20 February 2018

home

"reached home" అని ఒక చిన్న మెసేజ్
నీ నుంచి, వేసవిలో
ఆవరణలో రాలే చిన్ని ఆకులై,

మరి ఊహిస్తానిక నేను ఊరకే; నువ్వు
గేటు తీసినప్పుడు
వినిపించే ఆ చిన్నపాటి శబ్దాన్ని,

నీ చీర అంచులకి చుట్టుకుని, పడి లేచే
సాయంకాలపు గాలినీ
తాళం తీసేందుకు వంగినపుడు,

నీ నుదిటిపై వాలిన రాత్రినీ, నిటారుగా
నిలబడి, ఆ చీకటిని
నీ ముంజేతితో వెనుకకి త్రోయగా,

బయల్పడిన, జూకాలు ఊగే నీ వెన్నెల
ముఖాన్నీ, ఇంకా, తెల్లని
మబ్బుల నల్లని కళ్ళనీ, నీ చిన్ని

పెదాలనీ, ఎవరినో తలవగా, కుదురుగా
ఆ పెదాలపైకి చేరి
స్థిమితపడే, సన్నని నీ చిరునవ్వునీ ...
***
"reached home. చేరావా నువ్వు ఇంటికి?"
నీ నుంచే ఒక మెసేజ్,
ఈ చీకట్లో ఒక సీతాకోకచిలుకలా!

నేనింకా నిన్ను చేరలేదని, నువ్వెవరో
నువ్వు ఎక్కడో, మరి
నాకింకా అసలు తెలియ రాలేదనీ,

ఎలా విడమర్చి చెప్పేది నీకు నేను?

No comments:

Post a Comment