29 October 2017

సాదాగా

లంచ్ బాక్సు విప్పి
ఒక వొంటరి మధ్యాహ్నం వేళ, ఒక్కడినే మరి
బల్ల ముందు -

నీ చేతివేళ్ళ చివర్లై
మెతుకులు: తెల్లగా మెత్తగా దయగా, నువ్వైన
సువాసనతో ...

పొడుగాటి కిటికీలకకు
ఆవలగా జలజలలాడే ఆకులపై మెరిసే ఎండ
( నీ కళ్ళా అవి? )

ఎక్కడో దూరంగా మరి
చివుక్ చివుక్ మని శబ్ధాలు, అనువాదమయిన
ఆనందంతో ...

(నీ మాటలే అవి
WhatsAppలోంచీ, మెసేజ్ ఇన్బాక్స్లోంచీ తేటగా
ఎగిరొచ్చే పిట్టలు)

"తిన్నావా? తినేసేయి
త్వరగా. క్లాసులు అయిపోయాయా? తినకుండా
అలాగే ఉండకు"

తెరలు తెరలుగా వీచే
శీతాకాలపు మధ్యాహ్నపు గాలి. స్కూలు పిల్లలు
ఊరకనే మరి

మైదానంలో ఎగిరెగిరి
గెంతుతోన్నట్టు, బల్లపై కొట్టుకుకులాడే కవిత్వ
పుస్తకపు పుటలు ...

(అది నా హృదయం అనీ
ఈ పూట అది మైదానమూ, పిల్లలూ, గాలీ అయి
ఉన్నదనీ, నేను

నీకు ఎలా చెప్పేది?
మెతుకులలో నువ్వూ, మెరిసే నీ ముఖమూ నీ
శ్రమా మరి

కనిపిస్తున్నవనీ
వాటికి నేను ఎంతో రుణపడి ఉన్నాననీ, నేను
ఎవరికి చెప్పేది?)
***
రెండు చేతులూ
జోబుల్లో దోపుకుని, ఏదో స్ఫురణకు వచ్చి, ఇక
లోలోన

నవ్వుకుంటూ
మబ్బు పట్టిన దారిని, నింపాదిగా దాటుకుంటూ
వెళ్లినట్టు

లంచ్ బాక్సు విప్పి
ఒక వొంటరి మధ్యాహ్నం వేళ, ఒక్కడినే ఇక్కడ
నీ ముందు!

24 October 2017

నీ నవ్వు

నవ్వినప్పుడు, ఎంతో బావుంటావు నువ్వు
చలికాలపు వెన్నెల రాత్రుళ్ళు
గుర్తుకు వస్తాయి అప్పుడు నాకు; అవి
నీలా ఉంటాయని కాదు; కానీ, అవి అంటే
ఎంతో ఇష్టం నాకు; తెలుసులే
నాకు, ఇవన్నీ పోలికలనీ, ఇవేవీ కూడా
నీ చేతిస్పర్శని భర్తీ చేయలేవనీ! అమ్మని
వెదుక్కునే ఓ పసిచేతిని, మరి
ఏ పదం, అర్థం వివరించగలదో చెప్పు!
యెదలో వొదిగిన నిదురనీ, ఆ నిదురలోని
స్వప్న సువాసననీ, పెదాలపై
తేలే నెలవంకనీ, లేత పిడికిలి పట్టునీ
ఏ భాష, ఎలా అనువదించగలదో చెప్పు?
***
నవ్వినప్పుడు, ఎంతో బావుంటావు నువ్వు
నెగడై రగులుతో, చిటపటమని
నిప్పురవ్వలను వెదజల్లుతో! మరి, ఓ
అమ్మాయీ, ఈ చీకటి క్షణాలలో, నువ్వు
అన్నిటినీ విదుల్చుకుని, అట్లా
నవ్వడాన్ని మించిన విప్లవం ఏముంది? 

23 October 2017

నీ నొప్పి

నీ నొప్పి తెలుస్తోంది నాకు; రొట్టెలకి
పిండి వొత్తుతూ అమ్మ,
కళ్ళని ఎందుకో తుడుచుకున్నట్టు -
రాత్రి పన్నెండయ్యిందా, ఇప్పుడు?
బయట, ముసురులో
వీధి దీపాలు; తడచి వణికే కాంతిలో -
బాల్కనీలో ఓ పూలకుండీ పగిలింది
వేర్లు వెలుపలికి వచ్చి,
మట్టి ధారగా కారి, చిత్తడి అంతానూ -
అవును: హృదయం కూడా; చెదిరీ
ఎందుకో బెదిరీ, కాలి
బొబ్బలు ఎక్కిన చేతివేలి చివరైతే,
***
నీ నొప్పి తెలుస్తోంది నాకు; ఎంతో
ఆలస్యంగా పడుకున్న
అమ్మ, నిదురలో వొళ్ళు నొప్పులకి,
అట్లా ఉలిక్కిపడుతో మూలిగనట్టు! 

22 October 2017

sentimental

ఏం చేసుకోను నిన్ను నేను? ఎంత 
అయోమయం సృష్టించావు! 
తూనీగలు ఎగిరే ఓ పచ్చిక మైదానం 

అయిపోయాను నేను - 

లేత ఎండ ఉంది నీలో; కురిసే వర్షం
ఉంది నీలో. పునర్జన్మనిచ్చే 
ఇంద్రజాలం ఏదో ఉంది నీలో; పిల్లా 

ఒక పూలకుండీవి నీవు -

బయట, శీతాకాలపు గాలి; చెవి వద్ద
ఎవరో గుసగుసలాడినట్టు!
చిన్ని వలయాలై ఊగే నీడలు; మరి
నా క్షణాలవి ఈనాడు!
***
రాత్రంతా నింగిలో మెరిసే చుక్కలూ,
సవ్వడి చేసే ఆకులూ, 
మసకగా మెరిసే నెలవంకై నువ్వూ! 

మరి, ఏం చేసుకోను నిన్ను నేను

ఏమీ చేయను; ఇక - నాకు మిగిలిన 
కాలమంతా, ఉట్టినే అట్లా, 
నిన్ను చూస్తూ గడుపుతాను నేను!

21 October 2017

బహుశా,

బహుశా, కూర్చునే ఉండవచ్చు నువ్వు,   
లేక నిలబడో; వొంటరి మేడపైనో
లేక లోయల వంటి హృదయపు గదులలోనో -

"దీపాలు వెలిగే కళ్ళు నీవి" అని అన్నాను 
ఓసారి నేను, నీతో; తెలుసు నాకు
బహుశా అవిప్పుడు ఎంతో మండే రాత్రుళ్ళు - 

ఇంకా, చాలానే చెప్పి ఉన్నాను; చినుకు 
చిందిన పూవువనీ, ఊయల వలే 
ఊగే గాలివనీ, కుదురసలే లేని ఉడతవనీ,

చీకట్లలో పనస ఆకుల మధ్య, సగం సగం
కనిపించే చంద్రబింబమనీ, మరి  
నీ సువాసనతో అదీ రాత్రిని వణికిస్తుందనీ!
***
బహుశా, పడుకునే ఉండవచ్చు నువ్వు,
లేక అలా మెలకువగానో; వేలితో 
గోడలపై నీడలంచులని ఎంతో దీక్షగా గీస్తో -

మరి, దీపాలు ఆరాక, గాలి ఆగాక, వాన 
వెలసి వణికిన రాత్రి నిద్దురోయాక, 
ఊయల్లో కనబడని బిడ్డని, చెక్కుకుపోయిన  

గుండెతో, వెదికేదెవరో తెలుసునా నీకు?

19 October 2017

ఎక్కడ

అమ్మ పుట్టిన రోజు; మరి మబ్బులు పట్టి
గాలి వీస్తో బయట; దుమ్ము -
ఆవరణలో రాలి, దొర్లుతో వేపాకులు

ఇంటి వెనుక, తీగకు రెపరెపలాడుతో ఒక
ఊదా రంగు చీర; పాతదే,
ఇప్పుడు ఇల్లు తుడిచేందుకు వాడేదే;

( మరి అది అమ్మదే, రెండుగా చిరిగి ) -

ఒక జామచెట్టు ఉండేది అక్కడ; ఎన్నెన్నో
పళ్ళను ఇచ్చిన చెట్టు; ఇక
ఇప్పుడు, అక్కడంతా కరకు బండలు

పరచిన నేల; ( పగిలిన అరిపాదాలై ) -

ఎన్నో వెళ్ళిపోయాయి; ఎంతో ఏపుగా సాగి
అల్లుకున్న ఓ బీరతీగా, ఊగే
మల్లెపందిరీ, వెన్నెల్లో వొణికిన రాత్రీ ...

ఎన్నో వెళ్ళిపోయాయి; ఋతువులై కొన్ని
అశ్రువుల్లో మునిగిపోయి కొన్ని,
చీరేయబడిన పిల్లిపిల్లలై మరికొన్నీ ...
***
అమ్మ పుట్టిన రోజు ఇవాళ; బయట, మరి
మబ్బులు పట్టి, హోరున
గాలి; ఇల్లంతా ఖాళీ. కళ్ళల్లో దుమ్ము -

మరి, ఇక్కడ ఉండాల్సిన అమ్మ ఎక్కడ?

గీతలు

పెదవులు బిగించి, పాప ఎవరో మరి
ఎంతో శ్రద్ధగా గీసినట్టు
ఎన్నెన్నో గీతలు ఈ పలకనిండా...
అర్థం అయ్యేవి కొన్ని, అర్థం కానివి
మరెన్నో, పిచ్చికలేవో
వాలినట్టు, గీరినట్టూ, అంతలోనే
మళ్ళీ ఎటో ఎగిరిపోయినట్టూ, ఒక
సాయంకాలం నువ్వు
చెక్కి వెళ్ళిన గీతల్లో, మబ్బులు
తేమ: కిందుగా, బహుశా, వానలూ
నదులూ, రాలే గూళ్ళూ
చెరుపుకోలేని, తొలి అక్షరాలూ ...
***
పెదవులు బిగించి పాప ఎవరో మరి
ఎంతో శ్రద్ధగా గీసి, ఆపై
విసిరికొట్టినట్టున్న పలక నిండా
నెత్తురొలికే రాత్రుళ్ళలాంటి గీతలు -
ఆ పలకే నేను అని, ఇక
నీకు నేను ఎన్నటికీ చెప్పలేను!

ప్రశ్నే

పర్సులోంచి, ఒక పేపర్ నాప్కిన్ తీసి
ముఖాన్ని తుడుచుకుని,
ఎంతో తేలికగా పక్కకి విసిరికొట్టి,
ఇలా అడుగుతోంది అమ్మాయి: "ఇట్స్
క్వైట్ హాట్ టుడే. Isn't it?"
Finally, అతని హృదయం ఆమెకి
ఏమిటో అర్థం అయ్యి, తను వొదిలిన
ఖాళీలో కూర్చుని, ఇక కవి
ఇలా రాస్తోన్నాడు: "ఓ అమ్మాయీ
ఎట్లీస్ట్ ఫర్ ది టైం బీయింగ్, your face
కారీస్ ది సెంట్ ఆఫ్ మై
స్కిన్. మరి ఎలా విసిరి కొడతావు
నీలోలోపలికి ఇంకిన నా చర్మాక్షరాల్నీ
నువ్వు తుడిచాక, నాపై
మిగిలిన నీ శరీర బహుళార్థాలనీ?"

