02 December 2017

ఇట్లాగా? ఏమో

1
రాత్రి, వెన్నెలతో కూడి
రగిలింది;
అత్తరులో నానిన ఒక
చంద్రబింబం
ఆమె ముఖం;
ఎలా?
2
పుడమి అంతా చీకటి
సువాసన;
పసిచేతులేవో నిన్ను
తాకినట్టు,
ఒక పురాస్మృతి!
ఇలా!
3
పొగమంచులో కదిలే
లిల్లీపూలు
ఆ కనులు; గూళ్ళల్లో
మెసిలే మరి
పావురాళ్ళు;
శబ్ధాలూ!
4
"రానివ్వను లోపలికి
ఎవ్వరినీ!"
ఒట్టు పెట్టుకున్నావు
నీకు నువ్వే
వానలో, గాలిలో
వేలితో వ్రాస్తో!
5
ఆకులు రాలి పొర్లే వేళ
నీడలు మరి
హంతకులై బాకుల్తో
దిగబడే వేళ
ఏది సాయంత్రం,
ఏది రాత్రి?
6
అద్దంలో నవ్వుతోంది
ప్రతిబింబం;
అమ్మా, ఈ జనుల
జాతరలో,
మళ్ళా హృదయాన్ని
జారవిడిచాను;
ఎప్పటిలాగే!
7
రహదారి పక్కనో మరి
దయలేని
వాహనరద్దీలోనో మరి
ఎప్పటికీ రాని
తల్లికై ఎదురుచూసే
బాలికై; కాలం!
8
గులాబీని కోరుకున్నావు
హృదయం
నెత్తురులో తేలింది;
ఇంతా చేసి
ఏం మిగిలింది నీకు
ఓ ద్రిమ్మరీ?
9
ఛాతిపై ఇంకొక గాయం
ఎగిసే నెత్తురు
గంధంతో ఓ ముఖం;
కొనగోటితో
కనుపాపపై గీరినట్టు
ఈ కవితా!

చాలావా ఇవి?

No comments:

Post a Comment