31 March 2011

ఎవరు?

ఎవరు? ఈ ఆదిమ ఆకాశాంతాన

నిన్ను తన అరచేతుల మధ్య
పొదివి పుచ్చుకున్నది ఎవరు?

రాత్రి చుట్టుకుంటున్నప్పుడు
పగలు మిగిలిన
కాంతి కిరణాలు సర్పాలై
నీ నుదుటిని కాటేస్తున్నప్పుడు

నువ్వు కంపిస్తూ
తల దించుకుని నేలని పరికిస్తూ
నేలపై వాలే మసక నీడల
మట్టి జాడలని చెరిపేస్తూ
నువ్వు ఆ గదికి
పారిపోయి వచ్చినప్పుడు
నిన్ను తన అరచేతుల మధ్య
పొదివి పుచ్చుకున్నది ఎవరు?

వానల్లో, కరడు కట్టిన చీకట్లలో
కడుపుని నీళ్ళతో
కుట్టుకుంటున్న రోజులలో
నిన్ను తనలో దాచుకుని
పదిలంగా కాపాడుకున్నది ఎవరు?

నీ పెదాలు పగిలి, నీ కుత్తుక తెగి
నీ స్వరం పిగిలి
ఇక సాగలేక నీ పాదాలు విరిగి
నువ్వు దారి పొడుగూతా
రక్తపు ముద్రికలై పారాడుతున్నప్పుడు
నిన్ను ఎత్తుకుని
ఆ నిర్ధయ సమయాన్ని దాటించి
నిన్ను ఆదుకున్నది ఎవరు?

నూనుగు చంద్రకాంతిలో
కనులు చిట్లే మధ్య రాత్రిలో
అగ్నిలో, ఇతరుల
మంచు మృత్యువులో
మధువులో ఊయలలూగుతున్న
నిన్ను దగ్గరగా లాక్కుని
హత్తుకుని
నిద్ర పుచ్చినది ఎవరు?

నీ హింసకీ నీ విధ్వంసానికీ
నీ నిర్లక్ష్యానికీ
నీ దిగులు పారిజాతాలకీ
తన లోకాన్ని
వొదిలివేసినది ఎవరు?
నీ సంతోషానికీ
నీ మృగమార్మిక వ్యసనానికీ
నీ అవధులు లేని ఉన్మాదానికీ
నీ అంతంకాని
అంతంలేని నైరాశ్యానికీ
తన కాలాన్ని
బలి చేసినది ఎవరు?

నిన్ను వొదలలేకా
నీతో ఉండాలేకా
నిన్ను ద్వేషించాలేకా
నిన్ను మరచిపోయేoతగా
ప్రేమించాలేకా
రెండుశిక్షల మధ్య
మరణించినది ఎవరు?

మరణిస్తూ, నిన్ను
శిలువ వేసి
వెడలిపోయినది ఎవరు?

No comments:

Post a Comment