కృతజ్ఞతతో

ఎత్తైన ఆ మెట్ల వరస మీదుగా కిందకి
దిగి వస్తూ నువ్వు,
పొడుగాటి గులాబీ కొమ్మ ఒకటి గాలిలో
ఊగినట్టు, తెల్లని
దుస్తులలో, నెమ్మదైన నదిలాగా ...
ఎంతో అలసి ఉన్నాను నేను, ఆనాడు -
ఓ ఖండిత వృక్షాన్నై
ఎండి, రిసెప్షన్ బల్లపై వొరిగిపోయి ...
వెలుపల, పొరలు పొరలుగా శీతాకాలపు
మధ్యాహ్నపు ఎండ -
నిలువెత్తు అశోకా వృక్షాల మధ్యగా
అటూ ఇటూ చలిస్తూ తూనీగలు. ఏవో
ఏవేవో పిట్టల అరుపులు
దూరం నుంచి, గడ్డి పరకలలాంటి
గొంతుకలతో: చలించే నీడలతో, మరి
వాటితో పాటు ఊగిసలాడే,
రాత్రి రాలిన చినుకుల ఘోషతో!
ఇక అప్పుడు, మెట్లు దిగి వస్తూ నువ్వు
తల ఎత్తి పలకరింపుగా
నా వైపు చూసి నవ్వితే, కొమ్మ ఊగి
వెదజల్లిన ఓ సువాసనకీ, చీకట్లో చుక్కై
మెరిసిన ఓ చిరునవ్వుకీ
డస్సిన గొంతులోకి, మంచినీళ్ళై
జారిన ఓ వదనానికీ, ఇప్పటికీ ఓ శ్వాసై
మిగిలిన నీ మాటకీ, ఎన్నో
ఖండిత అంగాల, ఈ 'బ్రతకడం'లో
ఎంతో అపురూపంగా, బిడ్డని హత్తుకునే
తల్లి బాహువులై మిగిలిన
నీ స్మృతికీ, నీకూ, కృతజ్ఞతతో
ఎత్తైన ఆ మెట్ల వరస మీదుగా, నీ వద్దకు
చేరందుకు ప్రయత్నించే
నేనూ, ఈ పదాలూ, మరి ఎంతో
అబ్బురంతో, ఈ చిన్ని చిన్ని కవిత!

చివరిసారి

అపరమితమైన వ్యాకులతతో, అతను
అడిగాడు, "How can
you do this to me? ఎలా? ఎలా?"
ఎదురుగా, నిటారుగా లేచి ఎగబాకిన
గోడలు: తడిచిన ఎర్రటి
మట్టివలే ఆకాశం: బురద, బురద ...
లోపల అశోకా చెట్లు, పిచ్చిగా ఊగుతో
వొంగి, మళ్ళీ చివ్వున లేస్తో ...
ఎక్కడో, రాలే ప్రతి చినుకులోనూ మరి
శరీరం చిట్లి, నలుదిశలా చిందే, ఒక
మహాశబ్ధం: గూళ్ళు చెదిరి
పీలికలు పీలికలై వీడిపోతో, మరి
నేల రాలి మిగిలే, ఒక నిశ్శబ్ధం -
అమితమైన వ్యాకులతతోనే, అతను
అడిగాడు, "ఎలా? How
can you do this to me? Again?"
***
చర్చి ముందు, జనం పలచబడ్డారు -
రాత్రిలో, దూరంగా ఎక్కడో
మిణుకు మిణుకుమంటో ఓ దీపం,
వణుకుతో, క్రమేణా అంతర్దానమౌతో
నెత్తురు ఇంకిన చీకట్లో
ఎవరిదో, చెమ్మగిల్లిన కంఠస్వరం!

ఆవృత్తి

రెండు చేతులూ కట్టుకుని, తల వంచుకుని
ఇంటి వైపు నడుచుకుంటో ...
***
రాత్రి: పాదాలను చుట్టుకుంటూ సాగే గాలి,
నేలపై దొర్లే, రాలిన ఆకులు
వాటిపై ప్రతిఫలించే మసక వెన్నెల,
చుట్టూతా ఏవో శబ్ధాలు, గుసగుసలై, అంతా
సంకేత భాషై, "అనువదించుకో,
వీలైతే నన్ను" అని నువ్వు పలికినట్టైతే,
దూరంగా చీకట్లో ఇల్లు: ప్రార్ధనా మందిరమై,
ముకుళించిన కాంతిలో, ఒక
కంచమై, మంచినీళ్ళై, నిదురై, నువ్వైతే,
***
బడి నుంచి, తల్లి వెంటో పిల్లవాడు, ఏవేవో
కబుర్లు చెబుతూ సాగినట్టు,
ఇట్లా, నీ స్మృతితో, ఇంటివైపు నేను!

కాలం

ఒకరోజు ఎప్పటిలానే, చాలా మామూలుగా
కిటికీ పక్కగా కూర్చొని నువ్వు, నీ శిరోజాల 
చిక్కులు తీసుకుంటూనో, నేను
పదాల ముడులను విప్పుకుంటూనో,
నేలంతా కాగితాలైన కాంతి, వడలి, రాలిన
తెల్లని గులాబీ రేకులకు మల్లే ...
బయటరుస్తో పిచ్చికలు: ఎగిరీ, వాలీ
ఏదో గాలి. ఆరని దుస్తులు: మన పిల్లలవీ
నీవీ, నావీ: రెపరెపలాడుతూనో
తీగను పట్టుకుని, హూష్మని పొర్లుతోనో,
ఒకరోజు ఎప్పటిలానే, చాలా మామూలుగా
కిటికీ పక్కగా కాంతిలో, దువ్వెనని, ఎంతో
శ్రద్దగా పరికించి చూస్తూ నువ్వు
ఓ పదంలో చిక్కుకుని కాలం సాగిపోగా,
ఆకస్మికంగా నీలో, వ్యార్ధకంతో నేను!

చీమ

'నువ్వు ఎవరివి?' అని అడిగింది
ఓ అమ్మాయి -
నేనో చిన్ని చీమని, ఏ పాపమూ
తెలియని,
తెల్లని హృదయమున్న,
ఒక నల్లని, చిన్ని చీమని...
నీలో మునిగిపోకుండా, ప్రాణాన్ని
పణంగా పెట్టి ,
ఏ ఆకునో గట్టిగా పట్టుకుని
ఎటో, ఎటెటో, ఎటెటెటో
గాలికి కొట్టుకుపోయే, ఒక చిన్ని
చిన్ని చీమని,
మరి ఏదో ఒకనాడు నువ్వు
వదిలి వెళ్ళిపోతే, నీ కాలి కింద
చితికిపోయే, ఓ
చిన్ని చిన్ని, చీమనీ
సీతాకోక హృదయమున్న ఒక
గొంగళిపురుగునీ
ఒక నల్లని మబ్బునీ ...
***
సాయంత్రం అయ్యింది. మరి
రాత్రీ దాటింది -
ఓ అబ్బాయీ ... నీ ఖాళీ
అరచేతుల్లోని
ఓ చిన్ని లోకాన్నీ, వొంటరైన
హృదయ పదాన్నీ
విడుదల చేసేది ఎవరు?

నొప్పి

"పిల్లల్ని కొట్టొద్దు" అని అంటాను,
వాళ్ళు వినరు -
వెక్కిళ్ళు ఆగాక, ఎప్పటికో ఆ పాప
కిందకి దిగుతుంది
గుండ్రటి నల్లటి ముఖంతో ...
నవ్వుతోంది కానీ, ఏదో బెరుకు -
తోడపైన నల్లగా
చిన్ని పిడికిలంత మచ్చ,
"ఏమయ్యింది" అని అడుగుతానా
ఆగి ఆగి చెబుతుంది ఎప్పటికో,
అటు ఇటు చూస్తో,
"అమ్మ ... వాత పెట్టింది"
బయట చీకటి. మూలిగే గాలి. ఏవో
అరుపులు. ఘోష,
వీధి దీపాలు పగిలి, కాంతి
చిట్లి, కుండీలోని చామంతులపై
బూజురు బూజురుగా
రాత్రి, ఓ సాలెగూడై వ్యాపిస్తే
అమృతాంజన్ పెట్టిన కళ్ళలోని
నొప్పై, నీరై, తల్లి
తనని ఎందుకు కొడతుందో
తెలీని ముఖమైతే, చిన్ని వేళ్ళైతే
***
"పిల్లల్ని కొట్టొద్దు" అని అంటాను,
ఎవరూ వినరు -
ఇక రాత్రంతా, లోకమంతా
పై అపార్ట్మెంట్లోంచి ఒకటొకటిగా
ఇక్కడ రాలి చిందే,
చినుకులు కాలిన వాసనై
హృదయమై, మరిగిన నీళ్ళల్లో
పడ్డ పక్షిపిల్లై, అట్లా
ఓ ముద్దగా, మిగిలీ, పోయీ ... 

దశ

పిల్లలు ఎవరో గీసిన గీతలల్లే
వేసిన బొమ్మలల్లే
పెన్సిల్ పొట్టువలే ఆకాశం -
వాన ఆగిపోయింది. తలుపులు
తెరుచుకున్నాయి,
బొగ్గుల పొయ్యిల్లోంచి పొగ -
కట్టెలు ఎగదోస్తో ఓ ముసలావిడ
నెరసిన తన జుత్తుని
లాక్కుపోతూ, ఎటో గాలి ...
ఓ ఎర్రని ముద్ద గులాబీని, తన
తెల్లని శిరోజాల మధ్య
ఎవరో ప్రేమతో ఉంచినట్టు
ఊహిస్తాను. వొణికే ఆ చేతులనీ
వేళ్ళనీ, పెదిమల
మాటున దాగిన మాటల్నీ
తాను అల్లిన, ఓ ఉన్నిస్వెట్టర్
అని కలగంటాను,
వ్రాస్తాను. ఇంకేం చేయను?
ఆగాగు: వస్తున్నాను, వేగిరంగా
ఇంటికి, మెరిసి ఆరే
బొగ్గు కణికెలతో, రాత్రితో
చీకటి తువ్వాలుతో, నీతో కలిసి
స్నానం చేసి, మరి
వ్యార్ధకానికి చేరువవ్వడానికి!

వ్యాకులతతో

ఎవరూ లేరు ఇంటి వద్ద; ఆకులు
రాలిన ఆవరణలో,
సాయంకాలపు నీడలు, బహుశా

అమ్మ కళ్ళులాగా, శిరోజాలలాగా ...
గుబురు మొక్కలలో
మెసులుతో పిల్లి, తోచనట్టు, ఏదో

కోల్పోయినట్టు, (నా హృదయమై)
అన్యమనస్కమై,
నీరింకిన నల్లని మట్టై, చెట్టెక్కి

ఎందుకో అరుస్తో; ఎవర్నో పిలుస్తో
ఏవేవో గూళ్ళ వద్ద
తచ్చాట్లాడుతో, రాత్రిలోకి సాగి

మళ్ళా తిరిగి అక్కడికే వచ్చి, ఒక
స్పర్శకోసమో, నీలోని
ఇంత చిటికెడు స్థలం కోసమో

నీ ఒడిలోని జోలపాటకోసమో,
ముంత పాలవంటి
నిద్రకోసమో, ఓ మాటకోసమో,

పోనీ అచ్చంగా నీకోసమో, నువ్వు
లేక ఉండలేని
తన కోసమో, ఎందుకోసమో,

మరి ఎవరికైనా ఎలా తెలుసు?
***
ఎవరూ లేరు ఇంటి వద్ద; వెన్నెల,
ఒక మసక మసక
ముగ్గైన వాకిలి వద్ద; రాలిన

ఆకులు నలిగి, పదాలై పొర్లే ఖాళీ
శబ్ధాలవద్ద; దీపమారి
లోపల విలవిలలాడుతో ఎగిసి


వ్యాపించే పొగ వద్దా, నా వద్దా!

ముగింపు

ఇక నడవలేదు తను; కొమ్మలు
విరిగే చప్పుడు
మోకాళ్ళల్లో, కళ్ళ నీళ్ళల్లో ...

పాత గుడ్డలు వేసిన ఓ వెదురు
బుట్ట ఇప్పుడు తను,
మూలగా, నీడల్లో, చీకట్లల్లో ...

ఏం ప్రయోజనం నీ కవిత్వంతో?
వెలిగే దీపాలను
చేయగలవా మళ్ళా కళ్ళను?

అంతే చివరికి! మడతలు పడిన
దుప్పటీ, నేలపై
ఓ చాపా, తలగడ కింద మరి

అమృతాంజనూ, ఓ నిద్రమాత్రా
వొదులైన వోక్షోజాల
వెనుక, లీలగా మిణుకుమనే

ఓ హృదయ తారక! అంతే, ఇక -
చివరికి. ఓ రాత్రై,
ఎటో వెళ్ళిపోతోంది అమ్మ! 

స్థితి

ఎవరూ లేరు ఇక్కడ; ఆరిపోయే
చినుకుల వాసన
ఇక్కడంతా, లోపలి పొరల్లో...

దూరంగా ఎక్కడో ఆకులు కదిలే
సవ్వడి, పల్చటి
కాంతీ, గాలీ: ( మాటలయి

ఉండవచ్చు). ఎదురుగా బల్లపై,
వడలి వొరిగినవేవో ...
పూరేకులూ, ఓ ఖాళీ గళాసూ,

గోడవారగా కాలి రాలిన అగరొత్తీ
బూడిదా, క్రమేణా
కనుమరుగయ్యే దాని శ్వాసా...
***
ఎవరూ లేరు ఇక్కడ; చెట్ల కింద
ముద్దగా మెసిలే,
రోడ్డుపైకొచ్చి, ఏ చక్రం కిందో

చితికిపోయే, ఆ గాజుపురుగులే
గుర్తుకొస్తున్నాయి
మాటిమాటికీ ఈవేళ: మరి

ఎందుకో, తెలియడమే లేదు!

సరళత

రాత్రి అయ్యింది. నువ్వు లేవు
గదిలో నీడలు,
ఊయల్లూగే పూలబుట్టలు ...

రాత్రి అయ్యింది. నువ్వు లేవు
అర తెరచిన కిటికీ
రెక్కలు: ఏవేవో చప్పుళ్ళు ...

రాత్రి అయ్యింది. నువ్వు లేవు
మంచుముద్దై
చంద్రుడు, దూది మబ్బులు

రాత్రి అయ్యింది. నువ్వు లేవు
ఇక మరి గోళ్ళతో
గీరీ గీరీ, గూట్లో ఓ పావురం

మెసిలితే, తిరిగి సర్ధుకుంటే

రాత్రి అయ్యింది. నువ్వు లేవు -
ఇకేం చేయలేక,
నిన్ను తలుస్తో మరెవరో,

ఓ దుప్పటిని పాదాలకు పైగా
ముఖం మీదకు
లాక్కుని, ఓ దీవెన కింద

అట్లా, నిదురే పోయారు!

కఫం

ఎండ పొదిగే దినపు అండంలో
అతను; దగ్గుతో,
జ్వర తీవ్రతతో, వొణుకుతో -

గుండెలో కఫం; బయటికి రాకా,
లోపల ఉంచుకోలేకా
ఒక యాతన; ఎట్లా అయినా

బయటకి త్రోసివెయ్యగలిగితే
కొంచెం తెరపి;
శ్వాసాడవచ్చు; పడుకోవచ్చు ...

గుండెలో కఫం; అచ్చు నీలాగే,
లోపల ఉంచుకోలేకా,
అట్లా అని హృదయంలోంచి

బయటికి త్రోసెయ్యలేకా, త్రోసి
మరి, నిమ్మళంగా
ఉండాలేకా, ఓ తండ్లాట ...
***
ఎండ ఎంతో పొదిగి కన్న, ఒక
రాత్రిలో, అతనే;
దగ్గుతో, పదాలై వొణుకుతో!

అంతే

రొట్టెలాగా ఉందీ ఎండ. చుట్టూ
పిట్టలు, ముక్కులతో
పొడుస్తో, ఎగరేసుకుపోదామని ...

"చూసావా, నువ్వు చూసావా" అని
నువ్వు అడుగుతావు కానీ
దేనినో, నాకెన్నటికీ తెలియదు -

మరి అంతే! ఖాళీ పొట్లాన్ని ఊది
ఎవరో, టాప్మని అట్లా
పగలకొట్టి, పెద్దగా నవ్వినట్టు

గాలి. ఒక ప్రతిధ్వని; ఊగే చెట్లు -
చలించే నీడలు, లోన
నెమ్మదిగా రాలిపోతో, పూవులు ...
***
ఆరిపోయిన పొయ్యిలాగా రాత్రి -
నుదిటిన శిలువై, ఓ
ఖాళీ అరచేయి; వేచీ, చితికీ ...

అంతే! ఓ రోజు ఉండను; నేను!

15 October 2017

విన్నపం

గుండెకు గట్టిగా కరచుకుపోయి,
'వెళ్ళకు' అని అన్నావు
నువ్వు; బయట, గాలికి ఆకులు
కొట్టుకుపోయే సవ్వడి,

మబ్బు పట్టింది. కొంచెం తడిగా
కొంచెం జిగటగా, ఇంకా
అటూ ఇటూ చూస్తో, రోడ్డు దాటే
ఒక కుక్కపిల్లై పోయింది

హృదయం; మరి ఏవో కాగితాలు
కొట్టుకు పోతున్నాయి;
దుమ్ము రేగి, కళ్ళు చికిలించినా
ఏమీ కనపడదు; లోన!
***
గుండెకు గట్టిగా కరచుకుపోయి,
'వెళ్ళకు' అని అన్నావు
నువ్వు; నెమ్మదిగా, ఒక్కో వేలూ
విడదీసి వొదిలివేస్తే,

వానలో కూలిపోయిందీ రాత్రి!

స్పృహ

అంతగా గమనించనేలేదు; ఇద్దరం కూడా -
చీకటి ఎప్పుడు పడిందో
తెలియనే రాలేదు. తన జుత్తు మాత్రం,
ఆ రాత్రిలో తెల్లగా మారుతో ...

ఏ పొయ్యిలోనో సద్దుమణిగిన బొగ్గులై మరి
తన చేతివేళ్లు; రక్తం లేక
పాలిపోయి, పగిలిన గోర్లు; ఎన్నో ఏళ్లుగా
మార్చని ఒక అద్దం; గోడకు ...

అరలలో వరసగా కవిత్వం పుస్తకాలు, మరి
ఎంతో ఆకలితో, ఆ లోవోల్టేజ్
లైట్లో; ఎందుకూ పనికి రానివీ, ఎందరినో
పీల్చి పిప్పి చేసి, 'నేనే' అనే

నెత్తురు తాగే పద్యాలై, చీకట్లలో దాగి దాగి
వెల్తురూ వెన్నెలా గురించి
ఆలపిస్తో బ్రతుకుతున్నవీ! అట్లాగే ఎటో
చివరికి అలా, వెళ్ళిపోయేవీ ...
***
అస్సలు గమనించనేలేదు; ఇద్దరం కూడా,
ఆ చీకటి ఎలా తెల్లారిందో!
ఎప్పుటికో తలెత్తి చూస్తే, పగిలిన అద్దంలో

ఇద్దరం, ఒకే మృత్యువై, ముడుచుకుని!

02 October 2017

కొంచెం

"కొంచెం ఇవ్వు" అని చిన్నగా చేతులు
చాపుతారు ఎవరో,

అప్పుడు మరి నీ అరచేతులన్నీ ఖాళీ;
లోపలా ఏమీ ఉండదు,
ఎండిపోయిన సరస్సై హృదయం,
భూమీ; బీటలు వారి,

ఏవో రాళ్ళూ, ఇనుప తీగలూ, బహుశా
ఎవరికో ఇద్దామని దాచి
చివరికి చించివేసిన ప్రేమలేఖలూ,
విరిచేసిన బొమ్మలూ ...
***
"కొంచెం ఇవ్వు, నాక్కూడా"ని, చేతులు
చాపుతారు ఎవరో,
నీళ్ళ వంటి గొంతుకతో; నీతో -
***
బయట, తడిచి రాత్రి: మెరుస్తో, ఊగే
ఆకులు. నిద్రకు తూగే
కళ్ళైన పూవులు. అలసి, నిట్టూర్పై
ఆగిన శరీరం, చీకటీ!

ప్చ్; ఏమీ లేదు! ఖాళీ అరచేతులూ,
కొంచెం ఇవ్వలేని,
'నాక్కూడా' లేని రాత్రుళ్ళూ!