24 March 2011

నీకు మాత్రమే తెలుసు

ముందుగా, ఒక అంతం: ఒక ప్రశ్న. మనం
ఎందుకిలా?

౧.

నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే
నీ వదనానికి మాత్రమే
నీ నిర్లిప్త పెదాలకు మాత్రమే
అంత క్రూరంగా
అంత నిశ్శబ్దంగా ఉండటం తెలుసు.
నీకు మాత్రమే, ఒక్క నీకు మాత్రమే
జనులకు ప్రేమిస్తూ
నిజానికి ద్వేషిస్తూ ఉండటం
నీకు మాత్రమే తెలుసు. ఇది నాకు చెప్పు:

నువ్వు ఈ కళను ఎక్కడ అభ్యసించావ్?

౨.
రెండో వినతి: ఇది కవిత కాదు.
ఈ వాక్యాలలో నివిసించేది, ఈ పదాల మధ్య
తిరుగాడేది జ్ఞానం కాదు.

((అర్థరాత్రికీ ఇళ్ళకి చేరని పక్షులు
నీకు తెలుసా?
మధ్యరాత్రిలో, నిండు పున్నమిలో
వెన్నెలలోని చీకటిని నింపుకుని
రాలిపడే మల్లెమొగ్గలు
నీకు తెలుసా?
ఉదయమంతా, చీల్చివేసే ఎండలో
నీటితో కడుపుని నింపుకుని
అరచేతులో కళ్ళని పట్టుకుని
అలా ఎదురు చూసే మనుషులు
నీకు తెలుసా?

స్త్రీలు తెలుసా?
వారి మోహాలూ, వారి శాపాలూ
అంతంలేని వారి ప్రతీకారాలూ
వారి ప్రతీకాత్మక దేహాలూ
నీకు తెలుసా?))

౩.

మూడోవ, మొదటి సత్యం: నాకు
"సామాజికత" లేదు. నాకు
నా సత్యం తప్ప ఇతర నిజమూ లేదు.

((కాబట్టి, నువ్వు తలుపు తెరిచినప్పుడు
నీ వదనం మూసుకుంటుంది
కాబట్టి, నా పెదవులు పలికినప్పుడు
నీ స్వరం నల్లటి శిలగా మారుతుంది:
ఇదే సమయం. ఇదే
సరైన సమయం:

పూవులు రాళ్ళుగా, రాళ్ళు ముళ్ళుగా
ముళ్ళు మనంగా మారే
క్రియ గురించి, ప్రక్రియ గురించి
మాట్లాడుకునేందుకు.))

౪.

మధ్యలో ఒక జవాబు: ఎందుకిలా మనం
ఎప్పటిదాకా ఇలా మనం?

((వివశితుడను. అతి వ్యసనుడను
మధ్యమార్గం తెలియని
మధ్యవయస్కుడను.
పిల్లలు ఉండి ఇంకా "తండ్రిని" కాని వాడను
తండ్రి ఉండి ఇంకా "కొడుకుని" కాని వాడను
భార్య ఉండి ఇంకా "భర్తను" కాని వాడను
విషాదుడను, వ్యామోహ, మొహావేశాలు
వేషాలు లేనివాడను
అంతిమంగా నీకు అత్యంత ప్రియమైన
శతృవును, శాపగ్రస్తుడను
నీ ద్వేషాన్ని ద్వేషించే ప్రేమ కలవాడను))

మరలా మరలా మరొకసారి: ఇది
మీరు ఊహించే, మీరు కోరుకునే కవిత కాదు
ఇవి జ్ఞానం తిరుగాడే పదాల ప్రదేశం
దేహం దేశం కావు

వెడలిపోండి ఇక్కడనుంచి.

౫.
ఉన్నాను, నీ కటిన వదనానికి
నీ నిశ్శబ్దాల నీడలకీ ఒక కాందీశీకుడనై=
వేచి ఉన్నాను, నీ జ్ఞాన విముక్తికీ
దరిచేరని నీ మహా కధనానికీ
ఉన్నాను, నీ నిస్సహాయతకీ
నీ నిర్మాణాల వినిర్మాణానికి ప్రేక్షకుడినై=

మరేం లేదు ఇక్కడ, మరేం కాదు ఇక్కడ
త్వరగా దరికి రా

కలసి చనిపోదాం ఒకింత దయగా
ఒకింత శాంతిగా.

2 comments: