ఎవరూ లేరు ఇంటి వద్ద; ఆకులు
రాలిన ఆవరణలో,
సాయంకాలపు నీడలు, బహుశా
అమ్మ కళ్ళులాగా, శిరోజాలలాగా
...
గుబురు మొక్కలలో
మెసులుతో పిల్లి, తోచనట్టు,
ఏదో
కోల్పోయినట్టు, (నా
హృదయమై)
అన్యమనస్కమై,
నీరింకిన నల్లని మట్టై, చెట్టెక్కి
ఎందుకో అరుస్తో; ఎవర్నో
పిలుస్తో
ఏవేవో గూళ్ళ వద్ద
తచ్చాట్లాడుతో, రాత్రిలోకి
సాగి
మళ్ళా తిరిగి అక్కడికే వచ్చి, ఒక
స్పర్శకోసమో, నీలోని
ఇంత చిటికెడు స్థలం కోసమో
నీ ఒడిలోని జోలపాటకోసమో, ఓ
ముంత పాలవంటి
నిద్రకోసమో, ఓ మాటకోసమో,
పోనీ అచ్చంగా నీకోసమో, నువ్వు
లేక ఉండలేని
తన కోసమో, ఎందుకోసమో,
మరి ఎవరికైనా ఎలా తెలుసు?
***
ఎవరూ లేరు ఇంటి వద్ద; వెన్నెల,
ఒక మసక మసక
ముగ్గైన వాకిలి వద్ద; రాలిన
ఆకులు నలిగి, పదాలై
పొర్లే ఖాళీ
శబ్ధాలవద్ద; దీపమారి
లోపల విలవిలలాడుతో ఎగిసి
వ్యాపించే పొగ వద్దా, నా
వద్దా!
No comments:
Post a Comment