31 December 2017

మంచుపూలు

కావలించుకున్నావు నువ్వు; నీలో
ఒక అలసట వాసన,
అశ్రువుల దండ తెగి, నేలపై

చెల్లాచెదురయ్యే చప్పుడు;

పూలతోటలు గాలికి శివమెత్తినట్టు
శరీరం ఒక సుడిగాలై
ఎటో ఈడ్చుకుపోతునట్టు, మరి

ఎవరో బిగ్గరగా ఏడ్చినట్టూ,

బహుశా, పెద్దపెట్టున చెట్టు ఏదో
కూలినట్టూ, పక్షులన్నీ
కకావికలై ఎగిరిపోయినట్టూ, ఇక

నువ్వూ, నీ రొమ్ములూ, రెండు

భీతిల్లిన రాత్రుళ్ళు; పొగమంచు
వ్యాపించే సరస్సులు;
వొణికే నీడల లోకాలు; కాలాలు!
***
కావలించుకున్నావు నువ్వు; ఎంతో
దుఃఖంతో, ప్రేమతో;
ఇక ఆ రాత్రంతా, ఈ హృదయం

ఒక బాలికై, గుక్కపట్టి మూల్గుతో!

mirage

రాత్రిలో, తన నుదిటి కుంకుమ దీపమై వెలుగుతుందని ఆశించావు; చేతులెంతో చాచి - బహుశా, నీ ఇంటి ముంగిట నిల్చి ఎంతో ఆర్తితో, నిన్నెంతో అర్ధించిన బిక్షకుడ్ని మరిచావు - పిలుపులు వలయాలై, నీళ్ళయ్యీ లోన, ప్రతిధ్వనిస్తాయి; గొంతెత్తి అరిచే బుజ్జాయి అలాగే ఆకులు రాలిన నేలపై, నీడలతో 'అమ్మా' అనో, 'అంబా' అనో, వొణికి రగిలే ఆర్తనాదమై ... *** చీకటి, ఎవరిదో ఒక్క మాటా రాక నుదుటన దిగే మేకైతే, శిరస్సున ఒక ముళ్ళ కిరీటమైతే, ఏమీ చెప్పకు! అసలేమీ చెప్పకు శ్రీ! నెత్తురు గులాబీలతో తిరిగే, అందమైన మరీచికలకు!

25 December 2017

4 cold moments

1
మూసి ఉన్నాయి కిటికీ తెరలు,
పొడి చీకటి లోపల
అరచేతుల్లోని గీతలై, ఖాళీగా

ఎవరైనా ఉన్నారో లేదో తెలీక
2
"మనుషులు కావాలా, వొద్దా?"
అని అన్నావు నువ్వు,
నీ ముఖాన్ని ఊహిస్తాను నేను

మంచులో వణికే గులాబీగా!

బహుశా ఆవరణలో పూలై ఊగే
నీడలు; కాంతి కాడలు,
కాలం ఓ తూనీగై ఎగిరిపోతూనో

లేక రెక్కలు తెగి నీలోనే రాలో!
4
మరెక్కడో మనం; బహుశా. గాలి
లంగరేసిన పడవలో
తేలియాడే గాలి, కోసే ఓ ఈలై

శరీరం బద్ధలయ్యేంత శబ్ధమై!

23 December 2017

ఆవిష్కరణ

"పుస్తకం ఆవిష్కరణకి వస్తున్నావా?" / "లేదు. రావడం లేదు" / "అదేంటి? మరి దానికి ముందు మాట నాన్నగారు రాసారు తెల్సా?" / "శివారెడ్డి చాలా వాటికి ముందుమాటలు వ్రాసారు; ఆసక్తి లేదు అయినా నాకు" / "ఇక్కడి తెలుగు కవిత్వానికి దిశా నిర్దేశం చేసే కవిత్వమని అందరూ అంటున్నారు కదా" / అవునా?! ఆ అందరిలో నేను లేను. దిశమొలలతో ఉన్నవాళ్ళకు మరి అది కావొచ్చును; / " అంటే, నువ్వు ... /  నేను నాతో, నాలో

మునిగి ఉన్నాను; సంతోషంగా ఉన్నాను. I neither interested in literary politics nor in forewords! Or all those four words!  You see ... I am content with myself, writing myself with no self at all. All. Anything else, baby? / "బావుంది; నీతో ఇట్లా మాట్లాడటం చాలా బావుంది. ఉంటాను ఇక మరి!" / ( Of course

ఎక్కడ ఉంటావు నువ్వు? అసలు నువ్వు ఉన్నవా? నువ్వు ఉన్నావని నీకు తెలుసా అని నేను అతనిని అడగలేదు ) / ... 

PS: 
గాడ్! Can someone tell this asshole that there isn't any Srikanth here anymore! ఆmen! 

దాహం!

ఎంతో దాహం; గొంతో
ఎడారై తపిస్తో -
"చలికాలం ఎందుకు

నీకింత దాహం?" అని 
అడుగుతోంది
ఓ అమ్మాయి నవ్వుతో,

ఎదురుగా నీళ్ళ గ్లాసు,
దాదాపుగా మరి
అందినంత దగ్గరలో

అందక, దాహం తీరక! 

వంతెన

ఎన్నో మాట్లాడుకున్నాం; ఎన్నెన్నో
వేల పదాలు! మరి అవి,
వాన చినుకులో, మెరిసే చుక్కలో

కానీ, లెక్కపెట్టలేనన్ని! ఏవో, ఎన్నో
మాటలు! కొన్నిసార్లవి
ఆశ్రువులై, ఇంకొన్నిసార్లు నవ్వులై

ఒకోసారి వడలి, బల్లపై రాలిన ఒక
పువ్వో, వాలిన ముఖమో,
తాకాలనీ, తాకలేని చెయ్యో అయ్యి

ఎన్నో మాటలు! ఎక్కడికి పోతాయి?
ఎక్కడి నుంచి వచ్చాయి?
ఈ మాటలు? వెలుగై, చీకట్లై, రాత్రి

నీడల్లో ఊగే ఆకులై, ఆకులపై ఆగే
సీతాకోకచిలుకలై, మసక
వెన్నెల్లో వ్యాపించే పొగమంచై, ఇక

తెరలుగా తేలిపోయే, ఎవరో మనని
తలవగా పొలమారినట్టున్న
నీటి అలికిడి వంటి మన మాటలు?
***
ఎన్నో మాట్లాడుకోలేదు; ఎన్నెన్నో!
లోపలెక్కడో, ఇక నిన్ను
నింపుకున్న లిల్లీపూలు, రాత్రిలో

గూళ్లు లేని పావురాళ్ళై, వణికిపోతో! 

21 December 2017

కుమ్మరి

ఎంతో ఓరిమితో రెండు చేతులు
చీకటిని త్రవ్వి, రాత్రిని
ఓ మట్టికుండగా మారుస్తోన్నట్టు,

"అమ్మాయీ, తెలుసా నీకు? నీవు
ఓ కుమ్మరివని?" అని
నేను ఎన్నడైనా చెప్పానా నీకు?

రూపరాహిత్యం నుంచి రూపానికీ,
నింపడానికి ముందు
ఒక ఖాళీని సృష్టించి, సృజించి,

ఎంతో ఓరిమితో రెండు చేతులు
ఒక దీపకాంతిని చుట్టి,
గాలికి ఆరిపోనివ్వకుండా ఆపితే
***
ఎంతో అర్థంతో, రెండు చేతులు
రాత్రిలో ప్రాణవాయువై
తెగిన గొంతుకలో గుక్కెడు నీళ్ళై! 

15 December 2017

status

తెరిచిన కిటికీ పక్కగా ఒక్కదానివే,
రాత్రిని తాకుతో, రాలే
పసుపు ఆకులైన, కనురెప్పలతో,

ఎంతో చల్లగా ఉంది బయట. ఒక
చెట్టు, చీకట్లో; చేతులు
చాచి అలాగే నేల రాలిన వృద్దుడై,

"ఎవరు అది?" అడుగుతావు నువ్వు
ఎవరో చెప్పను నేను,
చేజారినవెన్నో, చెట్టుకేం తెలుసు?
***
ఎవరూ లేరు కిటికీ పక్కగా; నీడలు,
ఒట్టి నీడలు, పడగలు
విప్పి, రాత్రిలోంచి పైపైకి పాకుతో ..
.
భ్రాంతి! అంతా, సర్పరజ్జు భ్రాంతి!

08 December 2017

కోరిక

ఉదయాన్నే వెళ్లావు; ఇంకా, ఇంటికి
చేరుకోలేదు; మసకగా
మారుతోంది సాయంకాలం, దిగులై,

"బ్లీడింగ్ ఎక్కువగా ఉంది; నడుము
నొప్పి" అని కూడా
చెప్పి ఉన్నావు; మరి, ఆకులు రాలే

నీటి గొంతుకతో, ఎక్కడో తప్పిపోయి!
"ఎక్కడ?" అని నేను
అడగను; ఎందుకో నువ్వూ చెప్పవు
***
ఉదయాన్నే వెళ్లావు; ఇంకా, ఇంటికి
చేరుకోలేదు; నీ గొంతు
వినాలని ఉంది; నేల రాలిన పూలు,

నీ వేళ్ళై వణికి, కనులై మెరిసే వేళ,
ఊరికే అట్లా, నిన్ను
ఆనుకుని కూర్చోవాలనీ ఉంది; ఊ,

ఇంతకూ, ఎక్కడ ఉన్నావు నువ్వు ? 

06 December 2017

అవశేషాలు

వేలు కాలి ఉంటుంది
కాలిన మేరా ఉబికి, ఇంకా పగలని
ఒక నీటిపొర దానిపై,

"చూడెలా అయ్యిందో"
అని చూపిస్తావు కానీ, కాలినప్పటి
నొప్పి కనిపించదు,

నీ హృదయం కూడా
కాలి ఉంటుంది అలాగే; ఎప్పుడో!
నానమ్మ శరీరమై,

శ్మశానంలో, ఆ వేళ!
అక్కడ చితాభస్మమైనా మిగిలింది
కానీ, తగలబడి

నువ్వు రాలిన చోట,
ఏం మిగిలింది నీకు, నీ హృదయ
స్థానంలో? కాలి,

మిగిలిన ఆ ఖాళీలో? నిశ్శబ్ధంలో? 

04 December 2017

తెరలు

ఈ వీధి దీపాల కాంతిలో, అలలో
చెట్లో తెలియని నీడలు,
బాల్కనీలో ఎదుర్చూస్తో నువ్వు,

"ఎవరి కోసం?" అని, అడగాలని
ఉంది. జవాబులు మరి
అంత సులువుగా రావని తెలిసీ!

నింగిలో, జ్వలిస్తో జాబిలి. మరి
ఎందుకో దానిని, ఒక
పసుపు గులాబీలా ఊహిస్తాను

గాలికి ఊగిసలాడే దీపశిఖలాగా
చీకట్లో, ఊచలపై అలా
చేతులు ఉంచి, చూసే నీలాగా!
***
వీధి దీపాల కాంతిలో ఈ మంచు,
బహుశా నీ భాష; మాటా ...
ఎవరో నడిచి వెళ్ళిపోయినట్టు

ఆరినా, స్మృతిలో వెలిగినట్టు!

02 December 2017

ఇట్లాగా? ఏమో

1
రాత్రి, వెన్నెలతో కూడి
రగిలింది;
అత్తరులో నానిన ఒక
చంద్రబింబం
ఆమె ముఖం;
ఎలా?
2
పుడమి అంతా చీకటి
సువాసన;
పసిచేతులేవో నిన్ను
తాకినట్టు,
ఒక పురాస్మృతి!
ఇలా!
3
పొగమంచులో కదిలే
లిల్లీపూలు
ఆ కనులు; గూళ్ళల్లో
మెసిలే మరి
పావురాళ్ళు;
శబ్ధాలూ!
4
"రానివ్వను లోపలికి
ఎవ్వరినీ!"
ఒట్టు పెట్టుకున్నావు
నీకు నువ్వే
వానలో, గాలిలో
వేలితో వ్రాస్తో!
5
ఆకులు రాలి పొర్లే వేళ
నీడలు మరి
హంతకులై బాకుల్తో
దిగబడే వేళ
ఏది సాయంత్రం,
ఏది రాత్రి?
6
అద్దంలో నవ్వుతోంది
ప్రతిబింబం;
అమ్మా, ఈ జనుల
జాతరలో,
మళ్ళా హృదయాన్ని
జారవిడిచాను;
ఎప్పటిలాగే!
7
రహదారి పక్కనో మరి
దయలేని
వాహనరద్దీలోనో మరి
ఎప్పటికీ రాని
తల్లికై ఎదురుచూసే
బాలికై; కాలం!
8
గులాబీని కోరుకున్నావు
హృదయం
నెత్తురులో తేలింది;
ఇంతా చేసి
ఏం మిగిలింది నీకు
ఓ ద్రిమ్మరీ?
9
ఛాతిపై ఇంకొక గాయం
ఎగిసే నెత్తురు
గంధంతో ఓ ముఖం;
కొనగోటితో
కనుపాపపై గీరినట్టు
ఈ కవితా!

చాలావా ఇవి?