31 March 2013

విరామ చిహ్నం

ఇదొక అద్దం.

ఊహించు: అద్దంలోంచి, రెండు అరచేతులు

వెలుపలకి వచ్చి, నీకొక పుష్పగుచ్చాన్ని
అందించడాన్ని. మరి తిరిగి నీ ముఖాన్ని

ఆ అరచేతులే జాగ్రత్తగా అందుకుని

అద్దంలోకీ, ప్రతిబింబం లేని కాలాలలోకీ
తీసుకు వెళ్ళే ఒక క్షణాన్నీ.

ఏమీ లేదు. ముకుళించిన అరచేతులతో
వంచిన శిరస్సుతో, రాత్రి
వనాలలోంచి, వెన్నెల్లేని

మైదానాలలోకి, అరచేతిలోంచి అరచేయి
నీరు వలే జారి, వెళ్ళిపోయే వేళయ్యింది-

మరి వీడ్కోలు చెప్పడం ఇలాగేనా అంటే
మరి ఇలాగే. ఒక విరామ చిహ్నం వలే
ఒక నీ వలే, ఒక నా వలే-                   

27 March 2013

ఇలా కూడా

నీ ప్రియమైన స్నేహితుని సమాధి వద్ధ ఉంచుదామని
     నువ్వు తీసుకువెళ్లి
నేలలోంచి మొలుచుకు వచ్చే అతని ముఖాన్ని చూసే
     ధైర్యం లేక, మళ్ళా
అలాగే, అరచేతుల మధ్య భద్రంగా తీసుకు వచ్చి, అలసటతో
    నీ బల్లపై నువ్వు అలా

గిరాటు వేసిన పుష్పగుచ్చం, కాగే నీ నయనాలూ ఈ రాత్రి.

మరి, అయితే, ఇంతకూ నేనేం చేసానంటావా? చూడు

రాత్రంతా, చీకటి చెమ్మలో వెలిగే
ఒక నెత్తురు దీపాన్ని-!  

26 March 2013

గాలి కన్యలు*

ఒక మాయా వెలుతురులో నువ్వు కూర్చుని ఉంటే
దిగి వస్తారు గాలి కన్యలు పుష్పక విమానాల లోంచి. 
రెపరెపలాడుతుంటాయి అప్పుడు వాళ్ళ ముఖాలు  
అలసటతతో. నువ్వు ప్రయాణం చేసినంత మేరా, నువ్వు చూసిన వాళ్ళ కళ్ళ మెరుపుల వెనుక

అప్పుడు, కొంత ఇంటి బెంగ కనపడుతుంది. మరి 
నుదుటిని తుడుచుకునే వాళ్ళ అరచేతుల వెనుక
అప్పుడు నీకు, ఎదురుచూసే కొన్ని పసికళ్ళూ, చిట్టి చేతులూ, చిన్ని పదాలూ, వాళ్ళ ఇళ్ళల్లో మోగే 
వాళ్లకి బాగా సుపరచితమైన శబ్దాలూ వినపడతాయి

నువ్వు చూసిన నవ్వుతున్న ఆ పెదాలలోంచి
అప్పుడు నీకొక నిట్టూర్పూ, ఇంకొంత హడావిడీ
కనపడుతుంది: వడివడిగా బయటకి సాగే వారి 
పాదాల వెనుక, అప్పటిదాకా నువ్వు గమనించని, వయస్సుడిగి నిరీక్షించే వాళ్ళ తల్లులూ తండ్రులూ 

ఒక నిశ్శబ్ధంతో  నీకు ఎదురు పడతారు. ఇక
నువ్వు ఏం చేస్తావంటే ఆ గాలికన్యలు వెడుతూ
వెడుతూ, తమ చీర కొంగులతో కొంత శుభ్రపరచిన ఆ ప్రపంచాలలో, కాలాలలో కూర్చుని, నిన్ను
మరి కొంతగా చైతన్య పరిచినందుకు, వాళ్ళు

వొదిలి వెళ్ళిన చల్లని కాంతిలోంచి వాళ్ళని కొంత
అబ్బురంగా చూస్తూ వాళ్లకి ప్రణామం చేస్తావు-
మరి ఇటువంటి పదాలలో, ఇటువంటి పదాలతో.

ఇక ఇదంతా ఏమిటంటే, ఏమీ లేదు. దీపం వెలిగించిన ఆ వేళ్ళనీ చేతులనీ చూసావా నువ్వు అని

మామూలుగా అడుగుతాను నేను, ఈ భూమి
దీపశిఖను కాపాడే అ రెండు అరచేతుల మధ్య 
భద్రంగా దాక్కుంటూ, ముడుచుకుని పడుకుంటో- 
---------------------------------
*My word for Air hostesses.

24 March 2013

చూడు

పగిలిన పెదాలపై తెగిన, ఒక బలవంతపు చిరునవ్వూ
ఆఖరిసారిగా అంది పుచ్చుకున్నఒక అరచేయీ
తడిగా మారిన కనులూ, చలిగా వీచే గాలీ, చీకట్లోంచి నదిపై నుంచి వచ్చే

పురాతన రహస్యాల గుసగుసల సవ్వడీ, ఒక ఆదిమ నొప్పీ
నీ జడలోంచి రాలి వడలిపోయిన ఒక ఎర్ర గులాబీ

రాత్రి. ఇక ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు.

వెళ్ళు. వెళ్లి పడుకో. నీ శరీరంలోని చీకటి మగ్గీ మగ్గీ
ఎలా నా కలలోకి నీ ముఖంతో వస్తుందో చూడు

రేపు నువ్వు లేచిన ఉదయాలలో, కొంత దిగులుతో కొంత
నిరీక్షణతో, నీడలయ్యి హోరున ఊగే చెట్లల్లో
గుమికూడే మధ్యాహ్నాలతోఈ రాత్రుళ్ళతో-

22 March 2013

పూల రాత్రి

అరణ్యాలలోంచి వచ్చిన, నక్షత్రాలు మెరిసే ఒక పద్మానివి నువ్వు.
మంచులో నానిన ఉదయంపై 
ప్రసరించిన లేత ఎండ నువ్వు 
ఇంకా ఆకలిగొన్న కడుపుని 

ఎత్తుకుని, ఛాతిలో దాచుకుని శిశువుకి పాలిచ్చిన తల్లివి నువ్వు-
నీకు ధన్యవాదాలు తెలపడం ఎలా? 
అని నేను విభ్రాంతితో అడిగితే ఇలా 

చెప్పింది, మనం ప్రతీకలలలో సమాధి చేసిన ఒక బంగారం ఇలా 
ఇల్లాగే, చెప్పింది నా పదాలలో:

"ఎందుకో రాస్తావు పూలు గురించీ?

రాళ్ళుగా మారిన కాళ్ళు, కాళ్ళుగా మారి పగిలిన ఈ అరచేతులూ

బట్టలు ఉతికీ అంట్లు తోమీ, టాయిలెట్ కడిగీ కడిగీ
నీకు వండీ వండీ నీతో పడుకునీ పడుకునీ తడిలేక

పగిలిన పెదాలైన నా యోని ప్రేమ గురించీ మరి ఎందుకో రాయరు
మీ కవులు మరి మహాతాదాత్మ్యంతో, నును లేత
పోలికలతో, మబ్బులతో, ఆకాశంతో
వసంతాలతో వానలతో ఎప్పుడూనూ?"

ఆ తరువాత ఈ కొండలలో రాత్రంతా వర్షం కురిసింది.
చీకట్లో, ఒక దీపంలా వెలుగుతూ
తను నా ఎదురుగా కూర్చుంటే

గది అంతటా పచ్చి గడ్డి వాసన. కన్నీళ్ళలో తడచిన
వెదురు వనాల వాసన. కొంత
పచ్చి ముళ్ళ నెత్తురు వాసన-

తెలుస్తుందా మీకు ఇక్కడ ఆ రాత్రంతా వీచిన, శరీరాన్ని గడ్డ కట్టించే, తన
చేతి వేళ్ళ అంచుల నుంచి వీచే
అనంతాల మంచు ధూపం మరి
మరణం లేని కనుల దహనం?   

19 March 2013

మృత వ్యాకరణం

I.ఈ కిందివి వ్యతిరేక పదములు అవునో కాదో వ్రాయండి:
-----------------------------------------------------------

నలుపు x తెలుపు

అమ్మాయి x అబ్బాయి

రాజు x రాణి

మంచీ x చెడు

చీకటీ x వెలుతురు

పగలూ x రాత్రి---

(అవి ఎట్లా వ్యతిరేక మయ్యెను?)

II. కింది వాక్యములలో విశేషణం మరియూ క్రియలను గుర్తించి వ్రాయుడి:
--------------------------------------------------------------------

/రాముడు మంచి బాలుడు/
/రాముడు రావణుడిని చంపెను/

(మంచి ఎట్లయ్యెను, మరి ఎందుకు చంపెను?)

III. ఈ కింది దానిని చదివి, ఆపై ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము:
---------------------------------------------------------------------------------

దసరథునికి ముగ్గురు భార్యలు. ఆ నలుగురిలో ఒకరైన కైకేయి మాట విని ధసరథుడు రాముని అరణ్య వాసమునకు పంపెను. రాముని పట్ల విధేయుడైన లక్ష్మణుడు, తన అన్న వెంటనే అరణ్య వాసమునకు ఏగెను.

1. ఎవరి వలన రాముడు అరణ్యములకు పంపించబడెను?

2. ఎవరు విధేయుడు? మరియు ఎందువలన?----

( పదునాలుగేళ్ళు  విస్మరించబడిన ఊర్మిళ మరి ఏమయ్యెను? ఏ సిలబస్ నందు మరి మనం చదవవచ్చును?)


---బాల్కనీ వెలుతురులో, చుట్టూ మూగి 
తచ్చాట్లాడే పిచ్చుకల మధ్య 
రెక్కలు కుట్టుకుని పరీక్షలకు 

చదువుతున్న పిల్లవాడిని 
చూస్తూ, నా కళ్ళనీ మరి
నా పెదాలనీ నిస్సహాతతో 

ఒక పచ్చి ముల్లుతో, ఈ విద్యావ్యవస్థతో 
కుట్టుకుంటూ కూర్చున్నాను
ముంజేతి పై రాలిన కన్నీటి 
బొట్లలో అతని భవిష్యత్తుని 

చూస్తో, కొద్దిగా కొద్దిగా నేను సిగ్గుతో చస్తో---              

18 March 2013

అడగాలి కదా ఎవరో ఒకరు

పారిశ్రామిక ప్రదర్శనశాల ఇది, మరియూ
యంత్ర ఖచిత మనుషులు
దేవతా నవ్వులతో అలరాడే
మహా మాయా నగరమిదిరా

అని నేను మరచినప్పుడల్లా

అని నేను మరచి, ఎవరినో ఒకరిని మోదుకుని
కళ్ళను పెరుక్కుని

అరచేతులలో ఉంచుకుని, వాటిని చితుకుతూ
దుమ్ముతో గాలితో దూరంతో
కబోధి ఒకడు, తన కళ్ళను

కనీళ్ళలో కనుగొన్నట్టు నేను
ఒక్కడినే ఇక్కడికి తిరిగి వస్తే
ఎంత రాత్రైనా నువ్వే ఆ చీకట్లో

ఒక పసుపు పచ్చని దేద్వీపమానమైన పొద్దు
తిరుగుడు పూవై అక్కడే ఆ
గూటిలో, ఒక కంచంతో ఒక

గ్లాసుడు మంచి నీళ్ళతో ఈ
పొద్దు లేక తిరిగే పూవుకై
మరి ఇష్టంతోనో, లేక అలవాటుతనంతోనో. మరి

ఒక దీపం వెలిగించి, ఈ లోకం
ముఖాన్ని తుడిచి, అడగాలి
కదా ఎవరో ఒకరు ఇలాగైనా

"'రాత్రి, అన్నం తిన్నావా చిన్నా? లేక
తాగితాగలాగే పడుకున్నావా కన్నా?"

అని, కొంత ఆదరణతోనో, లేక
మరి కొంత స్వానుభవంతోనో
మరి కొంత ఏమీ చేయలేని నీ నిస్సహాయతతోనో? 

నిశ్శబ్దం మెట్లు

రాత్రైతే ఎక్కుతావు నిశ్శబ్దం మెట్లు, చీకట్లోంచి నింగివైపు-

కొంత గాలి తిరుగుతుంది అప్పుడు. నేలపై రాలిన పూలు
కొంతదూరం దొర్లి సన్నటి సవ్వడి చేస్తాయి
అప్పుడు. ఎక్కడిదో కొంత కాంతి నీ బాల్కనీ

అంచులలో, ఆకులు హడావిడిగా కదిలే ఆ రాత్రి వేళల్లో.
అవే, నిన్ను నువ్వు ఓపలేక
నిన్ను నువ్వు కాపాడుకోలేక

బొట్టు బొట్టుగా తిరిగి నువ్వు నీలోకే ఇంకిపోయే ఆ వేసవి
రాత్రుళ్ళు. ఎవరైనా నిను తాకితే
వాళ్ళ చేతివేళ్ళ నిండా అంటుకుని

వారి శరీరాల నిండా వ్యాపించే పొగ కమ్మిన నీ  చీకటి రాత్రుళ్ళు
కొంత దిగులుతో కొంత రోదనతో
కొంత కరుణతో కొంత మరపుతో

నిన్ను పది మందికి ముడివేసి
వారికి దగ్గర చేసే రాతిరాత్రుళ్ళు
నువ్వు ఎవ్వరికీ చెప్పుకోలేని ఆ మహా శ్వేత రాత్రుళ్ళు. ఎన్నటికీ
తీరని ఆ దాహపు రాత్రుళ్ళు.

మరి ఇంతకూ, విన్నావా నువ్వు
నిశ్శబ్దం మెట్లు ఎక్కే ఆ పాదాలు
తూలుతున్న ఆ వగరు శబ్ధాన్ని?   

12 March 2013

నీ వాళ్ళు

1
ఒక ఏకాంతం కావాలి నీకు, నిన్ను నువ్వు
బ్రతికించుకోడానికో, నిన్ను నువ్వు సమాధి చేసుకోడానికో: మరి అందుకే నీకు
ఈ పదాలు-
2
ముందుగా దీనిని ఊహించు, ఇలాగే: చీకట్లో
     సన్నటి మసక వెలుతురు చినుకులై రాలే నీ గదిలో
     మూసుకున్న నీ కనురెప్పలపై, ఎవరో
తమ అరచేతులని ప్రమిదల వలే ఉంచి, నీ

అధ్రుస్య అశ్రువులపై వొదిలి వేస్తే, ఆనక తిరిగి ఒరిమిగా
నీ చేతిని తమ చేతిలోకి తీసుకుని
'నేనున్నాను' అని అదిమితే, మరి

నీలో ఒక అలసట తీరిన నిట్టూర్పు, మరికొంత చిటికెడు శాంతీ. మరి ఇక అందుకే
ఇలా కూడా ఊహించు:
3
శరీరం కొంత

చచ్చిపోయి, కళ్ళు పూర్తిగా పిగిలిపోయి చేతులు ఎక్కడో
దిగంతాలలోకి రాలిపోయి, నువ్వు
మరి నువ్వే, నీ ఇంటికి ఒంటరిగా

తిరిగి వచ్చి అదే చీకట్లో కూర్చుంటే, మూసిన కనుల పైన వాలిన
ముంజేతి కింద కొద్దిగా చెమ్మ-- నువ్వు
ఉంచుకుందామనుకున్నా ఉంచుకోలేని

నువ్వు వొదుల్చుకున్న ఆ పిండం, ఏవో
లోకాలలోంచి నిన్ను చల్లటి చిరుగాలై తాకే కుత్తుక తెగే సందర్భం.
"తప్పా చెప్పు ఇష్టపడటం, శరీరంతో
శరీరాన్ని ప్రేమించడం?" అని నువ్వు

అని నువ్వే, నీ అద్దంలోకి చిట్లి చిట్లి కనుమరుగై, దూరమై ధూపమై 

మరి చిన్నగా గొణుక్కుంటావు కానీ
గోడ అంచున ఊగిసలాడే నీడలు నీ
నీడలు, పువ్వుల్లా వికసించే నీడలు
అవే, మరి అవే ఈ అక్షరాలకి ఆధారం. అందుకే మరి ఇలా కూడా-
4.                              
ఒక అంతం కావాలి నీకు, నిన్ను నువ్వు
చంపుకోడానికో, ఇతరులని పూడ్చిపెట్టడానికో లేక నీ అరచేతుల్లో
నా తలను బాదుకుని ఏడవటానికో- ఇంతకూ
5
మరి గుర్తుందా నీకు, వెడుతున్నానని మాట వరసకైనా చెప్పకుండా
నిన్ను తవ్వి తవ్వి కొల్లగొట్టుకు వెళ్ళిన

వాళ్ళు? ఆ నీ వాళ్ళు?  నీవనుకున్న నీ వాళ్ళూ?

PS: (ఇక రాత్రంతా
గాజుపాత్ర అంచున
తెగుతున్న కాంతి అంచున

వేలాడుతూనే ఉంది
నీ చూపు పూవు

తెగకుండా, ఎవరూ
తెంపకుండా. మరి

చూసావా నువ్వు?) 

టామీ

సాయంత్రం, నీళ్ళు చమ్కీలు వెలిగించిన ఆ పార్క్ లో

పరిగెడుతోంది పాపాయి రిమ్ జిమ్ మంటో
పాదాల చుట్టూ ధూళి దేవతల్ని
వెంట వేసుకుని, రివ్వు రివ్వున

చేతులు ఊపుకుంటూ, అరుచుకుంటూ, దుముకుతూ
మరకలు నిండిన, ఒక
తెల్ల కుక్కపిల్ల వెనుకగా

చుక్కలు చుట్టిన నల్లని రాత్రిలో మెరిసిపోతోన్న  ఒక
వెన్నెల వలయపు గౌనుతో

సర్రున రివ్వున ఝూమ్మున రిమ్ జిమ్ మంటో

గాలిలోంచి గాలిలోకి
గాలితో, మబ్బులతో
పోటీ పడుతూ ఉంటే        

గిర్రున తిరిగి తిరిగి
నవ్వుతో అలసి ఆ
కుక్క పిల్లను గాట్టిగా కావించుకుని మురిసి విరిసి
పోతా ఉంటె , 'విజ్జీ

ది డాగ్ ఈజ్ డర్టీ,
లీవ్ ఇట్. అది నిన్ను కరుస్తుంది' అని నువ్వు

నీ ఉన్నత వర్గ జాగ్రత్తను విడమరుస్తూ ఉంటే
ఇలా అంటుంది
ఆ చల్లని తల్లి
నీ కూతురు:  

"టామీ ఏమీ చేయదు కానీ
నాన్నా, మర్నువ్వే అరుస్తావ్
ఎప్పుడూ" అని అంటే, ఇక

ఆ సాయంత్రం తుళ్లిపడేలా ఎలా తుళ్లితుళ్లి నవ్వాను నేను?   

చిన్న సందేహం

చిన్న చిన్న చిన్న చిన్న చిన్న పాపా
ఎవరిచ్చారు నీకు
నీ చిన్ని చిన్ని చిన్ని చిన్ని చేతుల్లోకి

ఆడుకొమ్మనీ
ఆడుకుంటూ మమ్మల్ని ఆదుకొమ్మనీ
చిగురాకుల మాటున

దాగినా జాబిలినీ
చుక్కల చేపలనీ?  

ఒరోరే

ఉదయాన్నే/ ముఖ తెరలపై/ నాలికని పదను పెట్టుకునే పిలగాడా/ దా ఇలా

నీళ్ళు తాపిన/ పుంజు మెడను/ పట్టుకున్నాను వెనక్కు వంచి./ఆ/ వలయపు కుత్తుకపై/ మెత్తగా/ పెట్టొక కత్తి గాటు./ రాలతాయి ఇక/ ఎర్రటి పూలు/ కొమ్మలు వలవలా కదిలి/ నిన్ను కన్నీళ్ళమయం చేసిన/గాలి/ ఎక్కడో వీచి-/ అది స్సరేలే  

తెస్తాను నేను/ నీకు/ ఇప్పపూల సారా ఆకుపచ్చని పొగాకూ/ కానీ/ ఒరే/ ఒరోరే/ ఓ పిలగా

మూడ్రాళ్ళేసి    
వాటి మధ్యగా 
ఓ స్త్రీని రాజేసి 

నీ/ నా/ ఈ/ నాటు హృదయాన్ని/ వండి / సంధ్య వార్చి/ మనకి/ వడ్డించేది ఎవరు? 

11 March 2013

కొన్నిసార్లు కష్టం

1
కొత్తగా ఏమీ చెప్పను. సౌందర్యం వదిలి వేసుకుంటున్న
     చీకటి నీటిపై తేలే చిన్ని రాతలివి: సరే విను-
2
ముందుగా దీనిని ఊహించు, ఇలా: అలసి ఇక సాగలేక
     ఒరిగిపోయిన ఛాతిపై, చీకట్లో ఎవరో ఒక దీపం వెలిగించి
నీ పక్కగా కూర్చుని, సన్నటి చిరునవ్వుతో, ఒక
     పదునైన చాకుతో నీ ఛాతిని ఒరిమిగా చీల్చి

ఆపై ఆ రాత్రిలో మెరిసిపోయే, ఒక తెల్లని గులాబీని ఉంచుతారు.
     గుబురు పొదల్లోకి, కుందేళ్ళూ  చందమామలూ
వెళ్ళిపోయే సమయాలు: మరే, ఎవరూ అని అడగకు
     మరే, మరి ఎవరూ అని చూడకు. హృదయాన్ని

అలా చీల్చి/నదీ తిరిగి పూవై పాతుకుపోయినదీ ఒక నాలిక
     అవునో కాదో నీకు ఎలా తెలుసు? చూడు, వీధి మలుపు చివర
కళ్ళను తుడుచుకుంటూ వెళ్లిపోతున్నారు, ఎవరో
     అరచేతుల్లో నెత్తురోడుతున్న తననే, నిన్నే
     అతి జాగ్రత్తగా పుచ్చుకుని. మరి గుర్తుకు వస్తున్నారా నీకు

నువ్వొకసారి పొదివి పుచ్చుకుని వొదిలివేసిన నీ
     సహచరీ, నీ సహాచరుడూ, లోకంపై కోపంతో నువ్వు నీ
నిస్సహాయతతో చరచిన నీ పిల్లల బుగ్గల్లో, వాటిపై
     వలయమై ముద్రితమైన కమిలిన నిప్పులూ, తలను గోడకేసి
బాదుకున్న ఆ నీ కుత్తుక తెగిన రాత్రుళ్ళూ ?
3
కొత్తగా ఏమీ చెప్పను. సౌందర్యం వొదిలి వేసుకోలేని
     చీకటి నీటిపై తేలే పాదాలు ఇవి. నీ పదాలు ఇవి- సరే
4
ఎల్లా చచ్చిపోదాం మనం, ఈ కాగితపు అంచున ఊగిసలాడే
     రాత్రికీ, రాత్రి అంచున వెలిగే ఎవరూ లేని పిల్లల రెప్పల కాంతికీ?                 

