నాతో మాట్లాడు
నాతో, నా నీడలతో మాట్లాడు
నాతో, నా సంరక్షక దేవత అయిన
నా మధువుతో మాట్లాడు
ఇళ్ళు లేని
నా స్నేహితుల గురించి మాట్లాడు
ప్రేమించీ, పిగిలిపోయి
చెమ్మగిల్లిన అద్దంపై మంచుగా మారిన
స్త్రీల గురించి మాట్లాడు
స్త్రీల గురించి,
పుచ్చకాయల వాసన వేసే
స్త్రీల గురించి
పిల్లలు కావాలనుకునే
స్త్రీల గురించి
ఒక ఆలింగనంకై
తమ దుష్టస్వప్నాల నుంచి
నిరాయుధులై
భీతావాహకమైన నయనాలతో
లేచి వచ్చే స్త్రీల గురించి
అబార్షన్లలో శిశువుల్ని కోల్పోయి
ఇప్పటికీ రక్తం స్రవిస్తున్న
స్త్రీల గురించి
ఊచకోతలోని ఆనందం కోసం
మనం హత్య చేసింది
తమ గర్భంలోని కవలల్ని
అని విలపించే ఆ చిన్న
స్త్రీల గురించి
నాతో మాట్లాడు=
నాతో మాట్లాడు
తిరుగుబోతులతో
తాగుబోతులతో
అనాధులతో
నేను గడిపే, నేను
రాలిపడే
రాత్రుళ్ళ గురించి
నాతో మాట్లాడు
ఆత్మహత్య అంచున
తొణికిసలాడుతున్న
నా స్నేహితుడి గురించి
నాతో మాట్లాడు
అతడు అంతిమంగా
శ్వాసించాలనుకున్న
తను కలలో కాంచిన
నా కలైన
తల్లిలాంటి
తనదైన స్త్రీ
పరిమళం గురించి మాట్లాడు
ఉన్మాదం
గురించి మాట్లాడు
మధువుతో
వివశితమైన రాత్రుళ్ళ
గురించి మాట్లాడు
శూన్యబిలంలో
అందరూ పంచుకున్న
సున్నితమైన
లేత చిగురాకు క్షణాల
గురించి మాట్లాడు
ప్రేమ గురించి మాట్లాడు
స్నేహం గురించి మాట్లాడు
అందరూ నిన్ను
నైపుణ్యంగల వేటగాళ్ళలా
వేటాడుతున్నప్పుడు
నువ్వు తలదాచుకున్న
స్థలం గురించీ
స్తన్యం గురించీ మాట్లాడు
మాట్లాడు మాట్లాడు మాట్లాడు
అంతం కాని
దినాల గురించీ
దయలేని
రాత్రుళ్ళ గురించీ
నువ్వూ నేనూ మనమూ
రాలిపోయి
పాలిపోయి
పారిపోయి, తిరిగి
ప్రత్యక్షం అయ్యే
సమయాల గురించి మాట్లాడు
మనం చెప్పిన
విషయాలన్నిటిలోకీ
మనం చెప్పని
విషయాలన్నిటిలోకీ
మనం చెప్పాలనుకుని
చెప్పలేకపోయిన
విషయాలన్నిటిలోకీ
కలగలిసిపోయిన
పొగమంచు
గురించి మాట్లాడు
ఎందుకంటే
అస్తిత్వపు అంచున
మృత్యువు అంచున
నీ స్వరాన్ని వింటూ
కొన్ని క్షణాలకై కొనసాగే వాళ్ళు
కొందరు ఉంటారు
ఆ కొందరు, అందరై
ఒక అంతంకై
ఎదురుచూస్తూ ఉంటారు
ఒక అంతంలోంచి
మరొక ప్రారంభాన్ని
కనుగొంటూ ఉంటారు
మాట్లాడవా నువ్వు?
మాట్లాడతావా నువ్వు?
మరొక్కసారి
మళ్ళా మొదలుపెడదాం మనం.
నాతో మాట్లాడు
నాతో, నా నీడలతో మాట్లాడు.
kavita baagundi. batakadamela?
ReplyDeleteGud poem sri...
ReplyDelete