15 May 2011

అ/జ్ఞానం 23.

మధుశాలలో ఒకరికొకరు తోడు
స్నేహితులు లేక
చెరశాలలో నేను

రాత్రికి పగలు. సూర్యుడికి
చంద్రుడు

గాలికి పూలు. పూలకి స్త్రీలు
స్త్రీలకు పిల్లలు

లోకమంతా ఒకరికొకరు తోడు
గ్రహణంలో చిక్కుకుని
ఎవరూ లేని నేను

చెట్టుకి గూడు. గూటికి గుడ్లు
చెలమకి కప్పలు. కప్పలకి
కాకులు

కాలమంతా ఒకరికొకరు తోడు
ఎవరూ లేక కదిలే
తోక తెగిన బల్లిని

నేను

శిశువుకి స్థన్యం. బిక్షువుకి
మరణం

నీళ్ళకి రాళ్ళు. రాళ్ళకి ఆకులు
ఆకులకి నీడలు.
నీడలకి పిల్లులు

మెరిసే విశ్వాలకి విశ్వాలు

మరణం నుంచి జననం దాకా

ఒకరికి ఒకరు మరొకరు తోడు

ఏ నక్ష్త్రమూ లేని కృష్ణ బిలం
నేను

మధుశాలల్లో మనుషుల
కర్మాగారంలో ఆదిమ శిలను

నేను

తెలిసింది. సమాధులపై రాతి
పూలను ఉంచే వేళయ్యింది
దీపం ఆర్పివేసే సమయం
వచ్చింది

వెడలిపో త్వరగా
ఎవరూ గానం చేయని
చరణంగా

నిశీధి నిశ్శబ్దంలోకి, నిశ్శబ్దాల
నీడలలోకి

చీకటివై, ప్రతిబింబమై
పలు రంగుల నీడవై=

1 comment: