నవ్వుతున్న గాడిదలను చూసావా ఎపుడైనా?
రూకల గార పట్టిన పళ్ళతో
నవ్వుతారు ఈ జనాలు
నేను నిన్ను తలచుకున్నప్పుడల్లా
అంటాను నేను వాళ్ళతో
తెల్లటి కాగితాలైతే రాసుకోవచ్చు, ముఖం చూసుకోవచ్చు
ప్రేమించలేని, రమించలేని
శరీరాలు లేని ఈ పచ్చటి కాగితాలతో ఏం చేయగలం
విసర్జించాక తుడుచుకోవడం తప్ప?
అందుకే నవ్వుతారు, ఖ్యాతికై
దాచుకునే భవంతులకై
బంగారానికై వెంపర్లాడే
ఈ లోకపు మహా పిసినారి గాడిదలు-
నిన్ను మించిన పసిడీ
నిన్ను మించిన భవంతీ
నిన్ను మించిన ఖ్యాతీ పుణ్యం స్వర్గలోకం ఉంటుందా ఎక్కడైనా?
ఫరీదా ఇక ఇంతకంటే
మరి ఎక్కువ చెప్పడం
నిషిద్ధం: ఎందుకంటే
విత్తనంలో చిక్కుకున్న చిగురాకు
చినుకుకై పడే తపనా పెనగులాటా
నీకూ నాకూ తప్ప
మరెవరికి తెలుసు?
బాగా చెప్పారు..
ReplyDeleteబాగుంది..మీ సంబాషణ...
ReplyDelete