ఎలా ఉన్నావు నువ్వు? తను అడిగింది, నుదిటిపై చేయి ఉంచి-
లోపల ఎక్కడో నీటిపై వాలిన తూనీగ పాదాలు గీసిన
వలయాల అలజడీ.
వీచే గాలులలో తేలిపోయే పసుపచ్చ ఆకుల అంతిమ అలికిడీ: ఇక
ఇద్దరు ప్రేమికులు ఏళ్ళ తరువాత ఎదురుపడి
స్థాణువయ్యి, అలా నిలబడి నిశ్శబ్ధమయినట్టు
ఒక తొలి కలయిక వలే ఒక చివరి చూపు వలే
చాలా యధాలాపంగా, కూర్చుని గోడలపై నీడలను తదేకంగా చూసే ఓ
మూడింటి రాత్రివి నువ్వు కాగలిగితే, నిన్ను నువ్వు
పక్కన పెట్టుకుని ఎప్పుడైనా నన్ను చూడగలిగితే---
ఏమీ లేదు. నాతో నేను మాట్లాడుకుంటున్నాను, పగులుతున్న
ఈ రాత్రి లాంతరు కటిక చీకట్ల కాంతి కింద-
No comments:
Post a Comment