29 April 2012

స్థితి

నిశ్శబ్ధంలోకి నిశ్శబ్ధంగా
ఎవరో తల వంచుకుని గదిలోకి నెమ్మదిగా వచ్చిన పచ్చి వాసన

శరీరంలోకి
కొంత నీటి అలికిడీ, కొంత విరామం కొంత అభయం కొంత శాంతీనూ

యిక ఒక పచ్చిముల్లు దిగి
సలుపుతున్న ఈ రాత్రిలో
నేను ఎమౌతానోనన్న దిగులు లేదు

ఏం చేయకు నువ్వు

ఉండు ఊరికే అలా-

నేను నిదురోతాను

27 April 2012

నీకై 11*

పూల తోటలోకి రాకు
సాయం సంధ్యలో వికసించిన జాజులు చిన్నబుచ్చుకుంటాయి

కురిసే వానలోకి రాకు
కమ్ముకున్న మేఘాలు మళ్ళా తప్పుకుంటాయి

ముసిరిన రాత్రిలోకి రాకు
పసుపు వన్నెల చందమామ యిక తిరిగి వెళ్ళే పోతుంది

ఎవరి పచ్చిక మైదానాలలోకీ అడుగుపెట్టకు
వీచే గాలి నీ శరీర పరిమళాన్ని తాకి
అక్కడే ఆగి పోతుంది, తన ఉనికిని మరచిపోతుంది

వెలిగించిన నిప్పుని తాకకు
నీ చల్లటి ఊపిరి ఊయలలో ఇరుక్కుని అలా ఆరే పోతుంది

కదలనే కదలకు, బుగ్గపై పుట్టుమచ్చను చూపించకు
ఈ భూమి తిరగడం మరచే పోతుంది
సూర్యబింబం సిగ్గుతో ఉదయమే అస్తమిస్తుంది

అసలు నా వంక అలా చూడనే చూడకు
ఈ హృదయం కొట్టుకోవడం ఆగిపోతుంది

ఫరీదా, యిక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

అత్తరుల రహస్యం తెలిసిన ఫిరోజ్ కీ, శ్రీకాంత్ కీ
నిన్ను మించిన వదన జాలరీ హృదయ హంతకీ
మరొకరు లేరని మునుపటి జన్మలోనే తెలిసింది-

యిక ఈ జన్మకీ, ముగ్గురైన ఆ ఇద్దరికీ
కాలం, లోకం తెలిసిన
దిక్కెవరు, దారెవరు?

నీకై 10*

నీ కనులంచున మెరిసే
నిప్పు రవ్వలను
మింగీ
యింకా చల్లగానే
ఉన్నాను

నీ మాటల విషం నిండుగా తాగీ
ఎందుకో
యింకా బ్రతికే ఉన్నాను

హత్తుకునే నీ రెండు చేతులకై
నా జీవిత రహస్యాన్ని
త్రుణప్రాయంగా ధారపోసాను

వీధులలోనన్నునేను
వేలం వేసుకున్నాను

లోకపు బలిశాలలో
నన్ను నేనే అమ్ముకున్నాను

తల్లి వంటి చీకటి ఒడిలో తల దూర్చి
తనని కావలించుకుని
ఆ రాత్రంతా
రోదించాను

నీడలని వెంటాడుతూ
నీడలతో మాట్లాడుతూ
కర్కశ కాలం గడిపాను

యిక ఒక మధుపాత్రలో
నీ మోముని వెలిగించి
హృదయాన్నిఅంటించి

రగిలిపోయాను
విసిగిపోయాను
విరిగిపోయాను
నా నుంచి నేనే పారిపోయాను

ఫరీదా, యిక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

గుండె చెక్కుకు పోయి
అర్ధించే వాడి ఆక్రందన

ఆదిమ లోకంలోని అతనికీ

భవంతులలోకూర్చునే
ఒళ్లంతా ముళ్ళున్న
నీ గులాబీ రూపానికీ

ఏం తెలుస్తుంది?
ఎలా తెలుస్తుంది?

23 April 2012

నీకై 9*

నీవు ఉండే ఇంటి తలుపులు తట్టాను
తీరా చూస్తే అక్కడ తలుపులే లేవు

నీవు ఉండే కిటికీలవైపు చూసాను
తీరా చూస్తే, అక్కడ నిన్నటి జాబిలే కనిపించలేదు

నీవు ఎక్కడైనా తారస పడతావా అని
తిరిగిన వీధులే మళ్ళీ మళ్ళీ తిరిగాను

తీరా చూస్తే అక్కడ
వెళ్ళిపోయిన నీ నీడల శరీరపు వాసన తప్ప నాకేమీ దొరకలేదు

ఎక్కని ఆ గడపా లేదు, దిగని ఈ గుమ్మమూ లేదు
అడగని అతిధీ లేడు బ్రతిమాలుకోని బాటసారీ లేడు
మధుపాత్రలో నిన్ను చూసుకోని మత్తైన రాత్రీ లేదు

ఫరీదా, యిక ఇంతకు మించి
ఏమైనా చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

భగవంతుడు చెప్పిన ఆ యుగాంతం ఎలా ఉంటుందో
నువ్వు కనిపించకపోయిన నాడే తెలిసింది

జనుల మధ్య జాతి లేక, ఈ లోకపు నీతి లేక
గులాబీల నషాతో తిరుగుతున్న ఈ ఫిరోజ్ కి-

నీకై 8*

ఆ మూడు రాత్రులూ
ఈ వీధులలోనే పడి తిరిగాను, గుండెను నమిలి తిన్నవారెవరో తెలుసుకుందామని

రాలే పూలను హత్తుకున్నాను
వీచే గాలిని పట్టుకుని ఏడ్చాను-

కురిసే వర్షాన్నై, వాలే మంచునై
అక్కడా ఇక్కడా రాలాను. అయినా నీ ముఖంపై మబ్బులు తొలగలేదు
ఆ మూడు రాత్రుళ్ళూ చంద్రోదయం కాలేదు

కటిక చీకటిలో
చూపుల చితిలో శరీరాన్ని కాల్చుకున్నాను, గీతాల్ని అమ్ముకున్నాను

పాత్ర మధువుకై
మధుశాలల ద్వారాల వద్ద అపరిచితుల పాదాలు పట్టుకుని
కన్నీళ్ళతో అడుక్కున్నాను స్నేహితులని వొదులుకున్నాను

నువ్వు లేని ఈ లోకపు నరకంలో
నన్ను నేను పారవేసుకున్నాను, పారిపోయాను విరిగిపోయాను-

యిక ఆ మూడు రాత్రుళ్ళూ
జనన దహనమే తవ్వుకుంటూ పోయింది ఈ హృదయాన్ని
యిక ఆ మూడు రాత్రుళ్ళూ
శపిస్తూ కూర్చున్నాను నువ్వు కనిపించిన ఆ మొదటి క్షణాన్ని

ఫరీదా, ఇక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

ఇప్పటికీ, ఈ మెడని పుచ్చుకుని
తటాలున తెంపివేసే, కరుణ లేని

వంకీల వంటి నెలవంకల వంటి
పదునైన వేట కొడవళ్ళ వంటి

నీ లేత తలారుల అరచేతుల కోసమే
ఇంకా నేను ఎదురు చూస్తున్నాను-

19 April 2012

నీకై 7*

నవ్వుతున్న గాడిదలను చూసావా ఎపుడైనా?

రూకల గార పట్టిన పళ్ళతో 
నవ్వుతారు ఈ జనాలు    
నేను నిన్ను తలచుకున్నప్పుడల్లా 

అంటాను నేను వాళ్ళతో 

తెల్లటి కాగితాలైతే రాసుకోవచ్చు, ముఖం చూసుకోవచ్చు 
ప్రేమించలేని, రమించలేని
శరీరాలు లేని ఈ పచ్చటి కాగితాలతో ఏం చేయగలం

విసర్జించాక తుడుచుకోవడం తప్ప? 

అందుకే నవ్వుతారు, ఖ్యాతికై 
దాచుకునే భవంతులకై 
బంగారానికై  వెంపర్లాడే 
ఈ లోకపు మహా పిసినారి గాడిదలు-

నిన్ను మించిన పసిడీ 
నిన్ను మించిన భవంతీ
నిన్ను మించిన ఖ్యాతీ పుణ్యం స్వర్గలోకం ఉంటుందా ఎక్కడైనా?

ఫరీదా ఇక ఇంతకంటే 
మరి ఎక్కువ చెప్పడం 
నిషిద్ధం: ఎందుకంటే 

విత్తనంలో చిక్కుకున్న చిగురాకు
చినుకుకై పడే తపనా పెనగులాటా 

నీకూ నాకూ తప్ప 
మరెవరికి తెలుసు? 

నీకై 6*

రెక్కలు ముడుచుకుని
నిన్ను పొదుగుతాయి నా కళ్ళు

ఇంతకు మునుపు నా శరీరంలో
దాచుకున్న
నీ రూపాన్ని

పలుమార్లు తన్నుకుపోయారు

పవిత్ర నామ జపం చేసే
ఈ పాపపు మనుషులు-

ఫరీదా, ఇంతకు వినా మరి
ఎక్కువ చెప్పడం నిషిద్ధం-
ఎందుకంటే

కడుపు కోల్పోయిన తల్లి కోత
ఆ భగవంతుడికీ నాకూ తప్ప

మరి ఎవరికీ తెలుసు?

18 April 2012

నీకై 5*

సముద్రంలోని ఉప్పు నా కళ్ళలోకి ఎలా వచ్చింది?

ఆ నాగుపాములోని విషం
ఇంతమంది నాలికల పైకి
అంత సులువుగా ఎలా చేరింది?

