చిన్ని చేతులతో, పెద్ద కళ్ళతో
ఎదురుచూస్తావు నువ్వు
ఆడుకోవచ్చని, ఆపై
నా ఛాతిపై పరుండి నిదురోవచ్చని=
అడుగుతావు నువ్వు మళ్ళా మళ్ళా
అమ్మను నీటిబుడగలు పగులుతున్న
నీ తెల్లటి పదాలతో
చెట్ల కొమ్మలలోంచి సాగే
సాయంకాలపు గాలి చల్లదనంతో
వస్తానా నేనని, వస్తే ఎప్పటికని
రాత్రైతే రానేమోనని=
కొంత దిగులు, కొంత గుబులు
కొంత ఆశా, మరికొంత నిరాశా
ఆకాశానికి విచ్చుకున్న
నీ హృదయ పుష్పపు తుషారంలో=
వస్తానా నేను, వచ్చానా నేను
ఎపుడైనా? నీ చాచిన చేతులలోకీ
సుదూరంగా సాగిన
నీ చూపులలోకీ?
ఎదగటం అంటే ఇదే: ఎదురుచూపుల
నిస్పృహను రుచి చూడటం
హృదయ వేదనని నలు దిక్కులలో
గూడు కట్టుకోవడం
నా చిట్టి కన్నా గుర్తుంచుకో:
ఇది నీ జీవితపు
ప్రధమ ప్రేమ పాఠ౦.
lovely
ReplyDelete