13 August 2013

- కోత -

- అప్పుడొక కోత అక్కడ: ఎవరో నిన్ను వెనుకనుంచి పట్టుకుని
     నీ కుత్తుకను కోసి వొదిలి వేసినట్టు -
     ఆ వదనమూ తెలియదు,ఆ చేతులూ
     తెలియవు.వెనుతిరిగేలోపు అక్కడొక
గులాబీ కోతనూ
 
నీ కుత్తుక కిందుగా ఉబికే, రుగ్మత వంటి ఒక చీకటినీ ఉంచి
     మాయం అయ్యినది ఎవరో తెలియదు
     ఇక మసక వెన్నెల్లో,గాలికలా ఊగుతో
     ఆగుతూ చూస్తో అప్పుడొకటీ,అప్పుడొకటీ
రాలే కనకాంబరం పూలు:

వాటి నీడలు- అవే: నీ కుత్తుకను కోసి

నువ్వు వెనుదిరిగే లోపు మాయం అయ్యిన, తన శరీరం వాసన వేసే
     నీడలు: శూన్యం ఊగే ఊయలలో
     గుమికూడే ఊదా రంగు రాత్రుళ్ళు-
     అది సరే:నా తల్లీ, సోదరీ సహచరీ

నా ప్రియురాలా,నా భార్యా,ఇక ఎప్పటికీ ఒకటి కాలేని,ఒక్కటి కాలేని
     విధి వంచితురాలైన, నువ్వే కానీ
     మరి క్షమయే కానీ,'క్షమార్హమా?'
     అన్న సంవాదమే, వివాదమే కానీ

కానీ క్షమించు. నీ ఏక ముఖ వ్యాకరణను అంగీకరింపలేక,అనుసరించ/లేఖా
     నువ్వో,మరి నేనో ఇలా
     - కోసిన/గీసిన/రాసిన -
     కోతలలో,అలసిన ఒక

నెత్తురు బిందువునై ఆగిపోతున్నాను. క్షమయే కానీ,చేతులెత్తి నిను
     ప్రార్ధించి, అర్ధించి, నిను శరణుజొచ్చిన
     జీవినే కానీ,ఇక ఈ అద్దాలలో,ఇక 
     అబద్ధాలలో,ఇక ఈ పల్లకీలలలో-నిను-

మోయలేకున్నాను-నిను క్షమించలేకున్నాను -నీకు బానిసని కాలేక
     ఉన్నాను:పూలపాత్రలో వడలిన కాలంతో
     చేతిలో, నీ కలకలమంత హలాహలంతో
     ఈ అ/ఖండికనై, రాయబడుతున్నాను -

నా ఆల్కహాలికా, మరి ఈ

రాళ్ళు స్వప్నించగలిగితే
ఈ గాలి శ్వాసించగలిగితే
ఈ వాన తెరలు-నిన్ను-

వినగలిగితే, ఎవరి నయనాలలోంచో , మూలకు ఒదిగిన మన పిల్లవాని
కడుపులోంచి ఆకలై
నిన్ను, తాకగలిగితే
నీతో మాట్లాడగలిగితే

తల వంచిన అతని శిరస్సు కింద గుమికూడిన నీడలలో, నీ వైపు చేతులు
చాచిన ఈ అనాధ పదాలు
కాగలిగితే,రా-య-గలిగితే

- ఇక నీ సంగతి ఏమిటి? - 

No comments:

Post a Comment