14 August 2013

- ఒక ఆధ్యాత్మిక ప్రశ్న -

చిన్న పిల్లాడివైనా కాదు: ఉడుక్కుని అలిగితే
     చాక్లెట్తో ఐస్క్రీమో చూపించి మాయజేయటానికి - అలా అని 
పూర్తిగా పెద్ధవాడివీ కాదు 

రాత్రిలో, మసక వెన్నెల్లో 
     ఆకుల అంచులనుంచి జారే చెమ్మను చూయించి-'ఒరే, జీవితం 
     ఇలాంటిదిరా: కరిగిపోతుంది 
ఇలాగే తేలికగా 

చంద్రుడ్ని అంటిపెట్టుకున్న ఆ పసిడి మృత్యువలయంలోకి' - అని 
నిన్ను- నిన్నే - పట్టుకుని
నవ్వుతూనో ఏడుస్తోనో చెప్పి 

నేనూ కన్నీటి చెమ్మనై 
నీ కనురెప్పల అంచుల 
నుంచి రాలి, నీ అరచేతులలోకీ, ఆ మట్టిలోకీ రాలి, ఇంకిపోయేందుకు- 

మరి ఇక నేను ఏమి సేతురా నా వెర్రి నాగన్నా - 

చూడిక్కడ: ఈ హృదయ స్థానంలో ఏర్పడిన 
సమాధులనీ 
స్మశానాలనీ-

కొమ్మకి ఊగే ఆకు ఎప్పటికీ ఒంటరే: గాలిలో, చీకట్లో 
తనను బ్రతికించే వేళ్ళతోనే 
తనను తుంపివేసే వానతో - 

తప్పదు: గొరింటాకులా ఈ మనుష్యులని ఒంటినిండా పూసుకుని 
పరిపక్వమయ్యి ఎర్రగా పండిపోయో  
ఎవరూ చూడక 
పిగిలి రాలిపోయో

ఏదో ఒకటి, ఇక మరి ఇంతకు మించి, ఇంతకు మినహా  
ఏముందీ జీవితంలో? 
నీకైనా నాకైనా మరి 

- ఎ - వ - రి - కైనా? -

1 comment:

  1. తప్పదు: గొరింటాకులా ఈ మనుష్యులని ఒంటినిండా పూసుకుని
    పరిపక్వమయ్యి ఎర్రగా పండిపోయో
    ఎవరూ చూడక
    పిగిలి రాలిపోయో

    ReplyDelete