13 April 2013

నాన్నా నువ్వొస్తావా?

ఇంటికి వస్తూ ఉంటె, ఎదుర్రాయి మోదుకుని
కాలి గోరు చీలిపోయింది - పాపం పిల్లవాడు
కళ్ళంతా నీళ్ళు, పెదాలపై వణుకు. చేతితో 

కాలి బొటన వేలు పట్టుకుని, తల ఎత్తి చూస్తే 
కనుచూపు మేరా ఎర్రటి ఎండా, నిర్దయగా నడచిపోయే మనుషులూ
నీళ్ళు లేక, గోరు లేని, మాంసపు ముద్ధలా మారిన కరకు కాలమూ-

ఎత్తుకోలేదు ఎవ్వరూ, అడగలేదు ఎవ్వరూ 
వెక్కిళ్ళతో, మట్టి కలిసిపోయిన రక్తపు వేళ్ళతో, ఏడ్చుకుంటూ కుంటుకుంటూ
ఆ బాలుడొక్కడే రహదారంతా, తల్లినీడ లేని

లోకాలలో, అప్పుడు అక్కడ స్పృహ తప్పే 
క్షణాలలో, బాహువులలో తురుముకుని 
తనకి అనంతమైన ధైర్యం ఇచ్చే మట్టివంటి నాన్న వెన్నెల చేతులకై చల్లటి చినుకులకై- 

ఇక ఇన్నేళ్ళ తరువాతా ఇంత 
ఎదిగీ ఇలా అడుగుతున్నాడు ఆ బాలుడు బేలస్వరంతో, తండ్రి లేని ఖాళీ అరచేతులలోకి 
తన ముఖాన్ని కుక్కుకుంటూ:

"నాన్నా, ఈ లోకమొక ఎదుర్రాయి
మోడుకునీ మోదుకునీ, ఈ హృదయం చిట్లి చితికి నల్లటి నెత్తురు పూవయ్యింది. రాలి 
పోయే వేళయ్యింది.మళ్ళా నువ్వు 

ఎప్పుడు వస్తావు నాన్నా నన్ను 
హత్తుకునేందుకూ, మందు రాసి 
కట్టు కట్టి, అన్నం పెట్టి నీళ్ళు తాపి జ్వర తీవ్రతతో మూలిగే నన్ను పడుకోపెట్టేందుకూ?" 
అని.

ఇక ఆ రాత్రంతా వర్షం పడగా ఆ 
గదిలో ఆ యాభై ఏళ్ళ పిల్లవాడు
దిండుని గాట్టిగా కౌగలించుకుని 

ఉరుములకీ మెరుపులకీ ఉలిక్కి పడుతూ, కలవరింతలతో ముడుచుకుపోయాడు, ఒక 
మృత్యు భీతితో, ఒక తండ్రి జ్ఞాపకంతో
ఎన్నటికీ తను కాలేని తండ్రితనంతో-

చూసుకున్నావా నువ్వు, మోదుకుని 
రాలి నెత్తురోడిన, నువ్వు మరచిన నీకు 
అన్నీ చేసీ చేసీ నిను కాపాడీ కాపాడీ తన 
నెత్తురంతా ఇంకి రాలిపోయిన, ఎక్కడా మిగలక ఎవరికీ ఏమీ కాక వెళ్ళిపోయిన నీ చిన్నారి నాన్ననీ?

1 comment: