26 August 2013

సదా

ఆకుల మీది కాంతీ, కాంతిని తాకి రాలే మంచూ

నీ చుట్టూతా:నీ ముఖాన్ని నువ్వు దాచుకునే నీ

అరచేతుల్లో లేత మంట. ఎలా అంటే
చిన్ని చిన్ని గుల్మొహర్ పూవులు
చప్పున నీ అరచేతుల్లో వికసిస్తే,నీ
చెంపలపై ఆ కాంతి ప్రతిఫలించినట్టు

నీ ముఖమంతా సంతోషం, నీ కళ్ళల్లో ఆనందం-

అలలపై కలువ మెరిసినట్టు  నీతో నువ్వు
నీలో నువ్వు. నీ చుట్టూతా సమస్థం ఒక
అమృత పరిమళ వెన్నెల వలయం -ఇక
నీతో, వలయామృతమైన కాలంలో, నాలో

మరి ఇక, సదా ఇలాగే ఉండాలనే ఒక శాంతి సందేశం-

నీ వేళ్ళ చివర్లతో,నేలపై ఎగిరిపడే ఆ నీడల్ని తాకుతూ
అట్లా, తుళ్ళి తుళ్ళి పడి నవ్వే
ఓ చిన్ని చిన్ని చిన్నమ్మాయీ

ఇంతకూ నీ పేరేమిటి?/ ఇంతకూ నీ ఊరేమిటి?

నీ నవ్వుల నురగల్లో చిక్కుకుపోయిన, నేను ఏమిటి? 

No comments:

Post a Comment