08 March 2013

కొన్నిసార్లు

ఏం చేస్తావంటే
ఇంటి ఆవరణలో కూర్చుని, చీకటి నీళ్ళల్లో కాళ్ళు మోపి
వాటిని కదుపుతూ అలా వాటి శబ్ధాన్ని వింటూ ఉంటావు

మరి అప్పుడు నీ పక్కన
ఒక విశ్వమంత ఖాళీ.

పైనుంచి అప్పుడప్పుడూ గాలి. గలగలమంటో  రాలతాయి
వేపాకులు, చుక్కల్లా. ఇక

నీ చిక్కల్లా ఏమిటంటే ఈ
రాత్రి దాహానికీ, దాహపు
శరీరానికీ త్రాగేందుకు ఓ

బీరైనా లేదు తోడుగా, చల్లగా అని కూర్చుని మాట్లాడుకుంటావ్
నీతో నువ్వు అప్పుడు ఇలా:

'నీడలైన నీడలతో, నీడలు కాలేని నీడలతో నీడల వనమైనది
నువ్వే కానీ
అద్సరే కానీ

ఎందుకు చదువుతున్నావు నువ్వు దీనిని?' 

07 March 2013

ఎన్నోసారి?

చీకట్లో కూర్చుంటావు నువ్వు, ఒక చీకటి పుష్పపు
     చీకటి పరిమళాన్ని శ్వాసిస్తో
నీ కనురెప్పలపై మునివేళ్ళతో

తను నీకు బహుమతిగా అందించిన
చీకటిని రుద్దుకుంటో
     ఇలాగే అనుకుంటో: "భగవంతుడా -

ఎవరైనా వచ్చి, ఈ చీకటి పరదాలను తొలగించి 

ఈ శరీరంలో ఒక దీపం వెలిగిస్తే
ఎంత బావుండు".

PS: (అల్లా అనుకోవడం ఎన్నోసారో
అతని నిజంగా తెలియదు

అన్ని రాత్రుళ్ళు అలా ఎలా
గడిచిపోయాయో అతనికి
నిజంగా జ్ఞాపకం లేదు.

పోనీ గుర్తుందా మీకు? అతనెవరో
ఆమె ఎవరో?) 

06 March 2013

ముద్ద మందార పూవులు

నీ ఇంటి ఆవరణలో, చక్కగా ఊగేవి ఆ ఎర్ర ముద్ద మందార పూవులు.
నేను నీ కిటికీ పక్కన కూర్చుని
తల వంచి చూస్తే:ఎదురుగా అవి.

ఉదయపు లేత కాంతి, వాటి కొమ్మలపై వాలి, గాలితో
వాటిని ఊయలలూపుతున్నట్టూ
ఎవరో తల్లి, ఒక జోలపాటతో తన

ఒడిలోని శిశువులను జోకొడుతూ, ఊపుతూ నిదుర పుచ్చుతున్నట్టూ

మెత్తటి బరువుతో, తూనిగలు
తిరిగే నిశ్శబ్దాలలో ఊగేవి ఆ
ఎర్రఎర్రని ముద్ద మందారాలు

నీ ఇంటి ముందు బాదం చెట్టు వేసవికి తొలి ఆకుల లేఖలని రాసే వేళల్లో-
కూర్చున్నాను అప్పుడు, నీ
పక్కనే, నిన్ను ఆనుకుని నీ
అరచేతిని గట్టిగా పుచ్చుకుని-

నా తల ఆన్చిన నీ భుజంపై కొంత చెమ్మ. కొంత నొప్పి. నా తలని లేపి ఇక నీ
వక్షోజాల్లో దాచుకుంటే అక్కడ
కొంత నెత్తుటి తడి: తెలిసింది
నాకు తొలిసారిగా అప్పుడే నీ

వక్షోజాలు కళ్ళు అనీ, అవి
కన్నీళ్ళు పెట్టుకుంటాయనీ
ఆ కన్నీళ్లు రాలి, పూవులు
ఆ ముద్ద మందార పూవులు, వొణికి వొణికి, తలలు వంచుకుంటాయని-

ఇక చూడు ఇప్పుడు, అదే కిటికీ పక్కన
ఊగుతున్నాయి రెండు ముద్దమందార
పూవులు, నెత్తురు నిండిన బరువుతో
కనులని కోసే మిట్టమధ్యాహ్నపు కర్కశ వేసవి గాలులతో: తడి గుడ్డతో

నీ పెదాలు తాకిన నా నుదుటిని, కాస్త
అలసటగా తుడుచుకుని, ఇక నా తల
తిప్పి తిరిగి చూస్తే, కొంత ధూళీ కొంత
ఆవిరీ, చెట్ల కొమ్మల్లో కనిపించని పక్షుల అలజడీ, నీడలు నీడలతో
కలగలసి, చీకటయ్యే ఒక ఆకస్మిక

విభ్రాంతీ: నాలోపలో సమాధి ఉందో
లేక, ఒక సమాధిలో నేను ఉన్నానో
దహనమయ్యే చితిని మోసుకుని తిరిగే ఈ మనుషుల మధ్య మళ్ళా ఓ
పరి మరణించానో ఓపరి జనినించానో

తెలియని స్థితి: ఇంతకూ చూస్తున్నావా
నువ్వు? ఈ రెండు వాక్యాలనూ, కొన
ఊపిరితో నెత్తురోడుతున్న ఈ రెండు ఎర్ర ముద్ద మందార పూవులనూ
అరచేతులలో పుచ్చుకుని అందరికీ

చూయిస్తూ, తనని తానే అడుక్కుంటున్న ఆ పూవులు లేని ఈ మనిషినీ
ఆ రహస్య ప్రదేశంలో ఒక ద్వేదీపమైన
కాంతిలో, గాలిలో, వానలో, ఇప్పటికీ

అలా నిరంతరం ఊగుతూనే ఉన్న ఆ ఎర్రని, ఎర్ర ఎర్రని
 -ఇంకా మీలో మానని- ఆ
ముద్ద మందార పూలనీ-? 

05 March 2013

గర్భస్మృతి

లేచి వెళ్ళిపోతారు పిల్లలు : ఇక,
నలిగిన ఆ దుప్పట్ల కింద, పూర్వజన్మల
పురాతనమైన వాసన ఏదో-

ఈ లోకానికి చెందని జనన మరణ రహస్యాల
పుష్పగుచ్చాల స్పృహ ఏదో ఇక్కడ
వాళ్ళు అరచేతులు వాలిన దిండ్లపై:

రాత్రిని వొదలని సీతాకోక చిలుకల
రెక్కల కదలికలు ఏవో ఇప్పటికీ
వాళ్ళు కప్పుకుని తొలగించిన ఆ దుప్పట్లలో-

ఒక చిన్న కదలిక ఏదో
నిశ్చలమైన సరస్సును
వలయాలు వలయాలుగా విడమర్చినట్టు

గది అంతా లతల వలె అల్లుకున్న
ఒక కమ్మని నిదుర పాల వాసన.

వాళ్ళ అమ్మలాంటి, తన నవ్వులాంటి
వాళ్ళ కలల పసి ధూళి ఏదో
ఇప్పటికీ ఇక్కడ పసిడి తరంగాలై---

నేను తల్లి గర్భంలో
శ్వాసించి మరచిన పరిమళం ఏదో ఇక్కడ
నేను తల్లి గర్భంలో
చూచి మరచిన చిత్రాలు ఏవో ఇక్కడ-

ఆదిమ తల్లి  చూచుకాన్ని తాకిన

ఆ తొలి స్పర్స ఏదో తిరిగి తెలిసినట్టూ

ఆ తొలి పాల బిందువు ఏదో తిరిగి
పెదాలపై రాలినట్టూ, రహస్యమేదో
నెమ్మదిగా అవగత మౌతున్నట్టూ


ఒక తమకంతో, స్థాణువై నేను ఇక్కడ

పిల్లల వలే నిదురలోంచి లేవలేకా
పిల్లల వలే నిదుర లేచి వెళ్లి పోలేకా-!  

రాత్రి అతను అడిగిన ఒక ప్రశ్న

తుమ్మెదలు లేవు, పుష్పాలూ లేవు
నలువైపులా నలుగు దిద్దుకున్న నీ
మాటలూ లేవు

పచ్చటి చెట్లూ లేవు - ఎగిరే పిట్టలూ లేవు
నింగిన వేలాడే కరిమబ్బుల
జలతారు పరదాలూ లేవు-

ఊదిన వేణువులూ లేవు. మరి ఇక అన్నా
మరువలేని గోధూళులు లేవు
తాగుదామంటే మరిక, అన్నా

ఈత కల్లూ లేదు నాటు సారా లేదు
ఎండ బెట్టి వండుకున్న
సెలయేటి చేపలూ లేవు:

అంతా లోహ ఖగోళం లోహ వలయం
లోహ మోహ తాపం - తంత్రీ నినాదం.

చెప్పు అన్నా - ఇంతకూ
నా ఎదలోని వెన్నెలని
ఇనుప గోళ్ళతో తన్నుకు వెళ్లి

నన్ను నెత్తురు కూడుగా మార్చింది ఎవరు?    

04 March 2013

పిల్లలు నిన్ను పట్టుకుని ఏడ్చినపుడు

ఏం చేయాలో తెలియదు నీకు, పిల్లలు నిన్ను పట్టుకుని బావురుమన్నప్పుడు-

ఎంత మిట్ట మధాహ్నం అయినా, నీలోపలి ఆవరణలో కురుస్తుందో నల్లటి మంచు. ఆనక

నీ శరీరం లోపలంతా హోరున వీచే చెట్ల గాలుల్లో
చెల్లా మదురుగా ఎండుటాకులు రాలి ఆకాశంలో
మబ్బులు కమ్ముకుని, నేలపై నీడలు సాగిపోతే

ఇక ఒక మసక చీకటి నీ కళ్ళలోకి అలుముకుని
నీలో కొంత ఉక్కపోత మరికొంత
ఊపిరాడనితనమూ దిగులూనూ.

ఇక అప్పుడే, గోడలపై గీసిన పిల్లల గీతలలో చేరుకునే చెమ్మ.
ఎవరో తమ చూపుడు వేలిని కన్నీటిలో ముంచి
ఆ గోరువెచ్చటి తడిని ఆ బొమ్మల్లో అదిమినట్టు

వాళ్ళు జాగ్రత్తగా, గూళ్ళను అల్లుకున్నట్టు దాచుకున్న ఆ చిరిగిన కాగితాలలో చేరే
ఒక సునిశితమైన నిశ్శబ్దం. మరి అప్పుడు ఇల్లంతా
ఆగీ ఆగీ చిట్లే, ఒక వెక్కిళ్ళ శబ్ధం. సరిగ్గా ఆ క్షణాన

నీ ఇంటి బయట పావురాళ్ళు  హింసగా కొట్టుకునే రెక్కల అలజడి. ఇక రాలిపోతాయి
వాటి ఈకలు తెగి, నెమ్మదిగా నీ గుమ్మం ముందు ఎవరూ తాకని ఒక వొంతరితనంతో.
ఇక  వెళ్ళిపోతుంది వీధిలోంచి ఒంటరిగానే ఒక ఒంటె, పిల్లలు హృదయాలు కొట్టుకునే

గల్ గల్ శబ్ధాలతో. నిరాశగా తోసుకుంటూ వెళ్ళేపోతాడు
వంటరిగానే ఒక ఐస్క్రీమ్ బండి వాడు నీ ఇంటి ముందు
ఆగి, మరీ మరీ అరచీ నీ ఖాళీ బాల్కనీలోకి చూచీ చూచీ-

ఇక గేటు వద్ద ఒక్కత్తే ముదుసలి బిచ్చగత్తె, ఖాళీ సత్తుగిన్నెతో
ఈ నగరంవంటి నీ నలుచదరపు అపార్ట్మెంట్ ముందు నీ వంటి
ఆకలితో, డోక్కుపోయిన కడుపుతో, దాహంతో చిట్లిన పెదాలతో
ఒక నిరాకార మృత్యుమయ హృదయంతో - చూడండి

నిజంగా తెలియదు నాకు, ఏం చేయాలో, పిల్లలు అలా
నన్ను వాటేసుకుని బావురుమని ఏడ్చినప్పుడూ
వెక్కిళ్ళతో అలా తినకుండా నిదురోయినప్పుడూ-

మరి అప్పుడు, అక్కడ వాలిన పూలను చూస్తూ ఏం చేయాలో మీకేమైనా తెలుసా ఇంతకూ? 

03 March 2013

ఒక జీవితం

"పొత్తి కడుపు అంతా నొప్పిగా ఉంది, కొంత బ్లీడింగ్ అవుతుంది
     అస్సలు బావోలేదు. త్వరగా రావా" అని తను అడిగితే
      అతను తల ఊపి, తల వంచుకుని వెళ్ళాడు ఉదయం


తిరిగి తిరిగి, తిరిగి అర్థరాత్రి రెండింటికి రెండు రిక్త హస్తాలతో
ముఖం నిండా దుమ్ముతో, కళ్ళ నిండా మధువుతో
శరీరం అంతా అల్లుకున్న సాదా సీదా మనుషులతో

నలిగిపోయిన పూవులతో, రాలిపోయిన పక్షులతో
డోక్కుపోయిన కడుపుతో, చెంపలపై
కమిలిపోయి నెత్తురంటిన కన్నీళ్ళతో

తిరిగి వచ్చాడు అతను ఇంటికి, చీల్చుకున్న ఛాతిలో- తన కడుపులోంచి గర్భస్రావమయ్యి-
చితికిపోయిన బిడ్డను, ఆ పిండపు
ముద్దను అతి భద్రంగా దాచుకుని-

ఇక కళ్ళు తుడుచుకుంటూ ఆడిగింది తనుకనులు కాంచని ఆ నల్లటి చీకటిలోకి వంచిన
అతని ముఖాన్ని ఎత్తి ఇలా:

"అన్నం పెట్టమంటారా?-"