06 March 2013

ముద్ద మందార పూవులు

నీ ఇంటి ఆవరణలో, చక్కగా ఊగేవి ఆ ఎర్ర ముద్ద మందార పూవులు.
నేను నీ కిటికీ పక్కన కూర్చుని
తల వంచి చూస్తే:ఎదురుగా అవి.

ఉదయపు లేత కాంతి, వాటి కొమ్మలపై వాలి, గాలితో
వాటిని ఊయలలూపుతున్నట్టూ
ఎవరో తల్లి, ఒక జోలపాటతో తన

ఒడిలోని శిశువులను జోకొడుతూ, ఊపుతూ నిదుర పుచ్చుతున్నట్టూ

మెత్తటి బరువుతో, తూనిగలు
తిరిగే నిశ్శబ్దాలలో ఊగేవి ఆ
ఎర్రఎర్రని ముద్ద మందారాలు

నీ ఇంటి ముందు బాదం చెట్టు వేసవికి తొలి ఆకుల లేఖలని రాసే వేళల్లో-
కూర్చున్నాను అప్పుడు, నీ
పక్కనే, నిన్ను ఆనుకుని నీ
అరచేతిని గట్టిగా పుచ్చుకుని-

నా తల ఆన్చిన నీ భుజంపై కొంత చెమ్మ. కొంత నొప్పి. నా తలని లేపి ఇక నీ
వక్షోజాల్లో దాచుకుంటే అక్కడ
కొంత నెత్తుటి తడి: తెలిసింది
నాకు తొలిసారిగా అప్పుడే నీ

వక్షోజాలు కళ్ళు అనీ, అవి
కన్నీళ్ళు పెట్టుకుంటాయనీ
ఆ కన్నీళ్లు రాలి, పూవులు
ఆ ముద్ద మందార పూవులు, వొణికి వొణికి, తలలు వంచుకుంటాయని-

ఇక చూడు ఇప్పుడు, అదే కిటికీ పక్కన
ఊగుతున్నాయి రెండు ముద్దమందార
పూవులు, నెత్తురు నిండిన బరువుతో
కనులని కోసే మిట్టమధ్యాహ్నపు కర్కశ వేసవి గాలులతో: తడి గుడ్డతో

నీ పెదాలు తాకిన నా నుదుటిని, కాస్త
అలసటగా తుడుచుకుని, ఇక నా తల
తిప్పి తిరిగి చూస్తే, కొంత ధూళీ కొంత
ఆవిరీ, చెట్ల కొమ్మల్లో కనిపించని పక్షుల అలజడీ, నీడలు నీడలతో
కలగలసి, చీకటయ్యే ఒక ఆకస్మిక

విభ్రాంతీ: నాలోపలో సమాధి ఉందో
లేక, ఒక సమాధిలో నేను ఉన్నానో
దహనమయ్యే చితిని మోసుకుని తిరిగే ఈ మనుషుల మధ్య మళ్ళా ఓ
పరి మరణించానో ఓపరి జనినించానో

తెలియని స్థితి: ఇంతకూ చూస్తున్నావా
నువ్వు? ఈ రెండు వాక్యాలనూ, కొన
ఊపిరితో నెత్తురోడుతున్న ఈ రెండు ఎర్ర ముద్ద మందార పూవులనూ
అరచేతులలో పుచ్చుకుని అందరికీ

చూయిస్తూ, తనని తానే అడుక్కుంటున్న ఆ పూవులు లేని ఈ మనిషినీ
ఆ రహస్య ప్రదేశంలో ఒక ద్వేదీపమైన
కాంతిలో, గాలిలో, వానలో, ఇప్పటికీ

అలా నిరంతరం ఊగుతూనే ఉన్న ఆ ఎర్రని, ఎర్ర ఎర్రని
 -ఇంకా మీలో మానని- ఆ
ముద్ద మందార పూలనీ-? 

1 comment:

  1. నాలోపలో సమాధి ఉందో
    లేక, ఒక సమాధిలో నేను ఉన్నానో
    దహనమయ్యే చితిని మోసుకుని తిరిగే ఈ మనుషుల మధ్య మళ్ళా ఓ
    పరి మరణించానో ఓపరి జనినించానో :(

    ReplyDelete