12 August 2013

-నేనెవరిని ఇంతకు-

ఏమీ చేయలేక, కొన్నిసార్లు
నుదిటిపై ముంజేతిని వాల్చుకుని కళ్ళు మూసుకుని పడుకుంటావు-

వేన వేల పావురాళ్ళు ఒక్కసారిగా రెక్కలు కొట్టుకుని గాలిలోకి లేచినట్టూ
ఏ నదీ తీరానో రావి ఆకులు ఒక్కసారిగా
ఉలిక్కిపడి, అలలతో రెపరెపలాడినట్టూ

లోపలంతా అలజడీ, ఒక శీతల కాంతి-
అరచేతుల్లో పొదివి పుచ్చుకున్నదేదీ
క్షణకాలం కంటే ఎక్కువ మన్నలేని, కనుల ముందే కరిగిపోయే ఒక స్థితి-

ఇక ఒక ముఖం ఏదో, నీవై, నీ
శరీరం వంటి రూపమై, నా లోపలి లోకాలలో జీవం పోసుకుంటుంది, అదొక
ఒక పూల పాత్ర అయినట్టూ, అదొక
మంచినీళ్ళ మట్టికుండ అయినట్టూ---

ఎవరో రావాలి, పాత్రలో పూలు ఉంచేందుకూ
మట్టికుండ చుట్టూ, ఈ దినం చుట్టూ ఒక
తడి గుడ్డను చుట్టేందుకూ, ఈ నుదిటిపై

సర్పాలవలె అల్లుకుపోయిన, ఈ చేతులని
తొలగించి ఇంత చూపుని ప్రసాదించేందుకూ
ఇంత శ్వాసని లోపల నింపేందుకూ - కానీ

ఇవన్నీ అడిగేందుకు, నేనెవరిని ఇంతకూ?

1 comment:

  1. ఎవరో రావాలి, పాత్రలో పూలు ఉంచేందుకూ
    మట్టికుండ చుట్టూ, ఈ దినం చుట్టూ ఒక
    తడి గుడ్డను చుట్టేందుకూ,

    ReplyDelete