16 January 2016

అనుకున్నవి

ఒక తెల్లని కాగితం ఇచ్చావు నువ్వు అతనికి, కడు జాగ్రత్తగా
దాచుకొమ్మని -

అతను కూడా అనుకున్నాడు
రాత్రిని, ఒక ఇష్టమైన పుస్తకపు పేజీ తిప్పినట్టుగానో, ఒక
పూవుని విన్నట్టుగానో, నిన్ను
చూసినట్టుగానో గడుపుదామనీ, మరేమీ చేయకూడదనీ -

నిజమే, నువ్వే అయిన
ఒక తెల్లని కాగితం ఇచ్చావు అతనికి - దాచుకొమ్మనో
జీవితాన్ని దాటేందుకు
ఒక పడవగా చేసుకొమ్మనో, అతన్ని రాసుకొమ్మనో -

మరి, రాత్రిలోకి
కనుమరుగయ్యే దీపపు కాంతిని కాగితంలో నింపి, అట్లా
ముక్కలు చేసి
చీకట్లోకి విసిరి, నింపాదిగా నడచి వెళ్లిపోయింది ఎవరు?

No comments:

Post a Comment