29 July 2015

క్రియ

రాత్రి అవుతుంది.

ఇంటి తలుపులు తెరచినప్పుడు
ముఖాన్ని చరిచే, వాన హృదయం తెలియని ఒక గాలి ఏదో -
గూటిలో పక్షిపిల్ల ఒకటి తల్లికై, ఆకలై కీచుగా అరచినట్టు

గొంతు తెగిన శబ్ధం లోపలేదో. ఇంకా ధూళి.
ఖాళీ బాహువులంతటి చీకటి. ఇక, గదుల్లో ప్రతి మూలా
ఒక దీపం ఆరిపోయిన వాసన -

అల్మారాల్లోనూ, దుప్పట్లలోనూ
దుస్తులలోనూ, వంటగదిలోని పాత్రల్లోనూ, స్నానాల గదుల్లోనూ
ఒక పూవు రాలిపోయిన శబ్ధం.
అంతిమంగా నీ నిశ్శబ్ధం -

సరే. ఇప్పుడు చెబుతున్నాను విను

సరిగ్గా
అప్పుడే గుర్తుకు వస్తావు నువ్వు.

నిదురలో
ఏడుస్తూ మన పిల్లలు
నీ వైపు తిరిగి, నీ మెడ చుట్టూ చేతులు వేసి, నిన్ను గట్టిగా కావలించుకుని
వెక్కిళ్ళు పెడుతూ పడుకున్నట్టు-!

27 July 2015

విభక్తి

ఎన్నో వెళ్ళిపోయాయి
ఏ జాడలూ లేకుండా, కనీసం స్మృతి సమీరాన్నయినా
మిగల్చకుండా

ఎదురుగా
నీరెండలో సగం తడిచి, నెమ్మదిగా ఊగే ఆకులు. కొమ్మలపై
అంతే నెమ్మదిగా ఎగబాకే నీడలు

ఎవరో  ఇష్టంగా
నీకు దగ్గరగా జరిగి నీ చెవిలో గుసగుసలాడినట్లు వాళ్ళ  ఊపిరి
నిను తాకినట్టూ, వానాకాలపు

వెలుతురు. కొంత చీకటీ -
మరికొంత, పిల్లలు ఆడుకుని వెళ్లిపోయాక మిగిలే నిశ్శబ్ధం.
లోపల, చాలా కాలం

తాళం వేసి ఉన్న ఇంటిని
తెరిచినప్పటి వాసన. పల్చటి మట్టి పోర ఏదో పేరుకుపోయినట్టూ
ఎవరూ నిన్ను తమ వేళ్ళతో తాకనట్టూ

రంగులు వెలసిన
కదిలీ కదలని కర్టెన్వో, లేక చేతులిరిగిపోయిన ఒక కుర్చీవో అయి
నువ్వు మిగిలి, పిగిలి పోయినట్టూ

ఎన్నో వెళ్ళిపోయాయి
ఏ జాడలూ లేకుండా. ఎందరో వెళ్ళిపోయారు, ఏ జాడలూ
మిగల్చకుండా -

ఇక, ఈ బాల్కనీలో
ఈ గూటిలో పెరిగే  ఇంకా కళ్ళు తెరవని ఈ పావురాళ్ళలో
ఏవి బ్రతికి ఉంటాయో
ఏవి చనిపోతాయో...

తెలియదు నాకు నిజంగా -

ఎన్నటికీ. 

26 July 2015

బహుశా

చీకటి సద్దమణిగింది
గదిలోని దీపపు కాంతీ మందగించింది 
బయట 

వర్షపు రాత్రిలో 

ఇక రాలలేక ఒక చినుకు ఉగ్గపట్టుకుని 
ఒక ఆకు అంచునే 
ఆగిపోయింది ~

ఇది నిజం.

లోపల అంతా చల్లగా ఉంది. గూడు అంతా 
పక్షులకై మోకరిల్లింది. వాలి
తేలిక ఆవుదామని 
అనుకున్న 

ఒక భుజం

ఎక్కడో విస్మృతిలోకి కనుమరుగు అయ్యింది
అరచేతులలోంచి ఒక పూవు 
రాలిపోయింది.
'నువ్వు' అనే 

ఖాళీతనం మిగిలిపోయింది. మరి 

దీనినేనా నువ్వు 

'జీవించడం' అని అన్నది? 

23 July 2015

దిగులీక

తను వచ్చింది నా వద్దకు
తలలో
ఒక గులాబీ పూవేమీ లేకుండా
పట్టించుకోలేదు పెద్దగా
నేను కూడా ~

ఇక  ఆ తరువాత
పగలు రాత్రిగా మారే క్షణాన
తను నా అరచేతిని గట్టిగా పుచ్చుకుని, దగ్గరకి లాక్కుని
తన ముఖాన్ని
నా నిస్సహాయపు అరచేతిలోకి
అదుముకున్నప్పుడు
నాకు నిజంగానే
సాయంత్రం
గుమ్మం ముందు
గుండెకు ఒక బొమ్మని అదుముకుని
పని కోసం వెళ్ళిన
తన తల్లి కోసం ఎదురుచూసే
దిగులు చారికల
మట్టి మరకల
ఐదారేళ్ళ
తడి కళ్ళ ఒక పాపే జ్ఞాపకం వచ్చింది
గుండెలో
ఒక  బాకు దింపి
మెలిపెట్టినట్టు అయ్యింది
గొంతు బిగుసుకుపోయి, ఊపిరాడక
లోపలెవరో
బావురుమన్నట్టు అయ్యింది
చిగురాకల్లే
శ్వాస కోసం ఎవరో
విలవిలలాడుతున్నట్టూ అయ్యింది
శరనార్ధికి దొరికిన
ఒకన్నం ముద్దా వొలికిపోయినట్టూ అయ్యింది ~

(అవును. ఇది నిజం)

తను వచ్చింది
తలలో
ఒక గులాబీ పూవేమీ లేకుండా
తను వెళ్ళిపోయింది
తలలో
ఒక గులాబీ పూవేమీ లేకుండా ~  

17 July 2015

బహుమతి

నెలవంక
అతి నెమ్మదిగా బయట పడ్డట్టు: నీ ముఖం -
అప్పుడు వీచిన గాలికి, నామం లేదు వాసన లేదు దిక్కూ లేదు
నిన్ను తాకిన, ఒక్క దాని విలాపం తప్ప -

దాహార్తినై
ఉన్నాను నేను: అప్పుడు. మబ్బులు కమ్మిన
ఆకాశం కింద, నన్ను నేనే ఒక జోలెగా మార్చుకుని, ఎవరో త్రవ్వుకు
పోయిన హృదయ సారాన్ని

అడుక్కుంటూ
ఉన్నాను నేను: అప్పుడు. నువ్వు నా వైపు
తల తిప్పినప్పుడు, లేతేరుపు నాలికతో కీచుగా అరిచే, కళ్ళు తెరవని
పిట్ట ఏదో గూటిలో - తల్లి లేక -

"అదేమంటోంది?", అనా నువ్వు అలవోకగా అడిగింది?
***
నెలవంక నవ్వినట్టు
గాలిలా వీచినట్టు, మబ్బులై వర్షించినట్టు లోకం అంతా ఉత్సవం.

చూడు -
నువ్వు కొద్దిపాటి ఆందోళనతో, నీ కళ్ళన నిండిన వర్షంతో, ఇష్టంతో
నువ్వు నాకు ఒంపిన గుక్కెడు నీళ్ళల్లో

ఎలా నేను ఒక కాగితపు పడవనై
అనంతాలకి తేలిపోతున్నానో!  

16 July 2015

సాధన

సాయంత్రం మరలిపోతోన్నది.

తిరిగి వచ్చే ప్రతి పక్షికీ ఒక గూడు ఉన్నది. రాలిపోయే ప్రతి పూవూకీ
చీకటిలో సుగంధం ఏదో
మిగిలే ఉన్నది -

దూడ ఒకటి భీతిల్లి తల్లి పొదుగులోకి చేరినట్టు, లోకం అంతా
లోకాన్నివదిలివేసి, ఒక దగ్గరకు చేరి
ముడుచుకునే

క్షణమూ ఆసన్నమయినది -

తెలుసు నాకు.

