకు గమనించవు? ఒకసారి- ఒక్కసారి, ఒకే ఒక్కసారి, వాళ్ళని వినేందుకూ, వాళ్ళని హత్తుకునేందుకూ నువ్వు ఎందుకు ప్రయత్నించవు? మూర్ఖుడా: నేను నిను ప్రేమిస్తున్నాను. నిజంగా. ఈ దేహం తోటీ, ఈ మాటల తోటీ, నా భాష తోటీ, నాదైన పెదాల తోటీ, పాదాల తోటీ ఈ వక్షోజాల తోటీ నా ఈ చనుమొనల తోటీ ఈ తొడల తోటీ నా ఈ కౌగిళ్ళ తోటీ ఈ హస్తాల తోటీ ఈ వేళ్ళ తోటీ నా దేహంలోని మలం తోటీ మూత్రం తోటీ నెల నెలా నెత్తురు వెన్నెలయ్యే నా ఈ చెలమ తోటీ నిన్ను ప్రేమిస్తున్నాను. మూర్ఖుడా: అది నువ్వు ఎందుకు , నువ్వెందుకు గ్రహించవు?- 
-------------------------------------------------------------------------------------------------

07.07.1997

1 comment:

  1. -నీకు మనుషుల్ని ఏం చేసుకోవాలో కూడా తెలియదు శ్రీ-

    ReplyDelete