05 March 2013

గర్భస్మృతి

లేచి వెళ్ళిపోతారు పిల్లలు : ఇక,
నలిగిన ఆ దుప్పట్ల కింద, పూర్వజన్మల
పురాతనమైన వాసన ఏదో-

ఈ లోకానికి చెందని జనన మరణ రహస్యాల
పుష్పగుచ్చాల స్పృహ ఏదో ఇక్కడ
వాళ్ళు అరచేతులు వాలిన దిండ్లపై:

రాత్రిని వొదలని సీతాకోక చిలుకల
రెక్కల కదలికలు ఏవో ఇప్పటికీ
వాళ్ళు కప్పుకుని తొలగించిన ఆ దుప్పట్లలో-

ఒక చిన్న కదలిక ఏదో
నిశ్చలమైన సరస్సును
వలయాలు వలయాలుగా విడమర్చినట్టు

గది అంతా లతల వలె అల్లుకున్న
ఒక కమ్మని నిదుర పాల వాసన.

వాళ్ళ అమ్మలాంటి, తన నవ్వులాంటి
వాళ్ళ కలల పసి ధూళి ఏదో
ఇప్పటికీ ఇక్కడ పసిడి తరంగాలై---

నేను తల్లి గర్భంలో
శ్వాసించి మరచిన పరిమళం ఏదో ఇక్కడ
నేను తల్లి గర్భంలో
చూచి మరచిన చిత్రాలు ఏవో ఇక్కడ-

ఆదిమ తల్లి  చూచుకాన్ని తాకిన

ఆ తొలి స్పర్స ఏదో తిరిగి తెలిసినట్టూ

ఆ తొలి పాల బిందువు ఏదో తిరిగి
పెదాలపై రాలినట్టూ, రహస్యమేదో
నెమ్మదిగా అవగత మౌతున్నట్టూ


ఒక తమకంతో, స్థాణువై నేను ఇక్కడ

పిల్లల వలే నిదురలోంచి లేవలేకా
పిల్లల వలే నిదుర లేచి వెళ్లి పోలేకా-!  

1 comment:

  1. నేను తల్లి గర్భంలో
    శ్వాసించి మరచిన పరిమళం ఏదో ఇక్కడ
    నేను తల్లి గర్భంలో
    చూచి మరచిన చిత్రాలు ఏవో ఇక్కడ-

    ఆదిమ తల్లి చూచుకాన్ని తాకిన

    ఆ తొలి స్పర్స ఏదో తిరిగి తెలిసినట్టూ

    ఆ తొలి పాల బిందువు ఏదో తిరిగి
    పెదాలపై రాలినట్టూ, రహస్యమేదో
    నెమ్మదిగా అవగత మౌతున్నట్టూ
    గ్రేట్ అండీ!

    ReplyDelete