26 March 2011

అందాక

నా గురించి ఆలోచించకు
నేను ఎక్కడో ఉండి ఉంటాను: నీ వెనుకగా
నీ చుట్టూ నడయాడే గాలిలా
నిదురలో నిను తాకిన వర్షపు చినుకులా
నువ్ మైమరపుతో
ఆర్పివేయటం మరచిన రాత్రి దీపంలా
నేను ఎక్కడో ఉండే ఉంటాను.

నా గురించి ఆలోచించకు:
ఏం చేయాలో తోచక అలా తిరుగుతూ
పిల్లలని అలా విసుక్కోక
కాసేపు నింపాదిగా కూర్చో:

పగటిపూటి పూవులను రాత్రి దారంతో
నీ నిరీక్షణతో అల్లుకో
గతించిన కాలం, చింతించిన కాలం
అన్నింటినీ ఓ మారు తలుచుకో
శరనార్ధులనూ, శాపగ్రస్తులనూ
కొంతసేపు నీ దయగల
హృదయంలో తురుముకో
కిటికీలను తెరిచి, తలుపులు తెరిచి
గాలికీ, నక్షత్రాల కాంతికీ
నీ వేదనని నివేదించుకో
అందాక నా గురించి అంతగా
ఆలోచించకు

నేను ఎక్కడో ఉండే ఉంటాను
నేను ఎక్కడి నుంచో
వస్తూనే ఉండి ఉంటాను

No comments:

Post a Comment