10 August 2013

శాంతి

1
పల్చటి కాంతిని ఒత్తి పరచినట్టు, చుట్టూతా గాలి-

తడి తడిగా భూమి. చెట్లల్లో ఒక పచ్చి వాసన, చిగురాకులు విచ్చుకున్నట్టు-
తడారుతున్న నీటిగుంటలు
కదులుతున్న మబ్బులూ-

ఇక
ఈ నగరపు అద్దంపై మసి తొలిగి
ఒక ముఖం బయటపడుతుంది
శత్రువు,తన శిరస్త్రాణం తీయగా

-ఊహించని- నీ ప్రియురాలి తెల్లని కళ్ళు బయటపడి నిన్ను పలకరించినట్టు-
2
విచ్చుకోబోయే మొగ్గలో తొణికికిసలాడే మెత్తటి నిశ్శబ్ధం ఇక్కడ-
శబ్ధమంతా- కాంతి తరంగాలై-
కొమ్మల్లోకీ, ఆకుల్లోకీ మెత్తగా
ముడుచుకుపోయినట్టు ఎదపై

ముడుచుకుపోయి, తొలిసారిగా
తల్లి చూచుకాన్ని ఒక శిశువు ఆప్తంగా అందుకున్నట్టూ
ఆ తల్లి లాలనగా ఆ బిడ్డని
పొదివి పుచ్చుకున్నట్టూ.సరే
3
నువ్వు ఇది చదివే సమయానికి
నేను ఉండకపోవచ్చు.ఇక గాలికి
అల్లల్లాడిపోతూ, ఎగిసిపోతూ, ఊగిపోతూ,తేలిపోతూ,నీ 
ఇంటి ముందు రావిచెట్టు ఆకులు-
4
అందుకే
ఏమీ మాట్లాడకు
తాకు:ఊరికే విను
వెదురు వనాలలో,రికామీగా తిరిగి తిరిగి, తిరిగి నింపాదిగా నిదురించే గాలిని. తెలుస్తుంది నీకు

అంతిమంగా, మనం
కలసి ఉండటమెలాగో-

No comments:

Post a Comment