19 February 2013

ఒక ఉనికి

ఇలా ఎప్పుడైనా ఉన్నావో లేదో నాకు తెలియదు-

నూనె తరిగి, వొత్తి వొరిగి
రాలిపోతుందీ
దీపపు కాంతి.

ఇక ఒక మహా చీకటి, నీడల్లోంచి నీ వైపు చేతులు చాస్తే

గాలిలోని చెమ్మని పుచ్చుకుని
కంట నీరు పెట్టుకుంటుందీ
నీ ఇంటిలోని ఒంటరి కిటికీ-

ఇక అప్పుడు ఆ చీకట్లో నువ్వు ముడుచుకుపోయి, నీ
తలను, నీ రెండు
అరచేతుల మధ్య

మౌనంగా పూడ్చుకుని, తిరిగి ఉదయాన నీ తల ఎత్తితే

నుసి నుసిగా రాలే ఎండలో, నీ ఆద్దంలో ఒక కపాలం నీ
శరీరంలో ఒక
అస్థిపంజరం-

ఇంతకూ ఎవరది?
ఇంతకూ, ఏమని
పిలుస్తావు నువ్వు దానిని? ఏమని చెబుతావు వాళ్లకి?  

2 comments: