25 April 2014

నీ ముఖం

నా అరచేతుల్లో నీ ముఖం: ఇక నా చుట్టూ అప్పుడు

వీచే గాలీ, రాలే ఆకులూ, నీటి వంటి చల్లటి చీకటీ
గూటిలో ముడుచుకుంటున్న
పిచ్చుక పిల్లల రెక్కల సవ్వడీ-

నా అరచేతుల్లో నీ ముఖం: ఇక నా చుట్టూ అప్పుడు

పూవులు, పేరు తెలియని పూవులేవో విచ్చుకుని, నెమ్మదిగా
చీకటినీ చెట్లనీ గాలినీ గూళ్ళనీ
సువాసనతో అల్లుకునే శాంతి-

ఇక, అప్పుడు అక్కడ, నా చేతివేళ్ళని నీ చేతివేళ్ళు తాకినప్పుడు

తల్లి వొడిలో తల దాచుకున్న భద్రతా, తన బొజ్జ చుట్టూ
చేతులు వేసి హత్తుకున్న జ్ఞాపకం.
కొంత ధైర్యం, కొంత ఇష్టం. ఎవరో
జుత్తుని ప్రేమగా చెరిపిన అలజడీ-

నా అరచేతుల్లో, ఈ చీకట్లలో వీచే గాలిలో రాలే ఆకులలో
మట్టిపై చినుకు చిట్లే వాసనలో నీ ముఖం.
ఏంటంటే, ఏమీ లేదు. మరేం పర్వాలేదు-

ఇక ఈ పూటకి,ఇక ఈ రాత్రికి
చినుకుతో ఒక దీపాన్ని వెలిగించుకుని
మరొక రోజు బ్రతుకుతాను నేను- 

22 April 2014

వాళ్ళిద్దరూ

ఆరిన చితిలోంచి గాలికి ఎగిసిపడే చితాభస్మం వంటి చీకటి -

"ఎలా ఉంటావు నువ్వు ఇలా?" అని తను అడుగుతుంది.

"సాయంత్రానికి పూవులూ వడలిపోతాయి - పిల్లలూ
వడలిపోతారు. పగిలిన పాదాలను వొడిలో పెట్టుకుని
అరచేతులతో నిమురుకుంటూ, స్మృతలలో కోల్పోయే అమ్మలూ అలసటతో సోలిపోతారు-

ఏం చెప్పను? ఇది, ప్రతి మనిషీ ఒక ఎండాకాలమై, దాహార్తియై

మట్టికుండలో చల్లబడిన నీళ్ల వంటి, నీటి స్పర్శ వంటి
మరో మనిషికై తిరుగాడే లోకం. ఎవరూ దొరకని కాలం
మరి ఏం చేయను నేను?" అని అతను అడుగుతాడు -

ఆప్పుడు, అక్కడ - ఆ చీకట్లో, నిశ్చలమైన ఆకులపై కొంత కాంతి. ఎక్కడో మెరిసే నక్షత్రాలు.
ఎవరో ఎండి, పగిలిపోయిన మట్టిపై నీళ్ళు చల్లే
సవ్వడీ. లోపల అన్నం ఉడుకుతున్న వాసనా-

మరొక రోజు. మరొక రాత్రి. అప్పుడు అక్కడ తను

అతని భుజంపై తల వాల్చినప్పుడు, ఎక్కడో మల్లెపూలు విచ్చుకుంటున్న నిశ్శబ్ధం.
తనకి అతను ఎన్నడూ కొనివ్వని మల్లెపూలు
విచ్చుకుని, అతి పల్చగా వీచిన గాలికి, తమ
తెలుపుదనాన్నీ సువాసననీ వెదజల్లే నిశ్శబ్ధం-

ఇక ఆ తర్వాతనా? ఏమీ లేదు. మీకు చెప్పడానికీ కూడా నిజంగా ఏమీ లేదు.

ఊరకే అలా
మరొక రోజు, బ్రతుకుతాను నేను
వాళ్ళిద్దరిలో-

21 April 2014

silly, but still...

నిన్నొకసారి తాకాలని ఉంది - కానీ నువ్వెవరో నాకు తెలియదు.

ఎండిన ఊదా సాయంత్రాల చుట్టూ చుట్టిన
ఒక తడి గుడ్డగా నిన్ను ఊహిస్తాను-

రహదారుల పక్కగా ఉంచిన ఒక కుండ ఈ శరీరం అని
నీకు ఎలాగూ తెలుసు. ముంచుకునీ
ముంచుకునీ తాగి వెళ్ళిపోయేవాళ్లకు

వాళ్ళ గొంతులను చల్లబరచేదీ, వాళ్ళ
శ్వాసలను క్షణకాలం ఓ చల్లటి గాలిగా
మార్చేదీ, నువ్వేనని తెలియదు. మరి
సాయంత్రం తిరిగి వచ్చిన పక్షులు రెక్కలు ఆర్పుకుంటూ, విదుల్చుకుంటూ, మాన్పుకుంటూ

- ఇక్కడ -

ఒరిగిన గడ్డీ, వడలిన పాదాలూ నలిగి
ఉండ చుట్టబడిన కాగితాలైన కనులూ
శిలలైన మనుషులూ, మనుషులైన శిలలూ, ఎదురుచూసే స్త్రీలూ, అనాధ గృహాలూ, ఇళ్ళూ

- ఇక్కడ-

ఒకరిని మరొకరు తాకలేని
మహా రాక్షస సమయ రాహిత్యమూ, మాట లేని మహా నిర్మానుష్య మౌనమూ, అంతులేని
ప్రసారాలలో కూరుకుపోయి

పునరుత్పత్తి సాధనాలుగా మాత్రమే మిగిలిన
నువ్వూ నేనూ అయిన
డైలీ సీరియలైజ్డ్ కథలూ

 - ఇక్కడ-

ఇక్కడ

O One
O blue blue One
O blue blue One
Of the None

నిన్నొకసారి తాకాలని ఉంది. నీ చేత ఒకసారి తాకబడాలనీ ఉంది

- ఇక్కడ-

మరి ఈ లోపల ఎవరైనా నన్ను, ఇంత తవ్వి
అందులో నిన్ను నాటి పోతే
ఎంత బావుండు - (!)

11 April 2014

చినుకులు లేని రాత్రిలో

1
ఏకాకిగా వెలిగే ఒక దీపం -

గాలికి తల్లడిల్లుతూ కూడా
నింగికి ఎగబాకుదామనుకునే
ఒక నిప్పు సెగ -

నిప్పుకీ, నీరు ఒక ఉపశమనం
అని తెలియక

ఇంకా రాని
మబ్బులు-
2
నీడలు. నీడల్లోంచి నీడల్లోకి
తేలిపోయే కనులు-

అతను తన వైపు చూసినప్పుడు
అక్కడొక
బావురుమనే ఆకాశం-

ఎండకి వడలిపోయి
నిస్త్రాణగా తలలు వాల్చిన
పూవులు

ఆ కనుపాపలు-
3
జల్లిన గింజల చుట్టూ వాలిన
పావురాళ్ళు
దిగ్గున

నింగికి ఎగురుతాయి-

ఏమీ లేక, ఎవరూ దొరకక

చేతులు రెండూ
రెండు రెక్కలైతే
నింగికి ఎగురుదామనుకునే
ఒక మనిషి -

అతనో, తనో
నువ్వో, మరెవరో-
4
కుండలో
కుదుటపడ్డ నీళ్ళల్లో, మళ్ళా
ఒక చిన్న కదలిక -

పెదాలపై
నెలవంక వంటి నీటి ధార
ముఖంపై
లేత వేళ్ళేవో లతల వలే అల్లుకున్నట్టు -
5
ఉగ్గబట్టుకున్న
మబ్బులూ, గాలీ, ఆకులూ, పిల్లలూ
అన్నీ, అందరూ

బిగించి పట్టుకున్న
నీ గుప్పిట్లలోనే -
6
గాలికి తల్లడిల్లుతూ కూడా, నింగిలోకి
తపనగా ఎగబాకే
ఒక నిప్పు సెగపై

రాలిన ఒక చినుకు. సోకిన
ఒక అశ్రు శ్వాస
ఒక పదం-
7
రా.

ఉండు.
నేను మళ్ళా నిన్ను రాయగలను


చినుకులు లేని రాత్రిలో
రాతి ఛాతిలో
నీలో
నాలో

నిన్నూ
నన్నూ-

Amen.

07 April 2014

ఒక పిచ్చుక కథ

(this ain't no poem. what ever it is, it is mine-)

ఎండ పలకల రాళ్ళుగా మీద పడే వేళ. సాయంత్రం కల్లా నువ్వు, కవులు చెప్పిన వడలిన పువ్వువో లతవో కావు. చెమట వాసన వేసే, అవయవాలు తెగిపడే ఒక మామూలు మనిషివి మాత్రమే - 

తను అడుగుతుంది: ఉదయం నుంచీ కరెంట్ లేదు. పాత కుండ కదా, చల్లబడటం లేదు నీళ్ళు, అని తను ఒక గ్లాసు నీళ్ళు నీ ముందు ఉంచుతుంది. వొణికే చేతులతో అందుకుని త్రాగుతావు నువ్వు. అదొక మహా వరం. నీళ్ళు ఎవరైనా అందివ్వడం. కవిత్వం రాసేవాళ్ళకు తెలిసినా ఎవరూ మాట్లాడని సత్యం: పగలంతా చచ్చీ, చచ్చీ, నాలుగు రూకలకై నానా నానా మాటలు పడి, కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చే సత్యంం: మరి కవులు ఎవరూ మాట్లాడరు, నువ్వు ఒక కుటుంబాన్నీ నిన్నూ నీ నాలుగు వాక్యాలనీ బ్రతికించుకుంనేందుకు, మొడ్డ గుడిచిపోయి, నిన్ను నువ్వు ప్రతి దినం చంపుకుని ఇంటికి వచ్చే వైనం. అయినా ఇది దీని గురించి కాదు కానీ

నీళ్ళు నీ గొంతులోకి దిగుతున్నప్పుడు ఒక వాక్యం నిన్ను తడి గుడ్డతో తుడిచిన విరామం. తల తిప్పి చూస్తే నీ స్త్రీ పట్లా నీ పిల్లల పట్లా ఒక కృతజ్ఞత. ఆనక, లోకపు దుస్తులు వొదులుకుని, దిస మొలతోనో, ఒక లుంగీతోనో,  ఒక చెడ్డీతోనో, అట్లా జారగిలబడతావు కదా బాల్కనీలోనో లేక అద్దెకు తీసుకున్న హాల్లోనో - అప్పుడు 

నెర్రులిచ్చిన నీ అరిపాదాలను చూస్తూ తను అంటుంది: మీ కాళ్ళు ఎప్పుడూ ఇట్లా పగలలేదు. నొప్పి వేయడం లేదూ? ఒక్క నిమిషం" అంటూ ఒక వెడల్పాటి నీటి పాత్రని తెచ్చి తను నీ పాదాలని దానిలో ముంచమని అన్నప్పుడు, నీ శరీరంలో ఒక ఎడారి. 'మరి అమ్మ ఉండాలి కదా, అరిపాదాలు కాక, ఒళ్ళంతా చిట్లి, మాన్పుకునే దారీ మార్గం లేక ఎక్కడో పిగిలిన ఆ చర్మపు, హృదయ చర్మపు తొనకల్ని పీక్కుంటూ, నెత్తురోడుతున్న పాదాల్ని ఎదురుగా పెట్టుకుని నిన్ను తలచుకునే అమ్మ ఎక్కడో ఉండాలి కదా అమ్మ' అని నువ్వు తలచుకుంటావు కానీ 

నీ చుట్టూ చీకటి. గాలి సాయంత్రాన్ని వొదిలి రాత్రిని ఎప్పుడు తీసుకు వచ్చిందో తెలియని గాలి. నువ్వొక పిచ్చివాడివి. ఎర్రి ముఖం వేసుకుని నువ్వు అయోమయంగా చూస్తున్నప్పుడు, నీ ఎదురుగా ఒక పిచ్చిక గూడు. అపార్ట్మెంట్ పలకలలో, శాటిలైట్ వైర్ల మీదుగా కట్టుకున్న పిచ్చుకుల గూడు. నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు - మూడు పిచ్చుక పిల్లలు నోరు తెరిస్తే, వాటిలో నీ స్త్రీ పిల్లలూ నీ తల్లీ తండ్రీ--- ఇంత ఆహారం పెట్టి, అటు పిమ్మట బాల్కనీలో కింద ఉంచిన మట్టి ముంతలోంచి నీళ్ళు అందుకుని లేత గొంతులలోకి వంపే పిచ్చుకలు...

ఇదంతా ఎక్కడ మొదలు పెట్టాం? (this ain't no poem. what ever it is, it is mine-) అని కదా? ఎండ పలకల రాళ్ళుగా మీద పడే వేళ. సాయంత్రం కల్లా నువ్వు, కవులు చెప్పిన వడలిన పువ్వువో లతవో కావు. చెమట వాసన వేసే, అవయవాలు తెగిపడే ఒక మామూలు మనిషివి గురించి మాత్రమే అని కదా - ఈ లోపల

ఎవరో ఒక స్నేహితుడు వస్తాడు. అతని చేతులో ఒక పక్షి గూడు. మీరు అంటారు అతను త్రాగుబోతు అనీ, ఎప్పుడూ తల్లి గురించే వ్రాస్తాడనీ: మరి మీకు ఓపిక ఉండదు. మరి మీకు ఎప్పుడూ, మీరు విశ్లేషించే జీవితాన్నే వ్రాయాలనీ. పిల్లలని పెట్టిన పిచ్చుకలు గూట్లో కాక, బయట ఎక్కడో కూర్చుంటాయి. ఇనుప తెరలపై ఎక్కడో నిదురోతాయి. అవే, పిచ్చుకలు. నువ్వు ఇప్పటి దాకా చూడని పిచ్చుకలు - ముడుచుకుని ముడుచుకుని కూర్చుని పడుకునే పిచ్చుకలు- " మ్మా మ్మా, వాటి పిల్లలు ఎట్లా?" అని పిల్లలు అంటారు కానీ

కిందొక రెక్కలు విరిగిన పిచ్చుక. కిందొక, రెక్కలు కింద కలలు దాచుకున్న పిచ్చుక . కింద ఒక, మట్టి ముంతలో మాత్రమే తనని తాను చూసుకునే పిచ్చుక. చిన్న తండ్రి పిచ్చుక. చిన్న తల్లి పిచ్చుక. ఆ తరువాత...? (to be continued) 

A Note

"లేనని అనుకోకు. కనుమరుగయ్యానని తలచకు. 
కలలలో, నిన్ను కలత పరచే చేతుల వంటి 

పదాలను, మన శరీరాల వంటి, మన శ్వాసల వంటి వాక్యాలను 
వొదిలివేసి నేను వెళ్లిపోయానని అనుకోకు. చూడు - అలసిన ఒక 
దీపం,గాలి వేలిని పుచ్చుకుని, దొర్లిపోయే ఆకుల వెంట సాగిపోయే 

ఒక క్షతగాత్ర కాలంలో, గానంలో ఉన్నాను నేను: 
వాన, కన్నీళ్ళ వాసన వేసే రహదారులలో
రహదారులు నీ అంత కనులై, నోరు తెరచి 
ఎదురు చూసే పిచ్చుక పిల్లల వంటి లోకమై

అట్లా సాగిపోయే, అంతం కాని దారులలో ఉన్నాను నేను. నమ్ము - 
నన్ను. నేను అయిన నిన్ను. తప్పక 
వస్తాను నేను. తిరిగి వస్తాను నేను -"

ఇలా పలికి అతను, పై ఆఖరి వాక్యం చివర ఒక బిందువుని 
ఉంచాలా వద్దా అని సందేహించాడు. ఇక 
అప్పుడు తను, వంచిన తలను లేపి ఇలా 

అంది: "నేను ఎదురుచూస్తున్నాను. ఇంకా, నీకై - ఒక ఎదురుచూపు 
ఎదురుచూపై మరొక చూపుకై ఎదురుచూస్తోంది. మరి
నువ్వు నన్ను, నీకు ఎన్నటి దారి 
చూపించనివ్వగలుగుతావు? మరి 

నువ్వు, ఎప్పటికి ఇక్కడికి రాగలుగుతావు?"

ఆ తరువాత, ఇక్కడ ఇప్పటికీ ఒక 
నెత్తురుబొట్టు ఉబికిన కాటుక ఖాళీ
తనం. తనువు. తన తనం - ఒక 

వాక్యంత బిందువూ, విరామచిహ్నం-

Tell me, how to write and what to write?

01 April 2014

ఇంకో ప్రశ్న

తెల్లని నిశ్శబ్ధపు నీరు, నల్లటి రాత్రంతా
గోరువెచ్చని మంచు తుంపరై కురుస్తూనే ఉంది -
నా నిదురలోంచి నువ్వెప్పుడు

మెత్తగా విచ్చుకుంటున్న పూవువై చిరునవ్వావు?
నా కలలోంచి నువ్వెప్పుడు

సూర్యుడు అల్లిన నీడల గూటివైపు ఎగిరిపోయావు? 

ఆ పిచ్చుక పిల్లలు

చిక్కటి చీకటి బూజు కప్పుకున్న చెట్ల మధ్యనుంచి

రాత్రంతా ఆ పిచ్చుక పిల్లలు తమ లేత గొంతులు బొంగురుపోయేలా
అరుస్తూనే ఉన్నాయి-

సూర్యుడి పసుపుపచ్చ కనుపాపలవి. రాత్రి చంద్రుడి
మైమరపు హృదయాలవి. నీడల నిశ్శబ్ధాలతో    
చెట్ల కిందుగా, పైగా తమ తనువులతో ఆడుకునే శిశువులవి.

ఏం జరిగి ఉంటుంది?

గూటిలోకి గింజలతో తల్లి తిరిగి రాలేదా? జగమంతా
ఒక ముడుచుకున్న త్రాచైనప్పుడు
నిప్పు కణికెల కళ్ళతోఏదైనా పిల్లి

గూటి వద్దకు నిశ్శబ్ధంగా కదులుతుందా? లేదా ఒక పిచ్చుక పిల్ల
అదిరీ, బెదిరీ, కదిలీ, ఆకాశాన్ని
పదునుగా కోస్తున్న నక్షత్రంలా, నేల రాలిపోయిందా?

ఏం జగిగి ఉంటుంది?

చిక్కటి చీకటి రక్తం జిగటగా కమ్ముకున్న చెట్ల మధ్యనుంచి

రాత్రంతా ఆ పిచ్చుక పిల్లలు, తమ లేత గొంతులు బొంగురుపోయేలా
అరుస్తూనే ఉన్నాయి -

ఒక అస్తిత్వం

నీ కొరకై ఆకాశం నుంచి పేనిన అనంతమైన తాడు ఇది. నలుదిశలా

మృత్యు ఆహ్వానంతో వీస్తున్న గాలులతో, పురుగుల కాంతి రెక్కలపై
నీ కొరకై తిరిగి వస్తుందది. వృక్షాల కిందుగా కొనసాగే నీడలతో
నీ కొరకై శతాబ్ధాల క్రితం భూస్థాపితమైన శరీరాల్నీ స్పర్సల్నీ

మరలా బ్రతికించుకుని నిన్ను బిగియారా
కావలించుకునేందుకు వస్తుందది --- 

ఆహ్ ఏమి కౌగిలి అది. సగం తగలబడిన శవం లేచి నిలబడి
చిరునవ్వుతో నిన్ను కౌగలించుకున్నట్టు
ఆహ్ ఏమి కౌగిలి అది. ఈ అరటి ఆకుల కిందుగా

నీ ఎముకలలోకీ, మూలిగలోకీ, ఈ సూర్యరశ్మి నింపాదిగా జోరబడుతుంది.
ఆహ్ ఈ పరిశుభ్రమైన మృత్యుపరిమళం, ఎన్నటికీ
అర్థం కాని ఈర్ అనామక అస్తిత్వం,ఈ రోజు మాత్రమే

నీ కొరకై అనంతమైన శూన్యం నుంచి సూర్యరశ్మియై
నీ గొంతు చుట్టూ, పసిపిల్లల
చేతివేళ్ళలా చుట్టుకుంటుంది-  

ఇది, ఈ...

సాంధ్య సాగరంలోంచి, అలసిన కళ్ళతో నువ్వు
రాత్రి రాతికాంతిలోకి నడుస్తావు.
అది - ధూళి నిండిన నీ పాదాల వద్ద ఉంచిన
ఒక నల్లగులాబి -

అంధుడి: పిగిలిపోయిన పాదాలతో దారిని చూస్తావు
అనాధవి: నేల రాలిపోయే పుష్పాల అంతిమ
అరుపులను ఎవరికీ చెందని ఆకాశంలోంచి

నిర్లిప్తతతో వింటావు: ఎవరో మతి తప్పిన ఈ
మనుషుల లోకంలో వొదిలి వెళ్ళిన నీ
అస్తిత్వాన్ని ఒక భిక్షపాత్రలో వేసుకుని

తిరుగుతావు: సంధ్యధూళి నుంచి అలసిన కళ్ళతో
నువ్వు రాత్రి రాతికాంతిలోకి నడుస్తావు

అది - నీ సంధ్య పాదాల వద్ద ఉంచిన
ఒక తెల్ల గులాబి -  

మృత్యు విహంగం

అర్థరాత్రివేళ ముదురు ఆకుల మధ్య నుంచి బొప్పాయి పూలు నిశ్శబ్దంగా
ఆకాశపు తటాకంలోని జాబిలిని చూపిస్తాయి
తల ఎత్తలేని, నల్లటి మట్టిలో సమాధిని తవ్వుకునే
నిర్లిప్తపు బాటసారికి -

అతడు ఈ రాత్రి, ఈ భూమిలో తన ఎముకలని నానబెట్టుకోవాలి.
పుర్రెలాంటి తన ముఖాన్ని మట్టి పొరల దోసిళ్ళలో దాచుకోవాలి.
వడలిపోయిన పాదాలను వృక్షాల వేళ్ళతో
జతవేసుకుని విశ్రమించాలి.ఇక ఈ లోపల

అలసిన కొమ్మల మధ్యనుంచి తెలియనిది ఏదో
అనంతపు శూన్యం నుంచి ఇక్కడికి
కదలి వస్తుంది. చెట్లలోంచీ గాలిలోంచీ

ఇక అదృశ్య పాదాల సవ్వడి. రహస్య కనుల అలికిడి: నల్లటి మంచు బొట్లు
చుట్టూతా కురిసే వేళల్లో, చీకట్లో శూన్యాన్ని
ఖడ్గంతో నరికిన, రివ్వున ఎగిరి వెళ్ళిపోయే
ఉక్కు పక్షి రెక్కల సవ్వడి-
అది, ఆదీ అనంతం అయిన

మృత్యువిహంగపు మెత్తటి గోరు వెచ్చటి తాకిడి. ఇక ఆ తరువాత కూడా

అర్థరాత్రివేళ ముదురు ఆకుల మధ్య నుంచి బొప్పాయి పూలు నిశ్శబ్ధంగా
ఆకాశపు ఎడారిలోని జాబిలిని చూపిస్తాయి
తల ఎత్తలేని, నల్లటి మట్టిలో సమాధిని తవ్వుకునే
నిర్లిప్తపు బాటసారికి- 

ఒక ప్రశ్న

ఎవరిది ఈ అస్తిత్వపు నలుపు గులాబి? ఈ దినం మరో మారు
నిస్సహాయంగా
రాలిపోతోంది-?

ఎవరి పాదాలు తాకాయి ఈ అస్తిత్వపు నల్లటి మట్టి బాటని? మృత్యు ప్రేమతో
ఈ సమయంతో/తో మెత్తగా
భూమిలోకి కుంగిపోతుంది?

పుష్పాలూ, స్త్రీలూ పిల్లలూ. అలసిపోయారు వీరంతా ఈ పూట. నిర్లిప్తంగా సాగే
గమ్యం లేని బాటసారిని కనులతోనైనా పలుకరించలేనంతగా
సోలిపోయారు వీరంతా. ఇక ఈ నైరాశ్యపు రాత్రి పూట

ఎవరి అస్తిత్వపు నలుపు గులాబీ పాదాల వద్ద
ఈ హృదయాన్ని పరుచుకోవాలి? ఏ ఏ దీపాల వద్ద ముందుకు సాగలేని
ఓ నిస్సహాయతతో, గాలిలో
నలుదిశలా వెదజల్లబడాలి?  

ఈ సమయం

ఈ లోకంలో ఎదురుపడే ప్రతి ముఖపు సమాధి ముందు వేన వేల మంది
పుష్ప గుచ్చాలతో
మోకరిల్లి ఉంటారు

ఏమీ లేని సమయపు ఖడ్గం కింద మెడను వాల్చినందుకు పిల్లలే నిన్ను
మరికొంతకాలం గుర్తుపెట్టుకుంటారు. ప్రమిదె వెలుతురులో దాగిన
చీకటిలో కనుమరుగైన స్త్రీలే నిన్ను మరికొంత కాలం జ్ఞాపకం ఉంచుకుంటారు.

ఈ ముఖం వాళ్ళ మధ్య నుంచే వచ్చింది. ఈ మట్టిలోంచీ, సముద్రాల్ని చుట్టి వచ్చిన గాలిలోంచీ
నిప్పులోంచీ శరీరంలో యుగాల స్పృహతో కదులాడుతున్న నీటిలోంచీ
నింగిలోంచీ, ఈ ముఖం వీటన్నిటి నుంచే వచ్చింది. సర్వత్రా కదులాడే
మనుషుల అరచేతుల మధ్యే
ఈ ముఖం రూపు దిద్దుకుంది.

ఓరిమిగా దినాలను గడుపుతూ నీ ముఖాన్ని రూపుదిద్దుతారు వాళ్ళు. వర్షాలతో నిండుగా
కదులాడే నదులలో నీ ముఖాన్ని శుబ్రం చేస్తారు వాళ్ళు.
ఆత్మలూ దేవతలూ మృగాలూ వాళ్ళు. సమాధులలోంచి
ఏరుకు వచ్చిన అమృతపు ధూళితో
నీకు చూపును ఇస్తారు వాళ్ళు. ఈ

లోకంలోకి నీ ముఖాన్ని తీసుకువచ్చిన హస్తాలే, లోతైన భూమి పొరలలో
బ్రతికి ఉన్న కనులతో ఎదురుచూసే నీ పూర్వీకుల వద్దకు
తీసుకు వెడతాయి. మరికొంత సేపు అలా వేచి చూడు -
ఏమీలేని సమయపు ఖడ్గం కింద మెడను వాల్చినందుకు

ఈ లోకంలో ఎదురుపడే ప్రతి ముఖపు సమాధి ముందు
వేనవేల మంది నిశ్శబ్ధపు ప్రార్థనలతో మోకరిల్లి ఉంటారు.