ఆ తలారి చేతిలోని ఖడ్గం
ఇంతమంది అరచేతుల్లోకి
అంత అందంగా ఎలా ఇమిడిపోయింది?

ఆ స్నేహితుల పరనింద
ఇంతమంది పెదాలపైకి
అంత సరళంగా ఎలా ఒదిగిపోయింది?

రాత్రిలో రహదారిలో, నీ స్మృతితో
తాగి తూలి పడిపోయిన వాడిని

ఫరీదా, ఇక యింతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

కనులలోంచి నిదురను లాక్కువెళ్ళిన దానివి

సమాధానాలు లేని ఈ లోకంలో, ఈ కాలంలో

మరికొంత మధువునో, మృత్యువునో
నీ మొదటి ప్రార్ధనా గీతంతో పంపించు-

17 April 2012

నీకై 4*

నిదురను ఆశించిన కళ్ళకు
కనులు మూయలేని కలలు ఇచ్చావు

మంచినీళ్ళను ఆశించిన అరచేతులకు
యిక ఎన్నటికీ తీరని
దాహాన్ని ఇచ్చావు

విరామాన్ని ఆశించిన పాదాలకు
యిక ఒక చోట నిలువలేని
స్థిమితం లేని ప్రయాణాన్ని ఇచ్చావు

పదాలను ఆశించిన పెదాలకు
అనంతమైన మౌనం ఇచ్చావు
నీడను ఆశించిన శరీరానికి
నిలువ నీడ లేని లోక రీతిని చూపించావు

సముద్రాన్ని ఆశించిన హృదయానికి
ఏడు ఎడారులను ముంగిట పెట్టావు

ఫరీదా, యిక ఇంతకంటె
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

నువ్వెక్కడా అని ఎవరైనా అడిగితే

రాయిగా మారిన ఒక పూవునూ
తాగే మధుపాత్రనూ చూపిస్తాను-

నీకై 3*

అనుకోలేదు ఎన్నడూ
దివారాత్రులు ఇలా మధుశాలలు పట్టి తిరుగుతానని, మత్తిల్లిపోతానని

త్రాగుబోతునని నవ్విపోయేవాళ్ళకు

ఎలా చెప్పను
నీ వదనం ఒక మహిమాన్విత మధువని?
నీ శరీరం
ఒక అమృత వెన్నెల భాండాగారమని?
నీ చూపుల వలలో చిక్కుకున్న వాళ్లు
యిక తిరిగి బయటకి రాలేరని?
మధువు తాగేది నేననీ, ఎక్కే నిషా నీవనీ?

ఫరీదా, యిక ఇంతకంటె
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

నీ నామాన్ని అయిదు సార్లు స్మరించి
ఆ భగవంతుడు ఇచ్చిన మధుపాత్రలో

ఒక గులాబీల తోటను, అదే
నీ ఇంద్రజాలపు మోమును

ఒక చల్లనైన చంద్రకాంతిలో
చూస్తూ కూర్చునే వేళయ్యింది-

నీకై 2*

మధుశాలలో, లోకం చెరశాలలో
అడుగుతారు మతిలేని ఈ జనాలు
నువ్వంటే నాకెందుకు అంత ఇష్టం అని, నువ్వంటే ఎందుకు పడి చస్తానని

చందమామని చూడని వాళ్ళకూ
గులాబీ పూవుని తాకని వాళ్ళకూ
రాత్రిని వీచే చల్లని గాలిని కౌగలించుకొనని వాళ్ళకూ

నీ వదనాన్ని ఎలా చూపించేది

ఎలా చెప్పేది వాళ్లకు
నువ్వే అమృతం, నువ్వే విషం అని
నిన్నుని మించిన భ్రమా మత్తైన కలా మరొకటి లేదనీ
అంతకు మించి నాకు మరేమీ వద్దనీ

ఫరీదా, ఇంతకు మించి
ఏమైనా చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

నిన్ను చూసాకనే కదా
తెలిసింది నాకు
నివ్వెరపోయేటట్టు

ఆ భగవంతుడు
ఈ ప్రపంచాన్ని ఎందుకు, ఎలా సృష్టించాడోనని!

నీకై 1.*

నా హృదయం జ్వలిస్తోంది ఇక్కడ
బహుశా రగిలే ఆ మంటకి కూడా ఇంతగా మండటం తెలియకపోవచ్చు
కురిసే ఆ వర్షానికి ఏం తెలుసు
ఆరిపోయే ఈ దీపపు ఆక్రందనా, ఆ చీకటి నిశ్శబ్ధం?

ఇక నేనంటావా?

నువ్వు పీల్చుకునే గాలిలో
వీచే శ్వాసను నేను

ఫరీదా, ఇక ఇంతకంటే
ఎక్కువ చెప్పడం నిషిద్ధం
ఎందుకంటే

ఆ భగవంతుడికి తెలుసు

తన కంటే ఎక్కువగా
నేను నిన్ను ప్రేమిస్తాననీ
నేను నిన్ను పూజిస్తాననీ-
_____________________
*originally written in Hindi, for - a friend of mine- Firoz, who wanted to gift some verses for his women.

16 April 2012

అతిధులు

చూద్దామని వచ్చిన వారిని
బయటకి తరమలేవు, అలా అని లోపల ఉంచుకోనూ లేవు

అరచేతులను
పుచ్చుకున్న అరచేతులనూ, దయగా తడిమే కనులనూ పదాలనూ
ఏం చేసుకోవాలో అస్సలే తెలియదు

తలకిందులుగా గది
తలకిందులుగా కుర్చీ
తలకిందులుగా కాలం
తలకిందులుగా లోకం

కూర్చోమనలేవు
మంచి నీళ్ళు తాగమనా లేవు
ఎలా ఉన్నావని ఎందుకు వచ్చావని అడగనూ లేవు

అవును, అయినా వాళ్లకి తెలిసే ఉండవచ్చు
అందుకనే వచ్చి ఉండవచ్చు

నువ్వొక సమాధిగా మారావని
ఒక పుష్ప గుచ్చాన్ని నీకు సమర్పించేందుకు తాము వచ్చామని
రెండు నిమిషాల మౌనంతో తిరిగి నిష్క్రమిస్తామనీ
వారికీ నీకూ తెలిసే ఉండవచ్చు

అవును, అయినా
చూద్దామని వచ్చిన వారిని
కౌగాలించుకోనూ లేవు, దాచుకోనూ లేవు ద్వేషించా లేవు-

మూర్ఖుడా! ఇక వెళ్ళు, వెళ్లి
మళ్ళా నీ క్రిష్ణబిలంలో

నెత్తురు నెలవంకలలో ముంచిన నెమలీకలతో
ఒంటరిగా
ఇటువంటి పదాలను రాసుకునే వేళయ్యింది

ఇక నిను కాపాడేదెవ్వరు
ఇక నిను శబ్ధంలో పునీతుడను చేసేదెవ్వరు?

15 April 2012

అలక

1

సున్నా చుట్టుకున్న నీ పెదవులలో
ఒక ఉద్యానవనం విరగబూస్తోంది

2

ముఖం అటు తిప్పుకుని కూర్చున్నావు కానీ
మళ్ళా మనస్సంతా ఇటే

నీ తెల్లటి వీపు మీద
ఆ నునుపైన వెన్నెల

నేను తాకలేని ఒక పుట్టుమచ్చ, నాకు ఒక శిక్ష 



నిన్ను తాకిన వేసవి గాలి
నన్నూ తాకుతుంది

రాత్రికీ, తల్లి వంటి గాలికీ తెలియదు
నువ్వు అలిగావని

అన్నం కలిపిన పాత్రా
కుండలో మంచినీళ్ళు

చిన్నబుచ్చ్చుకున్నాయి
నువ్వు తాకక
ఏమని చెప్పను వాటికి?

4

పక్కపై దిండు కింద
దాచుకున్న కథల పుస్తకం

నువ్వు లేక నువ్వు రాక
తెల్ల కాగితాల
చిత్తు జాబితాల పుస్తకం అయ్యింది-

పుస్తకంలోంచి తప్పించుకుని

చూడు నీ చుట్టూతా
నీకు నచ్చే ఆశ్వాలూ
పులులూ సింహాలూ
ఆకాశంలో విహరించే దేవతలూ

ఎలా రెక్కలతో
ఎగురుతున్నారో



సున్నా చుట్టుకున్న
నీ పెదవులపై ఒక
నెలవంక పూస్తోంది

రా కన్నా
నీ చుట్టూ చేయి వేసుకుని నిదురోతాను

ఒక వాస్తవం

ఉండుండీ ఒక వేసవి గాలి
మధ్యాహ్నం నుంచి తన వెంటే వెనుదిరగకుండా తిరుగుతోంది

తనేమో ఇంటి నుంచి రక్షక భట నిలయానికీ
అక్కడ నుంచి ఎక్కడికీ వెళ్ళలేని చోటుకీ కదులాడుతోంది

సలుపుతోంది లోపల ఒక రాచ పుండు, ప్రేమ రాచ పుండు
హృదయమొక రాచ పుండు

ఉండుండీ
ఉండకుండా, పూర్తిగా వొదలకుండా_

ఎటువంటి దారి ఇది?

