29 March 2018

ఈ క్షణం, 3 కవితలు

1.
గమ్యం
ఎండలో వచ్చావు; ముఖాన తడి,
పచ్చిక వొత్తిగిల్లినట్టు
ఓ పక్కగా వొదిగి కూర్చున్నావు,
పొదిగే పిట్టల్లాగా నీ కళ్ళు , అట్లా
తెరిపారా నను చూస్తో;
"నీళ్ళు కావాలా?" అడుగుతాను

నేను: "ఊహు: వెళ్దాం" అంటావు
నువ్వు . కదులుతాను
నేను ఇక నీతో మరి, కానీ ఎటు
వెడుతున్నానో, నాకసలే తెలీదు!
2.
balm

అసంకల్పితంగా, నీ పెదాలని
తుడిచాను నేను,
నా ముంజేతికి లేతెరుపు రంగు
'స్ట్రాబెర్రి లిప్ బామ్' నవ్వుతావు
నువ్వు ; స్ట్రాబెర్రీ
జ్యూస్ గ్లాస్లోంచి పైకి చిల్లినట్టు

చీకటి పడింది; చల్లని రాత్రిలో
ఇక గగనమంతా
ఎన్నెన్నో స్ట్రాబెర్రీ పూవులు,

నీ మాటలై మిలమిలా మెరుస్తో!

3.
కృతజ్ఞత

రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ
కూర్చున్నాను,
చిన్నగా నడచి వచ్చే నిన్ను

చూడాలని; దారిపై ఒకటి వెంట
మరొకటి వాహనాలు,
అలుపు లేకుండా, ఎక్కడికో!
క్షణం ఆగే తీరిక లేకుండా మరి
మనుషులు కూడా;
ఫ్లై ఓవర్లై, సెల్ఫోన్లై, ఎక్కడికో!
***
రేర్ వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ
కూర్చున్నాను;
చిన్నగా నడిచి వస్తూ నువ్వు

ఎంతో ఎండలో ఒక్కసారిగా మరి
వాన కురిసి, చెట్లు
వొణికి పూలను రాల్చినట్టూ,
ప్రాణం మళ్ళీ లేచొచ్చినట్టు!

No comments:

Post a Comment