సాయంత్రం మరలిపోతోన్నది. దట్టమైన పొగమంచు కమ్మే
ఘడియా రానున్నది. ఒక నీడ తపిస్తో
తన మూలాన్ని

వెదుక్కునే
శిక్షా, స్మృతీ

ఇప్పుడే  ఇక్కడే ఆరంభం కానున్నవి.
*
మరి ఇంతకూ
ఎక్కడ నువ్వు?

12 July 2015

ఒక క్షణం

నీ నిశ్శబ్ధంలోకి
నీ ఒంటరితనపు ప్రాంగణంలోకి, తేలుతూ వచ్చే ఒక శబ్ధం -

చల్లటి గాలి వీచే సాయంత్రం. మబ్బులు పట్టి
మసకగా మారిన ఆకాశం. వేల పక్షులు ఒక్కసారిగా ఎగిరినట్టు
గలగలలాడే ఆకుల్లో నీటి పరిమళం.

తెరచాప లేపినట్టు, నేలపై నుంచి పైకి ఎగిసే ధూళి
భూమి ఒక మాతృ హృదయమై వేచి చూసే వేళల్లో, ఇళ్ళకు పరిగెత్తే పిల్లలు.
రెపరెపలాడే పూలు. నిన్ను ఎవరో

బిగియారా  కౌగలించుకున్నట్టు - మెత్తటి నొప్పితో
వ్యాపించే ఈ చీకటిలో, ప్రార్ధించే దోసిలి వంటి ఒక ఇంటిలో - జీవం పోసుకుని
ప్రాణవాయువై చలించే ఒక దీపం. నీకు లేని
ఒక సరళమైన కాంతీ, ఒక జీవన స్వీకారం -
*
నీ నిశబ్ధంలోంచీ
నీ ఒంటరితనపు ప్రాంగణంలోంచీ, తడచిన రెక్కల్ని విదుల్చుకుని తటాలున
ఎగిరిపోతుంది పావురం. కూడా బహుశా
నువ్వు ఇస్తానన్న ఓ గూడూ, ఒక పదం -

మరి ఇక మిగలిన
వాన వెలసిన ఈ నిశబ్ధంలో, ఈ డోలాయమాన క్షణంలో, ఈ రాత్రిలో
నిన్ను తమ రెక్కల మాటున పదిలంగా దాచుకుని

వెచ్చగా పొదిగి, నిన్ను కని
మరొక రోజుకి సాకేది ఎవరు? 

11 July 2015

వృధా

పూలలాంటి కాంతిలో తను.

తెరచిన తలుపులూ, కిటికీలూ, గాలికి కదిలే ఆకులూ, ఎగిరే పక్షులూ
మరి ఎక్కడి నుంచో పిల్లలు నవ్వే సన్నటి సవ్వడి
బాల్యంలోని అమ్మని గుర్తుకు తెచ్చే గాజుల అలికిడి -

చీకటిలాంటి అశాంతిలో అతను.

గోడలపై కదిలే నీడలని మెత్తగా తాకుతూ వాటితో మాట్లాడుతూ, బహుశా
నీకు చెప్పలేని నా లోపలి మాటలతో, రహస్యాలతో
నువ్వు చూడలేని ఉద్యానవనాలలోని పరిమళంతో -

ప్రేమలాంటి ఒక అస్పష్టతలో ఇద్దరు.

రెండు తీరాలను కలిపే కలలు. ఊరికే నిన్ను తాకి ఆనందించే పిల్లలు.
వాళ్ళ ముఖాలలో ప్రతిఫలించే వెలుతురూ, ఊరకే
అట్లా నిన్ను చూసి వెళ్ళిపోయే పగళ్ళూ రాత్రుళ్ళూ -

పూలలాంటి చీకటిలాంటి ప్రేమలాంటి కాంతిలాంటి

స్పష్టమైన అస్పష్టతలాంటి, వాళ్ళు జీవితం అని పిలుచుకునే ఆ చిన్ని చిన్ని
బరువైన క్షణాలూ, కౌగిళ్ళూ, కోపాలూ, మోహాలూ
నయనాలూ, చివరికి మిగిలే అశ్రువులూ, నిశ్శబ్ధం

ఇంకిన సమయాలూ, వాగ్ధానాలూ, పదాలూ - ఇద్దరి సమీప దూరాలూ
సృజనా, సృజనా, సృజనా
చివరికి ఇవన్నీ వృధాయేనా?