03 September 2014

తను

అప్పుడు, తన ఇంటికి వెళ్లాను.

ఎవరో కొమ్మనుంచి తెంపి పడవేస్తే,  నేలపై రాలి
ఇక పూర్తిగా ఎండి, గాలికీ ధూళికీ కొట్టుకుపోయే ఆకునై తన గుమ్మం ముందు
వణుకుతూ ఆగాను:

అప్పటికి తనకి పెళ్లై పోయింది.

చాలా చిక్కిపోయి ఉంది తను
చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక రోగిలాగా ఉండింది తను-
విదేశాల నుండి తనని చూసేందుకు వచ్చిన
తనని వొదిలి వేసిన కొడుకుని చూసి

అప్పటికీ ఒక నవ్వుతో, అతి కష్టం మీద
మంచంపై నుంచి లేచేందుకు ప్రయత్నించే, ఆస్థిపంజరం వలే మారిన
ఒక తల్లిలానూ ఉండింది తను. నాకు అలానే ఎదురుపడింది తను-

మరి అప్పటికి ఇంకా, నాకు పెళ్లి కాలేదు.

అప్పుడు
తనని అడగాలని అనుకున్నాను
ఎలా ఉన్నావనీ, ఇదంతా ఏమిటనీ, ఎందుకు ఇలా జరిగిందనీ, ఇలా
ఎందుకు మిగిలావనీ, ఇంకా ఏమేమో
చాలానే - ఆడగాలానే అనుకున్నాను

గతించిన వాటిని ఏమీ మార్చలేని
ఇలాంటివే, ఎందుకు పనికిరాని ప్రశ్నలనే ఎన్నో అడగాలనే అనుకున్నాను
మాటల్నీ కోల్పోయి ఒక మూగవాడిలా, ఇలాగే ఏవో
ఏవేవో ఎన్నెన్నో సంజ్ఞలతో చేయాలనే అనుకున్నాను

అప్పుడు
కళ్ళ వెంబడ నీళ్ళు పెట్టుకుంది తను.
ఇంకా అప్పటికీ నేను, ఒక గూడూ గుమ్మం లేకుండా మునుపటిలానే
మనుషుల్నో మట్టో కొట్టుకుని రోడ్లపై తిరుగుతున్నానీ గ్రహించింది తను.
ఏదో చెప్పాలని కూడా అనుకుంది తను
నా చేతిని ఒకసారి

గట్టిగా పట్టుకుందామని
తన చేతిని తపనగా చాచి, మళ్ళా అంతలోనే ఆగిపోయింది తను. కళ్ళు తుడుచుకుంది తను-
ఏవో పేర్లు పిలిచి, గదిలోకి పరిగెత్తుకు వచ్చిన
ఇద్దరు పిల్లలని చూయించింది తను. ఆపై

ఎందుకో తల వంచుకుంది తను. తనలో
తాను ఏదో గొణుక్కుంది తను. ఆకాశం మసకేసి, గాలి రేగి - మబ్బులేవో చుట్టుకుని
నేలపై నల్లని నీడలు వ్యాపించి, ఘోష పెడుతూ ఉంటే
లేచి, వణికే చేతులతో ఒక దీపం వెలిగించింది తను -

అప్పుడు, అంతసేపూ, ఆ తరువాతా
చినుకులు ఇనుప తాళ్ళై, ఇంటిని బిగించి తిరిగి వదులు చేసేలోపు, నేను
ఆ ఇద్దరు పిల్లలనీ ఒళ్లో కూర్చో పెట్టుకుని
ఏవో అడుగుతున్నంత సేపూ

అన్నం వండింది తను. హడావిడిగా ఏదో కూర చేసింది తను.
ఒక ప్లేట్లో ఇంత వడ్డించుకుని వచ్చి, తినమని, నా ఎదురుగా, మసిపట్టి
వెలుగుతున్న కిరసనాయిలు బుడ్డీ వలే కూర్చుంది తను -
నా ముఖంలో ముఖం పెట్టి కూర్చుని
"చెప్పు: ఎన్నాళ్ళి లా" అని అడిగింది, తను.

అప్పుడు
తనని చూద్దామని తనది కాని ఇంటికి వెళ్ళినప్పుడు
తను పెట్టిన అన్నం తింటున్నప్పుడు, నా గొంతుకేదో అడ్డం పడింది-
ఇక ఇప్పుడు

ఈవేళ
అన్నం తింటూ పొలమారితే
తనే గొంతుకు అడ్డం పడి, తను లేని ఆ అక్షరాలే ఇలా ఇక్కడ
ఇంకా ఇప్పటికీ గుండెకు అడ్డం పడి
ఇలా ఎక్కిళ్ళు పెట్టుకునే
తనో, నేనో లేక ఇంకా మరెవరో -

అంతే. ఇంకేమీ లేదు.

No comments:

Post a Comment