30 June 2013

అంతే

గాలికి కొట్టుకుంటాయి కిటికీ రెక్కలు, ఒక మధ్యాహ్నం అప్పుడే జన్మించిన తేనె పిట్టలని చూసి నీ కనురెప్పలు రెపరెపలాడినట్టు - ఒక చెమ్మ నీ కనుబొమ్మల కిందుగా, మరి నక్షత్రాలేవో చమ్కీలై మెరిసిపోయినట్టు. పని చేసుకుని వచ్చావు కదా అప్పుడే, మరి

శ్రమ కూడా మెరుస్తుందని తెలిసింది నాకు ఆనాడే. కానీ ఇలా చెప్పనా నేను నీకు,ఈ రోజు? ఆ రోజేమో నీ చేతులు, నన్ను అల్లుకున్న గూళ్ళు-తోటలోనుంచి నువ్వు కోసుకు వచ్చిన తాజా ఆకు కూరలు. మెరిసాయి ఆనాడు నీ చేతులు ఒక చల్లటి మట్టి వాసనతో. ఎలా అంటే నీ శరీరమే ఒక పూలపొదై, ఇక్కడ నా ఛాతిలో, వానలతో విరగ బూసినట్టు-మరి

అవేమి పూవులూ అని, అవేమి ఆకులూ అని నువ్వు అడిగితే నాకూ తెలియదు. పక్షుల రవళుల కింద లతలేవో నెమ్మదిగా అల్లుకున్నట్టు, నా చేతివేళ్ళని ఆనాడు చుట్టుకున్న నీ చేతివేళ్ళ జ్ఞాపకం- ఇప్పుడు కనిపించని ఒక గాయం- ఇక ఏమీ చేయలేక 

ఇలా కిటికీ పక్కన కూర్చుని ఉంటే, వేగంగా రుతువులు మారాయి. ఆకులు రాలిపోయాయి. గూళ్ళని వొదిలి పిట్టలూ ఎగిరిపోయాయి. చెట్ల కిందుగా పడి ఉన్న- ఎవరూ తాకని -విరిగిన ఖాళీ మట్టి కుండల వలే, నా అరచేతులు మిగిలాయి-

"సరే, సరే, అది సరే కానీ, అంతిమంగా నువ్వు చెప్పొచ్చేది ఏమిటీ ఇంతకు?" అని మీరు నన్ను నిలదీసి అడిగితే , ఏమీ లేదు. ఇక్కడ. మృత్యుశయ్యపై ఉన్న శిశువుని ఆఖరి సారిగా చూసుకుంటూ ముద్దాడే ఒక తల్లి శ్వాస. ఉగ్గ పట్టుకుని తన చుట్టూ తిరిగే గాలి. కొంత నిశ్శబ్ధం. కొంత దిగులు. మరి కొంత, ఇలా గడచిపోయే కాలమూ, వాలిపోయే ఆకాశమూనూ- 

ఏంటంటే, ఈ రోజు ఇక్కడిలా ఊరికే, వీటన్నిటితోనూ, వీటన్నిటిలోనూ 'ఉన్నాను' అనే స్పృహ బావుంది- అంతే. ఇంకేం చెప్పను?  

29 June 2013

ఆ ఒక్క రోజు/how to name it

ఎత్తుగా పెరిగిన ఆ చెట్లల్లో, గాలికి రాలే ఆకుల కింద నడిచాం మనం-

నా చేతిని నీ చేయి , క్షణకాలం తాకీ తాకనట్టు తాకితే, మన పాదాల  
కింద నీడలు జీవంతో కదులాడాయి. ఇక
అప్పుడు, ఎక్కడి నుంచో, ఒక పక్షి కూత:

పిచ్చిగా, చక్కగా, పెరిగిన మొక్కల మధ్య ఏర్పడిన చిన్ని గుంటలలో 
చేరిన నీళ్ళల్లో తేలే మబ్బులు. తూనీగ
ఏదో అప్పుడు నీ ముందు కదిలీ మెదిలీ 
వాలితే, తూగుతుంది ముందుకు, ఒక

ఆకుపచ్చని గడ్డిపరక, రాత్రి చాలా ఇష్టంగా దాచుకున్న ఒక మంచు 
బిందువుని, మట్టి చేతులలోకి, ప్రేమగా 
వొంచుతూ. అప్పుడొక నిండైన నిశ్శబ్ధం 
నీ చుట్టూ, నా చుట్టూ. సీతాకోక చిలుక 

రెక్కల కింద వినిపించే ఒక లేత ఝుంకారం, విత్తనంలో తొలి చివురు 
ఏర్పడుతున్నట్టూ, రంగు చేరుతున్నట్టూ-
ఇక అప్పుడు, చప్పున నా అరచేతిని నీ 
అరచేతిలోకి తీసుకుని, నొక్కి, అన్నావు 
కదా: 'చూడు, చూడు, అటు చూడు' అని-

మరి చూస్తున్నాను నేను ఇప్పుడు, అటు 
వైపు, నీ చేతి వేలు ఏర్పరచినా దారి వైపు-
కాకపోతే, అర్పితా సేన్, ఇప్పుడు అక్కడ నువ్వూ లేవు, ఇక్కడ ఇలా  
మొండి చేతులతో మిగిలిన నేనూ లేను-

ఇక ఈ పదాలకి ఏమని పేరు పెట్టను నేను?

28 June 2013

అమ్మీ

1
సాయిబు ఎవరో సాంభ్రాణీ ఊది, తన చేతిలోని నెమలీకల గుచ్ఛాన్ని
నీ తలపై ఉంచి దీవించినట్టు, నువ్వు మరచిన వారెవరో
-ఈ నగర రణగొణుధ్వనుల్లో- నిను తట్టి పిలిచినట్టు, ఈ
చల్లని గాలి-

నీ కళ్ళ పైకి చినుకుల్లా జారుతూ, ఈ కాలుష్యంలో
నీ కళ్ళను శుభ్రం చేస్తూ అదే:నీ తల్లి నీకు తలంటు
పోసాక, తల తుడిచి, నీకు ఇంత ఉప్పుని తినిపిస్తే

కళ్ళు మంట పుట్టి నీళ్ళు తిరిగి, నీ చూపు శుభ్రంగా
మారుతుంది చూడు అలా: ఇక నువ్వు నీ తల్లి బొజ్జ
చుట్టూ చేతులు వేసి కావలించుకుంటే, పారుతుంది
గోరువెచ్చని వెలుతురు,హాయిగా, తన శరీరంలోంచి

నీ శరీరంలోకి- బయట గూళ్ళల్లో ముడుచుకున్న ఆ
చిన్ని చిన్ని ఊదా రంగుల పిట్టలు గుర్తుకు వస్తాయి
నీకు అప్పుడు: పైనేమో, కొంత లేత కాంతి తాకగా
కింద నేలపై మువ్వల్లా అలికిడి చేసే వేపాకుల నీడలు- ఇక అప్పుడు
2
నీ తల్లి ఆ దినాన తన పనికి వెడుతూ వెడుతూ, తను
నిన్ను దగ్గరగా తీసుకుని నీ నుదుట ముద్దాడితే,అదే
ఇక నీ రక్షణ కవచం. నిన్ను కాపాడే దైవ సింధూరం-
నీ జీవితానికి కట్టిన తాయెత్తూ, మరి అదే నీ లలాట లిఖితమూనూ-
ఇక ఇప్పుడు
3
రుతువులు మారి, లోకాలు మారి, కాలాలూ మారి, ఇదిగో ఇక్కడ
ఈ లోహ దర్పణాల మధ్య కూరుకుపోయి ఉన్నాను, దారి
తప్పిన ఒక సీతాకోక చిలుకని చూస్తూ, యంత్రాల ఊబిలో-

మరి అమ్మీ, ఎక్కడ వొదిలివేసాను, నను అపురూపంగా
కాపాడుకున్న నిన్నూ, చీకటిలో దీపాలు వెలిగించి నను
కడు జాగ్రత్తగా దాచుకున్న నీ అరచేతులనూ?

27 June 2013

అస్పష్టత

నిలువెత్తుగా పెరిగిన ఈ చెట్ల కిందుగా నడుస్తూ ఉంటే, గుసగుసల వంటి ఆకుల సవ్వడి మధ్య నుంచి ఒక పక్షి అరుపు - పరాకుగా నడిచే నిన్నెవరో చప్పున నీ చేయి పట్టుకుని లాగితే, ఉలిక్కిపడి చూస్తావు కదా, అలా ఉంటుంది అప్పుడు నీకు: నిద్రలోంచి ఇంకా పూర్తిగా మెలకువలోకి రానట్టు, మరొకరి కలలోని రంగు ఏదో, కళ్ళను రుద్దుకునే నీ అరచేతుల్లోకి చేరి, నిన్ను విభ్రమ పరచినట్టూ, ఏది కలో ఏది వాస్తవమో పూర్తిగా తెలియనట్టు, తెలియ రానట్టూ- 

'అప్పుడు, నాలో ఎవరో చేతిని జొనిపి, నా గుండెను తమ పిడికిట్లో బిగించినట్టయ్యింది', అని నీతో ఎవరో, ఎప్పుడో అన్న మాటో, నువ్వు చదివిన ఒక కవితా వాక్యమో తటాలున స్ఫురిస్తుంది నీకు: ఒక ఎదురు రాయికి మోదుకుని, గోరు చీలిపోగా అప్పటి దాకా స్పష్టత లేని లోకం కాంతులీనుతూ కనిపించినట్టు-
     
మరిక, ఏమీ చేయలేవు నువ్వు, అప్పుడు: ఈ జీవితపు తపనని అంతా ఒక స్వరంలోకి కుదించి, ఒక ప్రార్ధన వలే, నేలకు తమ శిరస్సులు వంచిన ఆకుల మధ్య నుంచి, నిన్ను నీ మోకాళ్ళపై ఒరిగి పోయేలా చేసిన ఒక గొంతు వలయాలుగా నీ వైపు దూసుకుని వచ్చినప్పుడు-
     
ఇక ఏమీ చేయలేక, నిస్సహాయుడివై తల ఎత్తి ఆకాశంలోకి చూస్తే కన్నీటి పొర వంటి వెలుతురు. చిన్నగా ఊగే కొమ్మలు. శిశువుల గుప్పిట్లలోని లేతేరుపు రంగు వంటి పూలు. తల్లి చూచుకంపై మిగిలిపోయిన పసి పెదాల తడి వంటి గాలీనూ. ఇక
     
కనుచూపు మేరా పరచుకున్న ఒక ఎదురుచూపులో, ఆ రాళ్ళ పక్కగా నిలిచిపోయి ఎండిపోతున్న ఓ నీటినవ్వులో, ఒక నీడ, ఖాళీ బాహువులంత ఒంటరిగా మారి , ఇక్కడ నిలువెత్తుగా పెరిగిన చెట్ల కిందుగా ఎదురుపడితే, నేనేం చేయను-? 

26 June 2013

వస్తావా నువ్వు

ఇదేదో  గాలి ఇక్కడ. దీనిని ఎలా, ఏమని పిలవాలో కూడా తెలియదు-

పిల్లలు గీసినట్టుగా కాంతి. వాళ్ళ పసి పాదాల మల్లే కదిలే 
ఆకులు, అవి చేసే శబ్ధాలు. లోకానికి తలంటు పోసి
సాంభ్రాణీ వేసినట్టు, ఒక మంచు తెర, ఒక సుగంధం-

ఇదేదో దారి ఇక్కడ. దీనిని ఎలా, ఏమని పిలవాలో కూడా తెలియదు-

ఎవరో అభివాదం చేసినట్టు ఉండే కొండలూ, వాటిని 
తమలో ఇముడ్చుకునే నీటి చెలమలు. నేనో కవిని 
అయి ఉండినట్టయితే, నే రాసే పదాలన్నిటినీ వొదలి
మట్టి పక్కగా విచ్చుకునే ఈ చిన్ని పూవు ముందు మోకరిల్లి ఉందును. 

ఇక చిన్నగా నడిచే, నడకే జీవన పరమార్థంగా మారిన ఒక ప్రాణికి, ఎక్కడో 
ఎవరో పిలిచినట్టు ఒక పక్షి కూత.ఎగిరే తూనీగలపై 
తేలిపోయే మబ్బులు. చుట్టూతా ఒక పచ్చి శ్వాస-
నీ హృదయంపై ఎవరో వేళ్ళతో నిమురుతున్నట్టు

నీ చుట్టూతా ఎగిరే పురుగులు. చెట్ల మొదళ్ళలోని 
చెమ్మ. చెమ్మగిల్లి దయగా కనిపించే రాళ్ళు. చుట్టూ 
ఇంకా రూపాన్ని అంతరించుకోని నీడలు, ఉమ్మనీటిలో ఊగే శిశువుల వలే- 
ఇక ఏమంటావో నువ్వు దీనిని కానీ,నేనడుగుతాను 

నిన్ను ఇలా: వస్తావా నువ్వు, ఇక్కడికి? ఇలా నా చేయి 
పట్టుకుని? తూర్పున ఒక అమ్మ సింధూరం వికసించే 
ఈ వనాలలోకీ, ఇంద్రజాలాల కాలాలలోకీ లోకాలలోకీ-? 

25 June 2013

తలుపులు

నిన్నటి దాకా ఈ మొక్క ఇక్కడ లేదు

తలుపు చాటు నుంచి తొంగి చూసే పాపలా, ఈ పూట అది, కిటికీ పక్క నుంచి నా వైపు తొంగి చూస్తుంది. కానీ, ఆ పాప చూపు ఎటువంటిది అయ్యి ఉండవచ్చు? ఎటువంటిదైనా అయ్యి ఉండవచ్చు. నువ్వేం చేస్తున్నావో అని, కుతూహలంగా చూస్తుండవచ్చు. లేదా, నువ్వు కసిరి విసిరికొట్టిన తరువాత దిగులుతోనూ, బాధతోనూ వెక్కిళ్ళుగా మారిన చూపులతో బదులిస్తుండ వచ్చు. లేదా, తలుపు సందున వేళ్ళు నలిగి, కనుల రెమ్మలు కన్నీళ్ళతో తెగి, ఏడుపు గొంతులో ఇరుక్కుపోయి, సహాయానికి నీవైపు నిస్సహాయంగా చూపుల చేతులు చాచి ఉండవచ్చు. అవును 

ఈ రోజులు 
సగం మూసిన తలుపులు 

నిన్నటి దాకా ఉండినది ఏదో, ఈ రోజు మాయమవుతుంది 
ఈ రోజు ఉండినదేదో రేపటి కోసం 
ఈగ ఇరుక్కున్న సాలెగూడులా 
జిగటగా, సాగుతుంది-

ఆమె 
తలుపుల మధ్యకు తన చేతి వేళ్ళని చాచింది 
ఆగిపోతున్న ఊపిరిపై శ్వాసను నింపేందుకు-
ఇక 

ఒక శబ్ధం. ఒక పదం. విసురుగా మూయబడిన 
తలుపుల మధ్య చితికిపోయిన వేళ్ళు.చూపులు-
నిజం 

నిన్నటిదాకా, ఈ నెత్తురు వేళ్ళ మొక్క ఇక్కడ లేదు-
--------------------------------------------------
01-05-98/09-05-08. రాత్రి 11.-30- 12. 15

24 June 2013

నువ్వు వెళ్ళని చోటు

ఒకరోజు పావురం చనిపోతుంది. గాయపడిన తన రెక్కలను నిమిరి, నీ కనుల ఛాయలో కడు జాగ్రత్తగా, తల్లి బాహువులంత ఇష్టంతో దాచుకున్న, నువ్వు పెంచుకుందామని అనుకున్న ఆ పావురం ఒకరోజు ఆకస్మికంగా చచ్చిపోతుంది. నల్లటి చందమామ వలే, నక్షత్రాలు మెరిసే రెక్కలతో, తామర తూడు వంటి పాదాలతో, రాత్రి భోజనాల వేళకు నీ వద్దకు గునగునా నడుచుకు వచ్చే పావురం చచ్చిపోతుంది. ఎలా?

ఒక రోజు ఎగురుదామని ప్రయత్నించి, సఫలం కాలేక, ఎవరూ లేనప్పుడు, తొట్రువడి, నీటి తొట్టిలో పడి, లేవ లేక, గాయపడిన రెక్కలతో ఎగరలేక, అరవలేక, నిన్ను పిలవలేక, తనను అంది పుచ్చుకుని మృదువుగా బయటకు లాగే అరచేతులేవీ లేక, చచ్చిపోతుంది. ఇక చాలా రోజుల తరువాత 

ఒకరోజు నువ్వు, నీటి పొరల మధ్య లోకాలని చూద్దామని, ఈత రాక, ఆ నీటి  మధ్యకు జారినప్పుడు నీ శరీరం ఊపిరికై, నీళ్ళను దాటిన లొకాలకై విలవిలలాడుతుంది. ఇక అప్పుడు నీలో ఒక నిశ్శబ్ధం. అన్ని రోజులూ నీటిలో మరణం ఎలా ఉంటుందని లేదా నీటిలో పావురం మరణం ఎలా ఉంటుందని ఒక పసితనపు కుతూహలం. ఇక 

అప్పుడు నీకు ఆకస్మికంగా అర్థమౌతుంది. మరణం నిశ్శబ్ధం. బ్రతకాలని కోరిక ఉండి, ఎప్పుడైతే నువ్వు బ్రతకలేవో అది మరణం. ఆశ లేదు. నిరాశా లేదు. స్తబ్ధత. సహాయ, నిస్సహాయ మధ్య సీమలో, నింగిలో ఒంటరిగా సంచరించే డేగలాంటి నిశ్శబ్ధమది. నువ్వు లోపలి రాగలవా? నీ కనురెప్పలను ఎత్తి 

అనంతాకాశంలో గిరికీలు కొడుతున్న డేగను గమనించగలావా? అది నేను. నది అంచున నిల్చి, నీటిలోని ప్రతిబింబాన్ని గమనిస్తావా లేక నీటిలో వేళ్ళ తాకిడికి ప్రకంపనలుగా విస్తరించే ప్రతిబింబాన్ని ఇష్టపడతావా? నిశ్చలంగా ఉండాలని చెప్పకు. ఎదురుగా పూల పొదలా, పదిలంగా వికసించిన ఇంద్రధనుస్సులా కూర్చుని అలలు మెలికలుగా, సర్పాల నృత్యంలా ఎందుకు ఉన్నదని ప్రశ్నించకు. నది కావొచ్చు 

సముద్రం కావొచ్చు, జీవ చలనంతో ఉట్టి పడేదేధైనా కావొచ్చు. నిశ్శబ్ధంగా ఉండాలని ఎందుకు కోరుకుంటావు? ధూళిలా, గాలిలా, పరిసరాలలో అధ్రుస్యంగా కదులాడేదే జీవితం. సూర్య కిరణాలతో యుద్ధం చేసే ఆకుల నీడలు జీవితం. కదలిక- నువ్వు ఊహించలేనంత కదలిక. చలనం. దేహం లోపల కదలిక - ఒక మహా యుద్ధం. ప్రతి రోజూ 

ఈ శరీరపు నెత్తురు తొట్టిలో పడి  వేల పావురాలు మరణిస్తాయి. సన్నటి మర్రి ఊడల లాంటి నరాలకు ఉరి వేసుకుని నిర్జీవమవుతాయి. అంతా ఉన్మాద పూరితమైన రణరంగం. ఎక్కడ తాకినా తడిగా తగిలే గాయాలు. ఇక నిశ్శబ్ధంగా ఎలా ఉండగలను? 'సహజం'గా ఎలా ఉండగలను? రా మరి కొద్దిగా దగ్గరగా. తాకు నన్ను అంటీ అంటనట్టుగా. ఇక 

ఇక్కడ మాయమయ్యి మరో ప్రపంచంలో ప్రత్యక్షమవుతావు: ఎక్కడంటే, ఎక్కడైతే విశాలమైన నీలాకాశంలో స్వేచ్చగా విహరించే పక్షిని తాకగాలవో, ఎక్కడైతే కనులలోని నీటిని వేళ్ళ కొనలతో తుడిచి వేయగలవో, ఎక్కడైతే నీటి ఆగాధాలలో తప్పిపోయిన ఒక పూవునీ ఒక పావురాన్ని బ్రతికించుకోగలవో - అక్కడ. మరి 

వస్తావా ఇక్కడికి, నువ్వు ఎప్పుడూ వెళ్ళని అక్కడికి?
--------------------------------------------------
14/02/1997. సాయంత్రం 15:00 - 16:00-

ఇర్ఫాన్

అతను నా స్నేహితుడు. ఇర్ఫాన్. ఇరవై ఏళ్ళు. ఇద్దరు చెల్లెళ్ళు. అమ్మా నాన్న-

సాయంత్రం వస్తాడు నాతో కొంతసేపు గడిపేందుకు. మరి
కొద్దిగా తేనీరు పంచుకునేందుకు
(ఒక అర కప్పు మాత్రమే).

ముదిరిన ఆకుల రంగు వంటి తేనీరుతో పాటు
నా జీవితాన్ని కూడా, కొంత వొంచుకున్నాడు
తన కప్పులోకి-(నా అర్థ జీవితాన్ని వంచుకుని
తన అర్థ జీవితంతో కలుపుకుని, ఒక
నిండైన పాత్రగా ఇద్దరినీ మార్చుకుని)-

సాయంత్రాలు మేము ఆడుకునేటప్పుదు, ప్రేమాస్పదమైన మాటలతో పాటు
తన ఇంటి నుండి తెచ్చిన సంస్కృతినీ
తను తినేవేవో వాళ్ళ అమ్మ వండినవి
ఏవో నాకూ తెచ్చి, పంచి ఇచ్చేవాడు -

కొంత మాంసం, కొంత అమాయకతనం, కొంత బ్రతకలేనితనం, మరికొంత దుక్కం-

అతనే ఇర్ఫాన్. నా స్నేహితుడు. నిండుగానూ
ఫెళ ఫెళమని నీళ్ళల్లా నవ్వే నా స్నేహితుడు-
నేనే అయిన ఇతరుడు. మరి

ఈ రోజు నాకూ తెలియదు. అతనికీ తెలియదు. ఎప్పటిలాగే, మేమున్నామని
తేనీరు త్రాగేందుకు డైరీ ఫాం వద్దకు వెళ్లి, కప్పెడు
రక్తాన్ని తల నుంచి వంచుకు వచ్చాడు. నా సగం

కప్పునూ అతనే చిందించి, తెల్లటి షేర్వాణీ దుస్తులపై
ఆ నెత్తురు కప్పు పగిలిన మరకలను అంటించుకుని
వెనుదిరిగి వచ్చేడు-

ముస్లిం కదా, కారణం అనవసరం
ముస్లిమై పుట్టడం చాలు ముస్లిం
దుస్తులు ధరించడం చాలు. హాకీ
కర్రలతో క్రికెట్ స్టంపులతో ఇరవై మంది పైబడి, చీకట్లో చంపేందుకు ప్రయత్నించేందుకు-

ఏమీ లేదు
అతను ఇర్ఫాన్
నా స్నేహితుడు.
----------------
15/11/1997. 

మరొక రాత్రి

మరొక రాత్రి తను ప్రశ్నించింది, 'రాయడమంటే ఏమిటి?', అని-

నాకు తెలియదు. నాకు తెలిస్తే నేను రాస్తూ ఉండను, ఎలా అంటే
ప్రేమ అంటే ఏమిటో నాకు తెలిస్తే నేను ప్రేమిస్తూ ఉండనట్టు -

"కానీ, అన్నిసార్లు" (నా కనులలోని చూపుని గమనించి)
పోనీ, కొన్నిసార్లు, నువ్వు అదంటే ఏమిటో తెలిసినట్టుగా
కనపడతావు కదా" అని అడుగుతుంది-

మరి, అదంటే ఏమిటి? ప్రేమనా లేక రాయడమా?
నిజానికి ఈ రెండింటి మధ్య తేడా ఏమైనా ఉందా?
ఏమైనప్పటికీ, ఇది సరైన సందర్భం కాదు
మాట్లాడటానికి లేదా రాయడానికి, మరి
ప్రేమ గురించైనా లేదా రాయటం గురించైనా

ఎందుకంటే
రెండూ ఒకటని ఏవైతే అనుకున్నావో లేదా రెండు రూపాలు
ఏవైతే ఒకటని అనుకున్నావో, వాటిలో ఒకటి
నిశ్శబ్ధ శబ్ధంగా మాయమయ్యింది.ఇది సరైన

సందర్భం కాదు. మరోసారి తప్పకుండా
మరొక సమయంలో, మరొక ప్రదేశంలో-
-------------------------------------
02/06/1998. రాత్రి 11:30

23 June 2013

వాళ్ళూ. నేను. మేము.

నాలుగు అక్షరాలు రాసుకుని చాలా కాలమయ్యింది
వందల ఏళ్లుగా ప్రేమగా పెంచుకున్నది ఏదో మాయమయినట్టూ
లేదా నిన్నూ, నీ ముఖాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టూ-
బహుశా

ఈ మధ్య కదులాడుతున్న సుదీర్ఘమైన సమయాలలో
నేను నా కవిత్వంగా మారి ఉండవచ్చు: కొన్నిసార్లు సరళంగా, మరి
కొన్నిసార్లు సంక్లిష్టంగా, నా లోపల చుట్టుకున్న, చిక్కు
ముళ్ళను విడదీసుకోలేక తన్నుకులాడుతున్నట్టూనూ-
కవిత్వం

జీవితంలా గజిబిజిగా అల్లుకుపోయిన దారపు తీగ కావొచ్చు.
సహనంగా విప్పుకోవాలి, తెగకుండా, ఒక పుష్పాన్ని
మృదువుగా, పదిలంగా, ముళ్ళపొదల మధ్య నుంచి వెలికి తీసినట్టు-
చాలా సార్లు ప్రేమ కూడా-

ఇప్పుడు
బయట వాన చినుకులు చెట్లని తాకి కొమ్మలపై నుంచి
జారుతున్న సవ్వడి. నా తండ్రి తన చెవులని భూమిపై ఆన్చి ఉంచాడు
మట్టి లోపల, వాన పాములు పారాడే సవ్వడి వినేందుకు-
బహుశా ఇప్పుడతను, వాటి సంగీతాన్ని వింటుండవచ్చు
మట్టి వాసనని ఘాడంగా కౌగలించుకుని. అతనితో పాటు

నా తల్లి కూడా, ఎటువంటి సంఘర్షణా భరిత ప్రయత్నం లేకుండా
రాలి ఇంకే చినుకులలో హంసలా తేలుతుండవచ్చు. మరి
ఇదంతా ఏమిటంటే

ఉండటం. నిశ్శబ్ధమైన దానిని వినడం. దేహాన్ని చెల్లా చెదురు చేసే
జీవన భీభత్స యుద్ధాల మధ్య, వాటిని తట్టుకుని, ఒక
ఓరిమితో కదలడం. ప్రశాంతంగా ఉండటం.అదొక తపన
అదొక శ్రమ, అదొక ప్రయత్నం, ఇంకా అదొక సంఘర్షణ కూడా:
నా తల్లీ తండ్రీ

ఇప్పుడా స్థితిలో ఉన్నారా? వాళ్ళు కవిత్వం, లేదా ఒక కవితను మరొక
కవిత కౌగలించుకునే దృశ్యం కూడానూ. ఇక ఇప్పుడు
చినుకులు ధారగా మారి, నింగినీ నేలనూ మీటుతున్న
సంబురం.ఈ గాలి, తెరలు తెరలుగా,నావలై, తెరచాపలై
పచ్చిక బయళ్ళను పక్షులుగా మార్చి ఎగరేసుకుపోయే
 ఒక సంభ్రమం-
వీటి అన్నిటిలో 

ఒక అంచుని పట్టుకుని నా తల్లీ తండ్రీ. మరొక అంచుని పట్టుకునేందుకు
ప్రయత్నిస్తున్న ఈ కవిత. మధ్యలో
నిశ్శబ్ధంగా కదులాడుతున్నది ఎవరు?
------------------------------------
17/07/98. రాత్రి 12:45

freedom-50

రకరకాలుగా వస్తారు వాళ్ళు-

రథయాత్రలుగానూ, పాతిక రూపాయల గంగా కలశాలు గానూ, పాతదైనా నూతనంగా, అఖిలభారత కృషి గోసేవా సంఘంగానూ -

రకరకాలుగా ప్రవేశిస్తారు వాళ్ళు-

ప్రజలలోకి, విద్యార్థులలోకీ, అంతిమంగా ఒక లక్ష్యానికి. మరి అది ఏమిటి? ఈ దేశముంది కదా, అది హిందూ దేశం. మరి హిందూ అంటే ఏమిటి? ముఖ్యంగా గోమాంసం తినక పోవడం. మారిత స్పష్టంగా, ముస్లింలను ద్వేషించడం. ఇక నువ్వెవరో వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వేం తినాలో, తినకూదదో 

నువ్వెవరిని ప్రార్ధించాలో, నువ్వెవరిని పూజించాలో, నువ్వెవరిని ప్రేమించాలో రమించాలో కూడా వాళ్ళే చెబుతారు. ఎలా అంటే, ఉదాహరణకు, ఈ ఉదయంపూట 

కరపత్రాలతో, కాలేజ్ విద్యార్థులపై వాలిన అఖిల భారత కృషి గోసేవా సంఘంలాగా. మరి, సాధారణంగా ఆ కరపత్రాలలో ఏం ఉంటుంది? గోహత్యను ఆపివేయండి అనే నినాదంతో పాటు, కొంత చరిత్ర కూడా. ఎటువంటి చరిత్ర? గోవులను హతమార్చడం ఒక దుష్టకార్యం అనే చరిథ్ర. మరి గోవులను హతమార్చేదెవరు? వాటిని ఆహారంగా భుజించేది ఎవరు? నా మిత్రుడొకడు నిరాశగా తల విదుల్చుతాడు-

"వీళ్ళు మారరు. సినిమా స్లైడ్స్తో దేశమంతటా తిరుగుతారట. బహుశా, ఒకటే సత్యం వీళ్ళకు, ఒకటే ప్రచారం వీళ్ళకు- చెప్పకుండా చెప్పి, ముస్లింలను ద్వేషించమని చెప్పడం, దొరికితే చంపమని చెప్పడం, చెప్పకుండా చెబుతూ-"

ఎదురుగా, క్లాసురూముల్లో, వాళ్లకి ఎదురుగా వందల కళ్ళు మసక బారుతున్నాయి. మరి కొద్దిసేపట్లో వందలాది స్వచ్చమైన హిందూ కళ్ళు తయారవుతాయి ఇక్కడ- FREEDOM 50- జీవితాన్ని కల్మషం చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఇక్కడ. FREEDOM 50లో భాగంగా- మరి చూసారా/చూసుకున్నారా మీరు, ఇటువంటి మలినాన్ని ఎప్పుడైనా అక్కడైనా అస్పష్టంగానైనా?
-------------------------------------
1997.

వర్షం

వర్షం ఎప్పుడు కురుస్తుందో నీకేమైనా తెలుసా-?

మబ్బ్లులు కమ్ముకున్న మధ్యాహ్న సమయంలో, ఆకాశంలో వొంటరిగా తిరుగాడే డేగకు తెలియదు, లేదా తలపై పుస్తకాలు ఉంచుకుని, చెట్ల కిందుగా హడావిడిగా వచ్చే అమ్మాయికి కూడా తెలియదు-

తను ఒక నల్ల గులాబి. కదిలే, మాట్లాడే నల్ల గులాబీల పొద. క్లుప్తంగా, తను మెలికలు తిరుగుతూ ప్రవహించే నల్ల గులాబీల నది. తను ఒక తుంపర కూడా-

"జీవితంలో స్పష్టంగా ఉండాలి. నాకేది కావాలో నేను కూడా నిర్ణయించుకోవాలి కదా - నేను జీవితంలో స్పష్టంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. సాధ్యమయినంత స్పష్టంగా - ఇతరులకు అస్పష్టంగా ఉన్నా సరే. అది సరే, నువ్వెందుకు ఎప్పుడూ నైరాశ్యంగా కనిపిస్తావు? తను అడిగింది. 

నేను తిరిగి ప్రశ్నించాను: వర్షం ఎప్పుడు కురుస్తుందో నీకేమైనా తెలుసా?

తను తల ఊపింది. ఎటు వైపో జ్ఞాపకం లేదు. వర్షానికి తడుస్తున్న రాయిలా తన ఎదురుగా కూర్చున్నాను. పచ్చికలా, నీటికి నానిన పచ్చిక మైదానంలా శరీరం విస్తరించి, తిరిగి అంతలోనే ఎడారిలా దేహం దప్పికతో పరచుకుంటుంది. ఎల్లా అంటే, దేహంలో నెత్తురు పిడచ కట్టుకు పోయినట్టుగా.-

మరి తనేమో నడిచే వర్షం. అదే చెబుతాను తనతో. నువ్వు గులాబీవి కాదు, గులాబీ రేకుల వర్షానివి, కాదు కాదు ఒట్టి వర్షానివి అని. అప్పుడు విరగబడి నవ్వుతుంది తను. "Metaphors". మబ్బులు పగిలి మెరుపులతో చిట్లినట్టు తను మళ్ళా నవ్వి చెబుతుంది: " సరే, నేను వెడుతున్నాను. నువ్వూ ఇష్టమే కానీ, ఎప్పటికీ వర్షం కురుస్తూనే ఉండదు ". నేనూ నవ్వాను. కానీ అది ఎడారి గాలి. నేను అన్నాను: "కానీ నాకు ఎప్పటికీ కురిసే వర్షమే కావాలి, మరే వర్షమూ కాదు." తను నవ్వి వెళ్ళిపోయింది. అతను అనువదించుకోలేకపోయాడు. నవ్వు - వర్షం. ఎవరైనా 

వర్షాన్ని అనువదించగలరా? పోనీ, వర్షంలోని ఒక చినుకునైనా? వర్షంలో తడిచే భూమీ చెప్పలేదు. భూమిపై వీచే మొక్కలూ చెప్పలేదు. మొక్కలపైకి వంగిన వృక్షాలూ చెప్పలేదు.  ఏదీ అనువదించలేని, చెప్పలేని వర్షం. మరి ఇంతకూ, వర్షం ఎప్పుడు కురుస్తుందో మీకేమైనా తెలుసా? మబ్బుల నీడ కమ్ముకున్న మధ్యాహ్న సమయంలో 

వర్షంలో వంటరిగా తిరుగాడే డేగకీ తెలియదు. తలపై పుస్తకాలు ఉంచుకుని, చెట్ల కిందుగా హడావిడిగా వచ్చే అమ్మాయిని గమనించే నాకూ తెలియదు!
----------------------------------------
25/03/1997. సాయంత్రం 04.30.

22 June 2013

పర్వీన్

స్కూలుకి ఎలా వెళ్ళవచ్చు?

వేకువఝామున స్నానం చేసిన చందమామల్లా
లేదా స్నానం చేసి అల్లరి చేసే చందమామల్లా వెళ్ళవచ్చు
గాలికి ఊయలలూగుతున్న అశోకా చెట్లల్లా, గుంపుగా
గుబురు పొదల మధ్య సవ్వడి చేస్తున్న లేత పక్షుల్లా వెళ్ళవచ్చు- లేదా

చిన్నారి యోధుల్లా, చిక్కటి అడవిలో దారి ఏర్పరచుకుంటూ
సాగిపోతున్న వేటగాళ్ళలానూ వెళ్ళవచ్చు- కానీ
చాలా సార్లు, కదులుతున్న మొక్కల్లా, కళ్ళల్లో ముళ్ళతో
బడికి కాకుండా పనికి వెడుతుండవచ్చు. ఎలా అంటే

ప్రతి ఉదయం
ఆకుపచ్చటి జాబిలిలా లేదా
తెల్లగా నవ్వుతున్న ఆకుపచ్చటి జాబిలిలా, పర్వీన్ లా - మరి
పర్వీన్ ఎవరు?

ఆకుపచ్చటి పరకిణీతో
చీపురుకట్టల రెక్కలతో
సీఫెల్ లో చెత్తబుట్టలను  శుభ్రం చేసే అయిదేళ్ళ అమ్మాయి-
ఇంద్రధనుస్సులేవీ లేని సీతాకోకచిలుక - కళ్ళను
లోకమంత విశాలంగా విప్పార్చి  చూసే నీటి చినుకు: మరి

పనికి ఎలా వెళ్ళవచ్చు?

కాళ్ళ కింద లోకమంతా శీతలంగా రాలి పడుతున్నప్పుడు
రోజంతా తిండి లేక, రాత్రి నిదుర రాక, పాకపై పాకలోకి
జనగణమన లాంటి సవ్వడి వలే గులకరాళ్ళ వలే జారి
పడుతున్న వర్షపు చినుకులకి దూరంగా ఒక మూలకి వొరిగి
రాత్రి రెక్కలలోంచి, రెక్కలు నరుక్కునే పగటిలోకి
ఆకుపచ్చటి లంగా జాకెట్తో, పర్వీన్ లా వెళ్ళవచ్చు.

తనకీ ప్రపంచం తెలుసు - గోళీకాయలా. కానీ ఒకటే రంగు.
పేరేమీ లేనిది. పర్వీన్ లా, ఉనికి తప్ప అస్థిత్వం ఏమీ లేనిది

మరి, ఇక తన ప్రపంచం ఏమిటి ఏమటి?

మొదటిది పని. చీపురు కట్టలు, లేదా
లతల్లా విచ్చుకున్న వేళ్ళ మధ్య శుభ్రమయ్యే  ఎంగిలి పాత్రలు
పాలిపోయిన ఆకులలాంటి అరచేతులపై
చెంపలపై ఎర్రటి గాయపు కోతలు - మరి

అలాంటప్పుడు తన ప్రపంచం ఏమిటి?

రెండొవది ఆకలి. వాసనొచ్చే అన్నమైనా
బూజు పట్టిన బ్రెడ్డు తునకైనా చాలు- ఆకలి నిండాలి. రెండు
చిట్టి అరచేతులతో కడుపుని లేదా ఈ
విశ్వమంతటి ఆకలిని నొక్కిపెట్టడం అసాధ్యం.

మరా క్షణాలలో తన ప్రపంచం ఏమిటి?

రోదించడం. ఆకలిని తట్టుకోలేక, కుత్తుక తెగిన పావురంలా
చుట్ట చుట్టుకుని కొట్టుకులాడటం. తప్పదు. పోనీ
కనీసం మంచినీళ్ళు? పాకలోకి చొచ్చుకువస్తున్న

నీటి కత్తుల మధ్య, అన్నం మెతుకులాంటి
ఒక నీటి బిందువైనా ఉండదు.తన చెంపలపై
సర్పాల్లా పాకుతున్న కన్నీళ్ళలో,  చుక్కలాంటి ఒక నీటి
నక్షత్రమైనా ఉండదు. తను - ఆ పర్వీన్

ఆకుపచ్చటి పర్వీన్
కమిలిపోయిన నెత్తురు కనుల పర్వీన్, ఆమె ప్రపంచం
కళలు తప్ప మరేమీ లేని అన్నమ్లాంటి కనుల పర్వీన్
చిక్కటి గంజిలాంటి కనుల పర్వీన్, చల్లటి రొట్టెముక్క
దేహం గల పర్వీన్ , ఆమె ప్రపంచం-

మరణం కంటే ఘాడమైన, హింసాత్మకమైన జీవితం కింద
తన లోకం లిప్తకాలం పాటు
వర్షం వెలిసాక విచ్చుకునే
సూర్యపుష్పం వలే, ఒకే ఒక్క క్షణం మెరుస్తుంది- తను
నిజంగా నవ్విన క్షణాలలో -
అయిదేళ్ళ వయస్సు, చిట్లిన విత్తనంలా, ఫక్కుమని నవ్విన క్షణాలలో-

మరి పర్వీన్  ఎప్పుడు నవ్వుతుంది?

ఆకుపచ్చటి గడ్డిలో  కలసిపోయి లేదా
తనే, విశాలమైన పచ్చిక మైదానంలా మారిపోయి
రోగగ్రస్థమైన కుక్కపిల్ల ఒకటి, గుడ్డిదైన
కుక్కపిల్ల మరొకటీ - రెండిటితో గాలిలో
పరిగెడుతూ ఆడుకుంటున్నప్పుడు, సర్వం మరచి

వాటితో కలగలసిపోయి, స్వేచ్ఛగా పొర్లుతున్నప్పుడు
ప్రపంచమంతా ఒకే సవ్వడితో నిండిపోతుంది
ఆకాశం నుంచి భూమి దాకా, ఎండిన మట్టిపై
వాన చినుకుల శబ్ధాలలాంటి పర్వీన్ నవ్వుతో-

ప్రపంచమంతా, ఫక్కుమని ఫేటీల్మని పేలిపోయి
కనుల ముందు బూజుబూజుగా రాలిపడుతుంది
ఒక కన్నీటి బిందువులో బరువుగామునిగిపోతుంది- మరి

పొరలు పొరలుగా, గాలి తెరల్లా విస్తరించుకుంటున్న ఆ శబ్ధం
నవ్వు - పర్వీన్ నవ్వు - ఆ సవ్వడి
కన్నీటి బిందువులు రాలిపడుతున్న సవ్వడి
కనులు పిగిలిపోతున్న సవ్వడి

స్వేచ్చదా, లేక రేపటి నిర్భందానిదా?
-----------------------------------
July, 1996. 

21 June 2013

కొందరి కథ

"జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా సున్నితం - వదిలి వేసావో
రాలి పడుతుంది. ముక్కలవుతుంది. అసంఖ్యాకంగా
-ఏరివేసినా కనిపించని గాజుముక్కలు - తిరిగి నిన్నే గాయపరుస్తాయి"

పై మాటలు చెప్పి అతను
మృదువుగా ఆ పిల్లవాడి లేత వేళ్ళ మధ్య సౌందర్యవంతమైన గాజుగ్లాసుని
వాన నీటిపై కాగితం పడవని వదిలినట్టు జార విడిచాడు.
ఆ పిల్లవాడి వేళ్ళు వర్షం పాయలు. వర్షపు పాయలపై తూగుతున్న
గాజు గ్లాసు పడవను విచ్చుకున్న కళ్ళతో చూస్తున్నప్పుడు
మళ్ళా చెప్పాడు అతని తండ్రి:

"ఇది అధ్బుతమైన జీవితం. దేనితో తయారవుతుందో తెలుసా ఇది?
పారదర్శకమైన, నీటి పోరలాంటి ఈ గాజు గ్లాసు? గరుకైన  ఇసిక నుంచి-
అధ్బుతం కదా. జీవన సౌందర్యమిది - కటినమైన వాటి నుంచి
సున్నితమైనవి జన్మిస్తాయి. నిజానికి, ఇసిక కూడా
చిగురాకులంత మెత్తగా ఉంటుంది: నువ్వు గమనించగలిగితే-"

అతను (ఆ పిల్లవాడు)
మృదువుగా వేళ్ళ మధ్య తెల్లటి పావురంలా వొదిగిపోయిన గాజు గ్లాసుని
గమనించాడు. అటుపిమ్మట, ఎటువంటీ తొందరపాటూ లేకుండా
దానిని గాలిలోకి వదిలి వేసాడు. వాన చినుకు వోలె
అతని వేళ్ళ మధ్య నుంచి జారి నేలపై  వాలి తునాతునకలయ్యింది అది.
అటుపిమ్మట, అతను నేలపై ముత్యాల్లా అల్లుకుపోయిన
సాగర తీరాన ఇసికపై మెరిసే అలల తడి వంటి గాజుగ్లాసుముక్కలను
జాగ్రత్తగా ఎరివేసాడు. అయినప్పటికీ కనిపించని తునకలు
అతని పాదాలలోకి విత్తనాల వలె నాటుకు పోయాయి. చిన్నగా
నెత్తురు మొక్కలు మొలకెత్తాయి. అతను ఏడ్చాడు - కానీ
ఎవరికీ చెప్పలేదు, తాను రోదించినది నొప్పి వల్లనా లేక ఆ

గాజు గ్లాసు పగిలిపోయినందుకా అని- ఇక అప్పుడు, అరచేతుల మధ్య
అతను ఏరిపెట్టుకున్న గాజు తునకలు అతని కన్నీటి కిరణాలు పడి మెరిసాయి-
అతను (ఆ పిల్లవాడు)  అనుకున్నాడు: గాజుగ్లాసు పగిలినప్పుడు కూడా
సౌందర్యవంతమే అని, నిజానికి అది పగిలి తునాతునకలైనప్పుడే
మరింత సౌందర్యవంతమని.  అతను ఆ విషయం తన తండ్రికి చెప్పలేదు
చెప్పి ఉంటే తన తండ్రి చెప్పి ఉండేవాడు- ఒక మనిషి సౌందర్యం
పగిలి ముక్కలు ముక్కలుగా విస్తరించినప్పుడే తేలుస్తుందని -అయితే
బాల్యంలో అ పిల్లవాడు మరొక విషయం గమనించలేదు
అదేమిటంటే, ఆ గాజు గ్లాసు హృదయం కూడా కావొచ్చునని-
II
చాలా సంవత్సరాల తరువాత అతను (ఆ పిల్లవాడు) గమనించాడు, హృదయం
కూడా సున్నితమయినదని. ఎప్పుడు? అతని ప్రియురాలు
ఒక పుష్పాన్ని ముళ్ళ కంపల మధ్య, చాలా జాగ్రత్తగా, పూరేకులు
గాయపడకుండా ఉంచినట్టు, అమె హృదయాన్ని, అతని అరచేతుల మధ్య ఉంచి
ఇలా అన్నది: "ప్రేమగా ఉంచుకోవాలి. చాలా సున్నితం-
వొదిలి వేసావో, రాలిపడుతుంది. ముక్కలవుతుంది.ఇక

అసంఖ్యాకంగా, ఏరుకున్నా కనిపించని తునకలు నిన్నే గాయపరుస్తాయి"-
అతను మృదువుగా, తన దేహంలో-తల్లి బాహువుల్లో వొదిగిపోయిన
పాపలాంటి- సురక్షితంగా దాచుకుందనుకున్న ఆమె హృదయాన్ని
ఎటువంటీ తొందరపాటూ లేకుండా జార విడిచాడు.అతి సులువుగా

ధూళి అంటిన చేతులని తుడుపుకున్నట్టు, అతి మామూలుగా తన
హృదయాన్ని జార విడిచాడు. ఈ సారి ఏరుకునేందుకు
సుస్థిరమైన గాజు తునకలేమీ లేవు. దేహం నిండా కనిపించని గాయాలు.
ఎక్కడ తాకినా, ,మెత్తగా అంటుకునే నెత్తురు పరిమళం.
ఆమె శరీర పరిమళం.కానీ అతను గమనించాడు.మనిషి

సౌందర్యం, మనిషి తునాతునకలయ్యినప్పుడే తెలసి వస్తుందని. కానీ
నిజానికి ఇక్కడ, తునాతునకలయ్యింది  ఎవరు?  తన
అరచేతులలో ముక్కలుగా మొలకెత్తుతున్న ఇరువురి
జీవితాలలోని సౌందర్యాన్ని గ్రహించాడు. కానీ, విడవని
మరొక సందేహం: పగిలిన తరువాత ఏరుకున్న గాజు ముక్కలు కొన్ని
తన అరచేతులలో ఉన్నాయి.మరి కనిపించక గాయపరిచే
గాజు తునకలు ఎవరి వద్ద ఉన్నట్టు?
III

ఆతని తల్లి నవ్వి చెప్పింది: "నా వద్ద" అని, తను తన హస్తాలను
చాపి చూపింది. ఏభై ఏళ్ల అరచేతుల మధ్య, నెత్తురు మరకలు-
"నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి. నువ్వు గ్రహించడం మరచిపోయావు
కనిపించక గాయపరిచే తునకలు నిన్ను మాత్రమే కాదు
నిన్ను ప్రేమించే వారందరినీ గాయపరుస్తాయి. మరి నువ్వేం చేయాలంటే

ఆ గాయాలలోంచి ఒక ఇల్లుని నిర్మించుకోవాలి. గాయాలను
మాన్పుకోవడం కాదు.గాయాలను ప్రేమించడం నేర్చుకోవాలి
ఇది ఒక అద్భుతమైన జీవితం. జీవితం ఒక సంఘర్షణ లాగే
ప్రేమించడం ఒక సంఘర్షణ. ప్రేమించడం, ఒక సాధన-" అని
అతని తల్లి తన పెదాలతో అతని గాయాలని ముద్దాడింది-

అతను అప్పుడు తొలిసారిగా తన తల్లిని కడు ఓరిమితో గమనించాడు-
తన తల్లి నగ్న దేహమ్మీద అసంఖ్యాకమైన గాయపు కోతలు
తన తల్లి తండ్రుల నగ్న దేహాల మీదైన, ఆ గాయపు కోతల్లో
తను మృదువుగా జారవిడిచిన గాజు గ్లాసు పగిలిన తునకలు

కొన్ని దిగబడి, నెత్తురు ఊటలా ఉబికీ, ఎండిపోయిన ఛాయలు
మరికొన్ని పచ్చిగా, అప్పుడే వాడిగా దిగబడిన పలుగుల వంటి
పదునైన తునకలు. ఇక, చూస్తుండగానే (ఆ పిల్లవాడు) అతని
కనుల ముందు, ఆ రెండు నగ్న శరీరాలు రెండు మహారణ్యాలుగా మారినాయి-
అనాగరికమైన సౌందర్యంతో, అసంఖ్యాకమైన పక్షుల కిలకిలలతో
జలపాతాలతో మృగాలతో నదులతో మరణించిన అసంఖ్యాకమైన             
వదనాలతోనూ తుళ్ళిపడసాగినాయి. అతను మృదువుగా కదిలి

ఆ రెండు నగ్న దేహాలనూ ముద్దాడి ఇలా చెప్పాడు: "అవును. నిజం.
జీవితం వలే, ప్రేమించడం వలే, శాంతి ఒక సంఘర్షణ. శాంతి ఒక సాధన-"  
------------------------- 
05/03/1997. రాత్రి 01:15

19 June 2013

మళ్ళా మొదలు

వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళా ముందుకు రావడం. అలలా లేదా ధూళిలా నేలపైకి నేలలోకి రాలిపోవడం. తిరిగి మళ్ళా పైకి, గాలిలోకి లేవడం -

వానలా, ఎండకి నిశ్శబ్ధంగా ఆవిరి అవుతున్న నదిలా, ఒకే ఒక్క క్షణంలో చుట్టుకునే అసంఖ్యాక విషయాలు. మౌనంగా దేహంలోకి కరిగిపోయి, నెత్తురులోకి వ్యాపించి, తిరిగి శరీరం అణువణువులోంచి శ్వేదంలా చెమర్చే అసంఖ్యాక నేనులు - వాటిలో నేనెక్కడ?-

నువ్వు విసిరి వేస్తావు. నాలోని కొంత సారాన్ని అందుకుని వొదిలి వేస్తావు. మళ్ళా, నేను నింపుకోవాలి. కొమ్మల మధ్య నిర్విరామంగా శ్రమిస్తూ, ఒక్కొక్క పుల్లతో గూడుని అల్లుకునే పక్షిలా- మరి దానికీ తెలుసు అభద్రత. బలమైన  గాలి వీస్తుండవచ్చు. లేదా ఘాడమైన వర్షం కురుస్తుండ వచ్చు. రోజుల తరబడి ఏర్పరచుకున్న గూడు చెదిరి పోతుండవచ్చు. దాని పిల్లలు కంపిస్తూ నేల  రాలి పోతుండవచ్చు. కానీ నిర్మించకుండా ఉండటం ఎలా? ఇక మళ్ళా 
మొదలు - మొదట నుంచి ఏర్పరచు కోవడం. చాలాసార్లు 

బహుశా అన్నిసార్లూ నేను ఆ తల్లి పక్షిని. విధ్వంసం అవుతుందనీ తెలసి, ప్రేమించడం మానను. ధ్వంసం అయ్యాక తిరిగి నిర్మించుకోవడమూ ఆపలేను. తుమ్మ ముళ్ళ పొదలా (బహుశా , నేను ఒక తుమ్మ ముళ్ళ పొదను) మొదలు కంటా నరికినా తిరిగి చిగురించడం మానను. ఈ ఖాళీలను పూరించలేననీ తెలిసి, నింపుకోవటం ఆపలేను. తల్లి కుక్క, కనులు తెరవని తన పిల్లల వద్దకు పరిగెత్తినట్టు, నేను నాలోకి వెళ్ళిపోవడమూ ఆపలేను- వీటన్నిటిలోనూ 

విషాదముంటుంది. ప్రేమించడంలో కూడా - నీటిలో తడిలా, మంటలో వేడిలా, తప్పకుండా, ఒకే ఒక్క క్షణంలో అసంఖ్యాక విషయాలలోకి క్లుప్తీకరణమవ్వడంలో శూన్యం ఉంటుంది. తరచూ, అందుకే, నాకు నేనూ, నీకు నేనూ (నీ ప్రపంచానికీ), నాకు నువ్వూ (నా ప్రపంచానికీ) అపరచితుడని అవుతాను. నాలో నేను తునాతునకలు అవుతాను. ఎండలేని చల్లని మధ్యాహ్నం 

గాలిలో తూలుతూ నెమ్మదిగా నేల రాలుతున్న పసుపు పచ్చటి ఆకుల్లా, దేహం నుండి వీడిపోయి, తుంపులు తుంపులుగా రహస్య ప్రదేశాలలోకి కొట్టుకుపోతాను. భూమిపైకి వంగిన కొమ్మలా, లేదా కొమ్మపైకి వంగిన ఉడతలా ఆకస్మికంగా కదలిపోతూ విషాదంతో వొణికి పోయి, మళ్ళా నిశ్చలమయ్యి, మళ్ళా నీ వద్దకు నేను (నా వద్దకు కూడా) ఖచ్చితంగా ఒక అలలా, నేట్టివేసినా ముఖాన్ని చుట్టుకునే తేమ్మరలా, లేదా సముద్రపు తీరాన ఇసుక గూడుని కట్టుకునే ఒక పిల్లవాడిలా, లేదా ఒక వృద్ధుడిలా  

నాకు ఖచ్చితంగా తెలుసు. ఏదీ కొంతకాలమైనా ఉండదని తెలుసు. ఈ సజలతనంలో ఏదీ ఎక్కువకాలం మన్న లేదనీ తెలుసు. అరచేతులలోకి ఇసుకను దగ్గరకు తీసుకునే లోపల, దరి చేరకనే అది కరిగి పొతుందనీ తెలుసు. కానీ, తాకకుండా ఎలా? వీటన్నిటినీ చూడకుండా, ముట్టుకోకుండా ఎలా? పోనీ నువ్వైనా చెప్పు 

ధ్వంసం అవ్వకుండా దగ్గర అవ్వడం ఎలాగో, లేదా గాయపడకుండా ప్రేమించడం ఎలాగో?
----------------------------------------------------------------------------------
మార్చ్, 1996. 

18 June 2013

యాదృచ్చికం

1
జూకాల మాదిరి వేలాడే లతలతో పసుపు పచ్చని చుక్కల పూలు: కిందుగా ఊగుతూ నీడలు-

పూవులలో దాగి, దూరంగా ఉన్న నిన్ను తాకి, నీ గుండెల్లో భద్రంగా ముడుచుకునే సువాసన, ఒక పాపాయి తన తల్లి యెదలో ముడుచుకుని పడుకున్నట్టు, నీలో నువ్వు వొదిగి, నీ చుట్టూ నువ్వే చేతులు చుట్టుకుని, ఇరు వైపులా పుడమిని వినేందుకు చెవులొగ్గిన చెట్ల కింద, వీడిపోతున్నమంచులో, విచ్చుకునే కాంతిలో నువ్వు- 

నిశ్శబ్ధం ఒక సీతాకోకచిలుకై, ఈ నేలని ఆనుకుని ఎగురుతున్నట్టు, విత్తనాన్ని వీడి వెలుపలకి వచ్చే తొలి ఆకు కొద్దిగా చలించినట్టూ, కనిపించని పావురపు ఈక ఏదో నెమ్మదిగా తేలుతూ నేలపైకి వాలినట్టూ, మట్టిపై ఆనీ ఆనక కదిలే నీ పాదాలూ, ఆ మువ్వల సవ్వడీ-

ఇక మరి రాత్రంతా కురిసిన వానకి శుభ్రమయ్యి నవనవ లాడే, తెరిపి పడ్డ ఆకాశాలు నీ నయనాలు. నీ చేతి వేళ్ళ చివర్లలో పొంచి ఉన్న ఇంధ్రధనుస్సులు. గుబాళించే తోటలై మెరిసే నీ పెదాలపై, ఇక ఎన్నటికీ అడుగిడలేని ఒక తోటమాలిని నేను. అలవోకగా నవ్వుతూ నువ్వు తల తిప్పితే, సరస్సులన్నీ ఒక చోట చేరి, నీ ముఖమై 

తెరలు తెరలుగా గాలి- పూర్వజన్మలన్నీఒక్కసారిగా గుర్తుకు వచ్చినట్టూ, జనన మరరణాల రహస్యమేదో తెలిసిపోయినట్టూ, అంతా ఒక సుగంధపు కాంతి, ఒక శాంతి. మూసిన హృదయంలోంచి పక్షులేవో రెక్కలు విదుల్చుకుని ఎగిరి పోయినట్టు ఒక విభ్రాంతి. మరొక నిండైన స్థబ్ధతా-పేరు లేని ఒక దిగులూ, బెంగ కూడానూ- ఇక

చేతివేళ్ళల్లో చేతివేళ్ళమయ్యీ  ఒక ప్రమిదెను కాపాడుకునే అరచేతులమయ్యీ, రాత్రుళ్ళల్లో మెరిసే మిణుగురు పురుగులమయ్యీ, వెన్నెల ఛాయాలో వెలిగే నెగడులమయ్యీ , ఒక ఆదిమ తపనతో మోకాళ్ళ మధ్య మోకరిల్లిన శిరస్సులమయ్యీ, దైవిక అశ్రువులమయ్యీ, నీలోంచి నేనూ, నాలోంచి నువ్వూ తల తిప్పి చూస్తే

పసిడి జూకాల కిందుగా వేలాడే లతలతో, నీడలతో ఊగుతూ నువ్వూ, నేనూ, పూలూ పిల్లలూ, మనమైన ఇతరులూ, ఆ చల్లటి కాంతిలో, ఇష్టంతో, రాలిన పూలనేవో ఏరుకుంటూ, వేళ్ళతో ఇసుకలోకి నక్షత్రాలని లాగుతూ, పాదాలతో నీళ్ళను చెదుపుతూ, ఒక కలలోంచి మరొక కలలోకి, ఒకరి కలలోంచి మరొకరి కలలోకి, నాలోంచి నీలోకీ, నీలోంచి నాలోకి వెడుతూ, సమూహాలేవో, సంస్కృతులు ఏవో, విశ్వ కాల గమనాలేవో ఇలా-

మరి చిన్నా, తెలుసా ఏమైనా నీకు, ఇంతకు మునుపు తారస పడ్డామా మనం ఇలా, ఎప్పుడైనా, ఎక్కడైనా? 

17 June 2013

అర్థాంతరంగా

1
మేఘావృతమైన కాంతిలో, నీ నీడ నీకు కనిపించదు-

కదిలీ, కదలక చెట్లపై ఊగే పూలు. వాటి పేరేమిటో నీకు తెలియదు కానీ శిశువులు ఊగే ఊయలలపై తల్లులు వంగినట్టు, అవే, నీ పైకి నెమ్మదైన రంగులతో వొంగి, వాటి అంత ఘాడమైన ఎరుపు రంగూ మృదువుగా మారి చిరునవ్వుతో నీతో ఒక పురాతన భాషలో సంభాషిస్తున్నట్టు: 

ఎక్కడో నిన్ను తడిపే వర్షం. ఎవరో అదృస్యంగా నీ చుట్టూ తిరుగాడుతూ, మంద్రంగా వేణువు ఊదతున్నట్టు ఈ గాలి. నీ శ్వాసలోకి నువ్వే జొరబడి నీలోంచి నువ్వే బయటకి తేలిపోయి, ఎగిరిపోయి, తిరిగి ఒక ఇంటికి చేరుకున్నట్టు, ఒక విభ్రాంతి. గూడంతా ఆ పూలు తడచిన మట్టి వాసన. ఎవరో పుడమిని చిదిమి

ఓ దీపం పెట్టినట్టు, మెత్తటి అరచేతులతో వెనుక నుంచి నీ కళ్లెవరో మూసినట్టు, నీ శరీరమంతా వెన్నెల స్పర్శ, కాంతి నీటి పెదాలేవో నిన్ను అణువణువునా ముద్దాడుతున్నట్టు, ఒక నిశ్శబ్ధం. ఒక కారుణ్య కలకలం. అలలపై తేలిపోయే ఒక ఏకాంత నావలో నిండుకుంటున్న ఒక నిండైన శూన్యం. నీలో కొంత ఇష్టం. కొంత శాంతి. చూడు  
2
మేఘావృతమైన కాంతిలో, నేనే నీ నీడై సంచరించే వేళ్ళల్లో 

రా మరి.తాకు నన్ను.మబ్బులు తిరుగాడే నీ కళ్ళలోంచి 
లక్ష సీతాకోకచిలుకలై ఎగిరిపోతాను నేను.
లక్ష పూవులై రాలిపడతాను నేను
భయం లేదు.భయపడటానికీ 
ఇక ఏమీ  మిగిలి లేదు 
దా మరి 
3
ఇక, మృత్యువు ఆగిన చోట 
మనమిద్దరమే వెర్రిగా
నవ్వుతూ 
నవ్వుతూ 
నవ్వుతూ
ఉంటే 
4
రాత్రంతా వెలిగి విసిగిన దీపం 
ఒక చిన్న నిట్టూర్పుతో 
చిన్నబోయింది 
చిన్నా- 
5
దా మరి
నన్నూ
6
నిన్నూ, ఈ



7


. 

16 June 2013

అదే నేను

అదే కిటికీ, అదే కుర్చీ, అదే రాత్రి కాని రాత్రి-
ఆకులేవో ముడుచుకుని
తేమను చిలుకరించినట్టు.

అప్పుడు, నీకు నువ్వే విసుగు పుడతావు-
నీ నీడా నీకు సాంత్వన ఇవ్వదు
దాని కళ్ళలోనూ ఒక బుగులు-

ఇల్లు మరచి, దారి తప్పి, వాహనాల మధ్య
అటూ ఇటూ బెదురు బెదురుగా
తిరుగాడే, ఒక కుక్క కనులను

చూసావా ఎన్నడైనా? ఒక దిగులుతో, తనది
కాని, ఒక స్థలంలో ఇరుక్కుపొయి
తిరిగి ఇంటికెలా వెళ్ళాలోతెలియక

ఏ వాహనం కిందో పడి కాలో కడుపో
తెగి, పేగులు బయటపడి కదలలేక
ఏడ్చే  కుక్కను, చీకట్లో దాని ఊళనూ?

మరేం లేదు. ప్రస్థుతానికి అదే నేను-

వెళ్ళిపో.

బయట వర్షం పడుతుంది, కిటికీలోంచి కుంగుతూ వచ్చే మెలి తిప్పే గాలి-
ముడుచుకుని, మంచంపై ఒక్కడినే
దుప్పటి కప్పుకుని కూర్చుని చూస్తో-

ఎక్కడో మొరిగే కుక్కలూ, ఇంత రాత్రీ
చొచ్చుకు వచ్చే వాహనాల హారన్లూ-
వింటున్నావా నువ్వు? చెప్పు మరి

ఎందుకంటే, నానిన శ్మశానం వంటి
ఈ గదిలోకి మరేమీ రాగలవు?మరి
ఇక ఇక్కడ రాయడానికీ ఏమీ లేదు, పంచుకోడానికీ ఏమీ లేదు: ఒక్క చీకటే-

అందుకే
దాచుకున్న ఒక నిధ్ర మాత్రతో చేయీ చేయీ కలిపి పడుకుంటున్నాను- నిను
స్మరించుకుంటో. రాకు ఇటువైపు
దీపమార్పేందుకు. ఎందుకంటే

అప్పటికే
తలగడపై, వొత్తి రాలిన ధూపంతో
ఒక మనిషి విస్మృతి అయినాడు-

ఇక రాత్రంతా, ఒలికిన నూనె చుట్టూ, పగిలిన దీపం పైనా చిట్లి, కబొధులై
కొట్టుకులాడే, రెక్కలు తెగిన
ఈ పురుగులే ఇక్కడ.వెళ్ళిపో . 

ఇక్కడ నుంచి, నేలపై నిద్రలో కలవరింతలతో వొణికే నా నీడల్ని ఏరుకుని- 

15 June 2013

ఎలా?

1
తెరలు తెరలుగా పొడువాటి అదృశ్యపు తెరలను జాలు వార్చినట్టు
నింగి నుండి కిందకి దిగి, నిన్ను
ఉక్కిరి బిక్కిరి చేసే గాలి. తోటలో

పాదులను తవ్వుకుంటున్న నువ్వు, నెమ్మదిగా నీ నుదిటికి పైగా
అరచేతిని ఉంచుకుని పైకి చూస్తే
వలయాలుగా మంచురేణువుల్లా
కురిసే పల్చటి కాంతి:కొన్ని లక్షల

చామంతి పూరేకులు రాలిపడుతున్నట్టు, బిందువుల వంటి రెక్కలతో
2
చెట్ల కొమ్మల్లో, ఆకుల మధ్యలో
మిణుగురుల్లా మెరిసే-తడచిన-
వెలుతురూ. కనిపించనిది ఏదో

లేదా ఎవరో, నీ చెంత చేరి, నీ పక్కగా కూర్చుని, నీ చెవులో ఏదో రహస్యం
చెబుతున్నట్టు, ఎవరివో మరి
పాదాల సవ్వడి. నీ కళ్ళలోకి
నిశ్శబ్ధం, మరికొంత కొత్త నీరూ-
3
అప్పుడు
నీ చేతిని ఎవరో ఒత్తినట్టయ్యి
తల తిప్పి చూస్తావా, ఇక ఆ
పూవు చుట్టూ పూసిన సువాసనలో, అటు ఇటూ ఒక లయతో ఎగురుతున్న
ఓ లేతెరుపు సీతాకోకచిలుక-

నీ చుట్టూ ఒక ఆత్మ వేణువు
మట్టి కుండలో చేరి విలపించే
గాలి. ఒడ్డున ఆగి ఆ అలలలో
అటూ ఇటూ ఊగే, ఒక నావ.
తన తల్లి పొదుగుని చేరలేక, కట్టిన గుంజెకు గింజుకులాడే ఒక దూడ. ముళ్ళు

చివరన చిట్లినట్టై ఆ తల్లి కళ్ళూ.
4
ఇక
నీకు గుర్తుకు వస్తుంది అప్పుడో
ముఖం. ఛాతిలో ఒక నొప్పి- నీ
చుట్టూ సమస్థం అద్దాలై ఎటు చూసినా నీ ప్రతిబింబం బదులు మరొకరి ముఖం-
5
నువ్వు ఇది చదివే సమయానికి
నేను ఉండకపోవచ్చు.నీ ముందు
ఇక, ఊగుతూ, నిప్పు వలే గాలికి

ఎగిసి పోతూ, చలించి పోతూ ఇక
చివరిగా ఆరిపోతూ, మట్టి లోంచి
ఒక చేతికై మొలుచుకు వచ్చిన మరో చేయి వలే, తపిస్తూ రెపరెపలాడే
ఒక ఒంటరి గడ్డి పరక- దూరంగా
6
చేయి ఆయినా ఊపకుండా, నిను
వీడి వెళ్ళిపోతున్న నీకు అత్యంత
ప్రియమైన వారెవరో: మసకగా, పూర్తిగా కురవక, కనుమరుగయ్యే వానై ఇక్కడ-
ఇక
7
ఈ దినం గడవటం ఎలా? 

14 June 2013

మరి వస్తావా నువ్వు

1
నువ్వు లేవక ముందే లేచి ఉంటాయి ఆ బచ్చలి ఆకులు-

ఆకాశం వొంగి, వాటిని తన వొడిలోకి తీసుకుని, మంచుతో కడిగి శుభ్రపరచినట్టు
ఆ ఆకులు, నవ్వుతూ పలుకరించే ముఖాల లాగా
ఒక పసితనపు లాలిత్యంతో, పచ్చదనంతో నీ పెరట్లో-

అప్పుడు నువ్వొక దానిమ్మ చెట్టువి. నీ పెరట్లో వాలి
ఒకదానిపై మరొకటి కలబడుతూ ఆడుకునే ఆ పిచ్చు
కలలో, నువ్వు ఒకడివి. నీకై ఎదురు చూసే పిల్లలను

తాకి, వాళ్ళ జుత్తును చెదిపి, వాళ్ళ పెదాలపై చేరే గాలివీనూ- విను జాగ్రత్తగా
2
ఎవరో ఒక వెదురు వేణువుని నెమ్మదిగా బయటకి తీసి
ఊపిరినంతా ఒక దరికి చేర్చి, తన శరీరాన్నంతా, తన
ఆత్మ ఘోషనంతా ఒక నిశ్శబ్ధంగా మార్చి ఆ సప్త రంధ్రాలలోంచి వెలుపలికి ఊదే

కాంతి కదలికల తరంగాలని. ఎవరిదో ఒక పాదపద్మం
అతి సున్నితంగా, నీ ప్రాంగణంలోకి అడుగుపెడుతున్న
సవ్వడిని.  పూల రేకులపై వాలి, వాటి అంచుల వద్దకు

అతి సునిశితంగా జారే చినుకులని. ఎవరో ఒక రహస్యం
చెబుతున్నట్టూ మరెవరో నిన్ను అదృస్యంగా హత్తుకుని
గుండెల్లో దాచుకున్నట్టూ, ఆ బచ్చలి ఆకుల నీడల లోకాలలోకి వెళ్ళిపోయినట్టూ-
3
నువ్వు ఇది చదివే సమయానికి
నేను ఉండకపోవచ్చు. ఇక గాలికి
అల్లల్లాడిపోతూ ఎగిసిపోతూ తేలిపోతూ, రంగు మారుతూ ఆ బచ్చలి ఆకులే అక్కడ
4
మట్టిపాదులో వేళ్ళతో విశ్రమించి
మరి నువ్వూ నేనూ ఇక్కడ. ఇక
5
అంతిమంగా
పిట్టలు ఎందుకు పాడతాయో తెలిసి
ఒక శాంతిని కనుగొన్నట్టు అనిపించి

నా ఛాయలో నీవూ నీ ఛాయలో నేనూ. దా మరి నువ్వు కూడా, ఈ బచ్చలి ఆకుల
పందిరి కిందకు, చనిపోయేముందు
6
మనల్ని మనం
ఒక్కసారి, గాట్టిగా కావలించుకునేందుకూ
తనువు చిట్లేలా ముద్దు పెట్టుకునేందుకూ
7
మరి
వస్తావా నువ్వు, సీతాకోక చిలుకలు ఆగిన
ఈ రెక్కల బచ్చలి పందిరి కిందకి ఓ మారు?

13 June 2013

a QUESTion

నారింజ పండుని ఒలిచిన నోటితో ముద్దు పెట్టుకున్నావు నువ్వు-

ఇక ఆత్మను ఎక్కడో కోల్పోయి, ఊగే గడ్డిపరకనై, ఈ నిశీధి గాలుల్లో

వెదికీ
వెదికీ
వెదికీ

నా చుట్టూ నేనే తిరుగుతున్నాను అప్పటి నుంచీ. తెలియదా నీకు

How
God came all over the universe
with

Your moist lips, and a barrel of Bacardi rum
in
his
మౌత్?

12 June 2013

మై, my, మై - political ఫ్రెండ్

గురో
యే గ్లాస్ భరో
And then
I'll let you know

The story of
A cock and
A cunt-

గురో
మారో యే దునియా కో
నేనెటూ ఒక
మాధర్చోత్ నే అనుకో
అయినా
ఉన్నదా నీకు
నీదైన ఒక సంత?

సంసారమనుకో
సాగరమనుకో
పెళ్ళాం అనుకో
పిల్లలు అనుకో

ఉద్యోగమనుకో
బాంక్ బాలన్సు అనుకో
నూట్యాభై గజాల
ఇన్స్టాల్మెంట్ భూమనుకో
వీకెండ్ మందనుకో

గురూ
నీకూ లేదు ఆత్మ
నాకెటూ లేడు
పరమాత్మ

ఎంగిలైన లోకంలో
ఉమ్మూసుకుంటో
చినిగిన వాల్పోస్టర్లు చూసుకుంటో
ఎక్కడ తీర్చుకోవాలో తెలియక

మర్యాదస్తులమై
మూత్రాన్ని అదిమిపెట్టుకుని
తిరుగుతాం కదా రోడ్లంతా

మరి గురూ
గుర్తొచ్చేది దేవుడు
అప్పుడే
నీకూ, నాకూ
మరి గుర్తొచ్చేదీ
ప్రభుత్వం
అప్పుడే
నీకూ, నాకూ

ఇంతా చేసి
తిరుపతికి నువ్వెట్లాగూ
వెళ్ళవనుకో
ఏడ్చుకుంటూ
ఆ ఏడూ కొండలూ
నువ్వెట్లాగూ
ఎక్కలేవనుకో
అయినా కానీ
నీ భార్య అక్కడ
క్షవరం కావించకపోతే
షవర్లో నీకొక
జుగుప్సా షివర్

సరే
సరే
మరే
మహా
కరుణామయుడివి
నీవు
స్త్రీని
యోనిగా చూసే
మహాలింగ
పుణ్యపురుషుడివి
నీవు

సరే
సరే
అది
సరే
కానీ
నువ్వు కొనిచ్చిన
ముప్పై తులాల
మూడు అపార్ట్మెంట్ల
నీ వన్నె చిన్నెల
వెన్నెల చిలుక
ఏమన్నదీ

ఉన్నదా జన్నత్
ఇప్పటికీ అక్కడ
నువ్వు తల వంచి
నిదురోయిన
తన
రాత్రి లోయల
మెరుపు ద్రవాల
పరిమళం వద్దా?

నువ్వు నెలకొక
నెక్లెస్
వారానికొక
పట్టుచీరల్
GVK మాల్ లో
ములాఖాత్
అయ్యిన చోటా?

సరే సరే
అది సరే
నీ కత
నాకెందుకులే కానీ
సరే సరే

నువ్వెటూ బ్రతుకుతావ్
రూకలని
బంగారంగా మార్చుకుంటూ
నువ్వెటూ
నాయకుడివవుతావ్
పుర జనులతో
ప్రేమాభిమానాలతో
ఆడుకుంటో
వాడుకుంటో
అవసరమైతే
అమ్ముకుంటో
చంపుకుంటో

సరే
సరే
అది
సరే
కానీ

అందుకే
మరిక నీ

ఏడూ వేళ్ళకి ఏడు రింగుల్
మెడలో బారెడు చైనుల్
చెవులో, చేతులో సెల్లుల్

నోట్లో పాన్, నాలికకి పరాగ్
కాళ్ళకి కొల్హాపురి, ఒంటికి ఖద్ధర్
బండి బైలెల్లి నాదే అంటే
నీ వెంట. పొలోమంటూ
నీ చేలేగాళ్

అక్కొడొక డీల్
ఇక్కడొక ఫీల్
ఇక్కడొక మాటా
అక్కడొక చేష్టా

తాగీ తాగీ, నీ ముఖం
ఉబ్బీ, ఉబ్బీ, ఇక నీ
హావభావాల్ ముందు
నటనా చతురులందరూ
పూర్తిగా డల్ & నిల్-

ఇక ఇదేమిటంటావా?

ఏంటంటే

ఎంత ఆపుకున్నా
ఆగక, జారి
పడుతుంది కదా
అప్పుడప్పుడూ
పబ్లిక్లో, ఒక
మూత్రపు బొట్టు

నీ తెల్లని ఫాంటును
చల్లగా చేస్తూ -
చూస్తావు కదా
ఇకప్పుడు
అదోలా ముఖం పెట్టి
అటూ ఇటూ

మరి, అదే ఇది-

నీ మహత్తరమైన లోకం
కాలం, ఆదర్సప్రాయమైన
నీ కుటుంబమ్
నీ సంసారమ్, నీ ప్రజల
సంక్షేమమ్ మరియు
నీ స్నేహితుల
ఆశీర్వాదమ్-

వింటున్నావా
మరి, నువ్వు

లాగులిప్పుకుని కూర్చుని
బహిర్భూమిలో ఆవలిస్తోన్న
ఈ పదాలని?

11 June 2013

A Statement

I am
An asshole
Of this era.

Don't
Come to me.

//ఇట్టి విధమున//
//ఒక నామ శిలా ఫలకమును//
//మెడ యందు//
//ధరించి//

//కూర్చుని ఉంటిని//
//నిమ్మళముగా//నా శరీరం//
//ముందుగా//

//ఒక//
//గార్ధబముతో//

//అది//
//సరే//
//కానీ//

Why are you

//ఓండ్ర పెట్టింగ్స్ //
//At me?//
//అజీర్తి చేసిన//
//ఒక//
//గాడిద వలే?//

//ఉందా//
//లేకపోతే//
//ఇందా//
//ఒక//బాటిల్//
//హాజ్మోలా//

//ఇక//
//కూర్చో//
//నువ్వూ //నిమ్మళంగా//

//తుమ్ముకుంటో//
//దగ్గుకుంటో//ఈ
//లోకాన్ని//
//పసుపు
//పచ్చగా//
//చీదుకుంటో//

//శుభోదయం//
//లోకమంతా//
//ఇక//
//గార్ధభోదయం//
//జ్ఞానోదయం//

BTW
Do you want
To see
A donkey
That
Writes
Poetry?

//ఇక్కడ//
//నేనో//
//అద్ద్హం//వేలాడదీశాను//
//మరిక//
//చూసుకో//

-హ్హ్హ్హాఆఆఆఆఆఆఆఅచ్చ్!-

Hey, Babe

ఇంత దూరమూ వచ్చావు, తలుపు తట్టడానికి సందేహించకు
అలసిపొయావు.గోడకు జేరగిలబడి కూర్చుని
చేతలతో మాట్లాడేందుకు, అనుమతి అడగకు

నింగితో నిప్పుతో, నీటితో నేలతో, గాలితో, నిన్ను
నువ్వు తుడుచుకునేందుకు మొహమాటపడకు-

కావలించుకో గట్టిగా.//పర్వతాలు కదిలేటట్టూ, సముద్రాలు ఎగిసి పడేటట్టూ-
ముద్దు పెట్టుకో ఒక్కసారి.// ఆకాశం ఉలిక్కిపడి
మబ్బులు చెల్లా చెదురు అయ్యేటట్టూ. ఏడువు

కంటి నిండుగా//నదులన్నీ తిరిగి తమ మూలాల్ని చేరుకునేటట్టు- మునిగిపో
కరిగిపో//విచ్చిన్నమయిపో//ఖగోళ సంబరాలేవో
నీ నెత్తురులో నాట్యమాడి అంతమయిపోయేటట్టూ-

దూకు ఈ శరీరంలోకి, నీ శరీరంలోకి దూకుతున్నట్టు- హత్తుకో//తనివి తీరా//
చీల్చు//పగులగొట్టు//నములు//అమృతాన్నేదో
తాగు// నీ నోటిలోంచి నాలోకి ఉమ్ము.నీ చేయి
జొనిపి, ఈ గుండెకాయని పెకల్చి//నీ వక్షోజాలపై

కాల్చుకుని తిను.//దాహం అయ్యిందా// తాగు
ఈ శరీరాన్ని మొత్తం ఎత్తి, నాలోంచి, నీలోంచీ
తీసుకుని చిలికీ చిలికీ// విషాన్నో//విస్మృతినో//విషాదాన్నో//వేదననో//గర్భగాయాలనో-

ఎందకంటే, చిన్నా, మరో దారి లేదు, ఉండదు-

ఇంత దూరమూ వచ్చావు, ఇక నన్ను తట్టడానికి సందేహించకు
ఎవరో వస్తారనే, ఈ చీకట్లో, నెత్తురుతో
ఒక మృత్యు దీపం వెలిగించి ఉన్నాను-

మరి Babe//have you got guts// టు come//
With or without// your cloths?

10 June 2013

ఒక రోజు(A Noem)

This is a work of fiction. Names, characters, places and incidents either are products of the author’s imagination or are used fictitiously. Any resemblance to actual events or locales or persons, living or dead, is entirely coincidental.
---------------------------
ఎండలో పడి ఇంటికి హడావిడిగా వచ్చి, కుండలో నీళ్ళు ముంచుకుని గట గటా  తాగి, పమిటతో ముఖాన్ని తుడుచుకుంటూ, నేలపై, బొంతపై కూర్చున్నావు నువ్వు. ఒక ఇసుక కాగితంతో, గరుకైన నిప్పుతో ముఖాన్ని ఎవరో రుద్దినట్టు కమిలి పోయింది నీ ముఖం. తలలోంచి, వడలిపోయిన అ చిన్న మల్లెపూల దండని తీసి ఓ మూలకు విసిరి కొడితే, ఆ మూల లోంచి రెక్కలు తెగిన సీతాకోకచిలుకలు మొలుచుకు వచ్చాయి గది నిండా అప్పుడు. చేతులను వెనక్కి విసిరి, ఇక అలసటగా నువ్వు వాలిపోతే, లోపలంతా ఒక చీకటి. పేగులు తెగి కాలుతున్న వాసనా. కొద్దిగా తొలిగిన జాకెట్ లోంచి, చెక్కుకుపోయిన వక్షోజాలు,  నీ ప్రేమికులందరూ నులిమీ నులిమీ, కొరికీ కొరికీ, వొదిలి వేయగా ఇక ఎండిపోయి నీడకై వెదుక్కునే వక్షోజాలు. 

అప్పుడు, ఆనాడు నీ కళ్ళు లేవు అక్కడ. ముళ్ళ పొదలతో నిండిన ఎడారులు మాత్రమే ఉన్నాయి. "ఏడ్చినా కన్నీళ్లు రావడం లేదు" అని అన్నావు నువ్వా రోజు విరగబడి నవ్వుతో. నీ పొట్టపై వాళ్ళు తన్నిన బూట్ల ముద్రలు ఎర్రగా, కొద్దిగా రంగు మారుతో ఉంటే, అంటాను నేను: "Is it OK with just rice and pickles? That is all we have got for today." అప్పుడు బయట కాంతి రంగు మారింది. మబ్బులు కమ్ముకుని, ఈదురు గాలి వీస్తే, ఆ గాలిలో కొమ్మలని వీడలేక వీడుతూ కొట్టుకు వెళ్ళే ఆకులు: అశోకా ఆకులు. పసుపు పచ్చని ఆకులు. పండిన ఆకులు. ఎండిపోయిన ఆకులు. అవే నీ చేతులు. అవే, ఇక నెమ్మదిగా లేచి భీతిగా చుట్టుకుంటాయి భీతితో కూర్చున్న నన్ను. గది ముందు వాలు కుర్చీలో, కుక్కలు కొరికిన మన తెల్ల పిల్లి నొప్పితో కదిలి మళ్ళా ముడుచుకుని పడుకుంటుంది. నొప్పితో అప్పుడప్పుడూ అది చేసే గుర్ మనే సవ్వడి ఒక్కటే ఆకాశమంతా-

కొంత వర్షం పడొచ్చు. ఆకులు తడవొచ్చు. నీటికి నానిన భూమి మళ్ళా పచ్చిక వాసన వేయవచ్చు. బహుశా, పక్షులు పెట్టుకున్న గూళ్ళూ రాలిపోవచ్చు. నేలరాలిన, ఎగరలేని ఆ పిచ్చుక పిల్లలని పిల్లులు తినవచ్చు. సాయంత్రం తిరిగి వచ్చి, ఆ పిచ్చుకలు కీచు మనే శబ్ధాలతో రాలిన గూళ్ల వద్దే అల్లల్లాడుతుండవచ్చు. తిరిగి నువ్వు ఈ రాత్రికి ఇంటికి పోకపోనూ వచ్చు. అందుకని, అప్పుడు, వెచ్చటి నెత్తురు నా ఛాతి నుంచి నీ హృదయంలోకి కారితే  తల వంచి ఆ ఏడు కత్తి గాట్లలో ఉబికే ఎర్రటి చెమ్మని తాగుతో అంటావు నువ్వు:

"పిచ్చి ముండాకొడుకువి నువ్వు. ఎవరైనా కోసుకుంటారా ఇలా? What the fuck is your problem? Whose sins are you suffering for, fucker? Do you think you are responsible for everything in this shitty world?. నీకేం తెలుసు బాధ గురించి? identity గురించీ?. ఇటు చూడు. ఏం తీసుకు వెళ్ళాలి ఇంటికీ పూట? ఆ లంజా కొడుకులు ఆరుగురూ  దెంగి, ఒక్క పైసా ఇవ్వలేదు. చూడు ఇక్కడ రక్తం" అని తను, నా అరచేతిని తన మల ద్వారం వద్ద ఉంచితే, అదంతా ఒక నెత్తురు వస్త్రం. నెత్తురు కమలం. "ఏం, ముస్లిం అయితే దెంగడం, చెరచడం మీ జన్మహక్కా? లంజా కొడుకులు--- నొప్పిరా. నన్ను బ్రతికించురా' అని తను అంటే, ఆ రోజున అక్కడ, లోపలా బయటా 

ఒక మహా ప్రకంపన. బయట చినుకుల చప్పుడు. గడ్డిపరకలు గాలిని కోసే చప్పుడు. కడుపులో దాచుకున్న శిశువుని ఎవరో లాగి నరుకుతున్న చప్పుడు. కషాయ గంటలు మ్రోగుతున్న చప్పుడు. ఏడ్చీ ఏడ్చీ ఏడ్చీ ఇక ఏడ్వలేక, అన్నీ అంతమయ్యి, యోని పీలికలుగా కోయబడే చప్పుడు. స్పృహ తప్పుతున్న అ చిన్న ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకుంటే, గాజుపాత్ర పగులుతున్న చప్పుడు. నా రెండు చేతుల మధ్య ఒక దేశం బీటలు వారిపోతున్న చప్పుడు. రెండు కళ్ళు చితికిపోయి, వక్షోజాలై, పాలింకిపోతున్న చప్పుడు. జెండా అవనతమౌతున్న చప్పుడు. ఎవరో నిరంతరంగా ఒక సమాధిని తవ్వుతున్న చప్పుడు-

 అటువంటి శబ్ధాల మధ్యా, అటువంటి నాహిద్ ల మధ్యా, పూలను పొగుడుతూ జీవించడం ఎలాగో తెలుసా నీకు?

ఘోష

1
వెళ్ళిపోకు నువ్వు . నువ్వు వెళ్ళిపోతే
ఈ కాగితం కూలిపోయి ఒక శూన్యం మొదలవుతుంది
నాకు శూన్యం అంటే భయం లేదు-
కాకపోతే, నువ్వు వెళ్ళిపోతే, ఈ శూన్యానికీ అర్థం ఉండదు- అందుకే
2
ఇప్పుడీ రాత్రి గడిస్తే చాలని నాకు నేను చెప్పుకుంటాను. అయితే

చుక్కలు కూడా లేని చీకట్లో, కత్తులై ఊగుతున్న గడ్డి పరకలపై
కుత్తుకలని కోసుకుంటున్న మంచు బిందువులు
చల్లటి రక్తంతో నీ అరి పాదాల్ని తాకాక అక్కడలాగే
తటాలున పొలాల చివర తాడి చెట్టు కింద కూలబడి

 నేను వెళ్ళలేనంత దగ్గరలో ఉన్న
పాక లోంచి ప్రాణమై మెరుస్తున్నలాంతరు కాంతివైపు చూస్తూ

ఇప్పుడీ క్షణం గడిస్తే చాలని నాకు నేను చెప్పుకుంటాను-అయితే
3
నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలూ ఇక ఏమీ లేవు

ప్రేమా కరుణా హింసా దయా దు:ఖమూ, అన్నీ
నువ్వు నిదురించలేని ఒక రాత్రిలోనే తేలిపోతాయి

నువ్వు వెళ్ళాల్సిన ప్రదేశాలన్నీ, నీ నిదురలోకి
రాలేని పూల జోల పాటలపై మెరిసే
సూర్యరస్మితోనే తగలబడి పోతాయి

ఇక నీకు ఏమన్నా ఉంటే, అది
దుప్పటి కూడా లేని ధూళీ నేలా
పూర్వజన్మలో మమకారంతో తాకిన ఆ స్త్రీ వక్షోజం
అలల నురుగ ఘోష లాంటి నీ బిడ్డ చివరి నవ్వూ

నువ్వూ నీలోపల కోన ఊపిరితో తచ్చట్లాడుతున్న
మంచు మరణమూనూ- అందుకని
4
నీ ఊపిరికై నీ వద్దకు వస్తాను నేను-

నీవు లేనితనంలో నీ ఉనికిని వింటాను నేను. ఎవరో వొదిలి వెళ్ళిన
గులాబి నీడ, గులాబీని వింటున్నట్టు
నీవు లేనితనంలో నీ ఉనికి నిశ్శబ్దాన్ని వింటాను నేను

నీ ఊపిరికై నా వద్దకు వస్తాను నేను

పదాల నీడలలో, ఎవరూ తాకని, నీ శాశ్వతమైన తాత్కాలికపు
మరణపు పెదాలను రుచి చూస్తాను నేను
విరిగిన శిలా విగ్రహాలు ప్రాణం పోసుకుని, చీకటి పూట
ఈదురుగాలుల వంటి ఊపిరులతో
ఒంటరి నక్షత్రం వైపు తపనగా చేతులు చాచినట్టు, నీలోని
తడిని తదేకంగా చూస్తాను నేను

నీ ఊపిరికై ఈ ప్రపంచం నుంచి వెడలిపోతాను నేను

ఖాళీ గూళ్ళలో ఒదిగి ఉన్న అంతిమమైన అసంపూర్ణ అర్థంలాంటి
నీ సారాంశాన్నీ, సత్యాన్నీ
నీవు లేని చోట మాత్రమే కనుక్కుంటాను నేను. గాలిపై గాలి
నీడపై నీడ
జాడపై జాడ
సర్వత్రా వ్యాపించి మరణంతో జన్మిస్తున్న భాష. చూడు

నీ ఊపిరికి నీ వద్దకు వస్తాను నేను, ఇక్కడికి-
5
ఎవరూ రాలేదు ఇంకా ఇక్కడికి, ఈ ఎండిన

మట్టి వీస్తున్న సాయంత్రాన
ఎవరూ తాకని నీ సమాధి వద్దకు వస్తావు నువ్వు-

రాలిన పూవులు పలుకరిస్తాయి నిన్ను. తలలులేని
శిలావిగ్రహాలు పిలుస్తాయి నిన్ను
అమావాస్య సంధ్యా సమయాన, రహస్యమైన చేతులు
తాకుతాయి నిన్ను

ఎవరూ రాలేని ఇక్కడికి, ఈ ఎండిపోయిన

ఊపిరి వీస్తున్న సాయంత్రాన
ఎవరూ తాకని నీ సమాధి వద్దకు వస్తావు నువ్వు- మరి
6
ఇతర క్షణాలలో నీకు కనిపించి, నీవు నివసించిన
ఇక లేని, రాని
నువ్వు తపించే ప్రదేశాలలోకి ఎలా వెళ్ళగలవు నీవు-

నీ ఉనికి
వికసిస్తున్న పూవులా ఉండిన గాలిలోకి
నక్షత్రంలా మెరిసే నీటి చినుకులోకి
నిశ్శబ్దంగా, నిన్నుఓదార్చుతున్న ఆ స్త్రీ తెగిన అరచేతులలోకి
పాలిపోయిన నీడల లాంటి
నీ స్నేహితుల ఊపిరి తెగిన జాడలలోకీ

ఇతర క్షణాలలో నీకు కనిపించి, నీవు నివసించిన
ఇక లేని, రాని
నువ్వు తపించే ప్రదేశాలలోకి ఎలా వెళ్ళగలవు నీవు? అందుకే
7
దూరం చేయబడ్డ దిగులు ఇది-

దూరం చేయబడి, దారి తప్పి, తీరం లేక
ఎప్పటికీ గూడును చేరుకోలేక
గోడకు తల మోదుకుని మరణించిన
దూరం చేయబడ్డ పక్షి దిగులు ఇది

కాంతిలేని నీడ కమ్ముకున్న మధ్యాహ్నం
నీ హృదయంలో ఎవరో
నీరు లేని నల్లని చెపపిల్లయై విలవిలలాడతారు
నీ అస్తిత్వాన్ని ఎవరో
కరుణ లేక కత్తితో రెండుగా చీలుస్తారు
ఎవరో నిన్ను
ధూళిలా గాలిలోకి వెదజల్లి, నిన్నుగా
మిగులుస్తారు నిన్ను- ఇదంతా

దూరం చేయబడి, దారి తప్పి, తీరం లేక
ఎప్పటికీ గూడుని చేరుకోలేక
నీటిలో దేహాన్ని ముంచుకుని మరణించిన

దూరం కాబడిన నీ దిగులు ఇది- అందుకు
8
ఆకాశపు అంచుపై రాలిపోక మిగిలి ఉన్న
ఆఖరి నక్షత్రం పిలుస్తుంది నిన్ను-

గాలి తాకక, గూడు పిలవక
దారీ తెన్నూ లేక రాత్రిలో కనుమరుగైన పూవువి నీవు
అందరూ వదిలివేసిన
తపించే కీచురాయి సంగీతానివి నీవు

విను
సన్నగిల్లుతున్న
సుదూరపు దీపపు ఊపిరి కాంతిని
అనంతంగా సాగి ఉన్న
నీ అంతిమ ప్రయాణపు, నీవే అయిన
అద్రుశ్యపు మట్టిదారిని

అది
రంగుల శబ్దం, పదాల నిశ్శబ్దం
నీవు వేయని నీ అస్తిత్వపు కంపించే మంచు చిత్రం-
మరి
9
ఇంతకుమునుపే ఈ పాటను విన్నావు నీవు-

భూమి పొరలలో ప్రవహించే నీటి నెత్తురు చలనాన్ని
ఆకస్మికంగా నీ ఉనికితో విన్నట్టు
ఈ పాటను ఇంతకు మునుపే విన్నావు నీవు
లోయలోకి జారుతున్న ఆకు వలే
నీ అస్తిత్వం నిర్భయంగా
వినీలాకాశంలో స్వేచ్చగా కదులాడే పక్షి రెక్కలపైన
ఊయలలూగుతున్నప్పుడు

నీ లోపలి పాటను విభ్రమంతో విన్నావు నీవు-

వర్షం కురిసే రోజులలో, నీడ కమ్మిన మధ్యాహ్నాలలో
మోహంతో నిన్ను పిలిచినా నక్షత్రాలను నువ్వు
నవ్వుతూ తాకిన వేళలలో, ఎవరూ లేని రాత్రుళ్ళలో

నీ లోపలి పాటని వింటూ పాటగా మారావు నీవు
నీ లోపలి పాటని వింటూ నీవుగా మారావు నీవు
అది

నిశ్శబ్దాలకి నిశ్శబ్దం
పాటలకి పాట మాటలకి మాట
నా వైపు చూడు
ఈ శబ్దరహితపు పాటను ఇంతకు మునుపు విన్నావు నీవు. మరి
10
బాటసారీ
నీరు లేక దుమ్ము పట్టి రంగు మారుతున్న ముదురు ఆకుల మధ్య
తలి వర్షానికి వెదుక్కుంటావు నీవు
యుగాల నుంచి పిల్లల కళ్ల లాంటి కాంతి కదలికలు లేక
శిలల్లా మారిన ఆకుల నిశ్శబ్దం మధ్య
నీకై వెదుక్కుంటావు నీవు

పిల్లల తుళ్ళిపడే నవ్వుల జాడ లేని వృక్ష ప్రాంతం ఇది
పదాల పొత్తిళ్ళలో ఒదగ లేని
నల్లటి మంచు కురుస్తున్న, పెదాలు తెగిన మరణం ఇది

బాటసారీ

నువ్వు వెదుకుతున్న స్వప్నాంతపు దారిని కనుగొన్నావా
చెదిరిన నీ ఎదురు చూపుల కళ్ళను
ఏ రెండు అరచేతుల సెలయేరులోనైనా కడుక్కున్నావా
ఏ దేహపు ఒడ్డునైనా చేరగిలబడి
నక్షత్రాలు నెమ్మదిగా సంధ్యాకాశాన్ని చీకటి దారంతో
అల్లటం గమనించావా

బాటసారీ

నీరు లేక, దుమ్ము పట్టి రంగు మారుతున్న లేత ఆకుల మధ్య
తొలి వర్షానికై వెదుక్కుంటావు నీవు
యుగాల నుంచి పిల్లల బాహువుల వంటి కాంతి స్థిరత్వం లేక
శిలల్లా మారిన ఆకుల గుంపుల శబ్దాల మధ్య
నీ నిశ్శబ్దంకై వెదుక్కుంటావు నీవు. అయినా
11
దేహసారీ
నువ్వొక నదిలేని పాటవి. ఎవరూ కనుగొనని
ప్రాచీన లిపివి
తొలి వర్షానికై సంచరించే రక్త గాయపు గాలివి.

నిన్ను
నువ్వు కోల్పోయినపుడు మాత్రమే
నిన్నునువ్వు కనుగొంటావు
అన్ని దారులను వొదిలివేసినప్పుడు మాత్రమే
నీ దారిని నీవు చూస్తావు-

రా మరి
12
ఈ దిగులు నీకే తెలుస్తుంది

సముద్రపు సారాంశం అంతా మట్టిని తాకి చిట్లుతున్న
వర్షపు చినుకులో ఇమిడిపోతుంది
నిరంతరంగా, కనిపించీ కనిపించకుండా వీస్తున్న
గాలి గాజుల చేతుల అభద్రతా అంతా
వెన్నెల రాత్రిలో ఎగురుతున్న పక్షి రెక్కల కింద ఒదిగిపోతుంది
అనంతపు నక్షత్రాల నిశ్శబ్దం అంతా
ఒక పిల్లవాడి అసంకల్పిత నవ్వు చివర పిగిలిపోతుంది
విశ్వాలలో కదులాడుతున్న రహస్య కాంతి అంతా
నిశ్శబ్దంగా సమస్తాన్ని ఎరుకతో గమనిస్తున్న
నీ కళ్ళ అంచులలో ప్రయత్నరహితంగా వాలిపోతుంది

స్పర్శలకు స్పర్శా
పూలకి వేకువా
ఊపిరులకి ఊపిరి

ఇక్కడికి రా నువ్వు

ఈ దిగులు నీకే తెలుస్తుంది. ఎందుకంటే
13
ఎవరూ తాకక నిశ్చలంగా నిలబడి ఉన్న ఈ ముల్లు
నీ ఆప్త మిత్రురాలు

సంధ్యాస్తమైన ఆ వింత సమయాన, పసిపాప కన్నుకంటే
సున్నితమైన ఆ లేతముల్లు ముందు మోకరిల్లి ప్రార్దిస్తావు
నువ్వు:

"రాత్రిపూట మసక వెన్నెల్లో చలించే దేవతవి నీవు
నీ సరళమైన ఉనికి వల్లనే
విచ్చుకునే పూవుల వివిధ రంగులు సాధ్యమయినాయి
నీవున్నావు కనుకనే
నా పాదాల వెంట సాగే నా తల్లితండ్రుల నీడలు
ఊపిరి పీలుస్తాయి
ఇది  చెప్పు నాకు
నేను నీలా మారటం ఎలాగో?

జవాబు:

"నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-

ఈ శూన్యపు పుష్పాన్ని, నిండైన నీ స్త్రీకి
బహుమతిగా ఇవ్వు. ఆ తరువాత నీకే దయగా తెలుస్తుంది
స్త్రీలూ, పుష్పాలూ ఒకటే అని
పుష్పాలూ ముళ్ళూ ఒకటేనని
శూన్యం, శూన్యారాహిత్యమూ మృత్యుపక్షి విదిల్చే
రెండు అనంతపు రెక్కలని.

నిశ్చింతగా గాలిలో తేలు, గిరికీలు కొడుతూ నేలపై వాలి
నాట్యమాడు. నీటిని స్పృశించు, గాలిని పరామర్సించు
నీలోపల నీవు విశ్రమించు-
ఇదీ జీవితం, ఇదీ జీవించడం
ముల్లులా ఉండటమంటే ఇది:
నీవు పూర్తిగా ఖాళీ అయినప్పుడు మాత్రమే
నిండుగా ఉంటావు-"
14
కూర్చో, కొద్దిసేపు అలా విరామంగా

ప్రేమమయపు అలసటతో ఆగిన వర్షాకాలపు తెమ్మెరలా
కొద్దిసేపు అలా, ఊపిరి పోసుకుంటున్న కలలా
ప్రశాంతతతో, నీతో నువ్వు కూర్చో: ఏమీ ఆలోచించకు
పక్షిలా, అన్నిటినీ వదిలివేసి నీ రెక్కల్ని విదుల్చు.

నీ చుట్టూ ఉన్న కాంతినీ, చీకటినీ
ఆ ప్రమిదెపు ఆఖరి చూపునీ, నీ అస్తిత్వపు నాలికతో చప్పరించు.
నీకు తెలుసు: ఈ జీవితంలో జీవించేందుకు
నువ్వు మరణించేముందు మరణించాలి. ఆ తరువాత
సాధ్యం అవుతాయి అన్నీ. మరి నక్షత్రాలూ
పాల పొదుగులాంటి వెన్నెలా, దయగా నవ్వే

సూర్యుడూ, వర్షం, హర్షం, ప్రతిధ్వనిస్తున్న
శిశువు నవ్వులాంటి నువ్వూ, నీ ఆఖరి మొదటి అస్థిత్వమూనూ- కానీ
15
కొమ్మల మధ్యగా చలికాలపు ఎండా, ఆకుల నీడా కదులాడుతున్న
శంఖంలాంటి గూటిలో
సగం పొదిగిన గుడ్లను నువ్వైతే వొదిలి వెళ్లావు కానీ
నేను ఎలా వొదిలి వెళ్ళగలను? సరే,
16
ఎదురుగా నిశ్చలంగా ఉన్న ఎండిన ఆకు, ఒక పాటా ఒక నది.

పాట వెంటా, నది వెంటా, ఆకుపచ్చని సూర్యరశ్మి కిందుగా
సర్వాన్నీ మరచి వెడతావు నీవు.
దారి మధ్యలో, ఏ ఒడ్డునో సగం తడిసిన గవ్వ లాంటి పదం
దొరుకుతుంది నీకు. విశ్వం అంతా

నిక్షిప్తమైన, శంఖంలాంటి రహస్య సారాంశం దొరుకుతుంది నీకు
అలకూ అలకూ మధ్యగా ఉండే ఘాడమైన నిశ్శబ్దంలాంటి
నువ్వు దొరుకుతావు నీకు. ఎండిన ఆకు గీతాల మధ్యగా
కూర్చుని, సన్నటి నీటిపాయపై ప్రయాణించడం ఒక పాటా,
ఒక ఆటా. అందుకే

నిన్ను నువ్వు వదులుకోకు. ఆ లేత చేతిని ఎప్పటికీ మరచిపోకు. చూడు
17
-ఈ సమాధి నీ పూల అస్థిపంజరం-

నువ్వు ఇక్కడ జీవించావు. నువ్వు,  ఇక్కడ ప్రేమించావు.
నీ స్త్రీకై నీ రక్తపు బొట్లతో ఒక హారాన్ని తయారు చేసావు.
నీ పిల్లలకై, నీ హృదయాన్ని
వాళ్ళ పాదాలలో తురిమావు.

-ఈ సమాధి నీ పూల అస్థిపంజరం-

నువ్వు ఇక్కడ విశ్రమించావు. నువ్వు ఇక్కడ ప్రయాణించావు
నువ్వు ఇక్కడ, నీ మూగ తల్లి తండ్రుల లాగే
ముసలివాడివయ్యావు.నీ అలసిన ఎముకలతో
ఈ ప్రదేశంలో, ముక్కలు ముక్కలుగా మరణించావు.
జ్ఞాపకం లేదా నీకు

ఈ సమాధి నీ పూల అస్థిపంజరం. అది సరే కానీ, ఇది చెప్పు నాకు-
18
నీడల మధ్య జీవిస్తావు నువ్వు. అందుకని నీకు
నీడలా కరుణా, కాంతీ, హింసా అర్థమవుతాయి.
అందుకని నువ్వు

నీడలకు, చీకటిపూట కథలు చెప్పి నిదురపుచ్చుతావు.
అవి నిదురిస్తాయి. నిదురలో కంపిస్తాయి.
ఆ కలలలో తమ నీడలు కనపడగా, అవి
ఉలిక్కిపడి లేచి కూర్చుంటాయి. రాత్రంతా

నిన్ను చూస్తూ కూర్చుంటాయి.
నాకు ఇది చెప్పు. నేను నీడనా కాదా?
19
జాగ్రత్తగా విను
రక్కలు తెగి గిరికీలు కొడుతూ రాలిపోతున్న
అనాధ సీతాకోకచిలుక వినిపించని అరుపు.

అది ఎవరు?
20
వృక్షాల నీడలు కమ్ముకున్న నక్షత్రాలు కూడా లేని
రాక్షస రాత్రిలో, ఊపిరికై రెక్కలు కూడా లేని ఒక పక్షి
గదంతా నిస్సహాయంగా గిరికీలు కొడుతుంది.

నీ అరచేతులలో సన్నటి నిప్పుని బ్రతికించుకుంటూ వచ్చి
మూలగా మరెక్కడో, నీ హృదయపు తాకిడికై
తహతహలాడే ఆ పాత ప్రమిదెను వెలిగించు.

ఈ రాత్రికి, ఆ సంజకెంజాయ వెలుతురులో నా శ్వాసను
అందుకుంటాను. మరొక్కసారి నీ దయగల
పావురపు కళ్ళను చూస్తాను. మరొక్కసారి
నీ చేతులను నా అరచేతుల మధ్య పదిలంగా దాచుకుని
అలా నా ప్రాణాన్ని రేపటిదాకా నీ
స్పర్స మధ్య బ్రతికించుకుంటాను.
21
ఆ దినం, తెలియదు నాకు-

తెల్లని నిశ్శబ్దపు నీళ్ళు, నల్లటి రాత్రంతా
ఒక మంచుతుంపరయ్యి కురిసే వేళ్ళల్లో
నువ్వు
నా నిదురలోంచి మెత్తగా విచ్చుకుని
సూర్యు సాగరం  వైపు ఎగిరిపోయావో-
22
చిక్కటి చీకటి బూజు కప్పుకున్న చెట్ల మధ్యనుంచి
రాత్రంతా ఆ పిచ్చుక పిల్లలు
తమ లేత గొంతులు బొంగురుపోయేలా అరుస్తూనే ఉన్నాయి

సూర్యుడి పసుపుపచ్చని కనుపాపలవి
రాత్రి చంద్రుడి మైమరపు హృదయాలవి
నీడల నిశ్శబ్దాలతో
చెట్ల కిందుగా, పైగా
తమ తనువులతో ఆడుకునే శిశువులవి.

ఏం జరిగి ఉంటుంది?
గూటిలోకి గింజలతో, తల్లి తిరిగి రాలేదా?
జగమంతా ముడుచుకున్న త్రాచైనప్పుడు
నిప్పు కణికెల కళ్ళతో

ఏదైనా పిల్లి గూటి వద్దకు నిశ్శబ్దంగా కదులుతుందా?
లేదా ఒక పిచ్చుకపిల్ల అదిరీ, బెదిరీ, కదిలీ,
ఆకాశాన్ని పదునుగా కోస్తున్న నక్షత్రంలా
నేల రాలిపోయిందా?
ఏం జగిగి ఉంటుంది?

చిక్కటి చీకటి రక్తం జిగటగా కమ్ముకున్న చెట్ల మధ్యనుంచి
రాత్రంతా ఆ పిచ్చుక పిల్లలు
తమ లేత గొంతులు బొంగురుపోయేలా అరుస్తూనే ఉన్నాయి, కానీ
తెలుసా నీకు
23
గాలిలేని ఇటువంటి నల్లటి చీకటిలో
నలువైపులా చలిస్తున్న ఆ వేయి బాహువుల వృక్షాల కిందుగా
ఒరిగిపోతున్న మట్టి రేణువుని
మమకారంతో కౌగలించుకుని

అలా నిలబడి ఉన్న, ఆ నాలుగు రేకుల
నక్షత్రంలాంటి ఆ చిన్ని తెల్లపూవు చాలు
నువ్వు ఈ రాత్రికి జీవించి, రేపటి దాకా ఎలాగోలాగ బ్రతికి ఉంటాను కానీ,
24
వెళ్ళిపోకు నువ్వు . నువ్వు వెళ్ళిపోతే
ఈ శూన్యం దగ్ధమయ్యి ఒక కాగితం మొదలవుతుంది
నాకు కాగితం అంటే భయం లేదు-
కాకపోతే, నువ్వు వెళ్ళిపోతే, ఈ పదాలకీ అర్థం ఉండదు-
25
ఇక ఎవరు రాస్తారు, నిన్నూ, నన్నూ?

09 June 2013

గాడిద

రిఫ్ఫున వీచే గాలిలో, దిగబడే చినుకులతో, రహదారిలోంచి ఒక పక్కకి జరిగి, చెట్టు కింద ఆ ముళ్ళ పొదల వద్ద ఆగితే, కొద్ది దూరంలో నా పక్కగా గాడిద ఒకటి, కొట్టుకుపోయే ఆకులనీ, ఆ దుమ్మునీ, బూడిద రంగుతో కొ ట్టుకుపోతున్న ఓ పేరు అంటూ లేని ఆకాశాన్నీ చూస్తూ-

దాన్ని కళ్ళల్లో, బహుశా దిగులు, బహుశా వీచే చీకటీ, బహుశా నా అవిటి భాష కూడానూ. బక్కచిక్కి, ఎముకలు మొలిచిన దాని డొక్కల్లో, బహుశా చచ్చిన ఈ నగరం కూడా. ఊగదు దాని తోక. మరి కదలను నేను కూడా- నుల్చునీ నుల్చునీ నుల్చునీ ఇక విసిగీ విసిగీ విసిగీ 

క్షణకాలం ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటే, అక్కడ, పురుగులు పట్టి లుకలుకలాడే, ఒక లోకం, ఒక కాలం. ఇక ఏం చెప్పను మీకు? వాన ఆగి వెళ్ళిపోయే ఆ గాడిదకూ, ఈ మనుష్యులని మోయలేక ఇక్కడే వెన్ను విరిగి కూలబడ్డ ఈ రెండు కాళ్ళ గాడిదకూ, అట్టే పెద్ద తేడా లేదు. Amen.

తాయెత్తు

ఆకాశం మారి, గాలి మారి, నీళ్ళూ మారి, చెట్ల కింద మట్టీ తన తనువు రంగులు మార్చుకుంటుంది. రుతువు మారిన కాలంలో, రంగులైన పిల్లలు, ఆడుకునీ ఆడుకునీ ఆడుకునీ, వర్షంతో, చెట్లతో, మట్టితో, గాలితో, తుమ్ముకుంటూ దగ్గుకుంటూ ఇంటికి వస్తే

వాళ్ళ అమ్మ 'వొద్దురా అంటే వినరు' అంటూ తువ్వాలుతో తుడిచి, స్నానం చేయిస్తుంది. ఆనక రాత్రికి, రంగులు తెలియని ఆకాశం కింద, ఆ చెట్లతో, మట్టితో, నీళ్ళతో, పిట్టలతో పిల్లలు నిదురోతారు. ఏ మధ్య రాత్రో వాళ్ళ శరీరాలలో రుతువు మారి

నిప్పులు తెరలు తెరలుగా వీయగా, పొక్కిలయ్యిన వాళ్ళ నిద్రలో, నిద్రపోని ఏవోవో కలవరింతలు.  బ్లాక్ స్పైడీ అనీ డోరేమాన్ అనీ, ఇంకా ఏవేవో, నాకు అర్థం కాని మాటలూ, చిత్రాలూ-

అప్పుడా గదులలో పగలు వాళ్ళు వేసుకున్న బొమ్మలు, ప్రాణం పోసుకుని, నీటి రంగులతో లేచి ఎగరతా ఉంటే, ఇక నిదుర పోలేము వాళ్ళ అమ్మా, నేనూ. మరి, జ్వరం వచ్చి, కలవరింతలతో మూలిగే, ఆ చిన్న పిల్లలని చూస్తూ ఎవరైనా ఎలా నిధ్రించగలరో చెప్పండి మీరైనా---

ఇక ఉదయం, ఇంకిపోయిన ముఖాలతో, ఎండిపోయిన పెదాల్ని తడుపుకునే  కళ్ళతో లేచి కూర్చున్న వాళ్ళని చూస్తూ అంటుంది నా తల్లి: "ఒరే నాయనా, దిష్టి తీస్తాను వాళ్లకి కానీ ముందు వీళ్ళనా సాయిబు దగ్గరకి తీసుకెళ్ళి ఆ తాయెత్తు ఏదో కట్టించుకు రారా."అని-

అందుకే వస్తున్నాను నేను, నా పిల్లలతో మీ వద్దకు. మరి ఉందా, మీ వద్ద, తక్షణ ఉపశమనం కలిగించే, రంగు రంగుల వేపగాలి వీచే, నల్లటి మట్టిలాంటి తాయెత్తు ఏదైనా?

hedgehog

1
నీదేమీ లేదు ఇక్కడ.

కఫాన్ని ఊసివేసినట్టు, కిటికీలోంచి ఉమ్మేసిన నీ కళ్ళు
దొర్లుతాయి, అక్కడే
దారి పక్కన నీళ్ళల్లో-

కొంత బురద. ఏవో ఆకులు-
కనుల స్థానంలో ఏర్పడ్డ ఖాళీ గుంతలలో, రాలే చినుకులు-
చీకటి నీడలేవో సర్పాలై

దూరే నల్లటి బొరియలు.
2
అరచేతుల్లో పట్టుకున్న
కత్తి అంచున గొంతును ఆన్చి, నెమ్మదిగా తలని వాల్చుతూ
చేసే ఒక ఆఖరి ప్రార్ధన

ఈ రాత్రీ, ఈ శరీరం. ఇక
3
నిన్ను బేరీజు వేయకుండా
చూడగలిగే కన్నులే లేవు- ఇక్కడా, ఎక్కడా- ఎవరి వద్దా. చూడు...
ఏమీ లేదు
4
చీకట్లో
చెట్ల కింద ఒంటరిగా
ఒక మేనియాక్- 

07 June 2013

నీ ముఖం

నాకు ఆరేళ్ళున్నప్పుడు, ఆడుకుని, నేనా చీకట్లలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటే
ఒక ఇనుప చువ్వ గుచ్చుకుని
పూర్తిగా చీలిపోయింది కాలిగోరు-

ఆ రాత్రి, అమ్మ కళ్ళల్లో నా నెత్తురు-
నా పక్కన కూర్చుని, ఆ రాత్రంతా అమ్మ
సలుపుతున్న కాలినీ, కాలే ఒంటినీ తడిగుడ్డతో తుడుస్తూ, ఏడుస్తా ఉంటే, మరి
నాకు ఏడుపొచ్చి, గుక్కపట్టి ఏడ్చాను

ఎందుకో. మరచిపోలేదు ఇప్పటికి కూడా
నేనా దినాన్నీ, ఆ రాత్రినీ, నా వెక్కిళ్ళనీ, -తడచిన- ఎర్రని చారల అమ్మ కళ్ళనీ-

మరివాళ, నేను తరిగి వస్తూ ఉంటే
ఎదురుపడింది నీ ముఖం. దానికి
మోదుకుని, గుచ్చుకునీ, పూర్తిగా చీలిపోయిందీ, రాలిపోయిందీ, ఇక నేనే ఇప్పుడు-

మరి ఈనాడు, నా తల్లీ లేదు. నువ్వూ లేవు. తుడిచే ఆ చల్లని చేతులూ లేవు-
చెప్పు నువ్వే: How will I survive
This night? 

నీడల చప్పుడు

1
అప్పుడప్పుడూ
నీ శరీరంలోంచి ఒక నీడ బయటకు వచ్చి
నీ ఎదురుగా కూర్చుంటుంది-

అప్పుడు, పూరేకుల్లోకి మబ్బు పట్టిన ఆకాశం దిగి ఒదుగుతుంది
నీ చుట్టూ కదిలే ద్రుశ్యాలలో, ఒక
వాన వాసన మెత్తగా వ్యాపిస్తుంది

అప్పుడు, నిన్ను దాటుకుని వెళ్ళిపోయిన వాళ్ళెవరో, తిరిగి వచ్చి
నీ భుజం తట్టి, చిరునవ్వుతో
నిన్ను పలుకరించి పోతారు.

అప్పుడు నీ అరచేతులు మచ్చ లేని అద్దాలూ, మాయా దర్పణాలూ-
చూసుకుంటే కనిపిస్తాయి నీకు ఆ
సరస్సులలో, నీ ముఖంతో పాటు
నీ త్రికాలాలూ-
2
ఇక నిబ్బరంగా లేచి, కౌగలించుకుందామని చూస్తే, నీ ఎదురుగా
నీ నీడ స్థానంలో నువ్వు. నీడైన నిన్ను
చూసుకుంటూ నీ ఎదురుగా నువ్వే. ఇక
3.
అప్పుడు
ఆకులపై రాలిన చినుకుల్లోంచి జారిపోయే వీచే చెట్లూ
రెక్కలు విదుల్చుకుంటున్న పక్షులూ
నీళ్ళల్లో దొర్లలేని రాయిపై ఆగిన గాలీనూ-
అప్పుడే
4
సరిగ్గా అప్పుడే
నీ పరిసరాల్లో ఎక్కడో ఒక పూవు నిను చూస్తూ రాలిపోయిన సవ్వడి-
మరి ఇంతకూ
5
విన్నావా నువ్వు

అప్పుడప్పుడూ
నీ శరీరంలోకి ఒక రాత్రి వచ్చి, నీలో ఒక సాలెగూడు అల్లుకునే, ఆ
నీడల చప్పుడుని?

06 June 2013

మృత్యువు నుంచి తప్పించుకుని వచ్చిన అమ్మాయి

మృత్యువు నుంచి తప్పించుకుని వచ్చి , కూర్చుంది అమ్మాయి కుర్చీలో-

కొంచెం బావున్న వాన, ఇంకొంచెం బావున్న గాలీ, గాలిలో మెరిసే పూల తడీ
అన్నం మెతుకుల లాంటి వెలుతురూ
శిశువుల శరీరాల నుండి వీచే వాసనా

ఎవరో నిన్ను రహస్యంగా తాకి పిలిచే
ఒక పలుకూ, నిదురకీ మెలకువకీ మధ్య, ఒక పురాతన సీమలో, నువ్వు
చూసి వచ్చిన ఒక పురాస్మృతుల గడీ

తొలిసారిగా వక్షోజాలు బరువయ్యి, తల్లి తనమేదో తెలిసినట్టు, పసివేళ్ళతో
నీ ముఖాన్ని ఎవరో నిమిరినట్టూ, నీ
ఒడిలో జీవితం, పసిపాపై ఒదిగినట్టూ

తొలిసారిగా నిండుగా నవ్వినట్టు, శరీరం తేలికయ్యినట్టూ, తేలిపోతున్నట్టూ

మృత్యువుని వెళ్ళమని చెప్పి వచ్చిన
అమ్మాయి చుట్టూ, కొంత లేత కాంతి
నిండైన శాంతి, నడకలో నింపాదితనం
పసిడి పరకలు ఏవో వాలుతున్నట్టూ
తన కనుల సంజ్ఞల చుట్టూ, నువ్వు ఇంతకు మునుపు చూడని ఇంద్రజాలం-

అందుకే మరి, మృత్యువు దాగుడు మూతలలోంచి వచ్చి ఇక్కడ దాక్కున్న
అమ్మయిన ఆ అమ్మాయి, కుర్చీలో
కుదురుగా కూర్చుని, తేలికగా అలా
కాళ్ళూపుకుంటో  చెబుతోంది ఇలా:

"ఇట్లా కాళ్ళూపుకోవడం, బ్రతికి ఉన్నామని తెలిసి ఉండటం...It's so beautiful
Isn't it? ఎందుకు తెలియలేదు మరి
ఈ చిన్ని విషయం నాకు ఇన్నాళ్ళూ?" 

05 June 2013

-ఉండలేక, ఇక-

నీపై చిక్కగా ఆకాశం చుట్టుకుని, అది, రాలే ఒక లక్ష రేకుల నలుపు గులాబీయై

నేలపైకి విచ్చుకుని నిన్ను కమ్ముకున్ననాడు
కూర్చుంటావు ఒక్కదానివే, నిద్ర మాత్రలతోనో
నీ అంత ఎత్తూ బరువూ ఉన్న మధుపాత్రతోనో-

వేర్ల సారాన్ని పీల్చుకుని వొదిలివేసిన, నువ్వు
వేళ్ళూనుకుని, నీదని అనుకున్న నేల, నీది కాదని తెలిసిన నాడూ, నీ ఒంటరి
గదుల చీకట్లలో, నువ్వు తపనగా, తడుముకునీ
తడుముకునీ, నీ చేతివేళ్ళకి ఎటువంటి వెలుతురూ

దొరకని నాడు, కలలకీ నక్షత్రాలు లేని రాత్రుళ్ళకీ
తేడా లేని నాడు, కళ్ళల్లో స్మశానాలు విచ్చుకుని
నీ అనుకున్న వాళ్ళందరూ నిన్ను తగుల పెడుతున్ననాడు, కూర్చుంటావు
నువ్వొక్కదానివే, నీ తోటే, ప్రేమంత నొప్పిహింసగా-

రాసుకుంటూ అనుకుంటాను నేను ఇక్కడ, బ్రతికుండలేవా నువ్వు, అని కానీ
ఎప్పుడో పగిలిపోయిన గాజుదీపం ఈ కాలం, మరి
ఎంత వెదికినా ఎక్కడ దొరుకుతుంది నీకీ లోకం

తడుముకునే నీ చేతివేళ్ళకి పెంకులు దిగి, అంచున
ఉబికే నెత్తురు బొట్ల గానూ, నువ్వొట్టి యోని గానూ
వస్తుమార్పిడిగానూ, శరీర సౌందర్య వక్షోజాలగానూ
తొడలూ, పెదాలూ పాదాలూ గానూ, రూకలు గానూ
నరమాంస భక్షక, సదా వినోదంగానే మిగిలిన నాడు?

ఏమో. ఉరితాడుని నువ్వు ముద్ధిడటం మంచిదేనేమో- Who knows and who judges?
తెలుసా మరి, వాళ్ళకైనా, మీకైనా, ఇక్కడ ఈ 'నాకైనా'? 

02 June 2013

వేడుకోలు

Please
Let me sleep
My eyes are bleeding blood, my body is bleeding blood

అని బలహీనంగా అంది తను
-పొక్కిలయ్యిన గొంతుతో
సలుపుతున్న దేహంతో-

అర్థరాత్రి, తూలుతో వచ్చి, తనపై
చేయి వేసి ఎర్రగా
నిలబడ్డ అతనితో.

కానీ ఆ తరువాత ఏం జరిగిందో, ఏం జరిగి ఉంటుందో, ఊహించలేరా మీరు?

స్పృహ

మబ్బు పట్టిన వెలుతురులో, గాలిలో సన్నగా ఊగుతాయి ఆ పూవులు-

ఎక్కడి నుంచో ఎగిరొచ్చి  వాలతాయి ఇక్కడ
పిచ్చుకలు. వాటి కిచ కిచ శబ్ధాలు లోపల-
ఎవరో కుండని నీళ్ళల్లో ముంచినట్టూ, ఎంత

నెమ్మదిగా నడచి, సవ్వడి చేయకుండా పోదామని అని అనుకున్నా

గజ్జెలు చిన్నగా మ్రోగినట్టూ, రాసుకుందామని
ఉంచుకున్న తెల్లని కాగితాలు గాలికి రివ్వున
లేచి రెపరెపలాడినట్టూ ఎవరో సన్నటి నవ్వుతో
అలవోకగా నిన్ను తాకుతూ వెళ్ళిపోయినట్టూ
నీ లోపల అస్థిమితమయినది ఏదో ఒక చోట చేరి అతి నెమ్మదిగా కుదుటపడుతున్నట్టూ

ఆకాశం నుంచి కిందకి దిగుతోన్న ఒక వాన వాసన-
నీడలలో కూడా కొంత జీవం, మరికొంత చెమ్మ-
కనురెప్పలు ఆర్పినట్టు, మృదువుగా కదిలే కిటికీ రెక్కలూ, తీగలపై దుస్తులూనూ-
రెండు చేతివేళ్ళతో ఎవరో నీ ఛాతీపై రాస్తున్నట్టు

ముఖంపై మరొక ముఖం జారి నల్లని కురులు
నిన్నొక శాంతి సాగరంలోకీ, రాత్రిలోకీ తోసినట్టు
ఇదొక కాలం. నువ్వు బ్రతికి ఉన్నావన్న స్పృహ
నిన్ను లోకాన్ని కొంత దయతో చూసేటట్టూ, కొంత అపురూపంగా తాకేటట్టూ చేసే
చిన్న కాలం. ఒక లాలిత్యమైన నిశ్శబ్ధపు శబ్ధం-

ఇక అందుకే, మబ్బు పట్టిన వెలుతురులో గాలిలో
రాలే చినుకులలో, సన్నగా ఊగుతాయి పూవులు
పూలరేకులపై జారే పల్చటి నీటి కాంతి గీతలూనూ-

ఇంతకూ అవేం పూవులో, ఏమైనా తెలుసా నీకు? 

01 June 2013

అనామకం

అనుకోని వర్షం పడి, నీ శరీరం అంతా చెట్ల కిందకు కొట్టుకుపోయిన నాడు
ఇంటికి వొచ్చి, వేణ్నీళ్ళతో తలంటు స్నానం చేస్తావు నువ్వు
ఆ మసక మసక చీకట్లో, నగ్నంగా ముడుచుకుని ఒక పీటపై-

ఒళ్లంతా ఒక జలదరింత. వొదిలి వెళ్ళిన వానని, ఇంకా వొదలని గాలి ఒకటి
బిరబిరా మంటూ, బాత్రూం కిటికీలోంచి నిన్ను తాకినప్పుడల్లా
ఒక వొణుకు. ఈ జన్మకు చెందని దిగులు ఏదో, అనుభూతి ఏదో

నీ చైతన్యం, నీ ఉనికీ, వేరే ఏ జన్మలలోనో కాంచిన ప్రదేశాల నుండి
తీసుకు వచ్చే ఒక జలదరింపు. నీ ఈ జీవితపు అంతిమ క్షణమేదో
ఇప్పుడే నిన్ను లీలగా తాకుతున్న ఒక మృత్యు రహస్యం. తిరిగి

మరలా నువ్వు మరుజన్మలో అడుగిడబోయే లోకాలూ కాలాలూ అతి పల్చటి
మంచు తెరలై, నీ చుట్టూతా రహస్య నేత్రాలతో సంచరించే సవ్వడి.
ఓ ధూపం.నీకు నిన్నే ఎవరో సాంభ్రాణి పొగగా పెట్టే సమయమూనూ-

ఇక ఎక్కడిదో ఒక స్మృతి, నీ నెత్తురు లోంచి లేచి, నీ ముందు ఒక
అద్దంగా మారితే, దానిలో ముడుచుకుపోతావు నువ్వు భయంతో-
తల్లి గర్భంలో ముడుచుకుపోయినట్టూ, ఎక్కడి నుంచైతే నీ శ్వాస
వచ్చిందో, అక్కడికి నీవు తిరిగి వెళ్ళిపోతున్నట్టూ, వెలిగిన ఆ ప్రమిదె కాంతి

వెనక్కు తిరిగి నెమ్మది నెమ్మదిగా, అతి నెమ్మదిగా చీకటిలోకి కనుమరుగు
అవుతున్నట్టూనూ. ఇక లేచి వచ్చి మంచంపై కూర్చుని, నువ్వు నీ
తనువుని తుడుచుకుందామని చూసుకుంటే, అక్కడ నీ శరీరమూ

ఉండదు, నువ్వూ ఉండవు. ఇకా గదిలో, ఆ చీకట్లో, వెన్నెల లేని ఆ కాంతిలో

కిటికీలోంచి మరి ఎక్కడివో నక్షత్రాలు, దయగా మెత్తగా చిర్నవ్వుతో
రాలుతూ ఉంటే, తన తల్లి వక్షాజాలే పొదుపుకుంటాయి, తొలిసారిగా
ఒక కృతజ్ఞతతో వెక్కి వెక్కి ఏడిచే 'నిన్ను', బాహువులై, ఉమ్మ నీరై
ఆదిమ కాంతి తరంగాలై, అరూపాలై , అంతిమ సప్త లోకాలై కాలాలై-

ఇక, అటువంటి రాత్రిలోకి ఒక బిందువై కరిగిపోయాక, చెప్పడానికి
ఏం ఉంటుంది? ఎలా ఉంటుంది? నీకైనా, నాకైనా, మరి ఎవరికైనా-?