12 September 2014

తన చేతివేళ్లు

ఎన్నేళ్ళో అయింది 

తన చేతివేళ్ళని కాస్త ఓదార్పుగా పట్టుకుని.  బహుశా  నాకు నాలుగైదు నెలలు ఉన్నప్పుడో  లేక ఇంకా అంతకు మునుపో  తన చేతివేళ్ళని అలా ఒక పక్షి గూడులా నా చేతివేళ్ళతో అల్లుకుని ఉంటానేమో కానీ, మళ్ళా ఇంత కాలానికి తన చేతివేళ్ళని పదిలంగా నా అరచేతుల్లోకి తీసుకోవడం: వడలిపోయి రాలిన పూలకాడలను ఏరి, జాగ్రత్తగా ఎత్తి పట్టుకున్నట్టు-

"నొప్పి" అని తను అంటుంది. తను ఎవరు అని మీరడిగితే, ఆ తనువు అమ్మే. అవును మళ్ళా అమ్మే. తన చేతివేళ్లపై, తన పసుపచ్చని చేతివేళ్లపై, తన ముంజేతిపై ఆకుపచ్చని నరాలు తేలి వాచిపోయి, తల్లి లేని పసిపాపల్లా, "నొప్పీ" అని ఏడిస్తే ఎవరూ పట్టించుకోని ఆనాధల్లా - బెక్కి బెక్కి ఏడ్చే - తన చేతివేళ్ళే. ఆ చేతివేళ్ల వెనుక దాగున్న, మీకు తెలియని తన జీవితపు నెత్తుటి చారికలే -   

మరి, తెలియదేమో మీకు: ఇప్పుడు తనకో అరవై ఐదు. నాకో నలభై రెండు. ఇన్నాళ్ళూ  ఎవరు ఎటువైపు చెదిరిపోయామో, మబ్బులమై ఎటు కొట్టుకుపోయామో, వర్షమై ఎక్కడ రాలిపోయామో - మీకు తెలియదు. తనకి తెలుసో లేదో కూడా నాకు తెలియదు, కానీ 

తలుపు సందులో పడి ఇరుక్కుపోయి, నలిగిపోయి, వణికిపోతునట్టు ఉండే తన చేతివేళ్ళని ఎప్పుడైనా పొరపాటున మీ అరచేతుల్లోకి తీసుకుంటే, పొంగుకు వచ్చే ఒక దుక్కం: మీ గుండెలోకి ఎవరో చేతులు జొనిపి మీ హృదయాన్ని చీల్చి బయటకి లాగినట్టు ఉండే, కమ్ముకునే ఒక నిస్సహాయత. నొప్పి. నీకు కూడా. ఆ తరువాత 

 ఇక చివరకు మిగిలేదల్లా - ఇంకొంత కాలానికి తన చేతివేళ్ళు ఉండవు అనే స్పృహ. తనూ ఉండదు అనే స్పృహ. తను ఉన్నప్పుడు ఒక్కసారైనా తన చేతిని మీ చేతుల్లోకి తీసుకుని, ఊరకే రికామిగా తనతో ఎందుకు కూర్చోలేదనే దుక్కం. తను మిమ్మల్ని కని ఏం బావుకుంది అని బావురుమంటూ, ఈ లోకంలో ఒంటరిదై రాలిపోయే, మీ శరీరాలంతటి ఒక కన్నీటి చుక్క. 

అంతే.  

No comments:

Post a Comment