పాద రక్షలు లేక పగిలి పిగిలి నెత్తురు కారిన
ఒకనాటి పసిడి వెన్నెల అరి పాదాల కన్నా
తడి చేతులు తాకక పచ్చిక లేక దహించుక పోయి
కన్నీరు ఒలికిన ఒకనాటి పూల శరీరం కన్నా

పిల్లల్ని కని, ఎంతో పాపం చేసుకున్న
ఎటువంటి దిగులు దారి ఇది?
పిల్లల్ని పెంచుకుని ఎంతో భారమైన
ఎటువంటి గర్భ శోకం ఇది?
ఎటువంటి జీవన విలాపం ఇది? అందుకే

తిరుగుతోంది తను, ఇంటి నుంచి
రక్షక భట నిలయానికి
అక్కడ నుంచి ఇక ఎక్కడికీ ఎప్పటికీ వెళ్ళలేని ఒక చోటికీ ఒక అమ్మ

ఎరుపెక్కిన కనులతో
వేలిముద్రలు పడిన కాలిన బుగ్గలతో, నలిగిన చీరతో శరీరంతో
అరవై ఏళ్ల పసి పాపగా మిగిలి
లోక రీతిలో, క్రూరమైన ఆటలో
రూకలు కాలేక ఆభరణాలు కాలేక అమాయకత్వం ఒదులుకోలేక
ఇక్కడే మిగిలిపోయిన ఒక అమ్మ
మనిషొక మంచి నీళ్ళ కుండ అనుకుని ఎడారిగా మారిన ఒక అమ్మ

వేసవి గాలి తనని వొదిలి వెళ్ళింది
మధ్యాహ్నం రాత్రయింది. తిరిగి ఆ రాత్రి దయ లేక
ఒక జాబిలిగా మారి ఆకాశాన్ని దహించివేస్తోంది
అరచేతుల మధ్య తన ముఖం సమాధి అయ్యింది

ఇక తనని కొట్టేందుకు
తిరిగి ఇంటికి ఆ తనయుడు ఎప్పుడు వస్తాడు?

12 April 2012

శాపం

కళ్ళలో
దహనం కావించబడే పూల వనాలతో

పాత్ర నిండా
ముంచుకున్న చీకటితో, స్వవిషంతో

బ్రతకలేక, బ్రతక రాక
చచ్చిపోనూ లేక
ఏం చేయాలో తెలియక

కదిలే నీడల అంచులను
మునివేళ్ళతో తాకుతూ

ఒక్కడివే కూర్చున్నావా నువ్వు
ఎప్పుడైనా, ఏ రాత్రయినా?

ఒక రాత్రి

అద్దంపై మల్లెమొగ్గలు
కూజాలో మంచి నీళ్ళు

కనుల కింద చారలు
అలసిన చేతులు
ఎండిపోయిన పెదాలు

ఎవరో ఇప్పటిదాకా ఉండి
ఇప్పుడే వెళ్ళిపోయిన
ఒక శరీర పరిమళం,
ఒక సుధీర్గ నిశ్శబ్దం-

ఏం చెప్పను ఇంక

హృదయమొక
క్రూర వేటమృగం!

సందేహం

అందరూ నిద్రపోయే వేళ
మేల్కొని ఉండే వారెవరు?

ఇక వాళ్ళని మనం
ఏమని పిలుద్దాం?

హంతకురాలు

నిన్ను తాకే

చిట్లిపోయింది  హృదయం-

మల్లెపూలను తెంచుకుని
మాలగా మార్చుకుని
కురులలో ధరించే విద్యను 

ఎవరు నేర్పారు నీకు?  

11 April 2012

తప్పేంటి?

లోకమంతా తూగుతోంది

పగలు రాత్రితో
పూవు గాలితో

నేల నింగితో
విశ్వ వేణు గానంతో

వాన మట్టితో

చందమామ
మబ్బులతో

వెలుతురు
నీడలతో
సరస్సులు
చెట్లలలతో 

స్త్రీలు అద్దాలతో
పిల్లలు
ప్రతిబింబాలతో

చేతులు
చేతులతో
పదాలు
పదాలతో

నువ్వు నాతో
ఈ లోకం
కాలంతో

సర్వం తూగుతుంది

ఒకదానిని
మరొకటి చుట్టుకుని
దగ్గరగా హత్తుకుని=

మరి నేను

మధువుతో
తూగితే
నా మానాన
నేనుంటే

తప్పేంటి?

08 April 2012

ఇవాళ

అరచేతులలో
విచ్చుకున్న రోజా పూవు కాదు ఈ దినం

నీడలలోనే, విచ్చుకున్న
మెత్తటి పూల నీడలలోనే, నీడల నీలాల కనులలోనే

దేవతా రూపం ఒకటి
మృగ మోహంలా మారింది
ఒక దినం రాలిపోయింది.

ఇక
ఒక విత్తనంలోకి ఇంకిన
నిన్నటి చినుకులోని నిశ్శబ్ధాన్ని వినేదెవరు?
రాత్రి వీచిన గాలికి వొణికి
ఉదయమంతా రెపరెపలాడిన చిగురాకును

మృదువుగా కాంచేదెవరు? ప్రభూ     

ఈ  అరచేతులలోంచి
రేపటి సమాధులకై జాలువారిన
ఆ దినపు రోజా పూలను

చూసావా నువ్వు ఇంతకూ?   

రేపు

రాత్రి గర్భంలో
శిశువుని, వీచే గాలిలో పూవుని
సుడులు చుట్టుకునే
సెలయేటి చల్లటి పెదాలని

రేపు
తమ అరచేతులలో
పొదివి
పుచ్చుకునేదెవరు?

