29 December 2016

పరామర్శ

/ "ఏవయింది?" / "జలుబు" /
/ "అవునా! హ్మ్...
మరేమైనా వేసుకున్నావా?"
/ "ఊహు. లేదు" /
/ "ఓ! ... మరి
నీకు ఇబ్బందిగా లేదూ?" /
/ "లేదు ... " /
/ "ఉండదులే... డోంట్ వర్రీ ...
ఎందుకంటే ...

/ ... ముక్కు చీదడానికీ
స్ఖలించడానికీ
పెద్దగా తేడా తెలీదుగా మీకు ...
మరేం పర్లేదు
అదే ఎప్పటికో ఒకప్పటికి
సర్దుకుంటుందిలే
పోయి పడుకో" /

"..." 

23 December 2016

రహస్యం

పిల్లలు లేని పక్క: ఇంకా పోని
పసివాసన: దిండుపై -
ఓ చిన్న అరచేయి చెవిని 
నిమిరినట్టూ, గట్టిగా
అతనిని వాటేసుకున్నట్టూ ... 
***
గాలి అతని చుట్టూ వేణువైతే 
ఒక సువాసనలోకి 
ఇక అతను పునర్యానమై... 

ముద్దు

గాలిలో తేలే ఆకులు, నీ పెదిమలు -

రెండు నెలవంకలు అవి. సూర్యరశ్మిని 
నింపుకున్న రెండు వెచ్చని 
సరస్సులు అవి. తీరం లేని ప్రయాణం 
అవి. రెండు  పడవలూ అవి -
ప్రియమైన రెండు కృష్ణబిలాలూ కూడా 
అవి. అవే: నీ పెదిమలలలు... 

వాటితో నువ్విక అట్లా, అతని పెదాలని 
కొరికి లాగి వొదిలితే, చూడు 

సముద్రాలకుపైగా చీకట్లో చుక్కలవైపు 
గాలిలో తేలే ఒక ఆకై, ఆవిరై 

ఒక పిట్టై ఎట్లా ఎగిరిపోతున్నడో అతను!

21 December 2016

దినాంతం

"నొప్పి" నడవలేక గొణిగింది తను -
"తగ్గిపోతుంది. కొంచెం
ఓపిక పట్టు" అన్నాడు అతను -

వాళ్లకెదురుగా రహదారిపై చీకట్లో
విసురుగా వాహనాలు -
ఒకటే కరకు శబ్ధం: రంపపు పొట్టు ...
***
ఇక వాళ్ళు రోడ్డు దాటుతూ ఉంటే
ఫ్లైఓవర్ కింద ఎవరో
"అమ్మా" అంటో మూల్గిన శబ్ధం!

17 December 2016

ఎందుకు

అమ్మ ఇంటికి వచ్చింది. వస్తూ
ఏవేవో తెచ్చింది. తన
చుట్టూ మూగిన పిల్లలు ఒకటే
హడావిడి: తేనె పిట్టలై -

ఎప్పటికో రాత్రి అయ్యింది. తన
హృదయం ఇక, ఒక
మైదానమయ్యింది. చెట్ల కింద
వెన్నెల్లో, చినుకుల్లో

ఏవేవో చప్పుళ్ళు. పాల వాసన - 
చొంగతో నిదురలో ఊగే
పూలు: మంచులో సెలయేళ్ళు.
ఏవేవో కలవరింతలు -
***
అమ్మ ఇంటికి వచ్చింది. వచ్చి
అందరినీ బజ్జో పెట్టింది -
ఆ గూటిలో నువ్వూ నిదురోక

ఇట్లా, వ్రాసుకోవడమెందుకు?  

drilling

శీతాకాలపు ఎండ: చల్లని గాలీ -
పాకుడు రాళ్ళపై
నిరంతరంగా నీళ్లు పొర్లే చప్పుడు
లోపలి నగరంలో -
***
ఎవరూ లేక ఇట్లా మిగిలిపోవడం
ఒకోసారి ఎంత కష్టం!

14 December 2016

తటిల్లత

వెలసిపోయి ఉన్నాయి గోడలు, కాంతి లేక -
వాటిపై పసుపు ఛారలని తాకుతూ
కొమ్మలు. ఊగీ ఊగక, సంధిగ్ధంగా ఆకులు -
దాదాపుగా, వాన పడేట్టుగా ఆకాశం -

రెండు చేతులనూ బల్లపై ముడిచి, ఓరగా 
వాటిపై తలను వాల్చి, కిటికీలోంచి
బయటకు చూస్తూ పడుకుని ఉంది తను
అటూ ఇటూ ఊగే గాలై, కనులై. ఇక

సరిగ్గా అప్పుడే,  సరిగ్గా ఆ క్షణానే, అక్కడే
జీవించడం అంటే ఏమిటో మరి 
ఆకస్మికంగా తెలిసి వస్తుంది నీకు: వానై!

to be

పూలు జలదరించినట్టు
వెలుతురు
చుట్టూ రెండు చేతులు
సువాసనై ...
***
ఓహ్ -
బ్రతికే ఉన్నాను నేను!

దిగ్బంధనం

దీపం ఆర్పివేసినట్టు, మసక చీకటి -
నయనాలు స్థంబించినట్టు
ఆకులు. చెట్లు. శ్వాసలేని గాలి. లోన
ఒదిగి ఒదిగి ఈ దినం: నువ్వూ
నేనూ ఏమాత్రం తాకలేని ఈ లోకం

దీపం ఆరి సన్నటి పొగ ఎగసినట్టూ
ఆ పొగలో స్మృతి ఏదో
మెరిసినట్టూ, అంతలోనే తటాలున
ఎవరో వెళ్ళిపోయినట్టూ...
***
అవును లీలా, నువ్వన్నది నిజమే
ఇది, ముసురు పట్టి
నిన్ను ఒలిచి వేసే లోహకాలం!  

13 December 2016

చూడగలిగితే

నిద్రలో పక్కకి ఒత్తిగిల్లి, అతనిని దగ్గరికి
లాక్కుంటావు నువ్వు -
సరిగ్గా అక్కడే, నువ్వు చేయి వేసిన చోట
ఎవరో చీకట్లో, వెన్నెలని
ఛాతిపై రుద్దినట్టు కొంత కాంతి: లోపల -
ఎవరో నేల పరిమళాన్ని
వెదజల్లినట్టు, వేలపూల తోట: లోపల -
ఇక మంచులో, సరస్సులో
పడవై అతని ప్రాణం మెల్లిగా తేలిపోతే
***
స్వర్గలోకాలు ఇక్కడే: నేను నిన్ను
చూడగలిగితే, వినగలిగితే! 

10 December 2016

ఒకసారి

నిద్రపోయి ఉంది తను: బయట
ఆడుకుంటూ పిల్లలు -

శీతాకాలపు గాలి. ఎక్కడినుంచో 
పావురాళ్లు రెక్కలు 
విదుల్చుకునే చప్పుడు. ఎండా -
రెపరెపలాడే దుస్తులు 
బాల్కనీలో: కుండీలపై నీడలు -
వెరసి ఒక మధ్యాహ్నం
నిద్రపోయి ఉంది తాను, అలసి -
ఇక, తన కలల తోటలో
మునివేళ్ళ మీద తిరుగాడుతూ 
ఇద్దరు పిల్లలూ, ఓ కవీ 

మరి అతనీదే అయిన ఓ చిన్ని 
చిన్ని పొయెమ్! 

09 December 2016

దేశభక్తి

బారులు తీరి, దారి పొడుగూతా మనుషులు -
మధ్యలో ఎక్కడో  ఓ పక్కగా ఒరిగి
మెట్లపై కూర్చుని, తెల్లని వెండ్రుకలని వెనక్కి
తోసుకుంటూ, నొప్పెట్టే  మోకాళ్లని
రుద్దుకుంటూ ఎండలో ఒకావిడ: ఒక అమ్మ -
ప్రతిఫలిస్తూ ఎండ: కోస్తూ గాలి. మరి
వెరసి మొత్తంగా జీవితం, ఒక బాంక్ ముందో
ఒక ATM ముందో నిస్సత్తువైతే
***
ఇంతకాలం దేశభక్తి ఒక ఆవు. పరద్వేషం -
ఇప్పుడు మాత్రం, నడిరోడ్డుపై
2000 వేలకై సొమ్ముసిల్లిన ఓ తల్లి. గుండాగిన
ఓ తండ్రి: చెమ్మగిల్లిన కళ్ళల్లో

మిగిలిపోయిన, ఓ 500 రూపాయల కాగితం!   

అంతిమ ప్రశ్న

నేల అంతా కాంతి. ఆకులు
కదులాడే నీడలు. రాత్రి
కురిసిన మంచు. పూవులూ -
చివరిగా అంది తను:

"పూరేకులు రాలే శబ్ధాన్ని
ఏనాడైనా నాలో
వినగలిగావా నువ్వు ?"

జవాబు

వేలి చివర నుంచి, ఒక నీటి చుక్కను
అతని నుదిటిపై రాల్చి "నేనొక
వనకన్యనూ, వానచినుకునూ. తెలుసా
నీకు ?" అని అడిగింది తను -
కానీ అప్పటికే, తనని గట్టిగా పట్టుకుని
నిద్రపోయి ఉన్నాడు అతను!

08 December 2016

దృష్టి

అతి జాగ్రత్తగా ముక్కలని ఏరి, ఇంటిని
సర్ది పెట్టింది తను. ఈలోగా
సాయంత్రం అయ్యింది. చీకటీ పడింది -
కొంచెం గాలీ వీచింది. అయితే

ఇంటికి తిరిగి వచ్చి, దుస్తుల్ని విప్పుతూ
అతను, పగిలిన పాత్రని కానీ
తనలో లేని పూలని కానీ, వేర్లు తెగిన ఒక  
మొక్కని కానీ తనని కానీ, మరి

ఎందుకనో, అస్సలు గమనించనే లేదు!

ఇద్దరు

చీకటి ఒడ్దున ఇద్దరు: వాళ్ళ లోపల
చుక్కలతో మెరిసే నీళ్ల శబ్ధం -
వెన్నెల ఇసిక. గవ్వలూ, పీతలూనూ:
ఎక్కడో  మిణుకుమంటో దీపం -
***
తెప్పకింద చేరి రాత్రి, ఇక వాళ్ళతో 
అక్కడే ఆగిపోయింది!


కారణం

కర్టెన్లు వేసి ఉన్నాయి. చీకట్లో వెలుతురు
వలయం ఒకటి పావురమై
అతని భుజంపై వాలితే, తన ముఖాన్ని
ఛాతిపైకి జరుపుకుంటూ

తనలో తాను గొణుక్కుంటాడు అతను -
"నువ్వు కాదా? మరొక రోజు
మరొక సారీ, బ్రతికి ఉండేందుకు నాకు
మిగిలిన, ఒకే ఒక్క కారణం!"

తెరపి...

రెండు శీతాకాలపు రాత్రుళ్ళ మధ్య పెద్దగా
ఏమీ జరగలేదు -

అన్నం వండి, ఆరేసిన దుస్తులను తెచ్చి
నెమ్మదిగా మడత పెట్టుకుంటూ
కూర్చుంది తను. ఎదురుగా అతను: ఒక
పుస్తకంతో, పేజీల చీకట్లలో, ఏవో

చుక్కలతో, గాలితో, గూళ్ళలోని పక్షులతో -
***
రెండు శీతాకాలపు రాత్రుళ్ల మధ్య, పెద్దగా
ఏమీ జరగలేదు కానీ
ఇద్దరి మధ్యా, ఆరిన దుస్తులలోంచి ఎగిరే
లేత ఎండ వాసన! 

07 December 2016

ఆ పిల్ల...

నిమ్మకాయ రంగు ఎండ పిల్ల, అక్కడే
ముఖమంతా కోపంతో -

"అలా ఉండకు: వేసవి తెలుసు నాకు"
అని కూడా చెప్పాను నేను -
కానీ, వేసవి రంగు పిల్ల ముఖం తిప్పదు
నాపై ఇంత నీడ ప్రసరించదు!

"పోనీ, నేనేమైనా చేసానా చెప్పు?" అని
కూడా ప్రార్ధిస్తానా మరి నేను
నీడలు దోబూచులాడే నీలి కళ్ళ పిల్లతో
"హె పో: నాతో మాట్లాడకు -"

అని అరుస్తోంది, అంతలోనే నాపై పడి
రక్కుతోంది, గండుపిల్లిలా
ముఖం పెట్టుకొని, మిడి గుడ్లేసుకుని
చూస్తోంది, గుర్మంటోంది

ఛాతిపై కుంకుమై చెదిరి, రాత్రి అంతా
ఆగక ఒకటే కురుస్తోంది

ఎండలో చిట్లిపోయిన, నా వానాకాలపు
బేల కళ్ళ  పిల్ల! 

పోలేక...

పొరలుగా చీకటి: రాత్రి -
త్రవ్వుతున్న శబ్ధం
ఎవరో వెళ్లిపోయినట్టు -
లోతుగా దిగబడి
క్షణకాలమాగిన పలుగు
ప్రేమా దయా నీవు -
***
ఇక, రాత్రంతా బయట
వెన్నెల్లో రాలిన
పూలు, గాలికి మోకరిల్లే
ఆశ్రు దృశ్యం!

స్పృహ

రాత్రి ఎప్పుడో, మ్రాగన్ను నిద్రలో నువ్వు
నా గుండెల మీద తల ఆన్చితే
ముసురు చీకట్లలో అవిసె చెట్లు వొణికిన
జ్ఞాపకం: హోరున వీచిన గాలికి

ఆకులు రాలి, వెన్నెల చెదిరి, అలలపై
మరోవైపుకు తేలిపోతే, నీ చిక్కటి
కురుల కింది కళ్ళల్లో, పండిన గోరింట
వాసన. ఛాతిపై ఒక గాటు: చెమ్మ -

రాత్రుల కలవరింత. బ్రతికి ఉన్నాననే
స్పృహ. కానా తరువాతే ఎందుకో
నీ తల అనిన చోట, వలయాలు ఏర్పడి
హృదయం పునర్యానమయ్యే వేళ

రాత్రే ఎక్కడో, దారి తప్పిపోయింది!