14 May 2011

పచ్చని చెట్టువి నువ్వు

పచ్చని చెట్టువి నువ్వు

మంచు కురిసే
వెన్నెల రాత్రివి నువ్వు

పెదవిపై మిగిలిన
రక్తపు చినుకువి నువ్వు

పాత్రలో వడలిన
శ్వేత గులాబీవి నువ్వు

కన్నుని తాకిన
తెమ్మర తారకవి నువ్వు

కంటిని చీల్చిన
కన్నీటి కాంతివి నువ్వు

వొదిలి వేయబడ్డ
ఖాళీ గూటివి నువ్వు

పిల్లలు ఉండీ పిల్లలు రాని

ఎదురుచూసే
ఎదురుచూపువి నువ్వు
బెదురు చూపువి నువ్వు

ఎవరూ తాకని తల్లివి నీవు
ఎవరూ పాదం మోపని
తెల్లని కలవి నువ్వు

పూలని తాకని వర్షం నువ్వు
వర్షాన్ని తాకని
బాలికవి నువ్వు

స్థన్యం లేని స్థలం లేని
శిశువువి నీవు
నీడ లేని నీడలలో కదిలే
నీడవి నీవు

నదివి నీవు నగరానివి నీవు
సారంగి లేని
అగమ్య ప్రయాణం నీవు

నిరంతర కలవి నీవు
నిర్మల కలవరం నీవు

కలల అలలు విసిరివేసిన
గర్భానివి నీవు.
విశ్వ శూన్యానివి నీవు

యవ్వనం నీవు
వృద్ధాప్యం నీవు

మృత్యుపాదాల రహస్య
పయనం నీవు

బరువుగా కదిలే బాల్యం నీవు
కదలలేని రోగిగా మారిన
ఆవువి నీవు

ఎవరో వెలిగించి వొదిలివేసిన
దీపం నీవు
కొనశ్వాసతో కొనసాగుతున్న
వొణికే సన్నటి జ్వాలవి నీవు

ఆదిమ అంతాలలో బిందువువి
నీవు. బిందువులో కరిగే
మృత్యుసింధువువి నీవు

తొలి వెలుగు నీవు
చివరి చీకటి నీవు

ధరిత్రిపై మిగిలిన చివరి
చెట్టువి నీవు. మంచు కురిసే
చివరి రాత్రివి నీవు

పెదవిపై విరిసిన చివరి
చిరునవ్వువి నీవు

పిల్లలు ఉండీ పిల్లలు రాని

ఎవరూ తాకని
ఎవరూ సోకని

ముదుసలి తల్లివి నీవు
నింపాది మరణం నీవు=

1 comment: