27 July 2014

ఒక ఆకు, ఒక కొమ్మ, ఒక స్త్రీ, మరొక మధ్యాహ్నం అను...

దేశం లేని జెండా వలే రెపరెపలాడుతూ
కొమ్మకి కొట్టుకులాడే ఒక ఆకు: ఒక దేశం, ఒక నిర్దేశం లేదు దీనికి నాలాగే.
సరే, మరి ఇది

ఒక మధ్యాహ్నం. గదిలోకి నీడలు వ్యాపించి
శరీరంలోకి తొంగి చూసి, తిరిగి ఉడతల వలెనో, సీతాకోకచిలుకల వలెనో, తుర్రున
పారిపోయే, ఎగిరిపోయే

ఒక మధ్యాహ్నం. లేత ఎరుపు చేతులేవో
నీ చుట్టూ కనిపించకుండా నాట్యం చేస్తే, ఇక ఒక చెట్టంత శ్వాస గుండె నిండుగా
పీల్చుకుని, ఒక ఎర్రటి కోరికతో నువ్వు -
అప్పుడు, ఇక

ఆ అమ్మాయికి రూపం లేదు, కాలం లేదు.
ఏ లోకంలోనుంచో నీ లోకంలోకి, డుబుక్కున, సరస్సులోకి ఎవరో ఒక పాలరాయిని
విసిరినట్టో, ఒక చిన్ని కప్ప దుమికినట్టో
దుమికితే

నీ లోపల అలలు కొట్టుకుంటాయి.
నీ లోపల వాన చినుకులు పిల్లల్లా గెంతుతాయి. ఎవరో నవ్వుతారు బిగ్గరగా నీలో -
నీ లోపలంతా బురద. 
ఎక్కడ ఎవరు తాకినా

వాళ్ళే మళ్ళీ తిరిగి నీలోంచి మొలకేత్తేటట్టుగా
మారి నువ్వు. కుళాయి కింద ఉంచిన ముఖంలా మారి నువ్వు. ఏ మట్టి కుండ కిందో
అరచేతులుగా మారి నువ్వు: ఆ
అమాయి ఎదురుగా, దాహంతో -

ఇక, ఆ తరువాత, ఒక కొమ్మకి కొట్టుకులాడీ
కొట్టుకులాడీ ఒక ఆకూ, గదంతా తిరిగీ తిరిగీ నీడలూ, ఒక్క దేశం ఒక్క దేహం లేక
రెప రెపలాడి నువ్వూ
తన శరీర ప్రాంగణంలో

వీచిన ఒక పరిమళపు గాలికి
ఎక్కడికో కొట్టుకుపోతే ... ప్స్చ్ ఇలా , ఇక్కడ, ఒక ఆకు, ఒక కొమ్మ, ఒక స్త్రీ,
మరొక మధ్యాహ్నం అను... 

No comments:

Post a Comment