28 July 2014

నిబద్ధత

జ్వర తీవ్రతతో మంచంపై నువ్వు: ఆనాడు -
అనేక ముఖాలతో వాన, కిటికీ అద్దాలని చరచీ చరచీ లోపలకి చొరబడేందుకు
ప్రయత్నిస్తున్న వేళ -

"మందులు వేసుకోక, అలా పడుకుంటే ఎలా?"
అని అన్నాను నేను. "మందులు లేకపోతే, వెళ్లి తెచ్చుకోలేనంత చిన్నపిల్లవా"
అని కూడా కసురుకున్నాను నేను.

మాట్లాడని నీ మౌనంలో, గదుల నిశ్శబ్ధంలో
తెరచిన తలుపులలోంచి హోరున కొట్టుకు వచ్చే గాలి: వెక్కిళ్ళ వలే గంటలు-
అవే, నువ్వు గుమ్మానికి వేలాడదీసిన

గాజు పక్షుల రెక్కలు విరిగి
టప టపా కొట్టుకునే చప్పుడు. తడచిన హాలులోకి, రాలి, కొట్టుకు వచ్చిన
చితికిన లిల్లీ పూవులు -
కమిలిన నీ శరీరంపై

తార్లాటలాడే నీడలూ, నువ్వు
ఆప్తంగా తెచ్చుకుని, గోడకు వేలాడ దీసిన క్రీస్తు చిత్రం ఇక చిన్నగా పక్కకి ఒరిగి -
నీ చేయి నా చేయి పక్కగా వాలి

వడలి, నీటిపై తేలుతున్న లతలా మారి, పోయిన నాడు
ఆనాడు
అప్పుడు

నీలో వాన. పొక్కిలయ్యిన గొంతు.
వెచ్చటి కరకు గాలీ, శ్వాసా, ముకుళితమయ్యిన కనులూ, హృదయం మనస్సూ
చెదిరి రాలిపోయిన

పిచ్చుక గూడు వంటి నీ శరీరమూ ---

అప్పుడు
ఆనాడు
"Man is not a church anymore"
అని అతి కష్టం మీద కూడదీసుకుని నువ్వు అంటే, ఇదిగో ఈనాడు
కూడదీసుకుని రాస్తున్నా
నీ ప్రతిధ్వనించే పదాలని

జ్వర తీవ్రతతో, మంచంపై, నీవు లేని
ఓటమి తెరలేవో లోపల గుమికూడి ప్రకంపనాలు సృష్టిస్తున్న వేళ, నాలిక చేదుగా మారి
పెదాలు ఎండిపోయి, చిట్లి
భాష కరువయ్యి

ఇలా ఇలా ఇలా ఇలా
ఒక్క గ్లాసు నీళ్లకై-   

1 comment: