28 February 2018

true

చేతులు అందివ్వగలవా నువ్వు?
తాకలేనంత
దూరంలోంచి మాటలు,

వొట్టి మాటలు. ఖాళీయై మాటలు
ఫేస్బుక్ లోంచీ,
వాట్సాప్లలోంచీ రంపపుకోతై

పొట్టై  రాలే మాటలు:పొగమంచై
బొట్టు బొట్టుగా
గాట్లుగా మిగిలే నీ మాటాలు!
***
ట్రూ:చేతులు అందించలేవు నీవు!
మరి ఏడ్చి ఏడ్చి
గుక్కపట్టి వొణికి, ఏ రాత్రికో

సోమ్మిసిల్లి నిదురించిన పిల్లలెవరో
మరి వాళ్ళెలా
ఉన్నారో, నీకెందుకు చెప్పు?

చుక్క

కొంచమే గాలి. ఎంతో చీకటి
ఒంటరి వీధీ,
ఖాళీ రాత్రి. అయినా, లోపల

లీలగా, మెతుకంత నీ మాట
మొగ్గలా, ఒక
పసి కలవరింతలా చిన్నగా!
***
కొంచమే గాలి. ఎంతో చీకటి,
అయినా చాలు,
చూడు: ఎంత ఆనందమో

ఇక్కడ, నువ్వు తాకిన చోట! 

తోడు

"దగ్గరిగా రా: అంత దూరంగా ఉండకు,
కొంచెం నొప్పిగా ఉంది,
నిద్ర మాత్రేమైనా ఉందా నీ వద్ద?"

అడిగింది తను. తెచ్చిన వాటర్ బాటిల్
మంచం పక్కగా ఉంచి,
దుప్పటిని విప్పి లైటార్పి ఎండలో

ఓ చెట్టు నీడన ఒరిగినట్టు,తనకానుకుని
చెప్పాడు అతను:
"నీకు ఏదైనా అవసరం అయితే

నన్ను లేపేందుకు సందేహించకు"

నీ గొంతు

ఎవరో వేలికొసతో తాకినట్టు
రాత్రీ, చీకటి
బచ్చలి ఆకులపై పల్చటి

కాంతి:తడి.పసి పిడికిలై ఓ
గూడు. లోన,
అలసిన రెక్కలూ, కనులూ
***
అమ్మాయీ,నీ గొంతు కూడా
అంతే! నేలపై
తడిచి ఊగే నీడకు మల్లే!

బరువు

కాగితం ఎగిరిపోకుండా, దానిపై
పేపర్ వెయిట్
ఉంచి వెళ్ళావు నువ్వు,

బయట ఎంతో వెల్తురు. పిలిచే
చెట్లూ, అరిచే
పిట్టలూ గూళ్ళూ పూలూ

కొమ్మలూ: ఇక ఏదో వ్రాసుకున్న
కాగితం, అక్కడే
గాలికి విలవిలలాడుతూ,

చేతులు బయటకి అలా చాచి
మరి వెళ్లలేక,
బూజులో ఇరుక్కున్న ఒక

తూనిగై, రెక్కలు కుట్టుకుంటో!
***
చిన్నదే అయినా ఎంతో వొత్తిడి
ఇక్కడ: నీదే,
నీ అంచనాలదే! చూడు

పేపర్ వెయిట్ బరువుకి, మరిక 
ఈ హృదయం
నలిగి కమిలి ఓ ముద్రికయై!

27 February 2018

ఎడమవైపు

"చిన్నదే, గుప్పెడంతేనేమో. ఎడమవైపు ... మరి అక్కడే ...నొప్పి. ఎవరో కత్తి దింపి మెలి తిప్పినట్టు ... మాటి మాటికీ పెదాలు ఎండిపోయినట్టు ... నీళ్లు లేక చచ్చిపోతున్నట్టు ... నువ్వు గుర్తుకు వచ్చినట్టు కూడా... మరి ఏం చేయను?" అని కళ్ళల్లో మంచుతో నీళ్లతో నిప్పుతో, జలదరించే చెట్లతో హోరున  వీచే గాలితో ధూళితో, మబ్బులు పట్టి నీడలు వ్యాపించి, మసక కాంతై చినుకులై వానై చెల్లాచెదురైన పూలపందిరై  ఒకటే అడుగుతోంది అతనిని ఒక అమ్మాయి -
***
అతని చేతిలో తన అరచేయి తడిచిన పిచ్చికై: వణుకుతో, ఎవరూ లేక, ఎటూ పోలేక, ఉండాలేకా వెళ్లిపోలేకా, అక్కడక్కడే తచ్చాట్లాడుతూ, గొంతుకు ఏదో అడ్డం పడి లోపల ఏదో త్రవ్వుకుపోయి, తండ్లాటై అక్కడే మిగిలిపోతే ...
***
దూరంగా ఎక్కడో ఎగిసే గోధూళిలో కుంగే వెలుతురు. నేలలోకి ఇంకే నీడలు. రాళ్లు. వాలిపోయిన పూలు. తెగిన ఆకులు. ఇక ఎక్కడో, బొట్టుబొట్టుగా నెత్తురు రాలే రాత్రి చప్పుడు - 

promise

"గుండె తరుక్కుపోయింది. ఏం చేయాలో
తెలియలేదు: Sorry
if I hurt you. But you see, I didn't
want to..." అని

అతనా వాక్యం ఇంకా పూర్తి చేయనేలేదు -
కానీ ఎందుకో  మరి
ఆమెనే, తన అరచేతిని ఆతని
పెదాలపై ఉంచి,

గాట్టిగా కావలించుకుని, హోరున ఓ వానై
కురిసింది: రాత్రిలో 
రాత్రిధారతో, ఆ ధారలో, అంతెత్తు
రాలి మునిగి,

కనులు చేసే చినుకు శబ్ధాలతో, ఎందుకో! 

hope

"అలసటగా ఉంది" అంది
ఆ అమ్మాయి,
నుదురుని రుద్దుకుంటో
***
బయట, కుళాయిలోంచి
నీళ్లు పడే శబ్ధం,
చుట్టూ నురగ. ఆరవేసిన

దుస్తుల కింద, ఎండలో
నీటినీడలు: నీ
అలసిన కళ్ళకు మల్లే ...

ఇక, పైనెక్కడో కొమ్మల్లో
ఒక కాకి మరి,
వేసవిని ఒకటే అరుస్తో!
***
అలసటే ఉంది. అయినా
అమ్మాయీ,
బ్రతికే ఉందాం మనం!

మళ్ళీ

"sorry. అస్సలు చూసుకోలేదు.
జారి పడిపోయింది"
అని అన్నది తను, ఎప్పటిలాగే

చాలా యధాలాపంగా: బయటేమో
చీకటి. పగిలిన ఒక
కుండై నెలవంక. స్థబ్ధుగా చెట్లు,

మసక కాంతిలో, అలసిన చేతులై
నీడలు. గాలి లేక
శ్వాసందక ఎవరో, తనని తాను

లోపలికి ఎగబీల్చుకుంటో తపిస్తో!
***
"sorry. అస్సలు చూసుకోలేదు.
జారి పడిపోయింది"
అని అన్నది తను: ఎప్పటిలాగే

ముక్కలు అయిన హృదయాన్ని
చిన్నగా ఏరుకుంటో
ఏమీ మాట్లాడనేలేదు అతను! 

ప్రస్థుతం

కాంతి కనుమరుగై, దినం

తినే కంచం, నీళ్ళూ, ఒక
మంచం, కంబళీ
మరి రెండు దిండ్లూ, ఇంకా

దగ్గర్లో కూజా, నిద్రమాత్రా!
***
"ఐ నో వి ఆర్ గెట్టింగ్ ఓల్డ్"
తాను అన్నది
రెక్కలు విప్పినట్టు ఇక

బాహువులను విప్పుతో!

ఇట్లా

చిన్నగా గాలి వీచి, వెళ్లి పోయింది
వొణికి గడ్డిపరకలు,
రాలి చినుకులూ, ఎక్కడో మరి

దాగుని ఒక ముఖం, మేఘాలలోని 
చందమామై, పూల
వాసన వేసే నీడై నను విడవక

వెంటాడి - తాకి - నన్నో అలజడిని
చేస్తే, వెళ్తూ వెళ్తూ
తల తిప్పి చూడు నువ్వోసారి,

ఆకులపై నిద్రలో రాత్రి: రాత్రిలో
నిదురలో, నీలో
ఏటో దారి తప్పిపోయి నేను!


ప్రతిధ్వని

ఊగుతోంది ఎండ, ఆకులపై
ఊయలై,
ఊయలలోని వాన పాపాయై -

నిద్రలో ఒత్తిగిల్లినట్టు, ఏవేవో
సవ్వడులు, చిన్నగా,
చుట్టూ నీ వక్షోజాల వాసన -

నేను దాగే గూళ్లేనా అవి మరి?
చెవి వద్ద ఎవరో
నవ్వినట్టు ఉండే జీవితమేనా

అది మరి? ఎక్కడి నుంచో ఇక 
రెండు కళ్ళూ , 
చేతులూ, పాదాలూ, లోపలికి

పొగమంచై మెల్లిగా వ్యాపిస్తే ...
***
ఊగుతోంది ఎండ, ఆకులపై
గుప్పిటలోంచి
ఎపుడో చేజారిన లేత వేలై,

తల్లి లేక గుక్కపట్టిన శిశువై!

26 February 2018

like a ...

చెక్కబల్ల. చీకట్లో, చిటికెడంత కాంతి
చిగురాకులా వొణుకుతో,
ఛాతిపై నువ్వు తలను వాల్చినట్టు,
హృదయం అంతా ఒక

వార్మ్నెస్: గొంతులో అదే పరిమళం
హ్మ్: ఎదురుగా Black &White.
ఇంకా నాతో, కొంచెం కొంచెంగా నీ
జ్ఞాపకం: ఎలా అంటే,

వెళ్తూ వెళ్తూ, ఎందుకో ఆగి, వెనుదిరిగి
తల తిప్పి నువ్వు నవ్వుతో
చిన్నగా చేయి ఊపినట్టు! మరి, O
తేనెకళ్ళ మేజిక్ పిల్లా,
***
ఇక ఈ రాత్రికి కొదవేమున్నది నాకు? 

దయ

ఎంతో వేడిమి. తన కళ్ళలోంచి
చినుకులు,
చాపపై చెమట. కిటికీలోంచి
పెంకులై ఎండ

చర్మం కాలుతూనట్టు, గదిలో
తరుక్కుపోయే
వాసన ఏదో: "ఆకలవుతుంది"

అని అంది తానే: ఎప్పటికో!
***
లేచి వస్తూ వస్తూ, వెనుదిరిగి
ఒక్కసారైనా 
తన ముఖం చూడలేదు తను 

అక్కడ

వేళ్ళని వేళ్ళతో తాకించి, తను
ఎంతోసేపు అట్లా,
ఏదో జ్ఞప్తికి తెచ్చుకునేందుకు
***
కుళాయిలోంచి నీళ్ళ  పడే శబ్దం
సింక్ లో, ఎండిన
పాత్రలూ, ప్లేట్లూ, గ్లాసులూ,

బాల్కనీలో, గాలికి ఊగుతో మరి
పిల్లల దుస్తులూ,
వాటి నీడలూ రాలిన ఆకులూ,

ఏవో పక్షి ఈకలూ, పొరై దుమ్ము,
లేకున్నా, ఎవరో
మెసిలినట్టు: (ఎవరూ లేరక్కడ)
***
ఇక, ఎప్పటికో తను తల తిప్పి
అటువైపు చూస్తే,
అక్కడ, మరి గూడు కట్టుకున్న

చీకట్లో,తనని పొదుగుతూ రాత్రి! 

అప్పుడు

ముంజేతిపై తలను వాల్చి
ఏటో చూస్తో
పడుకుని ఉన్నావు నువ్వు -

బయట, తిరిగొచ్చే పక్షుల
కలకలం. గాలి -
రాలే ఆకుల మసక చీకటి

పడుకుని ఎటో వెళ్ళిపోయి
ఉన్నావు నువ్వు -
తెరచి ఉన్న నీ కళ్ళల్లో ఇక

తేలిపోయే నావల నీడలు! 

25 February 2018

love

"I love you. It is just that I don't know
how to say it"
అని అతను ప్రాధేయపడ్డాడు,

గిన్నెలో బియ్యం వేసి, ఎంతో ధ్యాసతో
మూడు సార్లు కడిగి,
రైస్ కుక్కర్లో పోసి, వేళ్ళతో నీళ్ల

కొలతను చూసింది తను. బయట రాత్రి.
తడికెలుగా ఆకాశం.
కొంచెం గాలి. (కొంచమే). ఎక్కడో

ఏవో కదిలిన శబ్దం. బహుశా బాల్కనీలో
కుండీలలో నీళ్లు
స్థిమిత పడటం కావొచ్చు: గూళ్ళల్లో

పక్షులు ముడుచుకుపోవడం కావొచ్చును,
ఆకులపై నుంచి
రాత్రిలోకి తేమ జారడం కావొచ్చును!

"I love you. It is just that I don't know
how to say it"
అని అతను మళ్ళా అన్నాడు -

చేతులు తుడుచుకుంటూ తను అన్నది
ఎంతో నిదానంగా,
'కొంచెంసేపే: కాస్త ఓపిక పట్టు. అన్నం

అయిపోతుంది. తినేయొచ్చు నువ్వు"!

మామూలు

తెరిచే ఉన్నాయి కిటికీలు: తన చేతులేమో
చల్లగా, సెలయేరుల్లా,
బయట, చీకటి తన శిరోజాలై, అక్కడక్కడా
నెరిసే కాంతి రేఖలతో!

"సమయం ఎంతయ్యింది?" నిదురలోంచో
కలలోంచో అడుగుతుంది
తను అతడిని, ఆకులు రాపాడే గొంతుకతో:
చిన్నగా అంటాడు అతను,

'తెల్లవారలేదు అపుడే ఇంకా. పడుకో నువ్వు'!

క్షణం

మధ్యరాత్రిలో నిద్రలేచి అతను
తన చేతిని
ఎంతో నెమ్మదిగా పక్కకి జరిపి

లేవబోతే, ఉలిక్కిపడి తటాలున
ఆ చేతిని తిరిగి
అల్లుకుంటుంది తను,ఎలా అంటే 

ఆకలేసి శిశువు, నిదురలోనే తన
తల్లి చూచుకంకై,
తపనగా వెదుకులాడుకున్నట్లు!

గ్రహింపు

ఎంతో అదిమి పట్టుకుని, నీ చేతులు,
బయట, మంచుకి ఒంగిన
గడ్డిపరకలు: పొలాల వాసన. ఎక్కడో

గణగణమంటూ, బుజ్జాయి మెడలోని 
గంటలు. చెట్ల మీదుగా
మెరిసే మరి నీ నుదిటి మీది సూరీడు!
***
ఎంతో పొదివి పుచ్చుకుని నీ చేతులూ,
ఆ చేతులలోని నదులూ
లేకుంటే, ఏమయ్యుందుము మేము! 

బ్రతికి ...

దాల్చిన చెక్క వాసన అప్పుడు నీలో,
కొన్ని రొట్టెలూ, కొంచెం నీళ్ళూ
ఇంకొంచెం గాలీ, నేలా నిప్పూ: నీలో 

పొలం గట్టున నిలబడి, తిరిగి వచ్చే 
కొంగల గుంపును చూసినట్టో, 
మరి విన్నట్టో, అల్లాగే ఆ ఒడ్డున ఇక 

ఒరిగిపోయి, రాత్రిలోకీ, చుక్కలలోకీ 
నిద్రలోకీ నీలోకీ,నీ కలలలోకి
జారిపోయినట్టో నావై తేలిపోయినట్టో!
***
పురావర్షాలకు తడిచిన చల్లని వాసన 
అప్పుడు నీలో; పలుమార్లు
మరణించినట్టూ, పలుమార్లు నీలోనే

జన్మించి, నన్ను నేను మరచినట్టు!

లీలగా

రాత్రి: అర తెరచిన కిటికీలు,
ఎవరో చల్లిన నీళ్ళకి
చీకట్లో వెలిగి బ్రతికిన నేల,

వొదిలి వెళ్లిన వాళ్లెవరో, ఎన్నో
ఏళ్ళకి తిరిగి వచ్చి,
ఇక నిన్ను గట్టిగా హత్తుకుని 

నీలోకి శ్వాసను నింపినట్టు!
***
దూరంగా ఎక్కడో, పూలను
అమ్ముకునే ఒక
అమ్మాయి వేసే కేక, లీలగా

ఇక అంతంలేని వలయాలై!

24 February 2018

యధాలాపంగా

యధాలాపంగా  కర్టెన్ని పక్కకి తోసి
వెళ్ళిపోయావు నువ్వు ,
***
రాత్రి లోపలికి రాగా, గాలి గంటలు
మ్రోగాయి. చెక్కబల్లపై
కాగితాలు, కదిలి సర్ధుకున్నాయి -
ఎక్కడో రెక్కలు కదలగా

అంతా వేర్లు తడిచిన వాసన: శిలగా
మారినదేదో బ్రతికినట్టు
పువ్వై, గాలిలో జలదరించినట్టు
 ఒక చినుకై కురిసినట్టూ!
***
యధాలాపంగా కర్టెన్ని పక్కకి తోసి
వెళ్ళిపోయావు నువ్వు,
***
ఇక రాత్రంతా లోపల ఒక సరస్సు
ఒడ్డున వెన్నెల్లో నువ్వు! 

23 February 2018

రంగు

ఈ రోజంతటికీ నీ రంగు అంటింది -

నీలంగా మొదలై లేతెరుపుగా మారి చివరికి రక్తవర్ణంతో గాలై నీలా మిగిలిపోయింది. అందుకే - బ్రతికి ఉందామనే, ఒక కొత్త మట్టికుండని కొని తెచ్చాను. దానిని కడిగి నీళ్లు నింపి ఇక సాయంకాలందాకా మరి అక్కడే కూర్చుని వేచి చూసాను. గూళ్లకేమో పక్షులు తిరిగొచ్చాయి; ఆ చలనానికి చీకట్లో చెట్లు నీ కళ్ళై వెలిగాయి. ఇక ఎలాగోలాగ చేయి చాచి మరి నిన్ను తాకేలోగా ఎవరో ఎక్కడో "దాహం" అని పాలిపోయి ప్రార్థిస్తే, రాసుకునే చేతులలోకీ ప్రార్ధించే గొంతులోకీ నీరు నిషిద్ధం అని, మరింకెవరో వర్ణరహితవర్ణంతో నీళ్లని పారబోసి శరీరాన్ని రాత్రిలోకి విసిరికొట్టి "sorry: చూసుకోలేదు. పొరపాటున కాలు తగిలి పగిలిపోయింది. అయినా నీకు ఎందుకంత దాహం?" అని విరగబడి నవ్వారు!
***
ఈ రాత్రిని కూడా అనివార్యంగా నీ రంగే తాకింది; ఎగిసే అగ్నిలా, తగలబడిపోయాక మిగిలే చితాభస్మంలా!

వాస్తవ్

జ్వలిస్తోందీ రాత్రి -

fuck. మళ్ళా అదే కాలం అదే లోకం. దారి తెలియక ఎటూ పోలేక, ఒళ్ళంతా పుండ్లు అయ్యి రక్తం కారుతో, చీముతో ఒకప్పుడో కుక్క ఇట్లాగే, నీ ఇంట్లో నీవైపు తలెత్తి చూసి మూల్గితే బావురుమంది ఎందుకో నీ హృదయం: ఎందుకిట్లా కావాలి పాపం ఆ చిన్ని ప్రాణానికి, ఎందుకు దానికి ఇంత నొప్పి, దేవుడు లేడా అని!

ఛత్: తెలుస్తోంది ఇప్పుడు, ఇంతకాలానికి: నువ్వే ఆ కుక్కవని. ఏవో నెత్తురోడే పొయెమ్స్తో కాలు విరిగి మూల్గుతో, దారిని దాటేందుకు ఈడ్చుకుంటూ అటూ ఇటూ చూస్తో అస్థిమితంగా తిరుగుతున్నావనీ, ఎవరూ నీ దరి చేరరనీ, ఏదో నాడు ఇట్లాగే ఇక ముందుకు సాగలేక ఎక్కడో నుజ్జయ్యి ,పేగులు బయల్పడి, ఆగిపోతావనీ; దేవుడు లేడనీ! మరి స్మశానమై 

తగలబడుతోందీ రాత్రి అని. fuckwhat kind of fucking reality and nightmare is this

21 February 2018

వెనుక

తలుపులు మూసి, కిటికీలు మూసి
వెనుక నువ్వు;
మగ్గిపోయావు; మారిపోయావు
ఎంతో,

చర్మం మడతలు పడి వొదులయ్యి
చెట్టుకి కాక
గోదాములలో పండిన వాసన
నీలో,

మైనంపూతలా నవ్వుని పూసుకుని
తిరుగుతున్నావు
కానీ,ఇంకా, నీ లోపలేదో మరి
పచ్చిగా,

చెక్కు కట్టక, నేల రాలిన ఓ పూవై
గాలికి ఇక
అస్థిమితమై, కొట్టుకుపోయే
నువ్వే ...
***
తలుపులు మూసీ, కిటికీలు మూసీ
నీ వెనుక నేనే;
కాగితం కత్తితో, మరీ నిష్ఫల

పదాల దినదిన విషకలశంతో!

అనివార్యమైన

రాత్రంతా అతనొక్కడే, కుర్చీలో వొరిగి
ఎంతో అలసటతో,
మరి తొలిచే, ఒక నిస్సహాయతతో
***
నేలంతా రెక్కలు ఊడిన ఉసుళ్ళు; కొన్ని
జీవంతో కదులుతో
మరికొన్ని, గాలికి చెల్లాచెదురవుతో,

ఎందుకొచ్చాయో అవి: వాన వచ్చిందనో
కాంతి వెలిగిందనో,
బహుశా, రాక తప్పని అగత్యంతో

రావడం తప్ప, హృదయాన్ని పదిలంగా
దాచుకుని వెళ్లడం
తెలియక, వొచ్చాక, వొచ్చి చూసాక,

కూలి, విరిగి, రాలిపోతామని తెలియకో
తెలిసో, మరి అవే,
రెక్కలూడిపోయి; లోపలి ఉసుళ్ళు!
***
రాత్రంతా అతనొక్కడే, లోపలకి వొరిగి
ఎవర్నేమీ అనలేక 
ఏమీ చేయలేక, ఒక్కడే, అక్కడే ఇక

ఆ ఉసుళ్ళని హత్తుకుని, తప్పిపోయి! 

20 February 2018

home

"reached home" అని ఒక చిన్న మెసేజ్
నీ నుంచి, వేసవిలో
ఆవరణలో రాలే చిన్ని ఆకులై,

మరి ఊహిస్తానిక నేను ఊరకే; నువ్వు
గేటు తీసినప్పుడు
వినిపించే ఆ చిన్నపాటి శబ్దాన్ని,

నీ చీర అంచులకి చుట్టుకుని, పడి లేచే
సాయంకాలపు గాలినీ
తాళం తీసేందుకు వంగినపుడు,

నీ నుదిటిపై వాలిన రాత్రినీ, నిటారుగా
నిలబడి, ఆ చీకటిని
నీ ముంజేతితో వెనుకకి త్రోయగా,

బయల్పడిన, జూకాలు ఊగే నీ వెన్నెల
ముఖాన్నీ, ఇంకా, తెల్లని
మబ్బుల నల్లని కళ్ళనీ, నీ చిన్ని

పెదాలనీ, ఎవరినో తలవగా, కుదురుగా
ఆ పెదాలపైకి చేరి
స్థిమితపడే, సన్నని నీ చిరునవ్వునీ ...
***
"reached home. చేరావా నువ్వు ఇంటికి?"
నీ నుంచే ఒక మెసేజ్,
ఈ చీకట్లో ఒక సీతాకోకచిలుకలా!

నేనింకా నిన్ను చేరలేదని, నువ్వెవరో
నువ్వు ఎక్కడో, మరి
నాకింకా అసలు తెలియ రాలేదనీ,

ఎలా విడమర్చి చెప్పేది నీకు నేను?