09 May 2011

అ/జ్ఞానం 19.

శిలపై మోదిన నీ నుదిటిపై
ఆమెను పుష్పించనీ

అలసిన అరచేతులతో
నీ ఛాతిని చీల్చనీ

నువ్వు కాలేని దృశ్యాలు
నీ నయనాలను
పెకిలించివేయనీ.

తిరిగిరాని, తిరగరాని
వంకీలు తిరిగిన
వెన్నెలలేని ఆ దారి

నీ పాదాలని
నరికివేయనీ.

మరణించినవారు
కరుణించిన రాత్రిలో

నువ్వొక తెల్లటి అద్దాన్ని
ప్రతిష్టించనీ
నువ్వొక తెల్లటి రూపాన్ని
సృస్టించనీ

ప్రతిబింబపు, ప్రతి
బింబాన్ని దర్శించనీ
వ్యాకరుణించనీ:


అందుకని, వాళ్ళు
రానందుకని
ఇక తెలియదు నీకు
ఎప్పటికీ

దర్పణంలోకి దారేటో
దర్పణంలోకి వెళ్ళినవారెవరో
వెళ్ళేవారెవరో

దర్పణంలోంచి నీకు
ఒక మృతవదనాన్ని

కారుణ్యపు నవ్వుతో
బహుకరించేవారెవరో=

No comments:

Post a Comment