18 August 2013

- అంతం -

1
గుత్తులుగా వేళ్ళాడే ఆకులను తొలగిస్తే, నీ వేళ్ళకు అంటుకుంటుందీ
పొరల పొరల వంటి కాంతి - మజ్జిగ చిలికే
అమ్మ ముందు కూర్చుంటే మధ్యలో ఇంత
వెన్న తీసి, తను నీ అరచేతుల్లో పెట్టినట్టు-

ఊహ తెలియని వయస్సులో, తన కొంగులో
దాగితే, ఆ కనకాంబరపు చీరలో లోకమంతా
లేత నారింజ రంగులో కనిపించినట్టు, మరి

ఇక్కడ, మృదువైన పూల కాంతి. ఇప్పుడు
గుర్తు లేదు కానీ నీకు, పొలమారితే నీ తల్లి
నీ తలపై తట్టి, మంచి నీళ్ళు తాపించినట్టు
ఇక్కడ, తన వొంటి వాసనా, తన చేతుల గాజుల అలికిడి వంటి గాలీ-

ఆ గాలిలో, రెపరెపలాడుతూ ఒక సీతాకోకచిలుక. దాని గమనాలలో
కాలభ్రమణం. ఇంతకు మునుపే ఇక్కడికి
వచ్చినట్టు,ఈ జీవితాన్నిఇంతకు మునుపే
పలుమార్లు జీవించినట్టు, వెళ్లిపోయినట్టూ-

ఇక అప్పుడు, అక్కడ
2
నిదురించిన పసి పిడికిలి లోంచి, అతి నెమ్మదిగా నువ్వు నీ
చూపుడు వేలిని లాక్కునట్టు, ఆ చెట్ల కింద
నుంచి సాగిపోతాయి నీడలు. రాత్రి కురిసిన
వాన నీళ్ళు ఆగిన పచ్చికలో ఒక ప్రకంపన-
ఆ నీళ్ళపై పురుగులు కదిలితే, అతి మెత్తగా

వణుకుతుంది సాయం సంధ్య. లక్షలక్షలు
విసెన కర్రెలు వీచినట్టు,హోరున వీచే గాలి.
ఆకస్మికంగా ధూళి లేచి, తెరలు తెరలుగా
నీ పైన కొమ్మలు గలగలా ఊగి ఆకులుగా
రాలితే,నీ కళ్ళల్లో కొంత నీరు.కొంత చీకటి-
దుమ్మే పడిందో,లేక నీ తల్లే అలా రాలిందో

ఎప్పటికీ తెలియదు నీకు. మరి ఇక నువ్వు నీ తల తిప్పి చూస్తే
3
నీకు కనిపించని దూరాలలోంచి నీ వైపు తేలి
వచ్చే సుపరచితమైన పిలుపు, ఆడుకున్నది
ఇక చాలనీ,ఇంటికి త్వరగా రమ్మని కేక వేసే
నీ తల్లి పిలుపు,వేచి చూసే నీ తండ్రి పిలుపు-
అప్పుడు,నీ మెలకువలోకి దిగే ఒక దిగులు-

అది ఎలా ఉంటుందీ అంటే
4
ఇంటి నుంచి తిరిగి వెళ్లలేనంత దూరంగా వచ్చాక, నీకు అత్యంత
ప్రియమైనదీ నువ్వు మరచినదేదో గుర్తుకువచ్చి
ఇక నువ్వు వెనక్కు వెళ్ళాలేకా మరి ముందుకి
సాగాలేకా, రెండుగా చీలుకుపోయి గిలగిలా

గింజుకులాడతావే, అలా-

ఇక అప్పుడు, నీ వదనాన్ని రివ్వున కోసే ఒక గాలి:నీ పూర్వీకుల చేతులేవో
నిన్ను అధ్రుస్యంగా తాకి, నిన్ను రహస్యంగా
తమ వద్దకి రమ్మని పిలుస్తున్నట్టు, నీ తల్లి

అరచేతుల ఛాయ ఏదో నీ పైకి కమ్ముకున్నట్టు
భూమిలోంచి పాదాలలోకి జొరబడి దేహమంతా
వ్యాపిస్తున్న ఒక పురాతన స్మృతి.జలదరింపు-
ఏదో మొదలై,మరేదో అంతమై,ఏమీ అర్థం కాక

నువ్వు,లుంగ చుట్టుకుని ముడుచుకుపోయి
నిస్సహాయంగా తల ఎత్తి ఆకాశంలోకి  చూస్తే
గుత్తులుగా గుత్తులుగా వేలాడే చేతుల మధ్య

నుంచి తెరలు తెరలుగా, నలుదిశలా నువ్వు
పిగిలిపోయే కాంతి. ఒక రహస్య విహంగమేదో
నీ ప్రాణాన్ని నీ ముందే తనపైకి ఎక్కించుకుని
క్షణిక కాలంలో, మరో లోకంలోకి ఎగిరిపోయే

సాంధ్యకాలపు సప్త రంగురేకుల పూవు ఒకటి నీ ముందు, తనకి తాను
5
విచ్చుకుని, మెరిసి, సువాసనతో వెదజల్లబడి
తిరిగి ముకుళితమై, ప్రార్ధనవలే ఒదిగిపోతూ...
ఎంత క్లుప్తం ఈ జీవితం-గుత్తులుగా వేళ్ళాడే
మనుష్యుల మధ్య ఎంత క్లుప్తం నీ సమయం-!
6
ఇక అప్పుడు,వాళ్ళు తాకిన చోట రాలిన నీ కన్నీటి మంచును తుడుచుకుని
లేచి చూస్తావా, కనిపించకుండా ఎవరో రమ్మనే
ఆ చోటూ, నీ గమనాన్ని నిర్ధేశించే ఆ పిలుపూ
ఆ గూడూ,నీ దీపాలు ఆరిన చోటే మొదలయ్యే
ఆ కాలాలూ... వాటిలోకి నువ్వు వెళ్ళాలేవు -
అలా అని అక్కడే ఉండాలేవు. ఇక
7
గుత్తులుగా వేళ్ళాడే ఆకులను తొలగించి నీ వేళ్ళకు అంటుకునే ఈ
పొరల పొరల వంటి కాంతిని చూస్తూ, తాకుతూ
ఇక ఎలా బ్రతకడం? ఇక ఎలా కొనసాగడం?ఇక

నిరంతరం నిన్ను స్మరిస్తూ -నిరంతరం నిన్ను లిఖిస్తూ- నిన్ను తుడిపివేస్తూ
నిన్ను చేరలేక, ఎలా ఇక్కడ ఈ గుత్తుల మధ్య
చిన్న చిన్నగా,చమురు ఆవిరయ్యే ప్రమిద వలే
సన్నగిల్లుతూ, కాంతికై తపించిపోతూ, చీకటిని
వదులుకోలేకా, ఉంచుకోలేకా ఇక

చిన్నా, మరి ఎలా - ఇలా - ఇక్కడ - అంతం - అవ్వడం-?

No comments:

Post a Comment