హృదయంలోకి ఒక బాకుని
దింపుతున్నాను
నిన్నొక పూబంతిని చేసి
రెమ్మరెమ్మనూ
తెంపుతున్నాను
నింపాదిగా,నిర్వికారంగా=
కనులలో రక్తపు చినుకుల్నీ
మనస్సులో ఒక కంపననీ
నీ శరీరంలో ఒక ఆగ్రహ
జ్వాలనీ రగిలిస్తున్నాను
బహు జాగ్రత్తగా
బహు నెమ్మదిగా
కరుణతో శాంతితో
ప్రేమతో=
తప్పక చంపుతావు
నువ్వు నన్ను
ఇందుకు
తప్పక ద్వేషిస్తావు
నువ్వు నన్ను
ఇందుకు
తప్పక వెడలిపోతావు
నువ్వు నన్ను
ఇందుకు
నన్ను నమ్మినందుకు:
అయితే ఒక దినానంతాన
నీ పిల్లలు నిన్ను వొదిలి
వేగిరంగా వెళ్ళిపోతున్న
సంధ్యా తరుణాన
నువ్వు ఒంటరిగా పూలు
అల్లుకునే చీకటి సమయాన
దీపం ఏకాకిగా మిగిలిపోయే
కరకు క్షణాన
గుర్తు తెచ్చుకుంటావు నన్ను
కనుల అంచున మంచుతో
పెదాల అంచున వొణుకుతో:
కృతజ్ఞతలు తెలుపుకుంటావ్
కొంత వేదనతో
కొంత నిట్టూర్పుతో
నేను ఇచ్చిన గాయపు
బహుమతికి అంతిమంగా
కృతజ్ఞతలు తెలిపే ఉంటావ్
ఒక బాకుకీ
ఒక నరహంతకుడికీ
తోటను దగ్ధం చేసిన
తోటమాలికీ=
No comments:
Post a Comment