(ఇంతకూ నువ్వు
నిదురించావా

చీకటిని బుజ్జగించి
జోలపాటలు పాడి?)

07 April 2012

తిరిగి వస్తాను

చేప పిల్లనై చిక్కుకున్నాను
రాత్రి వలలో
నీ జాలరి హస్తాలలో, నయనాలలో_

ఊపిరి ఆడటం లేదు

కొద్దిగా వొదులు, తిరిగి వస్తాను
మళ్ళా నీ పంచకే నీ వంచనకే

06 April 2012

నాకు ఎందుకు

గుంపుగా నిలబడి అలా అప్పుడప్పుడూ కమ్మగా ఊగుతాయి
కలలో వీచే యూకలిప్టస్ చెట్లు

అదే ప్రదేశం, అదే సరస్సు
ఎక్కడిదో సూర్యరశ్మి, రోజాపూల కాంతితో కళ్ళలో మత్తుగా పరుచుకుంటుంది

అదే దివ్య లోకం, అదే దివ్య కాలం
పచ్చిక పరిమళంతో చినుకులు ఆకుల అంచున చిందేసే మైకం, మోహం తాపం-

యిక్కడ నుంచి
ఎలా వెళ్లాను అక్కడికి?
అక్కడ నుంచి
ఎలా వచ్చాను ఇక్కడికి?

బహుశా నేనెపుడూ జన్మించలేదు
బహుశా నేనెపుడూ మరణించలేదు

గుంపుగా కమ్మగా హాయిగా ఊగే
యూకలిప్టస్ చెట్ల చిరు కదలికలలో

దిగంతాల నుంచి తెరలుగా కొట్టుకు వచ్చే సాయంత్రపు గాలిలో

ఊరకనే పచార్లు కొడుతున్నాను
మట్టి పెదాల నుంచి నింగి కనుల దాకా
ఒక సీతాకోకచిలుకనై ఒక మిడతనై-

నన్ను నిలిపే, నన్ను ఉంచే
ఆ శ్వాస ఎవరిదో

యిక ఎప్పటికైనా
నాకు ఎందుకు?

సరే సరే

సరే సరే
నాలుగు చినుకులు రాలి గాలి ఆగి
పిల్లల ముఖాలు ముకుళితమయ్యాయి కానీ నాకే

హృదయమంతా భరించలేనంత ఉక్కబోత-

సరే సరే, చీకటి ఆరంభం అయ్యే ఈ చిత్రమైన వేళ
పలికే రెండు చేతులకై పలుకరించే రెండు కనులకై

ఎక్కడకని పారిపోను?

కొంచెం

ముఖం లేని
ఈ ముఖ పుస్తకపు ముఖం ఎలా ఉంటుంది

వాసన లేకుండా
నెత్తురు లేకుండా
తాకేందుకు శరీరమైనా కాకుండా, రాకుండా

తెరలలో తెరలై
వలయంలో వలయమై వ్యసనమై? అమ్మాయీ

కొంచెం బయటకు వెళ్లి
పచ్చి మనిషిని, మట్టి మనిషిని కాస్త ముట్టుకుని రా

ఆనక మనం
జీవితం గురించి మాట్లాడుకుందాం

ఎలా?

రాత్రి రాయిలోంచి
నీటి తడి, గాలితో కనుమరుగయ్యింది

ఇక ఈ వేళ
ఇకీ రాత్రిలో
నిదురించడం ఎలా?

నవ్వు

చీకట్లో
ఎవరో సన్నగా నవ్విన రహస్యమైన నవ్వు_

=ఇక నువ్వు
బ్రతికి ఉన్నావో లేదో
ఎవరికీ తెలియదు=

స్మశానాలు

మట్టి గంధం పూసుకున్న
మెత్తటి గాలి కావాలి

మట్టి కుండలోని
బావిలోని చల్లటి మంచి నీళ్ళు కావాలి

కూర్చునేందుకు
హిమవనాల వేపాకుల నీడ కావాలి

ఇంకొంత కాలం
కొనసాగేందుకు ఇక్కడో మిత్రుడుండాలి

ఇంటికొస్తే

ఇంత తేలికపడేందుకు
కొంత బ్రతికి ఉండేందుకు

ఒక నవ్వు ముఖం కావాలి
ఒక మాట కావాలి_

అటువంటి
ఇంద్రజాల ప్రదేశమేదైనా తెలుసా నీకు

స్మశానాలు లేని ఇళ్ళూ
సమాదులుగా మారని
మహా మర నగరాలూ?

05 April 2012

ఆకాలం

ఒక దీపాన్ని ఎదురుగా పెట్టుకుని
కూర్చున్నాను ద్వీపంలా_

నీ ముఖ కాంతిలో
నా అరచేతులని వెచ్చబరుచుకుందామని
నీ చేతుల నీడలలో
సేదదీరుదామనీ అనుకున్నాను

ఒక దీపంలా
నిన్ను ఎదురుగా ఉంచుకుని

నన్ను నేను
శుభ్రంగా సర్ధుకుందామని
అనుకుంటూనే ఉన్నాను
శిల వలె ఇంకా ఇక్కడ కూర్చునే ఉన్నాను

నా నుదిటిన లిఖించిన
నీ అరచేతులు ఎక్కడ?

శిల్ప నయనాలతో

శిల్ప నయనాలతో
కటిన వదనంతో, పాషాణ హృదయంతో నువ్వు

అలా ఎదురొస్తే
ఇంటికి వచ్చిన అతిధి తిరిగి ఆ చీకటి వనాలలోకి

శరీరాన్ని బిక్షపాత్రగా మార్చుకుని
ఎక్కడికని వెళ్ళగలడు?  

చీకటి

వెన్నెల్లో
చీకటి చిగురాకు వొణుకుతోంది

ఇకలా
ఎదురుచూస్తూ ఉండు

హృదయం రాలి

రాతి రాత్రుళ్ళలో
కొట్టుకుపోయే

ఆ రాక్షస  సమయం
ఆసన్నమయ్యింది_

03 April 2012

తెలీదు నీకూ?

పలకలు పలకలుగా పగిలిన
కాంతి అద్దం _

ఆగిన పెదాల మధ్య ఒక ఖడ్గం
నాలికపై ఒక విషం
హృదయంలో ఒక విధి విలాపం:

ఆహ్ విచారించకు
రూకలని నమ్ముకున్న వాడెవడూ
సుఖపడలేదు ఇక్కడ

తెలీదు నీకూ
నిన్ను తుంపి

శిగలో తురుముకుని
అలా నడచి
వెళ్ళిపోయిన వారెవరో?   

a bit of chilled beer, a bit of warm smoke

సైనికుల వలె
కవాతు చేసాం పగలంతా

వేసవిలో, గాడ్పులలో
దిన దిన జీవన సమరంలో

హృదయాలని చేతబట్టి
కళ్ళను అదిమిపట్టి, సైనికుల వలె

పగలంతా
ధూళితో ఎండిన పెదిమలతో

టకా టక్ ధనా ధన్
టకా టక్ ధనా ధన్

పగిలిన పాదాలతో
కమిలిన చేతులతో

అరచేతులను రుద్దుకుంటూ
ఎవరినో తలచుకుంటూ
నెత్తిన కట్టిన తెల్ల రుమాలుతో
దారిన తాగిన నిమ్మ రసంతో

టకా టక్ ధనా ధన్
టకా టక్ ధనా ధన్

కదిలితిమి ముందుకు

రేగిన శిరోజాలతో
కమ్మిన యంత్ర తంత్రములతో
వాహనాలు కక్కిన పొగలతో

లోహ దారులు వాంతి చేసుకున్న
మనవంటి మనుషులతో
మనం కాని జంతువులతో
కవాతు చేసాం పగలంతా
నుజ్జు నుజ్జు అయ్యాం దినమంతా

నీడ లేక, నిలువ జాగ లేక
ఎక్కడా ఆగక, ఆగలేక
అమ్ముకోనిదే బ్రతుకలేక

పరిగెత్తీ పరుగెత్తీ
ఇతరులని వెంటాడీ వేటాడీ
కెఫేలలో టీ లతో
కడుపులని నింపుకుని
మనల్ని మనం
కొంత చంపుకుని చలించీ

టకా టక్ ధనా ధన్
టకా టక్ ధనా ధన్

పగలంతా కదం తొక్కాం
పగలంతా రణమయ్యాం

రణగొణ ధ్వనులమయ్యాం
రక్త పిపాసుల మయ్యాం-

చూడూ, పగలొక రాత్రయింది
ఇక యుద్ధం ఆపే వేళయ్యింది

నాటకపు దుస్తుల్ని విప్పి
దాచుకున్న హృదయాల్ని

తిరిగి గుండెల్లో
అమర్చుకుని

వొలికిపోయిన స్త్రీలను
జాబిలిలో దర్శించే
కాలంతమయ్యింది

ఒక మెత్తని చేతిని
శిశువై అల్లుకునే
కాంతి సమయమయ్యింది
కరుణా పదమయ్యింది

ఒరేయ్ నాయనా
ఇక పద పద దా

నిండా ఎండిన కుండలైన
ఈ విషపూరిత శరీరాల్లోకి

ఒక అమృత భాండాగారాన్ని
వొంపుకునే క్షణ మయ్యింది

దా దా, మనకే ఇంత కొంత
a bit of chilled beer
a bit of warm smoke-

ఇక ఆ తరువాత
మనం చచ్చినా
చచ్చామన్న చింత లేదు

మనం బ్రతకలేదనే
బ్రతకరాదనే దిగుల్లేదు-

02 April 2012

ఒక క్షణం

రాత్రయితే
ఇంటికొచ్చే దాకా ఎదురుచూపులు

పిల్లలతో ఆడుకుంటూ తను
బయటపడదు కానీ మనస్సంతా తలుపుల వద్దే

పిల్లల ఆటలకీ
పెద్దల ఆటలకీ ఎన్నడో కానీ పొంతన కుదరదు

అయిపోయాం పెద్దరికంతో పేదవాళ్ళం ఎపుడో
ఇక చిన్నారుల తోటలో అడుగుపెట్టడం ఎలా?

గిన్నెలతో గంటెలతో
కాగితాలతో కలాలతో రంగులతో గోడలతో

ఇల్లంతా ఖణేల్ ఖణేల్ మని తిరుగుతో
వాళ్ళ నాయనమ్మని తమతో తిప్పుకుంటో ఆ ఇద్దరే

వాళ్ళతో పరిగెత్తలేక, వెంటపడి అన్నం పెట్టలేక
హడావిడిపడుతోంది వాళ్ళ అమ్మ

ఆకాశాన మబ్బులు జారుకుంటున్నాయి
దాగుడు మూతల నుంచి బయటపడిన జాబిలి ఆగింది
విరామంగా ఒక చోట

ఎక్కడిదో చల్లని గాలి
పెంచుకున్న మల్లెమొక్క నుంచి తెంపుకున్న మొగ్గలై
మట్టి వాసనతో నీటి తాకిడితో తాకుతోంది గదులని -

గెంతుతూ ఎగురుతూ
తళ తళ మని ఇకిలింతలతో మోగుతో ఆడుకుంటూనే
అడుగుతారు పిల్లలు
'అమ్మా నువ్వు తినమ్మా. తిన్నావా లేదా?'

చూడు సరిగ్గా ఆ మాటే, సరిగ్గా ఆ చిన్న మాటే
సరిగ్గా సరైన సమయంలోనే

ఎన్నడైనా అడిగానా నేను నా తల్లిని ప్రేమగా?

ఫిరోజ్

రాత్రే చూసాను నిన్ను

మరచిపోయిన ఒక జాబిలి తిరిగి వెలిగి
భూమిని అబ్బురపరచినట్టు, ఫిరోజ్

రాత్రే తిరిగి కనుగొన్నాను నిన్ను-

నిజమే, నువ్వు కొద్దిగా అలసి ఉన్నావు
నిజమే, నువ్వు ఈ లోకం పట్ల
కొద్దిగా విసిగి చెంది ఉన్నావు-

నీకేమో చిన్న కోరిక
ఈ జీవితం ఒక విస్మృతిగా మారితే బావుండునని
మరణం ఒక మైకం వలె

ఒక మోహం వలె, మెత్తని పెదిమలతో
తనువుని అల్లుకుంటే బావుండునని
మరి కొంత కాలం ఉండేందుకు తనవే
ఒక లక్ష నీటి బాహువులు చాలునని

ఫిరోజ్, నిన్న రాత్రే చూసాను నిన్ను
మరచిపోయిన మధుపాత్ర ఏదో
తిరిగి హృదయాన్ని వెలిగించినట్టు-

నిన్న రాత్రంతానే ఉన్నాను నే నీతో

వర్షాన్ని పీల్చుకుని కమ్మగా తిరిగే
మట్టి వాసనతో ఎగిరే

ఈ ధరిత్రి రెక్కలపై పూలపై
చీకటి పురుగుల శబ్ధాలపై

ఒక స్వర్గకాలంలో, సకాలంలో
నీతోనే, నాతోనే ఉన్నాను తొలిసారిగా-

ఇంతకూ ఆ రాత్రి, ఫిరోజ్

అంత తొందరగా
ఎలా తెల్లవారింది

నీ మాటలతో నా విలాపంతో
ఇద్దరి కన్నీరుల పన్నీరుతో?

ఒక రోజు

ఈ వేళ పచ్చని మొక్కకు
తనువెల్లా రాతి పూవులు

కమిలిన కనులు ఆకులు

ఇక
చినుకులు లేని వానలో
కలలు కరిగే శిలల గాలిలో

తిరిగి తిరిగి రాని
అతడు ఎక్కడికి

వెళ్ళగలడు?

01 April 2012

ఇవే ఇవే

మౌనం
నీ యుద్ధ తంత్రం

నల్లటి అరచేతులూ
నల్లటి నయనాలూ

నల్లటి పెదాలూ
నల్లటి పాదాలూ

అవే అవే, నువ్వు చెప్పలేనివే
మిగులుతాయి
ఇక ఈ పూటకి

ఈ తోటలో ఈ బాటలో
నన్ను వేటాడే ఆటలో

ముడుచుకుపోయిన
పొద్దుతిరుగుడు
పూవువి నీవు-

మౌనం
నీ సాధనా మంత్రం
నీ నైపుణ్యం
అనితర సాధ్యం

ఇక ఈ నీ
యుద్ధ తంత్రంలో

నిన్ను
గెలవగలిగేదెవరు?