18 January 2015

అంతే

"ఎందుకో భయంగా ఉంది. ఎక్కువకాలం ఇక్కడ ఉండనని తెలుసు.
     అయినా, లోపలంతా గుబులు గుబులుగా ..."
 తన చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు అతను -

చీకట్లో, పల్చటి కాంతి ప్రసరించిన మొక్కల మధ్య, ఒంటరిగా కదిలే ఒక పావురం -
నిటారుగా నిల్చిన గోడలపై గాలికి చలించే నీడలు
మధ్యలో ముఖంపైనుంచి కదిలే కీటకాల సవ్వడి.
తెరమరుగవుతూ ఒక పల్చటి చందమామ, తన

అరచేతిలోంచి, రాత్రి దాగిన కుండీలోకి, నెమ్మదిగా ఇంకే
     బియ్యం కడిగిన నీళ్ళు. పక్కగానే, అతను చేరుకోలేనంత
సమీప దూరంలోనే, అతని అలసటలోనే
ఆ భయంలోనే, అతనికి ఎక్కువగా లేని
అతని - తన - కాలంలోనే, లోకంలోనే  

ఒక మంచుపొగ - తన శరీరం. కుండీలోంచి విచ్చుకున్న రెండు
ఎర్రెర్రని మొగ్గల వంటి తన నయనాలూ
తన చేతివేళ్లూ, అతనెన్నటికీ చేరుకోలేని
తన జీవితం, స్వప్నం జననం మరణం

- ఇంకా - రాత్రంతా, మొక్కల మధ్య చూపు లేక, ఏమీ తినలేక, అలా
ముణగదీసుకుని గుబులు గుబులుగా ఏడ్చే
అతని హృదయంలాంటి ఒక నల్లటి పావురం - 

17 January 2015

నీడలు

ఆకులు రాలుతూ, వణికించే గాలిలో, నీ చుట్టూ వ్యాపించే చీకటి-

చుక్కలేవో మెరుస్తాయి అప్పుడు ఆకాశంలో.
     చెవులు రిక్కించి వింటావు, ఎవరైనా వచ్చి గేటు తీసే శబ్ధం వినపడుతుందేమోనని.
     నీ శరీరం మొత్తం అప్రమత్తమై, ఒక ఆకస్మిక జలదరింపై
ఒక వాకిలై, ఎవరైనా వచ్చి కల్లాపి చల్లినట్టు, నీపై కురిస్తే

ఈ ఒక్క రాత్రి, బ్రతికిపోదామనే, ఒక ఊహ, ఒక
ఎదురుచూపు, ఒక ఆశ, ఒక స్వల్పమైన కోరిక-
     నీ ఆత్మ మొత్తమూ, శరణు జొచ్చిన కనులై, ప్రార్ధనకు ముకుళించిన అరచేతులై
     ఎండిపోయి రెండు చుక్కల నీళ్లకై విలవిలలాడే పెదాలై, ఎవరో వొదిలివేసిన వేణువులో
కొట్టుకులాడే గాలై, పరితపించీ పరితపించీ, చివరికి

ఆకులు రాలే వణికించే గాలిలో, ఆ ఒక్కరికై
రాత్రిలో చుట్టూ వ్యాపించే చీకట్లో ఒరిగిపోయి, భూమికి మోకరిల్లిన నుదురై
అలా నిలిచిపోయి-

ఏం లేదు.
నువ్వు లేవు, నువ్వు వొదిలిన నీడలు మాత్రం మిగిలి ఉన్నాయి ఇక్కడ. 

09 January 2015

dasein

అతనొక మూల
కుర్చీలో కూలబడి, చేతులు వదిలివేసి -
సాయంత్రం రాత్రిగా మారే చోట, కూలీ నుంచి వచ్చి నిస్సత్తువుగా జారగిలబడి
అట్లాగే కూలబడి నిద్రపోవాలని, తిరిగి
లేవలేనంతగా...

"పూవులు తెచ్చావా నువ్వు?" అని
సరిగ్గా ఆ క్షణానే అడుగుతారు మీరు, ఒక మంచుతెరని స్వప్నిస్తో, లేక
చినుకులు తాకిన ఒక మొగ్గని తాకుతో...

కుర్చీలోనో, మంచంపైనో ఒరిగిన
అతని కళ్ళల్లో మంటలు. మీరేమో చలిమంటలని కలగంటారు కానీ
ఆ నిప్పులు నీటిలోంచి ఎగిసాయని
మీకు తెలియదు -

అతను తన శరీరాన్నే గొట్టంగా మార్చి ఊదుకుంటూ
నిప్పురవ్వలని ఎగేస్తూ, ఒక రెండు రొట్టెలను కాల్చుకోవాలి
ఒంటరిగా ఇంత తిని, తనను తానే తాగి, మళ్ళా కళ్ళు చికిలించి, చీకట్లోకి చూస్తూ
అలా కూర్చోవాలి -

పిల్లనగ్రోవి అతడు
పిల్లలు లేని పిల్లనగ్రోవి అతడు.
ఛాతిపై శ్వాసించే ఒక గాయం అతడు. బాహువులలో, ఖాళీ గాలీ చేసే ఒక ఆర్తనాదం
అతడు. తనని తాను దగ్గరిగా ముడుచుకున్న
యుగాల నిశ్శబ్ధ నాగరికతల తపన అతను -
మరి ఉందా మనకు

కృష్ణబిలం వంటి
అతని హృదయంలోకో, ఆమె హృదయంలోకో
అతానామె శరీరంలోకో చేయి చాచి - పూవుల్ని వొదిలి వెన్నెలని వొదిలి - తాకేంత
ఒరిమీ, ధైర్యం, ఇష్టం, ప్రేమా

ఎక్కడో, మన శిధిలాలలో ఒక మూల? 

ఇంకేం లేదు

ఈ శీతాకాలపు మంచులోంచి, ఎండ పొర ఒకటి
రెక్కలు విప్పార్చి ఎగిరింది -
వినాలి నువ్వు దాని కూతని

ఒక పిల్లవాని అరచేతిని నీ అరచేతిలో పుచ్చుకుని -
అంతటా పూల తడి. అంతటా
ఒక మెత్తటి ఆకుపచ్చనితనం

అంతటా, రెప్పలు విప్పుతున్న నిద్ర వాసన ఏదో
నీ హృదయ ప్రాంగణంలో-
నీడలు లేని వెలుతురూ
గాలికి తడబడే ఆకులూ

ఇంకా, వెల్లకిల్లా పడి, నిర్జీవంగా రెప్పలు మూసుకుని
ఊదారంగు పావురమొకటి-
"నాన్నా ఏమయ్యింది?" అని
అర్థం కాక, ఆ పిల్లలు అడిగితే

వాళ్ళని గట్టిగా హత్తుకుని
-ఇలా- చెబుతాడు అతను:
"ఏమీ లేదు: ఎగరలేనప్పుడూ, చూడలేనప్పుడూ
రంగులేవీ మనల్ని తాకలేనప్పుడూ
మీ అమ్మనో, నేనో - రేపు మీరో ఇలా..."

ఇకా తరువాత,  ఆ రాత్రి వేళకి కూడా, అతనేం చెప్పాడో
పిల్లలకీ అర్థం కాలేదు, అతనికీ
అర్థం కాలేదు. పూచిన చెమ్మకి

కనురెప్పలు రాలి, గొంతు పూడుకుపోయిన
తనకీ అర్థం కాలేదు-

అంతే.  ఇంకేం లేదు. 

07 January 2015

dielogue

In the beginning was the Word
And the Word was with God, and the Word was God.

"ఎక్కడున్నావు నువ్వు? నిన్నొకసారి చూడాలి."/"అది తెలుసుకునేందుకే తిరుగుతున్నాను. ఎక్కడున్నానో నాకే తెలియదు"/ "ఆ పొయిటిక్ చెత్తంతా నాకు చెప్పకు. ప్లీజ్. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? మాట్లాడు"/ "You know...  Words don't convey anything. అయినా, ఎందుకు?"/ "కన్నా, ఎందుకంటే It's quite cold in here. It's quite lonely here. It's quite dark in here. బెంగగా ఉంది"/ "అమ్మ గుర్తుకు వచ్చిందా?'/ "ఊ. ఒక్కసారి రావా. ఒక్క పది నిమిషాలే. I won't make you stay longer. కొద్దిగా భయంగా కూడా ఉంది"/ "అవునా... నీకు తెలుసు. ఇక్కడ కూడా, quite cold in here. quite lonely here. quite dark in here..."/ "Please. ఒక్కసారి వచ్చిపో. ఎక్కడున్నావో చెప్పు పోనీ. నేనొస్తాను. అదీకాక పాప చాలా గుర్తుకువస్తుందివాళ "/ 

"తెలుసు నీకు. నేనో జంతువునని. కాదు, కాదు. అంతకంటే ఘోరమని. Is there any word that conveys more than the word beast?" / "కన్నా నాకు ఇప్పుడు వాగ్వాదం చేసే ఓపిక లేదు. అలసిపోయి ఉన్నాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నా వద్ద పెద్దగా డబ్బులూ లేవు."/ "Do you want money?"/ "డబ్బులు కాదు చిన్నా. ఒంటరిగా ఉండాలంటే ఎందుకో కొంత భయంగా ఉంది. మాట్లాడటానికి ఎవరూ లేరు. పడుకోడానికే అందరూ..."/ "That's how the world is... beast, beastlier, beastliest... చూడు, ఒక మృగం మరొక మృగం గురించి ఎలా మాట్లాడుతుందో... "/ 

"చిన్నా, ప్లీజ్..."/"ఇంకా?"/ "వస్తావా ఇంతకూ?"/ "తెలియదు."/ "ఒక్కసారి, ఒక్క పది నిమిషాలు. గోడలపై ఈ నీడలు... ఈ నీడల్తో ఎక్కువ కాలం ఉండలేను. ఈ నీడలతో ఎక్కువ కాలం బ్రతకనూ లేను."/"..."/ "చిన్నా..."/"ఊ..."/ "ఎక్కువగా తాగకు"/ "ఊ..."/"చిన్నా..."/"ఊ..."/"అందరూ ఇంతేనా?"/"అవును. అందరూ ఇంతే. నా మటుకు. నీడలే అంతా. నరమాంసభక్షకులే అంతా ... more than me, you should have known it better by now... నిన్ను నమిలి నమిలి తిన్న మనుషులందరితో ఇంతకాలం బ్రతికిన తరువాత.."/"ఎందుకో, somehow - ఎక్కడో ప్రేమ ఉంటుందని..."/ "ప్రేమా?  What's his name? ఏదోలే... మందు తాగొచ్చి వాడు, నీతో పడుకుని, నీ చూచుకాలు కొరికి వేస్తే, వాటిని చూసుకుంటూ, ఏడ్చుకుంటూ పాపకు పాలివ్వలేని రోజులు మరచిపోయావా?"/ "లేదు, కానీ..."/ "ఈ లోకం, నువ్వు మనుషులు అనుకునే వీళ్ళూ అంతా పెద్ద ... మరచిపోయావా అందరినీ? Will your vagina ever heal before you die?"/ 

/"చిన్నా, ప్లీజ్ ఆ టాపిక్ వొదిలెయ్. ఎక్కడున్నావు నువ్వు? నిన్నొకసారి చూడాలి. ఒక్కసారి రా. ఒకే ఒక్కసారి. ఈ నేల ఊబిలా మారకముందే, ఈ గోడలు నన్ను తినివేయకముందే, ఈ చీకటి నన్ను కప్పివేయకముందే, ఈ రాత్రి నాలోకి దిగబడక ముందే, నా గర్భం మళ్ళా విచ్చిన్నమవ్వక ముందే, మళ్ళా నేను చచ్చిపోక ముందే. కన్నా ఎక్కడున్నావు నువ్వు?"/

/"నేనా, ఎక్కడనా? ఎక్కడో, నేనెక్కడో ఒకచోట బార్లో,  ఒక quite cold in here బార్లో. ఒక quite dark in here బార్లో. ఒక quite cold in here, dark in here బార్లో, బార్ కార్నర్లో, కారోబార్లో... కారో బారో, దేవుళ్ళో, దెయ్యాలో, దేవతలో, పిత్రుసంహారులో, శత్రురక్షకులో, భూమున్నవాళ్ళో, లేని వాళ్ళో, తవ్వుకుపోయిన వాళ్ళో, తండ్రులో, తల్లులో, స్నేహితులో, తాగుబోతులో, భిక్షగాళ్ళో, రేపిస్ట్లో  రేసిస్ట్లో  కాస్టిస్ట్లో , పిల్లలో పూవులో చుక్కలో, వానో వరదో వాంతో, స్మృతో, విస్మృతో,  చివరికి మిగిలే ఈ జీవన అమృత విషమో... "/

In the beginning was the Word
And the Word was with God, and the Word was God
And after the Word and God, God and Word, there was a sudden darkness.

Amen. 

04 January 2015

నివేదిక

ఉదయాన్నే నిద్ర లేచావు. అకారణంగా ఎందుకో సంతోషంగా ఉన్నావు -
   
దులిపి ఆరవేసిన పల్చని తెలుపు వస్త్రంలాంటి మంచు. మంచువంటి కాంతిలో
     తడిచే చెట్లూ, ఆకులూ. నిదురించే పిల్లల వద్ద నుంచి వచ్చే
     సుగంధమేదో గాలిలో. అప్పుడు కొద్దిగా, దీపస్థంబాల కింద
     నీడల నిశ్శబ్ధం. మరికొద్దిగా రాలే చినుకులు చేసే అలజడీ-
సరిగ్గా అప్పుడు అంటుంది తను అతనితో -

"ఇంకా కొద్ది దూరమే. ఆగిపోకు అప్పుడే - సంతోషంగా ఉన్నందుకు
     దిగులు చెందకు. కళ్ళ పక్కగా పెరుగుతున్న కణితులతో
     ఆ పావురం పిల్లకు కళ్ళు కనపడవు.
మరి, తెలుసా నీకా విషయం?"

అతనికి తెలియదు కానీ, ఇక ఇప్పటికి
అతని అరచేతిలో, తన అరచేయి. తన అరచేతిలో ఒక పసివాని చేయీ-
ఎదురుగా కనుమరుగయ్యే మంచులో తడిచి

నింపాదిగా పుష్పించే, రెండు ఎర్రెర్రని దానిమ్మ పూవులు.    

03 January 2015

ఇంకొంతసేపే

ఇంకొంతసేపే-
మరింతసేపు ఉండమని నిన్ను అడగను.

తెలుసు నాకు
ఎవరూ దీపం వెలిగించలేదనీ, నీ హృదయం
ఎవరినో తలచుకుని వణుకుతుందనీ
నీ ముఖం బరువై, నీ అరచేతులలోకే

కూరుకుపోయే సమయం ఆసన్నమయ్యిందనీ
రమ్మని ఎవరూ నిన్ను పిలవరనీ, తమ
చేతుల్లోకి ఎవరూ నిన్ను, పొదుపుకోరనీ
ఒక తీవ్రమైన చలి రాత్రి వేచి చూసీ చూసీ

నీలో నువ్వు గడ్డ కట్టుకుపోతావనీ, కరిగిపోతావనీ
నెలలు నిండుతున్న గర్భంతో, పుట్టబోయే
పాపకి ఎంతో ఇష్టంతో అల్లుకున్న- సగంలో
ఆగిపోయిన- స్వెట్టర్లా అలా మిగిలిపోతావనీ...

తెలుసు నాకు.
అయినా, ఇంకా కొంతసేపే.
మరింతసేపు ఉండమని నిన్ను అడగను.
కొద్దిగా ఆగు -

వెళ్లిపోదాము మనము, ఇంత అన్నం తిని
నీ దారిలో -  నేను.
నా దారిలో నువ్వూ.