27 January 2016

ఎవరికి తెలుసు

"నేను పిచ్చిదానినా?" అడుగుతుంది తను. అతను ఏమీ
మాట్లాడడు -
***
రాత్రి. తెరచి ఉంచిన కిటికీలు. గాలికి సన్నగా ఊగే పరదాలు.
పరదాలని దాటి చూడగలిగితే, బహుశా
మబ్బుల చాటుకు తప్పుకునే జాబిలీ -

(తన కళ్ళూ, తన ముఖమూనా అవి?) 

బాల్కనీలో, ఆ మసక వెన్నెల్లో పాలిపోయిన ఆకులు: (తన
చేతివేళ్ళా అవి?) రాత్రి చెమ్మ బరువుకి
వొంగిన నెత్తురంటిన లిల్లీ పూలు. కింద 

ఎక్కడో, కుత్తుక తెగేలా ఒకటే అరచే, కళ్ళు తెరవని పిల్లి
కూనలు -
***
"నేను పిచ్చిదానినా?" అడుగుతుంది, బేలగా పాపలా
తను -
***
వానలో లిల్లీ పూవులు తడిచి తెరపిబడ్డాయో లేదో, పరదాలు
తొలిగి చంద్రబింబం బ్రతికిందో లేదో, ఒక
మహా పురుషాంగంగా మారిన ఈ లోకం

పిచ్చిదో, తను పిచ్చిదో ఎవరికీ తెలుసు?

No comments:

Post a Comment