23 February 2018

రంగు

ఈ రోజంతటికీ నీ రంగు అంటింది -

నీలంగా మొదలై లేతెరుపుగా మారి చివరికి రక్తవర్ణంతో గాలై నీలా మిగిలిపోయింది. అందుకే - బ్రతికి ఉందామనే, ఒక కొత్త మట్టికుండని కొని తెచ్చాను. దానిని కడిగి నీళ్లు నింపి ఇక సాయంకాలందాకా మరి అక్కడే కూర్చుని వేచి చూసాను. గూళ్లకేమో పక్షులు తిరిగొచ్చాయి; ఆ చలనానికి చీకట్లో చెట్లు నీ కళ్ళై వెలిగాయి. ఇక ఎలాగోలాగ చేయి చాచి మరి నిన్ను తాకేలోగా ఎవరో ఎక్కడో "దాహం" అని పాలిపోయి ప్రార్థిస్తే, రాసుకునే చేతులలోకీ ప్రార్ధించే గొంతులోకీ నీరు నిషిద్ధం అని, మరింకెవరో వర్ణరహితవర్ణంతో నీళ్లని పారబోసి శరీరాన్ని రాత్రిలోకి విసిరికొట్టి "sorry: చూసుకోలేదు. పొరపాటున కాలు తగిలి పగిలిపోయింది. అయినా నీకు ఎందుకంత దాహం?" అని విరగబడి నవ్వారు!
***
ఈ రాత్రిని కూడా అనివార్యంగా నీ రంగే తాకింది; ఎగిసే అగ్నిలా, తగలబడిపోయాక మిగిలే చితాభస్మంలా!

No comments:

Post a Comment