21 February 2018

వెనుక

తలుపులు మూసి, కిటికీలు మూసి
వెనుక నువ్వు;
మగ్గిపోయావు; మారిపోయావు
ఎంతో,

చర్మం మడతలు పడి వొదులయ్యి
చెట్టుకి కాక
గోదాములలో పండిన వాసన
నీలో,

మైనంపూతలా నవ్వుని పూసుకుని
తిరుగుతున్నావు
కానీ,ఇంకా, నీ లోపలేదో మరి
పచ్చిగా,

చెక్కు కట్టక, నేల రాలిన ఓ పూవై
గాలికి ఇక
అస్థిమితమై, కొట్టుకుపోయే
నువ్వే ...
***
తలుపులు మూసీ, కిటికీలు మూసీ
నీ వెనుక నేనే;
కాగితం కత్తితో, మరీ నిష్ఫల

పదాల దినదిన విషకలశంతో!

No comments:

Post a Comment