16 March 2011

నీ ద్వేషం (ఒక తొమ్మిది కా/రణాలు) లేదా కవిత కాని గాధ ఒకటి

నీ ద్వేషం, ఒక పరంపర వలె, శీతాకాలం సాయంత్రం మసక చీకటీ కలగలిసి కురిసిన ఒక తుంపర వలె, నన్ను ఒక దిగులు గదిలోకి దయలేని మదిలోకీ నెడుతోంది. నీ ద్వేషానికి, ఇప్పటికి నాకు తోచిన నువ్వు చెప్పక చెప్పిన ఒక తొమ్మిది కా/రణాలు:
***
1. మొదటిగా, చివరిది అయిన చిన్న కారణం: నేను ఉండటం. నేను నీ ద్వారా ఉనికిలోకి రావడం. 

2. రెండొవది ఏమిటంటే, నేను కవిత్వంవంటి దానినేదో రాయటం, దానిని నేను కవిత్వం అని నమ్మకపోవడం. 

3. నేను నేనుగా ఉండటం, అందులో భాగంగా నేను నిన్ను నిర్దయగా ధిక్కరించడం. (నీకు తెలియని ఒక విషయం: నా కోసం, నేను నేనుగా ఉండటం కోసం, అందుకై అలవాటైన స్వీయ హిం సకోసం, ఇప్పటికి తొమ్మిది మంది స్త్రీలను దేశంలో, దేహంలో, పరదేశాలలో, పరదేహాలలో వొదిలివేసాను. (*ఇప్పటికీ ఈ హృదయంపై తొమ్మిది కోతలు ఉన్నవి, ఇప్పటికీ అవి ఉబుకుతూ ఉన్నవి)

4. పురాజన్మలో తగిలిన శాపమొకటి వెన్నాడుతోన్నది ఊరూ పేరూ లేని ఓ దిగులై, ఓ తపనై ఈ జన్మలో : నీకు తెలియని ఆ పాదాలపూల పరిమళ నైరాశ్యమై నన్ను వివశితుడను చేస్తోన్నది. తిరుగుతున్నాను అందుకే, ద్రిమ్మరినై, దారులవెంటా, మట్టి అంటిన మనిషి పాదాలవెంటా.  రాలిపోతున్నాను నీటి చుక్కనై, పగిలిన పెదాలపైనా, పుసి పట్టిన కళ్ళలోనా, రహదారుల్లోనా, రహస్య మధుశాలల్లోనా హంతకుల రతి మైదానాలల్లోనా, అపరిచిత స్త్రీల బాహువులల్లోనా, రాలిపోయే నక్షత్రాల కరిగిపోయే రాత్రుళ్ళలోనా -

( నీకు తెలుసు నేను గూడుని నమ్మని గూడుకై వెదుకులాడుకునే ఒక గూడు లేని పక్షిని అని )

5. భర్తను కానీ, తండ్రిని కానీ కొడుకును కానీ పౌరుడిని కానీ మరొకరి పాత్రల పౌరోహిత్యం నిర్వహించే పురో/హితుడను అయ్యే పాపాన్ని చేయలేకున్నాను. అటువంటి పుణ్యం చేసుకుని ఉన్నాను: ఇందుకు - నువ్వు నన్ను ద్వేషించాలి: ఇంతకు వినా నీకు మరో మార్గం లేదు.

6. బానిసవలె పెంచబడి బానిసగా మారలేకున్నాను. నీ భాష్యపు దాస్యంకింద నువ్వు నమ్మి పెంచుకుని స్థాపించిన విగ్రహాలముందు మోకరిల్లలేకున్నాను. కాదా ఇది ఒక నేరం: నేరాలను శిక్షించే నేరస్థుడని నేను. చాలదా ఇది నన్ను ద్వేషించెందుకు నీకు ఆరో కారణం?

7. ప్రేమించలేను. శరీరం నచ్చకుండా రమించలేను. భాష లేక శరీరం లేదు. భావంలేక ప్రాప్తి లేదు. జీవం లేక శాస్త్రం లేక జీవశాస్త్ర ఉనికి లేక నువ్వు అనుకునే నువ్వూ, నీ పరమ అధ్బుతమైన, స్త్రీ లేదు. ఈ పదాలకి ఒక లయా లేదు. అంతిమంగా నీ ద్వేషానికీ దయా లేదు. పద సన్నిధీ లేదు. అందుకే వెడలిపోతున్నాను ఇక ఈ వాక్యాలలోంచి:

8. నీ విద్రోహాల నీడను పంచుకోలేకున్నాను. మన్నించు: నిన్ను మినహా శత్రువులవంటి మొగలి పూల పరిమళపు స్నేహితులను నమ్ముకున్నాను. బృంద గానాలను ఆలపింపలేకున్నాను. ఇతరులకై నన్ను నేను పారవేసుకున్నాను. చేయి దాటిపోయింది. దూరం ఏదో చేరువయ్యింది. దరి చేరనిది దాహమై ముంచివేసింది. ఇక మరణించేవరకూ ఉన్నాయి: నీకు నీ మరణం, నాకు నా మరణం. 

( ఇక మరణించేవరకూ, నేను నీ మరణం నువ్వు నా మరణం.)

9. మొదటిది అయిన చివరి కారణం: నేను నీ ప్రతిబింబపు ప్రతిబింబం: అద్దంలోంచి అద్దంలోకి తొంగిచూసే అద్దపు ప్రతిబింబం. ఎదురుచూపు మనం. తన మనం. అందుకే ద్వేషించు చివరిదాకా, కంటిచూపు సాగేదాకా: తరువాత, ఆ తరువాత, ఆ తరువాత తరువాత కలుస్తాయి మన చేతులు మరెక్కడో: అనంతంలో! 
***
నీ ద్వేషం, ఒక పరంపర వలె శీతాకాలం సాయంత్రం మసక చీకటి కలగలిసి కురిసిన ఒక తుంపర వలె నన్ను ఒక దిగులు గదిలోకి దయలేని మదిలోకీ నిరంతరంగా నెట్టివేయనీ, వొదిలివేయనీ!

1 comment:

  1. మీ 'నీ ద్వేషం' ద్వేషంగా, మీది కానితనంగా నిందారోపణంగా ఉంది. ఎందుకిలా? ఎవరిమీద?

    ReplyDelete